బై….బై….గణేశా… గణనాథునికి ఘనంగా వీడ్కోలు
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు….
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహరాజ్ కి జై, గణపయ్యా ఇక సెలవు అంటూ భక్తి ప్రపత్తులతో ఆ ఆదిదేవుడు గణనాథునికి రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు వీడ్కోలు పలికారు. రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ వద్ద గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టేజ్ వద్దకు పట్టణంలోని ప్రతి వినాయకుడిని తీసుకువచ్చి అక్కడనుండి గోదావరి నది తీరానికి గణనాథుల నిమజ్జనం నిమిత్తమై తీసుకెళ్లారు. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో ప్రతిష్టించిన వినాయకులను అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. రాజీవ్ చౌక్ లో ఏర్పాటుచేసిన ఉత్సవ కమిటీ స్టేజ్ వద్దకు పట్టణంలోని ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని వినాయకులను సాగనంపారు. తీర్థప్రసాదాలు స్వీకరించి, సాంప్రదాయ వస్త్రాధారణతో యువతి, యువకులు నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకుంటూ, కేరింతల కొడుతూ, భక్తిశ్రద్ధలతో గణనాధునికి సెలవు పలికారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి ట్రాక్టర్లను,లారీలను,ట్రాలీలను మామిడి తోరణాలతో ముస్తాబులు చేసి విఘ్నేశ్వరుని నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై జి రాజశేఖర్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…. గోదావరి నది తీరానికి గణనాథులను తీసుకువెళ్తున్న నేపథ్యంలో చిన్న పిల్లలను వెంట తీసుకెళ్లకూడదని, భక్తిశ్రద్ధలతో, నియమ నిబంధనలతో తరలి వెళ్లాలని అన్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆ ఆది దేవుణ్ణి వేడుకుంటున్నామని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కమిషనర్ మురళీకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు గాండ్ల సమ్మయ్య,పెద్దపల్లి ఉప్పలయ్య, పల్లె రాజు, మిట్టపల్లి శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, కంబగౌని సుదర్శన్ గౌడ్ ఆర్ముళ్ల పోషం, వేముల అశోక్, బెనివాల్ సంజయ్, పుర ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు,భక్తులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.