సందిగ్ధంలో టీడీపీ రాజకీయ ప్రస్థానం

టీటీడీ సంఘటనలో మసకబారిన ప్రభుత్వ ప్రతిష్ట

వరుస సంఘటనలతో భక్తుల్లో పెరుగుతున్న భయం

కంట్లో నలుసులా మారిన పవన్‌ కళ్యాణ్‌

టీడీపీలో క్రమంగా తెరమరుగుకు సీనియర్‌ నేతలు

లోకేష్‌ నేతృత్వంలో కొత్త తరం నాయకులు

లోకేష్‌ నాయకత్వాన్ని ‘మిత్రులు’ ఆమోదించడం కష్టమే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఈసారి వైకుంఠ ఏకాదశికి తిరుమల శ్రీవారు భక్తులకు పరీక్షలు పెడుతున్నారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీచేసే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, లడ్డూ కేంద్రంలోని 47వ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం, తిరు మల ఘాట్‌రోడ్డులో బస్సు ప్రమాదం చోటుచేసుకోవడం వంటి సంఘటనలు వరుసగా జరుగు తుండటంతో సహజంగా భక్తుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ‘పెద్దాయన’ (శ్రీబాలాజీ)కి కోపానికి ఇవన్నీ సంకేతమని కొందరు ‘సెంటిమెంట్‌’ పరంగా ఆలోచించేవారు భావిస్తే, సాధారణంగా పరిశీలించేవారికి ఒక్కోసమయంలో ఇట్లాగే వరుస సంఘటనలు జరిగి తర్వాత సమసిపోతాయన్న అభిప్రాయం వుండవచ్చు. విచిత్రమేమంటే ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌గా బి.ఆర్‌. నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన త తర్వాత వెంటవెంటనే చోటుచేసుకోవడం స్వామిపట్ల భయభక్తులు ప్రదర్శించేవారిలో ఆందోళన వ్యక్తం కావడం అసహజమేంకాదు. తొక్కిసలాట బాధితులకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నామనుకుంటే ఒకదానివెంట మరో సంఘటన జరుగుతుండటంతో ఇకముందు మరెన్ని సంఘటనలు జరుగుతాయోనని బిక్కు బిక్కుమనడం భక్తుల వంతైంది. ఎందుకంటే ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు ఇచ్చిన సమయం నుంచి ఇవి చోటుచేసుకోవడం గమనార్హం.
వరుస సంఘటనలు ఈవిధంగా వుంటే, ఛైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, ఇ.వొ.శ్యామలరావు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి వున్నదని మీడియాలో విపరీతంగా ప్రచారమైన నేపథ్యంలో, వీరు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ తాము తిట్టుకోలేదని చెప్పుకోవాల్సి వచ్చింది. అంతటి ఉన్నతస్థానాల్లో ఉ న్నవారు, నిత్యకళ్యాణం,పచ్చతోరణంగా వుండే తిరుమలలో అనుక్షణం అప్రమత్తంగా వుంటూ భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు అందించడంలో, పాలనా వ్యవహారాల్లో తలమునకలుగా వుండాల్సింది పోయి విభేదాలు…పరిష్కారాలు చివరకు అసలు మామధ్య విభేదాలే లేవని మరీ చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే, ఇందుకు వారే బాధ్యత వహించాలి. తొక్కిసలాటకు ఉన్నతస్థాయిలో సరైన సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణమన్న సత్యాన్ని విస్మరించడానికి వీల్లే దు. అసలు ఏమీ లేకుండా మీడియాలో ఏవిధమైన వార్తలు రావు. కాకపోతే కొద్దిగా ‘పొగ’ కనిపిస్తే ‘తగులబడిపోతున్నది’ అనేస్థాయిలో ప్రచారం జరగవచ్చు.

