‘‘కౌలు’’, ‘‘పట్టాల’’ మధ్య కయ్యం!

`‘‘సీఎం’’. రేవంత్‌ రెడ్డి కి నాయకులు తెచ్చి పెడుతున్న తలనొప్పులు.

`ముదురుతున్న లొల్లులు…పార్టీలో లుకలుకలు!

`కాంగ్రెస్‌ పార్టీ లో ఈ రెండు వర్గాలున్నాయా!

`అధిష్టానానికి తెలియకుండానే రాజకీయాలు సాగుతున్నాయా?

`అసంతృప్తులు కాంగ్రెస్‌ లో పెరిగిపోతున్నారు.

`అసలైన కాంగ్రెస్‌ లో అసమ్మతి వాదులు పెరుగుతున్నారా?

`జీవన్‌ రెడ్డి రాజేస్తున్న మంటకు లేదు అంతం.

`జగిత్యాలలో రోజు రోజుకూ ముదురుతున్న విభేదం.

`అసలు పట్టాదారులం మేమంటూ జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

`కౌలు దారుల పెత్తనం పెరిగిపోయిందని ఆరోపణలు.

`మంత్రుల వల్ల నలిగిపోతున్నామంటూ విమర్శలు.

`బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన సంజయ్‌ వల్ల పార్టీకి నష్టమంటూ ఆవేదనలు.

`పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల మధ్య సమస్యలు.

`నాయకుల మధ్య పొడసూపుతున్న విభేదాలు.

`మంత్రుల మధ్య పెరుగుతున్న అంతరాలు.

`ఆధిపత్యాలలో తవ్వుకుంటున్న అగాధాలు.

`పార్టీకి నలుసులుగా మారుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు.

`ఏదో ఒక వివాదం రగిలిస్తూ పార్టీ పరువు తీస్తున్నారు.

`ఆ మధ్య ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మందుల సామెల్‌ మధ్య మాటల యుద్ధం.

`‘‘ఎంపి’’ కి కాదు సమస్యలు నా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వివాదం.

