-జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల/నేటిధాత్రి
జడ్చర్ల నియోజకవర్గంలో నేటి నుంచి 25 వ తేదీ వరకు జరగనున్న గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు తప్పనిసరిగా పాల్గొని అర్హులందరికీ న్యాయం జరిగేలా చూడాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. తాను కూడా కొన్ని గ్రామ సభలకు ఆకస్మికంగా హాజరు అవుతానని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరులో ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగకుండా చూడాలని ఆయన అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులను కోరారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా గ్రామాలకు చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులపైననే ఉందని అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు. అధికారులు ఆమోదించిన జాబితాలలో అనేకమంది అర్హుల పేర్లు లేవని ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు చెందిన అర్హులందరి పేర్లను జాబితాలో చేర్చి వాటిని గ్రామసభలలో ఆమోదించాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సహకరించాలన్నారు. గ్రామ సభలలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటుగా ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని గ్రామసభలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.
తాను కూడా గ్రామసభలలో ఆకస్మికంగా పాల్గొంటానని వెల్లడించారు. అధికారులు గ్రామ సభలలో ఆమోదించిన జాబితాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూడా పంపాలని కోరారు. గ్రామ సభలలో అర్హులైన వారి పేర్లను జాబితాలోకి చేర్చడంలో ఇబ్బందులు ఎదురైన పక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి స్వయంగా గాని, లేదా 83280 09760 ఫోన్ నెంబర్ ద్వారా గాని ఫిర్యాదులు చేయాలని అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.