సరిగ్గా ఇదే సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ రంగంలోకి దిగి ప్రభుత్వంలోతాను కూడా భాగస్వామినే కనుక, జరిగిన సంఘటనకు క్షమాపణలు చెబుతూ, టీటీడీ ఛైర్మన్‌, ఈఓ, అసోసియేట్‌ ఈవోలు కూడా క్షమాపణలు చెప్పాల్సిందేనని గట్టిగా కోరడం, బి.ఆర్‌.నాయుడు అందుకు తిరస్కరించడం వరుసగా జరిగిన పరిణామాలు. నిజం చెప్పాలంటే పవన్‌ కళ్యాణ్‌ వ్య వహారశైలి తెలిసిన వారెవరైనా ఆయన ఇంకా ముందుకు దూకుడుగా వెళతారనే భావిస్తారు. కానీ మిత్రధర్మం, రాజకీయ పరిమితి నేపథ్యంలో అంతకుమించి ముందుకెళ్లలేదు. కానీ ఆయన క్షమాపణ చెప్పడంతో తనపట్ల ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకున్నారనే చెప్పాలి. దీని తర్వాత చంద్రబాబు రంగంలోకి దిగి నష్టపరిహారం చెల్లింపు ప్రకటనతో ‘‘మమ’’ అనిపించినా టీటీడీ ఛైర్మన్‌ ‘క్షమాపణ’ చెప్పకపోవడం, యాదృచ్ఛికంగా తర్వాత జరిగిన సంఘటనలు టీడీపీ పట్ల ప్రజల్లో విశ్వాసం సడలే పరిస్థితి ఏర్పడిరది. దేవుడి దగ్గరకూడా రాజకీయమేంటన్న ప్రశ్న లు ఉత్పన్నమవడానికి కారణమయ్యాయి. దీనికి తగ్గట్టే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నఅంశం దగ్గరినుంచి తిరుపతి సంఘటన వరకు ‘మిత్రధర్మం’ పాటిస్తూనే పాలనలో జరుగుతున్నతప్పిదాలను ఎత్తిచూపుతూ పవన్‌కళ్యాణ్‌ ముందుకెళ్లడం టీడీపీకి గొంతులో పచ్చివెలక్కాయపడిన చందంగా మారింది. ప్రభుత్వంలో జరుగుతున్న పొరపాట్లకు తనకు సంబంధం ‘లేదన్న’ రీతిలో పవన్‌ కళ్యాణ్‌ వ్యవహారశైలి వుంటోదనేది టీడీపీ పెద్దల ఆందోళన. నిజం చెప్పాలంటే ప్రత్యర్థి జగన్‌ను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటున్నప్పటికీ, పవన్‌ కళ్యాణ్‌ విషయంలో ఏంచెయ్యాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. అయితే పవన్‌కళ్యాణ్‌ వెనుక బీజేపీ వున్నదన్న సత్యం టీడీపీ నాయకులకు బాగా తెలుసు. రాష్ట్రానికి ఏమన్నా కావాలన్నా, చెయ్యాలన్నా చంద్రబాబు కంటే, పవన్‌కళ్యాణ్‌కే బీజేపీ పెద్దలు ప్రాధాన్యతనిస్తారనేది నిష్టుర సత్యం. మొన్న నరేంద్రమోదీ విశాఖకు వచ్చి రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారంటే, పవన్‌ కళ్యాణ్‌ పాత్రను మరువడానికి వీల్లేదు. ఇందుకు బీజేపీ ఆలోచనలు, వ్యూహాలు భిన్నంగా వుండవచ్చు.

ఇప్పుడు చంద్రబాబు వయస్సు రీత్యా పెద్దవారయ్యారు. 2029నాటికి ఆయన 80వ పడిలో పడతారు. అప్పటికి ఆయనకు ఇంతటి ఓపిక వుంటుందనుకోవడం భ్రమే! ఈ నేపథ్యంలో చిన్నగా లోకేష్‌ను వెలుగులోకి తీసుకొచ్చి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహింపజేయాలన్న పుత్రవాత్సల్యంచంద్రబాబులో వుండవచ్చు కానీ, దీన్ని జనసేన, భాజపాలు ఎంతమేర అంగీకరిస్తాయన్నది ప్ర ధాన ప్రశ్న. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నంతవరకు వాటికి అభ్యంతరం వుండదు. కానీ లోకేష్‌కు ఆ స్థానం ఇవ్వడం వాటికి సుతరామూ ఇష్టం కానిది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం లోకేష్‌ విషయంలో మీడియాకు చిన్నగా లీకులిస్తూ కూటమి పార్టీల అభిప్రాయం తెలు సుకోవాలని యత్నిస్తోంది. అదీకాకుండా పార్టీలో అంతర్గతంగా చంద్రబాబు నాయుడు సమకాలీనులైన సీనియర్‌ నాయకులను క్రమంగా పక్కకు తప్పించే యత్నాలు కూడా మొదలయ్యాయం టున్నారు. ముఖ్యంగా లోకేష్‌ సన్నిహితులు, ఆయన తరం నాయకులకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతుండటం ఈ అనుమాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇందుకు టీడీపీ సీనియర్‌ నేత అఅచ్చం నాయుడినే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయనకు క్రమంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గి పోతున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్‌ హయాంలో అచ్చన్నాయుడు జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ అభిమానం చంద్రబాబు నాయుడికి వుండటంలో తప్పులేదు. కాకపోతే వచ్చిన చిక్కల్లా, అచ్చన్నాయుడికి, లోకేష్‌పై పెద్దగా మంచి అభిప్రాయం వున్నట్టు లేదు. మరి లోకేష్‌ ప్రభావాన్ని పెంచాలని చంద్రబాబు యత్నిస్తున్న నేపథ్యంలో, ఇక అచ్చన్నాయుడి పాత్రను ఒక స్థాయికి పరిమితం చేసి క్రమంగా తెరమరుగు చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ ఉద్దేశాన్ని గుర్తించిన కొందరు తెలివైన సీనియర్‌ నేతలు తమ వారసులను రంగంలో కి దించి, లోకేష్‌ ప్రాపకం కోసం ప్రయత్నిస్తుండం కూడా టిడిపిలో జరుగుతున్న పరిణామం.

