రేపు చేపట్టిన ధర్నా కార్యక్రమం విరమించుకుంటున్నట్లు వెల్లడి
కార్యకర్తలకు అండగా ఉంటా-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల నేటిధాత్రి
25 పిబ్రవరి న ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ జాతరలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను కుటుంబ సభ్యులు మరియు కొంత మంది బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలతో కలిసి దర్శనం చేసుకొని వస్తున్న క్రమంలో కొంత మంది నాయకులు జై తెలంగాణ నినాదం చేశారనే నెపంతో ఉద్దేశపూర్వకంగా,అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం అక్రమ కేసులు బనాయించి, థర్డ్ డిగ్రీ ఉపయోగించి బి.ఆర్.ఎస్. నాయకులను విచక్షణారహితంగా కొట్టిన ఆత్మకూర్ ఎసై దుర్గాప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.సిపి నిర్ణయంతో పరకాల నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఇట్టి కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపి ఇందులో భాగస్వాములైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిని చల్లా ధర్మారెడ్డి కోరారు.సిపి నిర్ణయంతో రేపు ఆత్మకూరు మండల కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఈ సంఘటన జరిగినప్పటి నుండి మాతో పాటు ఉంటూ మాకు మా కార్యకర్తలకు అండగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం అకారణంగా కేసులు పెట్టి ప్రజలను,ఇతర పార్టీల నాయకులను,కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే పొలిసు అధికారులకు సిపి నిర్ణయం ఒక గుణపాఠం లాంటిదని పేర్కొన్నారు.పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన పనిలేదని మీకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటాలని చల్లా ధర్మారెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులను ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు.