https://epaper.netidhatri.com/view/274/netidhathri-e-paper-24th-may-2024%09
చేతగాని వారు చెప్పే లెక్కలే!!
`క్రాస్ ఓటింగ్ మ్యాజిక్ కాదు!
`ఓటింగ్ లో లాజిక్ లేని పద్దు లేదు.
`రాజకీయ పార్టీలు ఎప్పుడు ఏది చెబితే జనం అది వింటారా?
`రాత్రికి రాత్రే ప్రజలు మనసు మార్చుకుంటారా?
`ఇంతకీ అలాంటి ఓటింగ్ సాద్యమా!
`అదే నిజమైతే నెలల తరబడి ప్రచారాలెందుకు?
`కోట్లలో ఖర్చులెందుకు?
`ఎన్నికలకు రెండు రోజుల సమయం సరిపోదా?
`ప్రజలు చాలా విజ్ఞులు.
`డెబ్బై ఏళ్ల స్వతంత్రంలో ఎప్పుడు ఎవరిని ఎన్నుకోవాలో ఎన్నుకున్నారు.
`ఏ పార్టీని పక్కన పెట్టాలో పెట్టారు.
`క్రాస్ ఓటింగ్ అనే పదానికే అర్థం లేదు.
`ఆ మాటకే ప్రజల్లో విలువ లేదు.
`ఎవరు ఎన్ని చెప్పినా ఏది నమ్మాలో అదే నమ్ముతారు.
`ఎవరిని గెలిపించాలో వారినే గెలిపిస్తారు.
`ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు.
`ప్రజలే విజేతలు.
`నాయకులు ఎప్పుడూ సేవకులే…
` ప్రజల దయాదాక్షిణ్యాలతో గెలిచినవారే…
`ప్రజల చైతన్యం ముందు ఏ నాయకుడు గొప్ప వాడు కాదు.
`ప్రజలకు దారి చూపుతున్నామనుకుంటే అంతకన్నా మూరు?డు లేడు.
హైదరాబాద్,నేటిధాత్రి:
సహజంగా ఎలాంటి పొత్తులు లేకుండా ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీకి ఓటేయమని చెబుతుందా? పొత్తుల్లో భాగంగా అదికారికంగా చెప్పడం వేరు. ఎలాంటి అవగాహన లేకుండా, లోపాయి కారి ఒప్పందం లేకుండా ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీకి ఓటు వేయమని చెప్పడం జరుగుతుందా? అది సాధ్యమేనా? రోజుల తరబడి పొత్తుల గురించి ప్రజలకు చెప్పీ, చెప్పీ, ప్రచారం ఎంత చేసినా కొన్నిసార్లు పార్టీల మధ్య పొత్తుల గురించి సామాన్యులకు తెలియకపోవచ్చు. అలాంటిది రాత్రికి రాత్రి ఒక పార్టీ మరో పార్టీకి ఓటు వేయమని చెప్పడం అన్నది సాధ్యమయ్యే పనేనా? ఎక్కడైనా మా పార్టీకి వేయలేకపోతే మరో పార్టీకి వేయమని చెప్పడం అన్నది నిజంగా జరిగే ప్రక్రియేనా? అప్పుడు ఆపార్టీకి ఆత్మహత్యా సదృష్యం కాదా? ఆ పార్టీ తన మనుగడను తానే తుంచుకున్నట్లు కాదా? రాజకీయంగా తన గొయ్యి తాను తీసుకున్నట్లు కాదా? ఎన్ని రోజులు ప్రచారమైనా, ఎంతటి ప్రచారమైనా ఆఖరు ఓటు దాకా మాకే పడాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. కాని క్రాస్ ఓటింగ్ చేయమంటూ ఎప్పుడూ చెప్పదు. కాకపోతే ఎన్నికల ప్రచారం సాగిన సమయంలోనే అధికారిక అవగాహన వుంటే తప్ప జరగదు. ఇంకా ఫలితాలు వెలువడని పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ, ప్రజలు తమ పార్టీని నమ్మడం లేదని తెలుసుకొని, బిజేపికి ఓట్లు వేయమని చెప్పినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నిజంగా అలాంటిది ఏమైనా జరిగిందా? అందుకు ఆధారాలున్నాయా? లేవు. కాని వున్నాయంటూ దుష్ప్రచారం సాగిస్తుంటారు. ఒక వేళ వుంటే ఎప్పుడో బైట పెట్టేస్తారు. ఇలాంటి వార్తలు ప్రత్యర్ధి పార్టీలకు ఎంతో అవసరం. అలా ప్రచారం చేయడం తప్పు కాకపోవచ్చు. కాని నైతికత కాదు. అందువల్ల అలాంటి ఆడియోలు వున్నా, వీడియాలు వున్నా ఇప్పటికే బైటకు వచ్చేవి. కాని రాజకీయ నాయకులు పనిగట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తుంటారు.
