నారావారిపల్లెలో అభివృద్ధి పండుగ
రూ.కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రారంభోత్సవాలు చేసిన సీఎం చంద్రబాబు
నారావారిపల్లె, తిరుపతి(నేటి ధాత్రి:
నారావారిపల్లె గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అభివృద్ధి పనుల శుభారంభంతో గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. మిల్లెట్ టిఫిన్స్, ఫుడ్ బాస్కెట్ ప్రోగ్రామ్, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలిస్తూ నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోషకాహారం ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలని సూచించారు.
స్టాళ్ల సందర్శన సమయంలో “నమస్తే సర్” అంటూ పలకరించిన అంగన్వాడీ చిన్నారులను చూసి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుపై శ్రద్ధ తీసుకోవాలని అంగన్వాడీ సిబ్బందికి సూచనలు చేశారు. షైనింగ్ సెంటర్స్ తమ పిల్లలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, పిల్లల్లో స్పష్టమైన ఎదుగుదల కనిపిస్తోందని అక్కడున్న మహిళలు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యా, ఆరోగ్య ప్రమాణాలను పెంచడంలో కీలకమని సీఎం పేర్కొన్నారు. అనంతరం రూ.1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే రూ.4.27 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి విద్యుత్ సరఫరా మరింత బలోపేతం అవుతుందని వెల్లడించారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సంజీవని ప్రాజెక్టును సీఎం ప్రారంభించి, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. అలాగే రూ.70 లక్షలతో ఎ-రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభించారు.
నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు, మూలపల్లి చెరువు సహా మరో నాలుగు చెరువులకు నీటిని తరలించే పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సమస్యలు తగ్గి రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
