`వరుస విపత్తులతో తెలంగాణ రైతు కుదేలు!
`ప్రకృతి కన్నెర్రతో రైతు పడుతున్న అష్ట కష్టాలు

`ఈ ఏడాది రైతుపై పగ పెంచుకొని గండాలు తెచ్చిన కాలం
`అతివృష్టితో తెలంగాణ వ్యవసాయం అతలాకుతలం
`ముందుగా మురిపించి ముఖం చాటేసిన వరణుడు
`తొలకరితో విత్తనాలు చల్లి రైతు నష్టపోయాడు
`ఆలస్యంగా కురిసిన అంతులేని వర్షాలు
`అటు విత్తనాలు, ఎరువుల కష్టాలు
`తీరా పంట చేతికొచ్చే సమయంలో ‘‘మోంథా’’ చెడగొట్టు వానలు
`పొలంలో వున్న వరి ఒరిగిపోయి, వంగిపోయి, రాలిపోయింది
`చేతికందకుండా నీళ్ళలో మురిగి చెడిపోయింది
`కోత కోసి ఆరబెట్టిన వడ్లు కల్లాలలో కొట్టుకుపోయాయి
`పుట్లకొద్దీ వడ్లు కళ్ల ముందు మాయమైపోయాయి
`లక్షల రూపాయల రైతు పెట్టుబడి నీళ్లపాలైంది
`రైతు ఆరు నెలల కష్టం కన్నీటి పాలైంది
`ఈ రబీ పంటలు దుఖాన్ని మిగిల్చాయి!
`తెల్ల బంగారమంతా నల్లని బొగ్గైపోయింది
`వానకు తడిసి రాలి నేలపాలై కొట్టుకుపోయింది
`ఏ పంట చేతికందక రైతుకు అప్పులు మెడకు చుట్టుకున్నాయి
`ప్రభుత్వం ఆదుకుంటే తప్ప బతకలేని పరిస్థితులు దాపురించాయి
హైదరాబాద్, నేటిధాత్రి: రైతంటే పాలకులకే కాదు, ప్రకృతికి కూడా చిన్న చూపే వుంది. ప్రతిసారి అయితే అతి వృష్టి లేకుంటే అనావృష్టితో రైతు జీవితంతో కాలం ఆటలాడుకుంటోంది. రైతుకు అడుగడుగునా ప్రకృతి పరీక్ష పెడుతోందో..పగ పెంచుకుంటుందో అర్దం కావడం లేదు. దశాబ్దాలపాటు కనికరం చూపించని పాలకులు, కరువును తెచ్చి రైతుల జీవితాలను ఆగం చేసిన వరణుడు వణికిస్తున్నారు. ఏనాడు రైతును కడుపులో పెట్టుకున్న పాలకులు లేరు. ఏనాడు రైతుకు సహకరించిన కాలం లేదు. అయినా రైతు తన భూమిని నమ్ముకొని బతుకుతూనే వున్నాడు. దేశానికి అన్నం పెడుతూనే వున్నారు. తన పొట్ట నిండపోయినా, చేసిన అప్పుల కోసమైనా రైతులు పంటలు పండిరచాల్సి వస్తోంది. అప్పుల మీద అప్పులు చేసుకోవాల్సి వస్తోంది. భూమిని నమ్ముకున్నందుకు రైతు బాగు పడిరది లేదు. కడుపు నిండా తిన్నది లేదు. కంటి నిండా నిద్ర పోయింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుకు ఊరట లభించింది. కొంత మెరుగైన జీవితం మొదలైంది. ఒకనాడు నీళ్లు లేక పంటలు పండక, కరువు రక్కసి కాటేస్తుంటే బతకలేక వలసలుపోయిన తెలంగాణ కటిక దరిద్రం అనుభవించింది. ఆనాడు పాలకులు కనీసం పట్టించుకోలేదు. తెలంగాణ మేలు కోరలేదు. రాజుల కాలంలో రైతును పీడిరచుకుతిన్నారు. ప్రజా పాలకులు రైతులను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఈ రెండిరటికీ పెద్ద తేడా లేదు. కాని రైతు మాత్రం గోస అనుభవిస్తున్నాడు. చుక్క నీరు చూడని తెలంగాణ పచ్చగా మారడం కాలానికి కూడా కన్ను కుట్టినట్లుంది. పంట చేలు పచ్చ కనిపిస్తుంటే కన్ను కుట్టినట్లుంది. అందుకే ఈ సారి రైతును కాలం అరిగోస పెడుతోంది. రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఆరు నెలలు రైతు అనుభవించిన కష్టం అంతా ఇంతా కాదు. ఎప్పుడూ లేని విధంగా మే నెలలో వరణుడు ఊరించాడు. రైతు సంతోషించాడు. ఒక నెల ముందుగానే కాలమౌతోందని సంబరపడ్డాడు. ఆ ఆనందం మిగలకుండా వరణుడు మళ్లీ ముఖం చాటేశాడు. రైతు మీద కన్నెర్ర చేశాడు. మేలో