విశ్లేషలుగా చెలామణి అవుతున్న కొంత మంది సోకాల్డ్ స్వయం ప్రకటిత మేధావులు ఇలాంటి లేని పోని చర్చలు తెరమీదకు తెస్తారు. వాటిని కొంత మంది నాయకులు కూడా నమ్ముతుంటారు. అలాంటి ట్రాప్‌లో పడ్డ కరీంనగర్ బిఆర్‌ఎస్ అభ్యర్ధి వినోద్‌కుమార్ ఏకంగా తాను ఓడిపోతున్నానంటూ ప్రకటన చేయడం ఒక్కసారి దుమారం రేగింది. క్రాస్ ఓటింగ్ ప్రకటన ఆయన నోటి నుంచి రావడంతో అనుమానం మొదలైంది. ఆయనకు కూడా తెలుసు. రాత్రికి రాత్రి అలాంటి ప్రచారం సాధ్యం కాదని, కాకపోతే జరిగి వుండొచ్చు? అన్న అబద్దాలు ఎవరైనా తొందరగా నమ్ముతారు. నిజానికి వినోద్ కుమార్ చెప్పినట్లు క్రాస్ ఓటింగ్ అన్నది నిజంగానే జరిగితే అది ప్రచారం సాగినంత కాలం మెల్లిగా చాప కింద నీరులా సాగాలే గాని, రాత్రికి రాత్రే జరిగేది కాదు. అయినా తన నియోజకవర్గ పరిధితో తన అనుచరులెవరో..తనతో వుంటూనే తన ప్రత్యర్ధులెవరో.. తన పక్కనే వుంటూ గోతులు తీసేదెవరో వినోద్ కుమార్‌కు తెలియదా? ముందు జగ్రత్త పడొద్దా? ప్రపంచం మూలల్లో ఏం జరుగుతుందో కూడా చెప్పగలిగే వినోద్ కుమార్ తన పార్లమెంటు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడా? 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన నుంచి ఐదేళ్లపాటు నియోజకవర్గం అభివృద్ది వదిలేశాడా? నిజంగా పట్టించుకుంటే ప్రజలు వద్దనుకున్నారా? బండి సంజయ్ ఐదు పైసలు పని చేయకపోతే, వినోద్ కుమార్‌ను ఎన్నుకునే అవకాశంవుంది. అప్పుడు క్రాస్ ఓటింగ్ అవసరం ఎందకు? ప్రజలు వినోద్ కుమార్ వ్యతిరేక వర్గం ఏది చెబితే అది వినే పరిస్ధితుల్లో ప్రజలుంటారా? ఎక్కడ అనుమానం వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇలాంటి ప్రచారం ఎలా మొదలైంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నేపధ్యంతో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇది రాష్ట్రంలో పెద్దఎత్తున సాగుతున్న చర్చ. అసలు క్రాస్ ఓటింగ్ అంటే ఏమిటి? దీనికి ఎవరి వద్ద సమాదానం లేదు. వుండదు. కేవలం ఎన్నికల కోసం అప్పుడప్పుడు మాత్రమే వాడే పదం. అంతే తప్ప దానికి సరైన నిర్వచనం లేదు. చెప్పిన వారు లేరు. కాకపోతే ఓ పార్టీకి పడాల్సిన ఓట్లు మరో పార్టీకి పడ్డాయి..ఇది కొందరు చెప్పే లాజిక్. శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి వచ్చినప్పుడు ఓటర్లు రాష్ట్ర శాసనసభకు ఓ పార్టీని ఓటేస్తే, పార్లమెంటు విషయంలో మరోపార్టీకి ఓటేస్తారు అని చెప్పేది మరో లాజిక్. అంతకు మించి ఎలాంటి లెక్కలు చెప్పరు. దానికి సరైన ఆదారాలు లేవు.
