# ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజ్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ డిమాండ్..
# నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం అందజేత.
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణా గ్రామీణ ప్రాంత కళాశాలలు కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉపకార వెతనాలపైన ఆధారపడి నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంత కళాశాలలు ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాదిని కల్పిస్తున్నాయి. కాని గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు ఇవ్వకపోవడం వలన నిరుద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది అలాగే అద్దె భవనాలకు కిరాయి ఇవ్వలేని సంక్షోభానికి యాజమాన్యాలు గురి అవుతున్నాయని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బకాయిలుగా ఉన్న బోధనా రుసుములను ఇప్పించాలని నర్సంపేట ప్రైవేట్ డిగ్రీ,పీజీ కాలేజ్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు మంగళవారం స్థానిక ఆర్డీఓ కృష్ణవేణికి
ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజ్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ గత 2023 ఆగస్టు –సెప్టెంబర్ నెలలో గత ప్రభుత్వం విడుదల చేసిన ఉపకార వేతనాల మంజూరు టోకెన్లు వచ్చి ప్రభుత్వం దగ్గర దాదాపు 600 కోట్లపై చిలుకు పెండింగ్ లో ఉన్నాయని ఐనప్పటికీ నేటికి ఆ నిధులకు మోక్షం కలగలేదని వాపోయారు. ఇంకా మంజూరు కాని ఉపకార వేతనాలు మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కళాశాలలలు నిర్వహించలేని స్థితిలో ప్రైవేటు యాజమాన్యాలు ఉన్నాయని, కొంతమంది యాజమాన్యాలు వాటి పట్ల తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారని అలాగే మరికొంత మంది ఆత్మహత్యలకి పాల్పడ్డారని అవేదన వ్యక్తం చేశారు. దిక్కులేని పరిస్థితులలో ప్రైవేటు యాజమాన్యాలు నిరవదికంగా ప్రైవేటు డిగ్రీ, పీ.జి కళాశాలలను మూసివేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. కళాశాల బందు చేయడం భాదాకరమైన విద్యార్థులకు నష్టమైన తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యార్థులకు, తల్లి తండ్రులకు, తెలంగాణా ప్రజలకు విన్నవించుకున్నామన్నారు. మా సమస్య పరిష్కారం కోసం తక్షణం స్పందించి ప్రభుత్వానికి మా సమస్యలను తెలియపరచగలరని ఆర్డీఓను కోరారు. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో బకాయిలను ఇప్పంచేవిధంగా ప్రభుత్వానికి తెలియజేయాలని వారు కోరారు. పాత బకాయిలను విడుదల చేసే వరకు మా నిరసన కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు లాగే తప్పని పరిస్థితిలలో రాబోయే డిగ్రీ సెమిస్టర్ మరియు గ్రూప్ –I, గ్రూప్ – II పరీక్షలను బహిష్కరించడానికి కూడా వెనకాడబోమని తేల్చిచెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజ్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వివిధ కళాశాల డైరెక్టర్లు గోగుల ప్రభాకర్ రెడ్డి, జీజుల సాగర్, మోర్తాల రామ్ రాజ్ , మాచర్ల రమేష్, డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.