ఇవన్నీ ఈవిధంగా వుండగా సోమవారం ఇందిరాగాంధీ పంచాయతీరాజ్‌ భవనంలో కాంగ్రెస్‌ నేత సచిన్‌పైలెట్‌ మాట్లాడుతూ, చంద్రబాబు, నితిష్‌లు కేంద్రంలో చక్రంతిప్పే పరిస్థితి లేదని, త మ రాష్ట్రాలకు కావలసిన వాటిని సాధించుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పడమే కాదు, వీరిద్దరూ ఎప్పుడు హ్యాండిస్తారో తెలిదని కూడా వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. చంద్రబా బు, నితిష్‌లు ఎప్పుడు మనసు మార్చుకుంటారో తెలియదని, ప్రజాస్వామ్యంతో మిత్రత్వం శాశ్వ తం కాదన్న సత్యాన్ని గుర్తించాలని ఆయన అనడం, తెరవెనుక ఏం జరుగుతున్నదనే అనుమానా లు లేవనెత్తడం సహజం. వీరిద్దరూ మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రం చేత ఎన్‌డీఏ ప్రభుత్వం పడిపోదు, కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి రాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా సచిన్‌ పైలెట్‌ చేసిన ఈ వ్యాఖ్యలు చేశారంటే ఇందులో ఏదో మతలబు వున్నదనే భావించాల్సి వుంటుంది. ఆయన అభిప్రాయం ఎట్లా వున్నా, ఆంధ్ర రాజకీయాలకు వస్తే, చంద్రబాబు ప్రస్తు తం అందటి దుస్సాహసం చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వస్తే ఆయన కే నష్టం. లోకేష్‌ ఇంకా పూర్తిస్థాయి నాయకుడు కాలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి స్థానానికి చం ద్రబాబు తర్వాత పవన్‌కళ్యాణ్‌కే ఛాన్స్‌ ఇవ్వాలన్నది జనసేన, భాజపాల ఉద్దేశం! ఒకవేళ టీడీపీ కూటమినుంచి బయటకు వస్తే పార్టీ భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇప్పటికే ప్రభుత్వ వరుస తప్పిదాలను, తిరుమల సంఘటనలను జగన్‌ పార్టీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకోవడం మొదలుపెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలు నైరాశ్యంగా వున్న జగన్‌ పార్టీలో జోష్‌ నింపుతున్నాయి. గతంలో అన్ని సంక్షేమ పథకాలు అమలుచేసినా రోడ్లను పట్టించుకోకపోవడంతో, జగన్‌ను జనం పట్టించుకోలేదు. ఇప్పుడు బహు బాగా రోడ్లు వేశామంటూ ఎంత ప్రచారం చేసుకున్నా, మిగిలిన పాలన సజావుగా లేకపోతే ప్రజలు టీడీపీనీ పట్టించుకోరు. ఆంధ్ర ప్రజల రాజకీయ చైతన్యం వేరు. వారు ఎప్పటికప్పుడు చాలా తెలివి గా వ్యవహరిస్తారు. బహుశా ప్రజలకు సంక్షేమాలు సక్రమంగా అమలు జరకపోవడం వల్ల కలుగుతున్న కష్టం, నష్టం ప్రజలకు తెలిసొస్తుండవచ్చు. ఇది పెరుగుతూ పోతే పార్టీ పుట్టి మునగడం ఖాయం.తెలంగాణతో పోలిస్తే, ఆంధ్ర రాజకీయం భిన్నం. అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే తెలియకుండానే మునిగిపోవడం తథ్యం.

ఆంధ్ర రాజకీయాలను పరిశీలస్తున్న వారికెవరికైనా ఒక్క విషయం బోధపడివుంటుంది. లోకేష్‌ను ప్రొజెక్ట్‌ చేయడం జనసేన, బీజేపీకి సుతరాము ఇష్టం వుండదు. ఈ రెండు పార్టీలను వదిలేసి ఒంటరిగా టీడీపీ గెలవడం అసాధ్యం. టీడీపీ సహాయం లేకుండా వాటికీ మనుగడ లేదు. చం ద్రబాబు పెద్దవారైపోతున్నారు కనుక లోకేష్‌కు పగ్గాలు అప్పగించక తప్పదు. లోకేష్‌కు పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చే సత్తా లేదు. పార్టీలో సీనియర్లు కనుమరుగవుతూ, రంగంలోకి వస్తున్న కొత్త నాయకత్వం రెక్కలు విప్పే సరికి కొంత సమయం పడుతుంది. మరి ఈలోపు జన సేన, బీజేపీలు చేతులు ముడుచుకొని కూర్చోవు. వాటి రాజకీయం అవి చేస్తాయి. ఇక దెబ్బతి న్న దిగ్గజం వై.ఎస్‌. జగన్‌ ఎట్లాగూ ప్రత్యామ్నాయంగా వున్నారు. లోకేష్‌ ‘కలువ’ వికసించాలంటే, నాయకత్వ ఉషోదయానికి అడ్డుగా వున్న ఇన్ని మబ్బులు తొలగక తప్పదు! మరిది ఇప్పట్లో సాధ్యమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!