కోనరావుపేట, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా బుధవారం కోనరావుపేట మండలంలోని మరిమడ్ల,అహ్మద్ ఉస్సేన్ పల్లె, భూక్యారెడ్డి తండా, కమ్మరిపేట తండా, గొల్లపల్లి, వట్టిమల్ల గ్రామాలలో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు కుమార్తె చల్మెడ నిహారిక, జడ్పీ చైర్మన్ అరుణ-రాఘవ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. మల్కపేట బిడ్డగా, సేవ చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్న చల్మెడను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా స్థానిక మహిళ ప్రజాప్రతినిధులు, సోదరీమణులతో కలిసి ఆయా గ్రామాలకు వెళ్లిన చల్మెడ కూతురు నిహారికను చూసి పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆకట్టుకునే రీతిలో ఆమె మాట్లాడిన మాటలకు మంత్రముగ్దులై, నిహారిక రాక చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఆడబిడ్డ రాక గ్రామాల్లో పండగ వాతావరణం నింపిందని చర్చించుకున్నారు. అనుకోకుండా వచ్చిన అతిథి నిహారికకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య యాదవ్, ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, మహిళ విభాగం అధ్యక్షురాలు చీటి సంధ్య, మాజీ ఎంపీపీ మ్యాకల రజనీ, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు గోపు పర్శరాములు, సర్పంచులు ఇస్లావత్ దివ్య-ప్రవీణ్, ప్రమీల-తిరుపతి, ఆరె లత-మహేందర్, కొమ్ము స్వప్న-దేవయ్య, మాట్ల అశోక్, సూర్య నాయక్ లతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.