నీళ్లను కురిపించి, జూన్‌లో సూర్యునితో చేతులు కలిపి, నిప్పులు కురిపించాడు. జూన్‌లో కరువు రుచి చూపించాడు. తెలంగాణ వ్యాప్తంగా భూ గర్భ జలాలు అడగంటేలా చేశాడు. రైతుల ఆశల మీద నిప్పులు కురిపించాడు. రైతుకు ఆత్రమెక్కువ. నీళ్లను చూసి ఆగలేడు. నీళ్లు కనిపిస్తే సాగు చేయకుండా వుండలేడు. నేల తల్లికి మొక్కకుండా వుండలేడు. అందుకే మేలో కురిసిన వానలకే దుక్కి దున్ని విత్తనాలు చల్లాడు. ఒక నెల మందుగానే పంట చేతికొస్తుందని సంబరపడ్డాడు. వేలాది రూపాయలు ఖర్చు చేసి భూమి చదును చేయించుకున్నాడు. ఈసారి తెల్ల బంగారం పండిరచాలని కలలు గన్నాడు. ముఖ్యంగా పత్తి పంట ఉత్తర తెలంగాణలో ఎక్కువ. అందులోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి పంట విరివిగా పండే అవకాశం వుంది. ముందుగా మురిపించిన వానను చూసి పత్తిని సాగు చేశాడు. కాని రైతు ఆత్రం కాలానికి అర్ధం కాలేదు. రైతు కష్టం చూసి చలించలేదు. జూన్‌లో ఎండలు కాసి, మొలకెత్తిన మొక్కలను మాడిపోయేలా చేసింది. వేసిన విత్తనాలు పురుగుల పాలు చేసింది. అయినా రైతు కన్నీళ్లను దాచుకొని మళ్లీ కురిసిన వానలకు పత్తి వేశాడు. వరి రైతు ఆలస్యంగానే పంటలు వేశాడు. ఈ రెండు పంటలే కాకుండా మర్చి, ఇతర ధాన్యపు పంటలు కూడా రైతు సాగు చేశారు. వాటికి అవసరమైన ఎరువుల కోసం నెలల తరబడి ఎదురుచూశారు. కాని అందలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా పడిన కష్టాలు ఈసారి మళ్లీ తెలంగాణ రైతులు పడ్డారు. మందు బస్తాలు దొరకలేదు. సమాయానికి అందలేదు. ఎకరానికి అవసరమైన యూరియాను సరఫరా చేయలేకపోయారు. కేంద్రం, రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద నెపాలు నెట్టేసుకున్నాయి. రైతును ఆగం చేశాయి. ఓ వైపు వరి వేసి రెండు నెలలౌతున్నా, ఒక్క యూరియా బస్తా అందక పంట పెరడం లేదని బాధపడుతన్నా, ఇచ్చిన వాళ్లు లేరు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులు ఎన్నో అనేది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోలేదు. అధికారులు నివేదికలు తయారు చేయలేదు. కేంద్రానికి లెక్కలు పంపలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ముందే జాగ్రత్తపడలేదు. ఇది రెండు ప్రభుత్వాల పాపమే. అటు ప్రకృతి ఆవేశం, పాలకుల నిర్లక్ష్యం మూలంగా దిగుబడి సగానికి తగ్గే పరిస్ధితి ఎదురైంది. అయినా వచ్చిన పంటే చాలనుకున్న రైతుకు మోంధా తుఫాను రూపంలో సర్వం నాశనం చేసింది. చేతికొచ్చిన పత్తి పంట మూడు రోజుల రికార్డు స్ధాయి వానలకు రాలిపోయింది. నీళ్లలో కలిసిపోయింది. తెల్లబంగారం కాస్త నల్లని బొగ్గులా మారిపోయింది. చేళ్లలో నిండిన నీళ్లలో మురిగిపోయింది. ఇంతటి దుస్ధితి గతంలో ఎప్పుడూలేదు. కరువు వచ్చిన రోజుల్లో కూడా రైతు ఇంతగా కష్టం ఎదుర్కొలేదు. అప్పుడు పెట్టిన పెట్టుబడి అయినా చేతికొచ్చేది. ఇప్పుడు పెట్టుబడితోపాటు, కష్టం నీళ్లపాలైంది. నీళ్లలో కొట్టుకుపోయంది. తెల్ల బంగారాన్ని నమ్ముకుంటే మహిళల మీద వున్న బంగారాన్ని అమ్ముకొని అప్పులు తీర్చుకోవాల్సిన దుష్టకాలం దాపురించింది. ఇదిలా వుంటే వరి రైతుల కష్టం అంతా ఇంత