`‘‘పికే’’ బలపడితే బలహీన పడేది టిడిపియే.
`‘‘పికే’’ బలం.. ‘‘లోకేష్’’కు రాజకీయ సంకటం.
`‘‘పికే’’ చాణక్యం… చంద్రబాబు రాజకీయానికి చెలగాటం.
`‘‘పికే’’కు ఓ లెక్కుంది..సమయమొస్తే చంద్రబాబును కూడా లెక్క చేయడు.
`‘‘పికే’’ లెక్క వేరు..టిడిపికి చాపకింద నీరు!
`‘‘పికే’’కు ఓ లెక్కుంది…ఆ లెక్క తేలేందుకే టిడిపి పక్కన చేరింది.
`‘‘పికే’’తో దోస్తీ..పులిమీద స్వారీ!
`చిరులా జెండా పీకేసుకునే రకం కాదు!
`పొత్తు జెండాను ఎలా పీకేయాలో ఆలోచిస్తున్నారు.
`ఎలా ‘‘పీకేస్తే’’ మేలు కలుగుతుందని మంతనాలు సాగిస్తున్నారు.
`‘‘పీకేస్తే’’ ఎలాంటి సమాధానాలు చెప్పాలో కూడా కసరత్తు చేస్తున్నారు.
`అభిమానుల చేత ‘‘పికే’’ సత్తా ప్రచారం చేయించాలని చూస్తున్నారు.
`ప్లీనరీతో ‘‘పికే’’ పవర్ ఏమిటో కూడా చూపించాలకుంటున్నారు.
`గెలిచిన మరునాడే ‘‘పికే’’ పలికిన పలుకులు మర్చిపోడు.
`పవర్ పంచుకున్నంత మాత్రాన ‘‘పికే’’ సర్థకు పోడు.
`ప్రతిపక్ష పాత్రను కూడా ‘‘పికే’’ పాలనలోనే చూపిస్తున్నాడు.
`ఎక్కడ తగ్గాలో కూడా ‘‘పికే’’కు తెలుసు.
`సమయమొస్తే ఎలా పీక పట్టుకోవాలో కూడా తెలిసిందే ‘‘పికే’’ మనసు.
`అంతా బాగుంటే ‘‘పికే’’ ఎల్లకాలం దోస్తీ అంటాడు.
`జనం కోసం తప్పుకుంటున్నానని చెప్పడానికి ఎప్పుడైనా వెనుకాడడు.
`ఒక్కసారి పవర్ చూసిన తర్వాత ‘‘పికే’’ తన పవర్ వదులుకోవాలనుకోడు
రాజకీయాల్లో ప్రతి దానికి ఒక లెక్కుంటుది. కూడికలు కొన్సిసార్లు మైనస్‌లుకావొచ్చు. కొన్ని సార్లు మైనస్‌లే ప్లస్ కావొచ్చు. ఏ ఈక్వేషన్‌కు సరైన లెక్క వుండకపోవచ్చు. అవే రాజకీయాలు. అందువల్ల డిప్యూటీసిఎం. పవన్ కళ్యాణ్‌కు ఒక లెక్కుంది. ఆ లెక్కను ఎంత ఒద్దికగా సరిదిద్దుకుంటూ పోతున్నారో చాలా మందికి అర్దం కావడం లేదు. పైకి పవన్ కళ్యాణ్ ఆవేశాన్నే చూస్తున్నారు. కాని ఆ ఆవేశంలో కూడా లోతైన ఆలోచన వుంది. అది నెరవేరుతుందా? లేదా? అన్నది ఇప్పటికిప్పుడు సమాదానం దొరక్కపోయినా, ఖచ్చితంగా భవిష్యత్తులో లాభమే జరుగుతుంది. నిజానికి పవన్ కల్యాణ్ సీజనల్ నాయకుడు అని అందరూ అనుకున్నారు. కాని ఆయన సీరియస్ రాజకీయాలు చాలా భిన్నంగా చేస్తూ వచ్చారు. ఆ భిన్నమే వైసిపి ప్రభుత్వాన్ని నిండా ముంచేదాక తెచ్చింది. పాలు ఎన్ని వున్నా పెరుగు కావాలంటే పెరుగు చుక్క కావాల్సిందే. అదే పాలు చెడిపోవాలంటే ఒక్క ఉప్పురాయి చాలు. రాజకీయాల్లో లెక్కలు కూడా సరిగ్గా ఇలాగే వుంటాయి. ప్రతి క్షణం అప్రమత్తంగా వుండడమే రాజకీయం. ఏమర పాటు ఎవరికీ మంచిది కాదు. అందువల్ల పవన్ చెప్పే మాటలన్నీ నిజం కాదు. అందులో అబద్దాలు వెతికినా దొరక్కపోవచ్చు. అంత పకడ్భందీగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ విషయం అపర చాణక్యుడైన చంద్రబాబుకు తెలియదా? అంటే తెలుసు. కాని కొన్ని సార్లు ఎంత చాణక్యుడైనా ఏం చేయలేని రాజకీయాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ఆవేపూరితమైన రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఆలోచనాపూర్వకమైన రాజకీయాలు మాత్రమే చేస్తుంటారు. ఈ తరం రాజకీయాలు అందుకు భిన్నంగా సాగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వారు కూడా ఆలోచనాపూర్వకమైన రాజకీయాల్లో ఆవేశపూరితమైన అంశాలను మేలవిస్తున్నారు. ప్రతి అంశానికి రాజకీయాన్ని