అయ్యా ఎస్‌లు కాదు…ఐఏ ఎస్‌లు!

`ప్రగతి రధసాధకులు…సారధులు.

`ఐఏఎస్‌లు ఉత్సవ విగ్రహాలు కాదు.

`రబ్బరు స్టాంపులు అసలే కాదు.

`రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల అమలు కోసం నిరంతరం శ్రమించే శ్రామికులు.

`రాష్ట్రాలలో వుండే సమస్యల నిరంతర అధ్యయన వేధికలు.

`ప్రజా సమస్యల పరిష్కారానికి నిచ్చెనలు.

`ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులు.

`రాష్ట్ర అర్థిక పరిస్థితులపై నిత్య విద్యార్థులు.

`సమాజ నిర్మాణంలో కీలక భూమికలు.

`ప్రజా తీర్పుతో మారే పాలకులకు తొత్తులు కాదు.

`ప్రగతి గతి మార్గాలకు మూలాలు.

`సమాజ నిర్మాణానికి అలుపెరగని యోధులు.

`విజ్ఞాన వీచికలు…సమగ్ర సవ్యసాచులు.

`ప్రపంచ ప్రగతి అధ్యయనంలో ఆరితేరిన వాళ్లు.

`ప్రజా సంక్షేమానికి పట్టుగొమ్మలు.

`పేదరిక నిర్మూలనా కాంక్షపరులు.

`ప్రభుత్వాలకు మార్గదర్శకులు.

`పాలకులు ఇచ్చిన హామీల అమలు సాధకులు.

`రాష్ట్ర ప్రగతి కామకులు…రాష్ట్రాభివృద్దికి దారులు.

