భాజపా ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రాజేష్ ఠాకూర్
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
ఉప ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధుని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 18,021 కుటుంబాలకు 10 లక్షల చొప్పున వారి యొక్క ఖాతాలలో గత ప్రభుత్వం క్రెడిట్ చేసిందని. ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు రెండు విడతలుగా ఇస్తాం అని చెప్పి ఎలక్షన్ ఉన్నది అని సాకుగా చూపెట్టి రెండవ విడత డబ్బులు ఇవ్వకుండా 4900 కుటుంబాలను రోడ్డు మీద బీఆర్ఎస్ ప్రభుత్వం పడేసిందని. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో రెండవ విడత డబ్బుల అకౌంట్లను ఫ్రీజ్ చేసి లబ్ధిదారులను అయోమయానికి గురి చేస్తున్నదన్నారు. సోమవారం దళిత బంధు రెండో విడత డబ్బులు రావని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన కుటుంబాలకు అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హుజురాబాద్ నియోజకవర్గంలోని దళిత బంధు పైలెట్ ప్రాజెక్టును ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగింపు చేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల యొక్క అకౌంట్లో ఉన్న డబ్బులను విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు. వాసాలమర్రి గ్రామంలో 10 లక్షల రూపాయలు ఒకేసారి లబ్ధిదారులకు అందజేశారని గుర్తు చేశారు. అదే హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును రెండు విడతలుగా విభజించి లబ్ధిదారులను ఇబ్బందులకు గురించేసిందన్నారు. రెండో విడత దళిత బందు డబ్బులు లబ్ధిదారులకు అందజేయని యెడల ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.