ప్రతిసారి ఎన్నికల ముందు ఒక మాట..ఎన్నికల తర్వాత మరో మాట… ఫలితాల నాడు మరో కొత్త ముచ్చట చెప్పడం పార్టీలకు అలవాటు. మీడియాకు అలవాటు. కాని అసలు విషయం ఎవరూ చెప్పరు. అసలు ప్రజలు క్రాస్ ఓటింగ్ ఎందుకు చేస్తారు? ప్రజలకు ఆ అవసరం ఏముంటుంది? ఇది అసలు మనం చర్చించుకోవాల్సిన అంశం. ఎవరు ఎన్ని చెప్పినా ఒక్కసారి ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత ఎవరికి ఓటు వేయాలో..వారికే వేస్తారు. అంతే తప్ప హరిహర బ్రహ్మాధులు దిగి వచ్చి చెప్పినా వినరు. ఇక పోతే ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే ఓటు వేస్తారనేది కూడా పచ్చి అబద్దం. కాకపోతే డబ్బులు ఇవ్వడం పార్టీలు, నాయకులు అలవాటు చేశారు. తీసుకోవడం ప్రజలు నేర్చుకున్నారు. నాయకులు పంచే సొమ్ము కూడా మనదే అనే స్దాయికి కూడా చేరుకున్నారు. ఇది కూడా రాజకీయ పార్టీలే ప్రజలకు నేర్పుతున్నాయి. ఎవరెంత ఇచ్చినా తీసుకోండి..ఓటు మాత్రం మాకే వేయండి అని నాయకులు చెప్పడం అలవాటు చేసుకున్నారు. ప్రజలు కూడా అనుసరించడం నేర్చుకున్నారు. ఇదిలా వుంటే క్రాస్ ఓటింగ్ చేయమంటే చేస్తారా? మాకు కాకుండా మరో పార్టీకి వేయమంటే వేస్తారా? రాత్రికి రాత్రి సినారియో మార్చే అవకాశం వుంటుందా? ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు పడాల్సిన ఓట్లు బిజేపికి పడ్డాయన్నది కొందరు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారం. అంతెందుకు కరీంనగర్ పార్లమెంటు స్దానానికి పోటీ చేసిన బిఆర్‌ఎస్ అభ్యర్ధి మాజీ ఎంపి వినోద్ కుమార్ చెప్పిన లాజిక్ ఏమిటో ఆయనకే తెలియాలి. ఎన్నికల్లో అంతటి పండితుడే అయితే ఇన్ని రోజులు ఏంచేసినట్లు? ప్రజల మనసు ఎందకు చూరగొనలేకపోయినట్లు? క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆయనకు ఎలా తెలుసు. ముందు ఎందుకు తెలియలేదు. కనీసం మూడు నెలల కాలంగా ప్రజల్లో వుంటున్నారు. ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ప్రజల చేత మాట తీసుకుంటున్నాడు. ఊరూరు తిరిగి ప్రచారం చేశాడు. ఎన్నికలవేళ కోట్లు ఖర్చు చేశాడు. తీరా ఫలితాలు రాకముందే జోస్యం చెబుతున్నాడు. ఓ వైపు బిఆర్‌ఎస్ అధినత కేసిఆర్ మాకు పదమూడు సీట్లు వస్తాయంటూ ప్రకటనలు చేస్తున్నాడు. వినోద్‌కుమార్‌తాను ఓడిపోతున్నానని ప్రకటిస్తున్నాడు. ఇందులో ఎవరి మాట ప్రజలు నమ్మాలి. అలాగే ఎన్నికలకు సరిగ్గా ఒక్క రోజు ఏ పార్టీ అయినా తమకు ఓటు వేయమని చెబుతుందే గాని, వేరే పార్టీకి ఓటు వేయమని చెప్పడ ఏమిటి? స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఇది కొంత వరకు సాధ్యం. ఎందుకంటూ తక్కువ ఓటర్లు వుంటారు. ఊర్లు కావడంతో ఒక్కరోజు ప్రచారం చాలు. కాని పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇలాంటివి సాధ్యమేనా? ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి. క్రాస్ ఓటింగ్ అన్న పదం ఇప్పుడు పుట్టింది కాదు. ఎన్నికలు పుట్టిన నాడే పుట్టిన పదం. ఇప్పుడంటే సమాచార సాధనాలు చేతిలో వున్నాయి. సెల్‌ఫోన్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అయినా ఎంత మందికి చేయగలరు. మరి గతంలో ఏలాంటి సమచార వ్యవస్ధ లేదు. అప్పుడు కూడా ఇదే చెప్పారు. అంటే ఇదంతా ట్రాష్. తమ పార్టీకి ఓటు వేయమని చెప్పినా వినని, ప్రజలు మరో పార్టీకి ఓటు వేయమని చెబితే వింటారా? ఇది విచిత్రమైన వాదన. రాజకీయ పార్టీలు అన్నవి చేతులెత్తేయడం అన్నది ఎక్కడా జరగదు. ఒక వేళ అభ్యర్థులు తమకు అనుకూలంగా పరిస్ధితి లేదని గ్రహించినప్పుడు లోపాయి కారి ఒప్పందాలు ముందే చేసుకునే అవకాశం వుంది. అప్పుడు కొన్ని రోజులు మందు మాత్రమే ఇలాంటివి సాధ్యం.