`పాలకులు ఎల్ల కాలం ఒత్తిడితో పనిచేయించలేరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
కొన్ని విషయాలు వినడానికి విడ్డూరంగానే వుంటాయి. చెప్పడానికి నిష్టూరంగా వుంటాయి. నిజాలు ఎప్పుడూ కటువుగానే వుంటాయి. జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా వుంటుంది. మన శరీర వ్యవస్ధలో నడుము వంగిపోతే బతకంతా నరకమే అవుతుంది. ఒకప్పుడు ఐఎఎస్‌ అధికారులంటే సమాజంలో ఎంతో గౌరవం వుండేది. విలువుండేది. ఒక రకంగా అన్ని వర్గాలలో భయం కూడా వుండేది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా ఐఏఎస్‌ అంటే భయంతో కూడిన గౌరవం వుండేది. మరి ఇప్పుడు ఐఏఎస్‌లంటే నాయకులకు విలువ లేకుండాపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోవడిన ప్రజాప్రతినిధులకే విలువ ఎక్కువ. రాజ్యాంగం కూడా అదే చెబుతుంది. కాని ఐఏఎస్‌ల విషయంలో కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. నిబంధనలు కూడా వున్నాయి. వాటిని ఐఏఎస్‌లు పాటించింత కాలం బాగానే వుండేది. కాని వాటిని ఐఏఎస్‌లకు కూడా పట్టించుకోకపోవడంతో, పాటించకపోవడంతో కూడా వ్యవస్ధలకు సమస్యలొస్తున్నాయి. సవాలు విసురుతున్నాయి. ఐఏఎస్‌లంటే ప్రతిపక్ష పార్టీలకే కాదు, పాలక పక్షాలకు కూడా ఎంతో కొంత భయం వుండేది. కాని నేడు ఇప్పుడు లేదు. కనిపించడం లేదు. ఏమ్మెల్యే స్దాయి నాయకులైనా సరే ఐఏఎస్‌లంటే ఎంతో గౌరవించేవారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలైనా సరే కలెక్టర్ల అప్పాయింటు మెంటు కోసం ఎదురుచూసిన సందర్భాలు వుండేవి. కాని ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కార్యాలయానికి వస్తున్నారంటే కలెక్టర్లే ఎదురెళ్లి స్వాగతం పలకాల్సిన అవసరం ఏర్పడుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలంటే ఐఏఎస్‌లు చులకనగా చూడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. నిజానికి ఎమ్మెల్యే అంటే ప్రతిపక్షమైనా,పాలకపక్షమైనా ఒకటే. కాని ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కలెక్టర్లు కొంచెం ప్రాదాన్యత కల్పించినట్లు కనిపించినా వారి సీటుకు గ్యారెంటీ లేకుండాపోతోంది. గతంలో జనగామ ఎమ్మెల్యేగా పనిచేసిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అప్పటి కలెక్టర్‌ దేవసేన విషయంలో ఎలా వ్యవహరించారో తెలంగాణ సమాజం చూసింది. కలెక్టర్‌ తన మాట వినడంలేదని ఆమెను ట్రాన్స్‌ఫర్‌ చేయాల్సివచ్చింది. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏది చెబితే అది చేయాల్సిన పరిస్ధితి కలెక్టర్లుకు ఎదురౌతోంది. ఒకప్పుడున్న గౌవరం ఇప్పుడు వారికి ఎందుకు తగ్గిందన్న దానిపై కూడా ఐఏఎస్‌లు గుర్తు చేసుకోవాల్సి వుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఓ సీనియర్‌ మంత్రి కలెక్టర్‌కు రెకమండేషన్‌ లెటర్‌ తయారు చేయించి, చివరికి ఆ లెటర్‌ను పంపలేక చెత్తబుట్టలో వేసినట్లు స్వయంగానే ఆయనే ఓ సందర్భంలో చెప్పుకున్నారు. అంటే కలెక్టర్లు అంత స్టిక్టుగా వుండేవారు. రెకమండేషన్లు లెక్క చేసేవారు కాదు. అవినీతికి ఆమడ దూరంలో వుండేవారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు మాత్రమే వినియోగించుకునేవారు. ఒకప్పుడు హన్మకొండలో వున్న కలెక్టర్‌ కార్యాయలం ఎలా వుండేదో అందరూ చూసిందే. కొన్ని దశాబ్దాల పాటు ఆ కార్యాలయంలోనే కలెక్టర్లు, వారి కుటుంబాలు వుండేవి. కాని ఇప్పుడు కలెక్టర్లు కూడా అలాంటి బంగళాలో వుండేందుకు ఇష్టపడడం లేదు. ఐఏఎస్‌లు తమ జీవిత కాలమంతా ప్రభుత్వం కేటాయించిన భవనాల్లోనే వుంటూ వచ్చేవారు. కాని ఇప్పుడు ఐఏఎస్‌లకు ఎంతో విలువైన విల్లాలు వుంటున్నాయి. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అందరూ అలాగే లేరు. చాలా కొద్ది మంది ఐఏఎస్‌ల మూలంగా మొత్తం వ్యవస్ధ అబాసు పాలౌతోంది. గతంలో జగిత్యాల జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన ఓ ఐఏఎస్‌ కల్వకుంట్ల కవిత కుర్చీలో కూర్చుంటే, ఆ కలెక్టర్‌ మోకాళ్లపై కూర్చొని ఆమెకు సమాధానం చెప్పిన సందర్భం కూడా చూశాం. ఇలా ఐఏఎస్‌ల వ్యవహర శైలి కూడా వారికి గౌరవాన్ని తగ్గిస్తోంది. ఎప్పుడైతే పాలకులు చెప్పిన ప్రతి విషయాన్ని ముందూ వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నారో వారు పడుతున్న ఇబ్బందులు చూస్తూనే వున్నాం. అయినా ఇప్పటికీ ఐఏఎస్‌ల తీరు మారకపోవడం కూడా గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ హయాంలో జరిగిన తప్పులకు చివరికి ఐఏఎస్‌లు జైలు శిక్షలు అనుభవించారు. ఒకప్పుడు శ్రీలక్ష్మి అనే ఐఏఎస్‌కు మంచి పేరు వుండేది. ఆమె ఆలిండియా ర్యాంకును సాధించి, మంచి హనెస్టీ అధికారి అన్న గుర్తింపు,గౌరవం వుండేది. కాని మైనింగ్‌ విషయంలో అప్పటి పాలకులు చెప్పినట్లు ఆమె వినాల్సివచ్చింది. తర్వాత కేసులు ఎదుర్కొన్నది. జైలు జీవితం అనుభవించింది. ఆ సమయంలో ఆమెతోపాటు, అనేక మంది ఐఏఎస్‌లకు కేసులు ఎదుర్కొన్నారు. ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అధికార వ్యవస్ధలో పాలకులు చేసిన తప్పులకు బలయ్యేది ముందుగా ఐఏఎస్‌లే అని చెప్పకతప్పదు. తాజాగా ఫార్ములా రేస్‌విషయంలో కూడా కేటిఆర్‌ మాటతో ప్రభుత్వం నుంచి రూ.50 కోట్లు విడుదల కావడం ఎంత వివదమౌతుందో చూస్తూనేవున్నాం. ఒకప్పుడు ఐఏఎస్‌లు పూర్తి నిబంధనల మేరకుమాత్రమే పనిచేసేవారు. కాని ఇప్పుడు పాలకులు నిర్ణయాలను మాత్రమే అనుసరిస్తున్నారు. లేకుంటే లూప్‌లైన్‌లో వుండాల్సి వస్తుందనో, లేక జిల్లాలకు వెళ్లాల్సివస్తుందనో పాలకుల చేతుల్లో కీలుబొమ్మలౌతున్నారు. ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌కు వున్న గౌరవాన్ని వాళ్లకు వాళ్తే తగ్గిస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంద్రాకు కేటాయించిన అధికారులు తెలంగాణ వదిలి వెళ్లేందుకు ఎందుకు ఇష్టపడడం లేదన్న దానికి ఏ ఒక్కరిలో సమాధానం లేదు. గతంలో పాలకులు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎలా అమలు చేయాలి. వాటిని ఎలా ప్రజలకు చేరాలన్నదానిపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవారు. కాని ఇప్పుడు పాలకులు చెప్పినదానిపైనే ఆధారపడుతున్నారు. వారు చెప్పినట్లు మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు కలెక్టర్ల సమావేశం అంటే రాష్ట్రమంతా చర్చ జరిగేది. కాని కలెక్టర్లతో సమావేశాలు అనేవే మచ్చుకు లేకుండాపోతున్నాయి. పాలకులు చెప్పే పని మాత్రమే చేస్తూ వస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాలకులు తీసుకునే నిర్ణయాలపై రాష్ట్రానికి ఎంత మేలు అన్నదానిపై ఐఏఎస్‌లుకు పూర్తి పట్టు వుండేది. పాలకులు చెప్పిన ప్రతి పనికి తల ఊపే వారు కాదు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మూలంగా రాష్ట్రానికి జరిగే మేలును దృష్టిలో వుంచుకొని నిర్ణయాలు అమలుచేస్తూ వచ్చేవారు. పాలకులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సమావేశాలలో వాటిపై తమ అభిప్రాయాలను, నిర్ణయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. ప్రభుత్వనిర్ణయాలపై నిక్కచ్చి లెక్కలు చెప్పేవారు. దాని వల్ల పాలకులు ప్రజలు హమీలు ఇచ్చే సమయంలో ఆచి తూచి వ్యవరహించేవారు. ప్రకటనలు చేసేవారు. కాలం మారింది. ప్రజల ఆలోచనా ధోరణి మారింది. రాజకీయ నాయకులు అడుగులు మారాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అలవి కాని హమీలు ఇస్తున్నారు. వాటిని అమలు చేయలేక ఐఏఎస్‌లు తలలు పట్టుకుంటున్నారు. పథకాల అమలులో ఇబ్బందులు ఐఏఎస్‌ల మెడకు చుట్టుకుంటున్నాయి. ఐఏఎస్‌ల మీద పాలకుల పెత్తనం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఐఏఎస్‌లు అయ్యా ఎస్‌ అనే పరిస్దితులు ఎదురౌతున్నాయి. ప్రజల మేలు కోసమో, రాష్ట్ర క్షేమం కోసమే కాకుండా పాలకల మెప్పుకోసం ఐఏఎస్‌లు ఆరాటపడే పరిస్ధితులు అలవాటు చేసుకుంటున్నారు. పాలకులు మారినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఏటు చూసినా నష్టం ఐఏఎస్‌లకే జరుగుతోంది. పాలకులు తప్పించుకునేందుకు వీలౌతుంది. దేశంలో జరిగిన జరుగుతున్న అవినీతి అంశంలో దోషులుగా నిలబడుతున్నది కూడా ఐఏఎస్‌లే. పాలకులు మెప్పుతోపాటు, అక్రమ సంపాదనకు కూడా కొందరు ఐఏఎస్‌లు అలావాటు పడ్డారు. దాంతో పాలకులను ప్రశ్నించే పరిస్ధితిని కోల్పోతున్నారు. పాలకులకు సరైన సూచనలు కూడా ఇవ్వలేకపోతున్నారు. వారు ఏది చెబితే అది ఎస్‌సార్‌ అంటున్నారు. అందుకే ఇటీవల సమాజం ఐఏఎస్‌లను అయ్యా! ఎస్‌ అని సంబోధిస్తున్నారు. అందుకే మేం ఎప్పుడూ ఐఏఎస్‌లమే అని అదికారులు నిరూపించుకోవాల్సిన అవసరం వుంది. పాలకులు ఎవరైనా సరే పాలించే అదికారం మాకేవుందన్నట్లు నడుచుకుంటే గాని, సమాజానికి ఎప్పటికీ మేలు జరగదు. అధికారులు తప్పుచేస్తే శిక్షించే హక్కు పాలకులు వుంది. కాని పాలకులను సరైన దారిలో నడిచేలా చూసే శక్తి ఐఏఎస్‌లకే వుంది. ఇది మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!