ఘనంగా దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి
గొల్లపల్లి నేటి ధాత్రి: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, అతని జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం యాదవ్ అన్నారు. దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు గల దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు దొడ్డి కొమురయ్య అని అన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో భాగంగా కొందరి చేతిలో ఉన్న వేలాది ఎకరాల భూమిని వారి చేతిలో నుంచి విముక్తి కల్పించి పేదలకు పంచిన పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గ్రామాల్లో దొరల భూస్వాముల పటేల్ పట్వారి పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కలివండి గ్రామంలో దొరల గడి ముట్టడించే కార్యక్రమంలో తుపాకి గుండ్లకు నేలకొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య. ఇట్టి కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం,కచ్చు కొమురయ్య, కాలువ రాజయ్య, కాలువ కొమురయ్య, ఆవుల వెంకటేష్,నర్సాపురం రవీందర్, చౌటపల్లి తిరుపతి, కోమల్ల జలంధర్, సామల వీరస్వామి, మల్లయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.