*ప్రజలకు సౌకర్యాల కల్పనలో అలసత్వం వహించొద్దు..
*కమిషనర్ ఎన్.మౌర్య..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 03:
ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో అలసత్వం వహించకుండా త్వరితగతిన ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా పిర్యాదుల పరిష్కారంలో భాగంగా గురువారం ఉదయం రెండవ వార్డులోని రాజీవ్ గాంధీ కాలని, గొల్లవాని గుంట, లీలామహల్ సమీపంలోని మధురానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సి.సి.రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, తవ్వి అలాగే వదిలేసిన రోడ్లు పూడ్చాలని కోరారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన పిర్యాదులను ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని అన్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు సరైన సమయంలో సరఫరా చేయడం వంటివి అక్కడిక్కడే పరిష్కరించాలని అన్నారు. భూగర్భ డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, తిరిగి పిర్యాదులు రాకుండా మరమ్మత్తులు చేయాలని అన్నారు. అలాగే ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,ఏసిపి బాలాజి , డి.ఈ.లు రమణ, శిల్పా, సర్వేయర్ కోటేశ్వర రావు,శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.