నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సాయంచేయేది లేదు
బిఆర్ఎస్ విమర్శలకు ధీటుగా సమాధానం విసిరిన కాంగ్రెస్ నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):
బిఆర్ఎస్ నాయకులారా, మీరు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇది దొరల గడీ కాదు, ప్రజాస్వామ్యం. మీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మేము విమర్శించడం సిగ్గుచేటంట? మరి మీరు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, పచ్చి అబద్ధాలతో బురద జల్లుడు రాజకీయం చేయడం సిగ్గుచేటు కాదా?
ఎర్రబెల్లి పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాలను అభివృద్ధి చేశారని అంటున్నారు. ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు? ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని అభివృద్ధి మీదా? రోడ్లు లేవు, తాగునీరు లేదు, విద్య లేదు, వైద్యం లేదు. ఇదేనా మీ అభివృద్ధి? కేవలం తమ ఆస్తులు, అంతస్తులు పెంచుకోవడమే అభివృద్ధి అనుకుంటే అది మీ భ్రమ.
నాగరాజు గెలుపు అడ్డి మీద గుడ్డి దెబ్బ అంటారా? అది ప్రజల తీర్పు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే నాగరాజును గెలిపించారు. ప్రజల తీర్పును అవమానించి, మీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి గొప్ప నాయకుల మన్ననలు పొందిన చరిత్ర దయాకర్ రావుది అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ గొప్ప నాయకుల మార్గంలో నడుస్తూ ప్రజలకు ఏం చేశారో చెప్పండి. కేవలం పదవుల కోసం పార్టీలు మారడం, ప్రజలను మోసం చేయడమేనా మీ గొప్ప చరిత్ర?
“దొరల పెత్తనం” అని అంటున్నాం, మా చుట్టూ ఉండి మమ్మల్ని నడిపించేది దొరలే అంటారా? మా చుట్టూ ఉన్నది ప్రజలు! ప్రజల ఆశీస్సులతో, ప్రజల మద్దతుతోనే మేము ముందుకు వెళ్తున్నాం.
మీ చుట్టూ ఉన్నది కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే పెత్తందారులు మాత్రమే. అందుకే మీకు ప్రజల కష్టాలు కనిపించడం లేదు.
మేము మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచే సీన్ మాకు లేదంటారా? అది ప్రజలు నిర్ణయిస్తారు. మీ ముఖ్యమంత్రే ప్రజలు తనను దొంగలా చూస్తున్నారని చెప్పిన విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎందుకు చీత్కరించారో ఆ మాటలే నిదర్శనం.
స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని చోట్లా బిఆర్ఎస్ జెండా ఎగురుతుందనేది మీ పగటి కల. ప్రజలు మేల్కున్నారు. మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది.
నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాకు నీతులు చెబుతారా? మీ నాయకులు, మీ కింద పనిచేసే చెంచాలు మాట్లాడుతున్న బూతుల గురించి ఆలోచించండి. దయాకర్ రావును విమర్శించే స్థాయి మాకు లేదంటారా? ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాలను ప్రశ్నించే ధైర్యం మాకు ఉంది. మాకు ఏ స్థాయి అవసరం లేదు. ప్రజల మద్దతు ఉంటే చాలు.
ఖబడ్దార్ కాంగ్రెస్ చెంచాలారా అని హెచ్చరిస్తున్నారా? గుర్తుంచుకోండి, మేము చెంచాలం కాదు, ప్రజల సేవకులం. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు. మీరు ప్రజలను కించపరుస్తూ, అహంకారంతో మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీ పతనం దగ్గరలోనే ఉంది. అని వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య ,మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, బ్లాక్ పార్టీ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి లు సంయుక్తంగా ఆరోపించారు… ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ మైస సురేష్ , సీనియర్ నాయకులు కమగోని ప్రభాకర్ గౌడ్ , దుబ్బాక శివకుమార్ చీటూరి రాజు కుక్కల రాకేష్ ఆరేల్లి ఆరెల్లి ప్రభాకర్, గోధుమల విక్రం ముంజకృష్ణ తో పాటు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…