సాగునీరు అందక రైతుల ఎండుతున్న పంటలు…

సాగునీరు అందక రైతుల ఎండుతున్న పంటలు

దేవాదుల అధికారుల నిర్లక్ష్యంతో ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరోపించారు. ప్రభుత్వ నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కాలువల ద్వారా సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. తక్షణమే సాగునీటి సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.శనివారం ఏఐకేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేవాదుల ఎత్తిపోతల పథకం డి-8 నంబర్ కాలువ పరిధిలోని వర్ధన్నపేట, సంగెం మండలాల చెన్నారం, రామచంద్రాపురం, గవిచర్ల, ఆశాలపల్లి తదితర గ్రామాల్లో ఎండిపోయిన పంటలను బృందం సందర్శించింది. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంది.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా 1,23,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు పూర్తి కాక రైతులకు సాగునీరు అందడం లేదని విమర్శించారు. ఎనిమిదో నంబర్ కాలువ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కాలువల మెయింటెనెన్స్ సరిగా లేక చెట్లు, పొదలు పెరిగిపోవడం, పూడిక పేరుకుపోవడం వల్ల నీరు కిందికి చేరడం లేదన్నారు. కొంత భాగంలో లైనింగ్ పనులు కూడా పూర్తి కాలేదని తెలిపారు.ఎన్నో ఆశలతో వరి, మొక్కజొన్న తదితర పంటలు వేసిన రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి సాగునీరు అందక పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటలు ఎండిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దేవాదుల ఎత్తిపోతల కాలువలను తక్షణమే మరమ్మతులు చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలువల మెయింటెనెన్స్‌లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబా బాబురావు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్, ఎంసిపిఐ(యు) వరంగల్ డివిజన్ కార్యదర్శి మంద రవి, రైతు సంఘం జిల్లా నాయకులు సోమిడి రవి, శివ కుమారస్వామి, మహమ్మద్ రఫీ, అమ్మరాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version