– రికార్డుల్లో చనిపోయినట్టుగా తప్పుడు దృవీకరణ
– ఎన్ని కార్యాలయాలు చుట్టు తిరిగిన ఫలితం లేదు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణం 17వ వార్డుకు చెందిన భీమనాతిని లక్ష్మీనారాయణ అనే నేత కార్మికుడుకు 2014లో చేనేత ఫించన్ మంజూరైంది. 2024 జులై వరకు ప్రతినెల రూ. 2016/- తన ఖాతాలో జమ అయ్యేవి. తరువాత ఏమయిందో ఏమో తెలియదు కానీ కొంత కాలంగా ఫించన్ రావడం ఆగిపోయింది. లక్ష్మీనారాయణ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా ఆయన రికార్డుల్లో తాను చనిపోయినట్లు రికార్డు అయ్యిందని, అందుకే ఫించన్ రావడం లేదని సంబంధిత అధికారులు చెప్పారు. మళ్లీ దరఖాస్తు చేస్తే పింఛన్ వచ్చేటట్లు చేస్తామని వారు సూచించారు. వెంటనే దరఖాస్తు చేసుకున్న లక్ష్మీనారాయణకు ఇంతవరకు ఫించన్ మాత్రం రావడం లేదు. తనకు కిరాయి కట్టడం చాలా కష్టంగా ఉందని అన్నారు. అంతేకాకుండా
గత ఆరు నెలలుగా మున్సిపల్, డీఆర్డీఓ, కలెక్టర్ ఇలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఎలాంటి ఫలితం రాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు ఫించన్ వచ్చేలా చూసి తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని లక్ష్మీనారాయణ వేడుకుంటున్నాడు.