ఓరుగల్లులో హోరెత్తిన వాన..
వర్షం నీటితో ముంచెత్తిన వరంగల్ నగరం..
వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన పలు కాలనీలు..
వరద ముంపుకు గురి కావడంతో అప్రమత్తమైన వరంగల్ జిల్లా అధికారులు
ముంపు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించిన అధికారులు
భారీ వర్షం నేపథ్యంలో వరంగల్ మహానగర పాలక సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు
వరంగల్, నేటిధాత్రి
వరంగల్లో కుండపోత వర్షం కురిసిన కారణంగా స్తంభించిన జనజీవనం. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది.
ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలైనా వివేకానంద కాలనీ, ఎస్సార్ నగర్, సాయిగణేష్ కాలనీ, మధురానగర్ శివనగర్, ఎన్టీఆర్ నగర్, కరీమాబాద్, మిల్స్ కాలనీ, గరీబ్ నగర్, శాకరాశికుంట, డి కే కొమురయ్య నగర్ లు జలమయమయ్యాయి. నగరంలోని చెరువులు, కుంటలు పొంగిపొర్లడంతో వరద నీరు ఇళ్లను ముంచెత్తింది. పలు మండలాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. అత్యధికంగా సంగెం మండలంలో 178.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.
అలాగే ఖిలావరంగల్‌లో 155.0 మి.మీ., వరంగల్‌లో 148.8 మి.మీ., వర్ధన్నపేటలో 125.4 మి.మీ., ఖానాపూర్‌లో 108.8 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే గీసుగొండలో 90.4 మి.మీ, దుగ్గొండిలో 84.2 మి.మీ, నల్లబెల్లిలో 66.4 మి.మీ, నర్సంపేటలో 86.4 మి.మీ, చెన్నారావుపేటలో 85.4 మి.మీ, రాయపర్తిలో 90.8 మి.మీ, పర్వతగిరిలో 88.6 మి.మీ, నెక్కొండలో 82.4 మి.మీ భారీ వర్షం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లా మొత్తం సగటు వర్షపాతం 107.0 మి.మీగా నమోదైంది.
రాత్రి నుండి తెల్లారే వరకు భారీ వర్షం
వరంగల్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. సాకరాశికుంట, హనుమాన్ నగర్, పెరుకవాడ, ఏకశిలానగర్ ప్రాంతంలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. వర్షం నీటికి ఇంట్లో ఉన్న సామగ్రి తడిసిపోయాయి. రాత్రి నుండి తెల్లవారు జామున వరకు వాన పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది.
రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నుంచి రాకపోకలు బంద్
వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తెల్లవారుజామున ఎవరు లేకపోవడంతో ఒక కారు నీటిలో మునిగిపోయింది. అదృష్టవశాత్తూ, స్థానికులు వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో కారును బయటకు తీశారు. అధికారుల నుంచి సకాలంలో ఎలాంటి సహాయక చర్యలు అందలేదని స్థానికులు వాపోతున్నారు. రాత్రి పూట కురిసిన వర్షం కారణంగా, అండర్ బ్రిడ్జితో పాటు, హంటర్ రోడ్డులోని చిన్న బ్రిడ్జి కూడా వరద నీటితో నిండిపోయి రాకపోకలు బంధు అయ్యాయి.
ప్రధాన రహదారులపైనా వరద ప్రభావం..
వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై అక్కడక్కడ నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో భారీ వాహనాలు మినహా బైకులు, ఆటోలు, కార్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే బొల్లికుంట చెరువు అలుగు పోస్తుండడంతో గుంటూరు పల్లి, బొల్లికుంట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయి చెరువులను తలపింప చేశాయి.
ప్రమాదకర స్థాయిలో ఖిలా వరంగల్ చెరువు
ఖిలావరంగల్ అగర్తల చెరువు ప్రమాదకర స్థాయిలో నిండిపోయింది. రిటర్నింగ్ వాల్ పైవరకు నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద ధాటికి చెరువు వెనకాల ఉన్న సుమారు 100 ఎకరాల పంటలు నీటమునిగాయి. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖిలా వరంగల్ చెరువు పొంగిపొర్లుతుండడంతో ఆ నీరంతా శివనగర్, మైసయ్య నగర్‌లో లోతట్టు ప్రాంతాలను నీట ముంచాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు.
నీటితో నిండిన వరంగల్ రైల్వే స్టేషన్ పట్టాలు…
గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ రైల్వే స్టేషన్ కు భారీగా వరద పోటెత్తింది. ఒకటి, రెండవ ప్లాట్ ఫామ్ ల మధ్య పట్టాలు కనిపించనంత వరద నీరు చేరింది. దీనితో రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
టోల్ ఫ్రీ నంబర్ల ఏర్పాటు…
భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్‌లో మహానగర పాలక సంస్థ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. వరంగల్ కలెక్టరేట్- 1800 425 3434, 91542 25936, హనుమకొండ కలెక్టరేట్- 1800 425 1115, వరంగల్ మున్సిపాలిటీ కార్యాలయం- 1800 425 1980, 97019 99676
వరంగల్ విద్యుత్‌శాఖ- 1800 425 0028.
13,14 తేదీల్లో భారీ వర్షాలు?
రానున్న మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని.. 13న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో 13,14 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