`ఎప్పుడూ ఏదొ ఒక చిటపట రాజేస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణలో వరుస వివాదాలతో కాంగ్రెస్‌నాయకులు, ప్రభుత్వంలో కీలకంగా వున్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా ఏదో ఒక కాక రేపుతూనే వున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏదో ఒక తలనొప్పి తెచ్చిపెడుతూనే వున్నారు. తెలంగాణ రాజకీయాలలో వేడిని పెంచుతున్నారు. ప్రతిపక్షాలు ఆ రాజకీయంలో చలి కాచుకునేలా చేస్తున్నారు. పార్టీ పరువును, ఓ స్ధాయిలో వున్న నాయకులు కూడా బజారు కీడుస్తున్నారు. ఓ వైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఎలా గెవాలన్నదానిపై ఎరికీ శ్రద్దలేదు. కాని వివాదాలు మాత్రం రాజేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు మంత్రి అడ్లూరి లక్షణ్‌ ముందు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. నిజానికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన అన్యాయం లేదు. ఆయన గౌరవానికి భంగం వాటిల్లింది లేదు. ఆయనకు వరసగా అవకాశాలిస్తూనే వున్నారు. కాని ఆయన ఓడిపోతున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. అయినా తనదే పెత్తనం కావాలని ఆరాటపడుతున్నారు. గత శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్‌రెడ్డి, మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్‌ కోసం నానా యాగీ చేశారు. ఇప్పుడు తనకు ప్రాదాన్యత దక్కడం లేదని గొగ్గోలు పెడుతున్నారు. బిఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌ పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీని నిలదీస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తాము పట్టాదారులమంటూ లెక్కలు చెబుతున్నాడు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కౌలుదారులంటున్నాడు. కౌలు దారులు పట్టాదారుల మీద పెత్తనం చేస్తున్నారంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. తన వాదన అరణ్య రోధన అని తెలిసినా జీవన్‌ రెడ్డి ఊరుకోడం లేదు. తన వితండ వాదం సరైంది కాదని తెలిసినా వివాదాలు సృష్టించకుండా వుండడం లేదు. కాంగ్రెస్‌పార్టీకి ప్రతిపక్షం అవసరం లేదని అంటారు. కాంగ్రెస్‌ పార్టీ అదికారంలో వున్నప్పుడు ఆ పార్టీలోనే పాలకపక్షం, ప్రతిపక్షం కూడా కలిసే వుంటాయంటారు. కాంగ్రెస్‌ పార్టీలో సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏ నాయకుడు ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోవడం అనేది వుండదు. నాయకుల తీరు మరీ మితిమీరితే తప్ప చర్యలుండవు. పార్టీలో నాయకులు చేసే పనిని, చేసే ప్రతి వ్యాఖ్యను పట్టించుకోవడం అనేది సహజంగానే వుండదు. అందువల్ల ఆ పార్టీలో ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్చగా చెప్పుకునే అవకాశం వుంటుంది. అదే కాంగ్రెస్‌ పార్టీ కొంప ముంచుతుంది. నాయకుల మధ్య వున్న విభేదాలు ఎప్పటికప్పుడు బైట పడుతూనే వుంటాయి. కాంగ్రెస్‌పార్టీలో ఏ నాయకుడికి అన్యాయం జరిగినా బహిరంగంగానే చెప్పుకునే వెసులుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. ధైర్యం వున్న నాయకులు కొంత మంది తమ గళాన్ని సవరిస్తూనే వుంటారు. తమ అభిప్రాయాలు చెప్పేస్తుంటారు. అలా చెప్పగలిగే నాయకులలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఎవరికీ భయపడరు. మొహమాటం అసలే చూపించరు. తాను మనసులో ఏమనుకున్నా సరే దానికి బైట పెడతారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెబుతూనే వుంటారు. 2023 ఎన్నికల్లో మళ్లీ మునుగోడు నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆ కల తీరలేదు. దాంతో ఆయన సొంత ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు తన అసమ్మతిని చూపిస్తూనే వుంటారు. తాజాగా ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టైనా సరే రైతులకు న్యాయం చేద్దామని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఇది పెద్ద సంచలనంగా మారింది. పైగా ఇటీవల వైన్స్‌ టెండర్ల విషయంలోనూ తన ఇలాఖాలో రూల్‌ వేరుగా వుంటుందని ప్రకటించారు. తన నియోజకవర్గంలో బెల్టు షాపులు వుండకూడదని హుకూం జారీ చేశారు. అంతే కాకుండా వైన్స్‌ నిర్వహణ సమయాన్ని కూడా ప్రకటించారు. ఇలా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కాళ్లలో కట్టెలు పెట్టే పని ఆయన చేస్తూనే వున్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదంటూనే విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. అయితే ఇటీవల ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించునేవారు లేకుండాపోయారు. ఇక మరో ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి. నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికలైన ఆయన మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. కాని ఆయనకు ఆ పదవి దక్కలేదు. దొంతి మాధవరెడ్డి తీరు కూడా సిఎం. రేవంత్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. ఇక మహాబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఓ దినపత్రికలో రాసిన వ్యాసం సంచలనాన్ని సృష్టించింది. పంచాయితీలకు, నగర పంచాయితీలకు నిధుల విడుదలలో అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని ఆయన రాసుకొచ్చారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్‌ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక కుంపటి రగిలిస్తూనే వున్నారు. ఆ మధ్య కొంత మంది ఎమ్మెల్యేలు సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కూడా అసమ్మతి వాదిగానే ముద్ర వేసుకున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యే ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారయ్యారని అంటున్నారు. వీరిపై చర్యలు తీసుకోలేరు. వారి వ్యాఖ్యలను ఎవరూ ఖండిరచలేరు. అదంతే కాంగ్రెస్‌ పార్టీ..