భూపాలపల్లి నేటిధాత్రి
సీపీఐ(ఎం) భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బంధు సాయిలు విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్ కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడానికి, ఓటర్లను భ్రమల్లో పెట్టే బడ్జెట్‌గా ఉంది రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ దారిద్య్రరేఖకు దిగువనున్నవారికి ప్రయోజనం కల్పించే బడ్జెట్ కాదని సీపీఐ(ఎం) స్పష్టం చేస్తున్నది.
గత బడ్జెట్ రు.45లక్షల కోట్లు కాగా, 2024-25 సంవత్సరానికి రు.47.6 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ గత బడ్జెట్లల్లో దేశంలో 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ నుండి ఎగువకు తెచ్చామని చెబుతూనే, మరోవైపున దారిద్య్రరేఖలో మగ్గుతున్న వారికి రానున్న ఐదేళ్ళు ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం సరఫరా చేస్తానని ప్రకటించారు. పేదలు, యువకులు, మహిళలు, రైతులే ప్రధాన లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించామని చెప్పినప్పటికీ పేదల పరిస్థితి మరింత దిగజారుతున్నది. ఉపాధిహామీ నిధులు 2022-23లో రు.91వేల కోట్లు వ్యయం చేయగా, 2024-25లో రు.86వేల కోట్లకు, ఆహార సబ్సిడీ రు.3లక్షల కోట్ల నుండి రు.2.63 లక్షల కోట్లకు, ఎరువుల సబ్సిడీని రు.2.55 లక్షల కోట్ల నుండి రు.1.68 లక్షల కోట్లకు తగ్గించారు. కేంద్రం ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ, మరోవైపున సబ్సిడీలకు కోత పెడుతున్నది. నిరుద్యోగం, ఆరోగ్యం తదితర సమస్యలను ప్రస్తావించకుండా రామమందిరం నిర్మాణం ద్వారా రానున్న కాలంలో దేశం అభివృద్ధిలోకి వస్తుందని, 2047 నాటికి దేశంలో దారిద్య్రం పూర్తిగా నిర్మూలించబడుతుందని ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్‌లో ప్రకటించడం ప్రజలను మోసం చేయడమే.