జోడిస్తుంటారు. ప్రతి సారి సెంటిమెంటు రాజేయకుండా రాజకీయం చేయరు. ఎంతటి విపత్కరమైనపరిస్దితుల్లో నైనా కూల్‌గానే వుంటారు. అంతే కూల్‌గా మాట్లాడుతూ నిప్పు రాజేస్తారు. అందుకే బిజేపి ఇప్పుడు ఆ స్ధానంలో వుంది. ప్రధాని మోడీ రాజకీయం తిరుగులేని శక్తిగా మారింది. తన సమకాలీకుడైన మోడీ రాజకీయాన్నే చంద్రబాబు అంచనా వేయలేకపోతున్నారు. ఆయన దూకుడును అందుకోలేకపోతున్నారు. అదే జరిగితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయేదే కాదు. నిజానికి చంద్రబాబు అంచనాలు గతం తాలూకు చరిత్రకు సాక్ష్యాలు. అంతే కాని ఆయన విజయాలు చరిత్రకు పాఠాలుగా ఎప్పుడూ మారలేదు. అందుకే ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో పాలనాపరమైన కీలక భూమికలో తెలుగుదేశం పార్టీ వున్నా, జనసేన మాత్రమే దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలకే ప్రాదాన్యత కనిపిస్తోంది. ఇది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కరమే. ఇప్పటికిప్పుడు సమస్యలు ఎదురుకాకపోయినా, భవిష్యత్తులో జగన్ కంటే పవన్ వల్లనే తెలుగుదేశం కొంప మునుగుతుందని చెప్పడంలో సందేహంలేదు. ఇక్కడ చంద్రబాబు ఒక్కొ మెట్టు ఎక్కిన నాయకుడు కాదు. ఒక్కసారిగా కాలం కలిసి వచ్చి అధికారం అందుకున్న నాయకుడు. కాని ఆయన రాజకీయ పరిణతి వల్ల అందలం చూశారు. ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ కూడా ఇంచు మించి అలాంటి రాజకీయాల వల్లనే ఎదిగారు. జగన్ పాదయాత్ర చేసినా, ఇంకేది చేసినా ఆయన వారసత్వ రాజకీయాలను ముందు పెట్టి రాజకీయం చేసిన నాయకుడే. చెట్టుపేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయిన నాయకుడే. కాని పవన్ అలా కాదు. సినిమా రంగంలో వారసత్వంగా పైకి వచ్చినా, రాజకీయ రంగంలో ఆయన స్వశక్తి మీదనే ఆదారపడి వచ్చారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడంలో కూడా ఆయన స్వంత నిర్ణయాల మీదనే ఆదారపడి రాజకీయాలు చేస్తూ వచ్చారు. 2014లో తెలుగుదేశం, బజేపిలతో కలిసి రాజకీయం చేశారు. కాని రాజకీయంగా ఎదగాలనుకున్నా కాలం కలిసి రాలేదు. ప్రజా సమస్యలే తన రాజకీయ ఎజెండా అనుకున్నారు. కాని రాజకీయ ఎజెండా వేరు, ప్రజా సమస్యలు వేరు అని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఎలాంటి అడుగులు వేస్తే రాజకీయాల్లో ఒక్కొ ఇటుక పేర్చుకుంటూ వెళ్లాలో దారి కనుక్కున్నాడు. ఆ దారినే ఎంచుకున్నాడు. ఎందుకంటే 2019లో ఆయన ఒంటరి పయనం అనేక పాఠాలే, కాదు గుణపాఠాలు,అనుభవాలు నేర్చుకునే అవకాశం ఏర్పడిరది. వ్యక్తిగతంగా రాజకీయాల్లో తనస్దానమేమిటో తెలిసింది. అభిమానులతోనే రాజకీయాలు సాద్యం కాదని పూర్తిగా తెలుసుకున్నాడు. నిజానికి ప్రజారాజ్యమప్పుడే ఆ విషయం అర్ధమైనా అప్పటి ఉమ్మడి రాజకీయాలను అంచనా వేయలేకపోయారు. అందుకే చిరంజీవి రాజకీయాలు జెండా పీకేసేదాకా తెచ్చుకున్నారు. కాని పవన్ అలా కాదు. తన జెండాను ఎవరూ పీకేంత శక్తి వంతులు ఎదురుగా లేకుండా చేసే రాజకీయాలు చేయాలనుకున్నారు. అది ఆయనకు ఎంత మేలు చేస్తుందో..