కాదు. జూలై నెలలో కురిసిన వర్షాలను నమ్ముకొని కొంత మంది ఆలస్యంగా పంటలు వేసుకున్నారు. మేలో పడిన వర్షాలను నమ్ముకొని వరి నాట్లు వేసిన రైతులు ఇప్పటికే ఒకసారి నష్టాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు మోంధా తుపానుతోపాటు, వరసగా కురిసిన వర్షాలకు మొత్తం పంట చేతికి రాకుండాపోయి కన్నీటి పర్యంతమౌతున్నాడు. ముందుగా వరి నాట్లు వేసిన రైతులు చాల మంది పంటలు కోశారు. కళ్లాలల్లో వడ్లను ఆరపెట్టుకున్నారు. కొంత మంది మార్కెట్లకు తరలించారు. కాని కాంటాలు పెట్టలేదు. తూకాలు వేయలేదు. ప్రభుత్వం ఇంకా కొనుగోలు చేయలేదు. ఒక్కసారిగా ఉరుము లేకుండా వచ్చిన పిడుగులాంటి తుఫానుతో ఆరబెట్టిన వడ్లు కొట్టుకుపోయింది. లక్షలకు లక్షలు చేసిన అప్పులు కనిపిస్తున్నాయి. చేతికొచ్చిన పంట కొట్టుకుపోతుంటే గుండెలు అవిసిపోతున్నాయి. పుట్లకు పట్లు కళ్లముందు కొట్టుకుపోతుంటే చూసి తట్టుకోలేకపోయారు. ఆరు నెలల కష్టం గంగపాలౌతుంటే చూస్తూ గుండెలు బాదుకున్నాడు. కోత కోసిన రైతు గుండె కోతలు మిగులుతున్నాయి. ఇక పంట కోయని రైతు కష్టం అంతకన్నా ఎక్కువైపోయింది. మోంధా తుఫానుకు వరి వంగిపోయింది. పొలంలో నిండిని నీళ్లలో కూరుకుపోయింది. మూడు రోజలు పాటు నీళ్లలో మునిగి మురిపిపోయింది. చేతికి రాకుండాపోయింది. రాలిపోయి కొట్టుకోపోయేది పోయింది. నీళ్లలో ముగినిపోయింది నల్లగా మారిపోయింది. కోతకు కూడా పనికి రాకుండాపోయింది. ఇంతటి కష్టం రైతుకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. తుఫానులంటే సహజంగా ఆంద్రా ప్రాంతానికే పరిమితమనుకునే తెలంగాణకు తుఫాను కూడా రక్కసిలా మారుతుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. రికార్డు స్ధాయి వానలు కురిసి కుదేలైపోవాల్సి వస్తుందిన కల గనలేదు. ఇటు ప్రజలు, అటు రైతులు అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్ధితులు కాకున్నా, గతంలో కేసిఆర్ వున్నప్పుడు వచ్చిన అకాల వర్షాల సమయంలో రూ.560 కోట్లు విడుదల చేశారు. ఒక్క రోజులో రైతులను ఆర్ధికంగా ఆడుకున్నారు. ఎకరాకు రూ.10 వేలు బ్యాంకుల్లో వేసి రైతు కన్నీటిని కొంత వరకు తూడ్చారు. తర్వాత పంట ఎలా వున్నా కొనుగోలు చేశారు. కాని ఇప్పుడు కొట్టుకుపోయిన పంట ఎలాగా చేతికి రాదు. దానికి లెక్కలు లేవు. పొలాల్లోనే మురిగిపోయిన వరికి చేతికొచ్చేలా లేదు. రైతుకు ఓదార్పు దక్కేలా లేదు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వం మాత్రం ప్రకటించింది. తక్షణ సాయం కింద రూపాయి అందలేదు. రైతుకు ఓదార్పు ఇంకా దక్కలేదు. ఆదుకుంటారా… నాలుగు రోజులు గడిస్తే అందరూ మర్చిపోతారా? అన్నది చూడాలి. రైతుకు కష్టం వస్తే సాయం చేసే వాళ్లు లేరు. గతంలో తుఫానులు అంటే అందరూ స్పందించేవాళ్లు. ఆంధ్రా రైతులను ఆదుకునే వారు. సినీ వర్గాలు ముందుగా స్పందిస్తూ వచ్చేవి. మోంధా తుఫాను ఏపిపై కరుణ చూపించి, తెలంగాణను కనికరం లేకుండా నాశనం చేసింది. కాని సినీ పెద్దలకు ఈ విపత్తు కనిపించడం లేదు. సాయం చేస్తామన్న మాట ఎక్కడా ఇంత వరకు వినిపించలేదు. తెలంగాణ రైతంటే అంతే..ఎవరికీ పట్టని విగత జీవి అంతే!!