ములుగులో ఐటీ కంపెనీ ఏర్పాటుకు కృషి చేస్తా

# వుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు ద్వారా యువత మహిళలకు ఉపాధి కల్పిస్తా

# బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లాలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ప్రతి ఏటా వేల సంఖ్యలో మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉంటుందని, యువతకు ఉపాధి కల్పించేందుకు ములుగు జిల్లాలో ఐటి కంపెనీలు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం గోవిందరావుపేట మండలంలోని ఫ్రూట్ ఫామ్, సోమల గడ్డ, రంగాపూర్, బాలాజీ నగర్, చంద్రి గూడెం, పాపాయిపల్లి, గాంధీనగర్, కోటగడ్డ, రాఘవపట్నం, ఇప్పలగడ్డ, మొద్దులగూడెం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ ములుగు జిల్లాలోని యువత, మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 20 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సీతక్క చేసింది ఏమీ లేదని, సోషల్ మీడియాలో గుత్తి కోయిల జీవనస్థితిగతులు వివరిస్తూ ప్రచారం చేస్తూ వివిధ సంస్థల నుంచి సీతక్క నిధులు పొందినట్లు ఆమె ఆరోపించారు. ఆ డబ్బును దుర్వినియోగం చేసి ఈ ఎన్నికల్లో ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధించడం ఖాయమని, ములుగు జిల్లాలో అభివృద్ధికి అడ్డుకట్టగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని ఓడించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎన్నికల గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఓట్ల కోసం వస్తున్నారని, మూడు గంటలు మాత్రమే కరెంటు చాలు అనే వారిని నిలదీయాలని సూచించారు. గతంలో ఎన్నడ లేని విధంగా ప్రభుత్వం సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి ఇంటికి రూ. 3000 ఇచ్చేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. అసైన్డ్ భూములకు పట్టాలు భూమిపై పూర్తి హక్కు కల్పించడంతోపాటు ఈ ఏరియాలోని గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. దివంగత మంత్రి చందూలాల్ తనయుడు అజ్మీర ధరమ్ సింగ్ మాట్లాడుతూ తమ నాన్న చందులాల్ చనిపోయేంతవరకు కూడా బీ ఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, కానీ తన అన్న ప్రహల్లాద్ మాత్రం పార్టీకి మోసం చేసి తన స్వార్థం కోసం బిజెపి నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు. చందూలాల్ ఆశయ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించి కెసిఆర్ కు కానుకగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల ఎన్నికల ఇంచార్జ్ సాంబారి సమ్మ రావు, స్థానిక పార్టీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!