అజిత్ పవార్ మృతిలో కుట్రకోణం… మమత సంచలన వ్యాఖ్యలు
అజిత్ పవార్ మృతి చెందిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని వీడాలని పవార్ ఆలోచిస్తున్నారని ఇటీవల జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ నాయకులకు సైతం భద్రత లేకుండా పోతోందన్నారు.
కోల్‌కతా: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ మృతిలో కుట్రకోణం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దేశంలో రాజకీయ నాయకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
అజిత్ మృతి చెందిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని వీడాలని ఆయన ఆలోచిస్తున్నారని ఇటీవల జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ నాయకులకు సైతం భద్రత లేకుండా పోతోందన్నారు. ఈ ఘటన అనేక ప్రశ్నలకు తావిస్తోందన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మాత్రమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం మీద మాత్రమే తమకు నమ్మకం ఉందని, మరో ఇతర దర్యాప్తు సంస్థలపైన విశ్వాసం లేదని, దర్యాప్తు సంస్థలు తమ స్వేచ్ఛ కోల్పోయాయని ఆరోపించారు.
కాగా, బారామతి విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని పలువురు రాజకీయ నేతలు సైతం డిమాండ్ చేశారు. అజిత్ పవార్ మృతికి సంతాపం తెలుపుతూ ఇందుకు దారితీసిన ప్రమాద ఘనటపై పారదర్శకమైన దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, వంచిత్ బహుజన్ అఘాడి నేత ప్రకాష్ అంబేద్కర్ తదితరులు కోరారు.