అసమ్మతి లేకపోతే సాగదు. ఇక ఓ వారం రోజులుగా కరీంనగర్‌కు చెందిన ముగ్గురుమంత్రుల మధ్య అగాధం కనిపించింది. జూబ్లీహిల్స్‌ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ రాక ఆలస్యం కావడం వల్ల మంత్రి పొన్నం ప్రభాకర్‌ నోరు జారిన సంగతి తెలిసిందే. తాను మంత్రిని ఉద్దేశించి చేయలేదని మంత్రి పొన్నం చెప్పిన మాట విన్నదే. మంత్రి పొన్నం చేసిన ఆలస్యానికి కొంత రాజకీయ రగడ జరిగిందే. నిజం చెప్పాలంటే ఎప్పుడైతే మంత్రి పొన్నం మాటలు బైటకు రాగానే, క్షమాపణ చెబితే పోయేది. కాని బేషజానికి వెళ్లడం వల్ల ఆలస్యం అమృతం విషమైంది. మంత్రి పొన్నం ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. అయినా అప్పటికే జరగాల్సినంత రచ్చ జరిగిపోయింది. దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. మంత్రి పొన్నం దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మంద కృష్ణ మాదిగ, మోత్కుపల్లి నర్సింహులు లాంటి వారు మీడియా ముందుకు వచ్చారు. మంత్రి అడ్లూరికి అండగా నిలిచారు. దాంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కూడా మంత్రి పొన్నం క్షమాపణ చెపాల్సిందే అని డిమాండ్‌ చేయక తప్పలేదు. ఈ వివాదం ముగిసింది అనే లోపు మరో మంత్రి వివేక్‌ వెంకటస్వామి కొన్ని సంచనల వ్యాఖ్యలు చేశారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు. తనపై సామాజిక మాధ్యమాలలో టార్గెట్‌ చేసి కులం ఆధారంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి వివేక్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల బాద్యతలో వున్న తాను, అక్కడ కాంగ్రెస్‌ గెలిస్తే తనకు పేరు వస్తుందన్న అక్కసుతో తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని వివేక్‌ అన్నారు. అంతే కాకుండా మంత్రి లక్ష్మణ్‌ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్దం కావడం లేదని కూడా చెప్పుకొచ్చారు. లక్ష్మణ్‌కు రాజకీయ ప్రోత్సాహాన్ని కల్పించిందే తన తండ్రి వెంకటస్వామి అని గుర్తు చేశారు. తనకు పదవి మీద వ్యామోహం లేదని అన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారని వివేక్‌ అన్నారు. కొంత మంది పనిగట్టుకొని తాను అనని మాటలు ప్రచారం చేస్తున్నారని అంటూనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు రాజకీయం నేర్పిందే మేము అన్నారు. తన తండ్రి వెంకటస్వామి ఆశీస్సులతోనే మంత్రి అడ్లూరి రాజకీయంగా ఎదిగారని అన్నారు. అయితే మంత్రి పొన్నం ఎపిసోడ్‌లో పక్కనే మంత్రి వివేక్‌ కూడా వున్నారు. దాంతో ఆ సమయంలోనే మంత్రి అడ్లూరి కొన్నికీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వివేక్‌ తనను చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. తనపై రాజకీయ కక్ష పెంచుకున్నారని చెప్పారు. తాను మంత్రి వివేక్‌ పక్కన కూర్చోవడం ఆయనకు ఇష్టం లేదని మంత్రి అడ్లూరి అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ముగ్గురు మొదటి సారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన మొదటిసారేమంత్రులయ్యారు. కాకపోతే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకస్వామిలు గతంలో ఎంపిలుగా గెలిచారు. తర్వాత ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఇద్దరూ గెలవలేదు. తొలిసారి ఈ ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రులయ్యారు. అదే దారిలో అడ్లూరి కూడా మొదటిసారి గెలిచి మంత్రి అయ్యారు. అడ్లూరి మాత్రం ఈ మధ్యనే మంత్రి అయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌ నుంచి నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాని ఈ ముగ్గురి మధ్య మాత్రం సయోధ్య ఎంత కుదిరిందో ఎవరికీ తెలియదు. నల్లగొండ జిల్లాకు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌ చేసే వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బం ది కరమైన పరిస్ధితులే సృష్టిస్తున్నాయి. ఆ మధ్య డైరీ ఎన్నికల సమయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీద తుంగతుర్తి ఎమ్మల్యే మందులు సామెల్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే ఎమ్మెల్యే ఒక దశలో ప్రజలు గాని, పార్టీ నాయకులు ఏ సమస్యలున్నా ముందు తన వద్దకే రావాలంటూ హుకూం జారీ చేశారు. ముందు ఎంపి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి వద్దకు వెళ్లొద్దని ఆయన ముందే తేల్చి చెప్పారు. ఇవి చిన్న చిన్న సమస్యలు కాదు. పార్టీని ముంచడానికి ఈ చిన్న సమస్యలే పెద్దవై పార్టీని ఆగం చేస్తాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version