అంతే నష్టం తెలుగుదేశం పార్టీకి జరుగుతుంది. ఒక ఒరలో రెండు ప్రాంతీయ పార్టీలు ఇమడలేదు. ఇమిడినా ఎంతో కాలం కలిసి రాజకీయాలు చేయలేరు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు వాటి రంగులు బైట పడిపోతాయి. ఎందుకంటే పవన్ ఎళ్లకాలం తెలుగుదేశం పార్టీకి గొడుగు పట్టే రాజకీయాలు చేస్తారనుకోవద్దు. ఆయన రాజకీయ లక్ష్యం ఆయనకు వుంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కూడా పవన్‌కు బలంగా వుంది. కాకపోతే ఆ అవకాశం కోసం ఎంత కాలమైనా ఎదురుచూడొచ్చు. చూడకపోవచ్చు. రాజకీయాల్లో అవకాశం వచ్చినప్పుడు గద్దలా అధికారాన్ని తన్నుకుపోయే రాజకీయాలకే విలవెక్కువ. లేకుంటే మరో పార్టీ పాగా వేస్తుంది. ఇక ఏపిలో రెండు భిన్న దృవాలే ప్రత్యర్ది రాజకీయాలు భవిష్యత్తులో చేసే ఆస్కారం వుంది. ఎవరు ఔనాన్నా, ఎవరు కాదన్నా చంద్రబాబు ఆరోగ్యంగా వున్నంత కాలమే తెలుగుదేశం పార్టీ ఆధిపత్య రాజకీయాలు చేసే అవకాశం వుంటుంది. ఎందుకంటే మర్రి చెట్టు లాంటి చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ లాంటి నాయకత్వం కూడా ఎదుగుతుందని అనుకోలేం. ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్‌కు పూర్తి స్వేచ్చనిప్పుడే తెలుగుదేశంలో కొత్త తరం రాజకీయాలు ఆవిషృతమౌతాయి. తాను వేలు ఎల్లకాలం వేలు పట్టుకొని నడిపిస్తానని అనుకుంటే లోకేష్ రాటు దేలలేరు. ఏ రాజైనా ఆరోగ్యంగా వున్నప్పుడే వారసులకు యువరాజు పట్టాభిషేం చేస్తారు. దాంతో ఆటోమెటిక్‌గా రాజు వున్నా, యువరాజు మాటలే చెల్లుతాయి. మహాభారతం మనకు గొప్ప రాజనీతిని అందిస్తుంది. దృతారాష్ట్రుడు రాజైనప్పటికీ దుర్యోధనుడే రాజ్యబారం మోశాడు. రాజకీయం నెరిపాడు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఆ పాత్రను పోషిస్తేనే లోకేష్ రారాజౌతారు. లేకుంటే రాజకీయాల్లో తండ్రి చాటు బిడ్డగానే మిగిలిపోతారు. ఎప్పుడైనా స్వయం ప్రకాశానికే విలువ ఎక్కువగా వుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు స్వయం ప్రకాశమే. లోకేష్ కూడా అదే స్వయం ప్రకాశాన్ని అందుకోవాలి. అప్పుడే పార్టీకి మరో అర్ధ దశాబ్దమైన మనుగడలో వుంటుంది. లేకుంటే పవన్ ముందుకొస్తారు. తెలుగుదేశం రాజకీయాలను హైజాక్ చేస్తాడు. ఎన్నటికైనా పవన్ కళ్యాణ్ చీల్చగలిగేది తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకునే తప్ప, వైసిపి ఓట్లను టచ్ చేయలేరు. కూమిటి ఓట్లనే పవన్ తన వైపు తిప్పుకుంటారు. ఇది ముఖ్యంగా లోకేష్ గమనించాలి. లేకుంటే పికే ఏకు మేకౌతాడు. తెలుగుదేశం పార్టీకి ఎర్తవుతాడు. పవన్ కల్యాన్ ఇంకా పదేళ్లయినా తెలుగుదేశంతో వున్నా, చంద్రబాబు నాయకత్వంలో కలిసి పని చేయడానికి ఇష్టపడతాడే గాని, లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కలలో కూడా అనుకోడు. అందువల్ల లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయకపోతే, పవన్ ఏనాటికైనా ఏపికి ముఖ్యమంత్రి అవుతారు. పవన్ ముఖ్యమంత్రి కావొద్దంటే ముందు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే ఎల్ల కాలం మంత్రిగానో, ఉప ముఖ్యమంత్రిగా వుండడం పవన్ లక్ష్యంకాదు. రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు. ఎవరూ శాశ్వత శత్రువులు కాదు. అందరూ అవకాశవాదులే. అందరిదారి అధికారం సొంతం చేసుకోవడమే.. పార్టీ పెట్టి, పదిహేనేళ్లు కొట్లాడిన పవన్ పవర్ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. తెలిసి,తెలిసి తెలుగుదేశం మేలుకోకపోతే తప్పు.