కేంద్ర బిజెపి ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం ఆపాలి

జమ్మికుంట నేటిధాత్రి
సింగరేణికి నేరుగా కేటాయించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ఆపాలని, సింగరేణి సంస్థకే నేరుగా కేటాయించాలని సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గీతా భవన్ చౌరస్తాలో శనివారం రోజున ప్లకార్డులతో నిరసనచేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ
మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని సింగరేణి సంస్థ కూడా ప్రయివేటు సంస్థలతో పాటు వేలంపాటలో పోటీ పడాలని నిర్ణయించిందన్నారు. తెలంగాణలో సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ అన్నారు. సహజంగానే శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలన్నారు. కానీ వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు అవకాశం ఇస్తుందన్నారు. ఇప్పటికే నాలుగు బ్లాకులు గత బీఆర్ఎస్ పాలనలోనే మోడీ ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అప్పగించిందన్నారు. మన రాష్ట్రం నుంచే బొగ్గు గనుల శాఖామంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాదు కేంద్రంగానే వేలంపాట ప్రక్రియను ప్రారంభించటం అన్యాయమన్నారు.పైగా సింగరేణిని ప్రయివేటీకరించబోమని బుకాయించడం సిగ్గుచేటు అన్నారు.బొగ్గు బ్లాకులన్నీ ప్రయివేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముందన్నారు. క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరచి మూతపడే వైపు మోడీ ప్రభుత్వం నెట్టుతున్నదని, తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాపితంగా ప్రజలు కదలాలని పిలుపునిచ్చారు.
నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (నగదీకరణ) పేరుతో దేశంలో 6 లక్షల కోట్ల విలువైన ఆస్థులను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టిందని, అందులో భాగంగానే రు.28,747 కోట్ల విలువైన గనులను ప్రయివేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారన్నారు.. గత పదేండ్లలో మోడీ ప్రభుత్వం సుమారు 200 బొగ్గు బావులను ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టారన్నారు. దీని ఫలితమే ఇప్పుడు జరుగుతున్న వేలమని, దేశవ్యాపితంగా 10వ విడతలో 61 బొగ్గు బావులను వేలం వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి 8 మంది శాసనసభ్యులు, మరో 8మంది పార్లమెంట్ సభ్యులు ఉండి కూడా తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మెదపక పోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికై బొగ్గుగనుల శాఖా మంత్రిగా ఉండి కూడా సింగరేణిని దివాళాతీయించేవిధంగా బీజేపీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నదని,
ప్రస్తుతం సింగరేణి 40 వేల మంది పర్మినెంట్ కార్మికులకు, మరో 26 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పిస్తుందన్నారు. రికార్డు స్థాయిలో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్నదని, గత పదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ రూపంలో రు. 49,666 కోట్లు చెల్లించిందన్నారు.ఇందులో కేంద్రానికి రు.26 వేల కోట్లు చెల్లించగా, రాష్ట్రానికి రు.23 వేల కోట్లు చెల్లించిందన్నారు. ఒకవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, మరోవైపు ప్రభుత్వాలకు ఆదాయపు వనరుగా ఉన్నదని, సింగరేణి రు.35 వేల కోట్ల టర్నోవర్తో లాభాల బాటలో నడుస్తున్నదని, యేటా రెండు నుండి మూడువేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను ఎక్కడికక్కడ ఎండ కట్టాలన్నారు. వేలం పాట ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొనడం ఆశ్చర్యకరమన్నారు.ఇది వేలంపాట ప్రక్రియను ఆమోదించడమే కదా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి చేయాలని, ఇందుకనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలని,కేంద్రం ఆమోదించకపోతే రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలన్నారు. కేవలం విజ్ఞప్తులతో సరిపెట్టవద్దని, సింగరేణి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను సమాయత్తం చేయాలని, బొగ్గు బ్లాకుల వేలం రద్దు చేసే వరకు సిపిఎం పార్టీ పోరాడుతుందని, దేశభక్తి పేరుతో దేశ సంపదను ప్రైవేటు సంస్థలకు ధారా దత్తం చేస్తున్న బీజేపీ విధానాలను ప్రజానీకం గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, గుడి కందుల సత్యం, జి బీమాసాహెబ్. జిల్లా కమిటీ సభ్యులు యు. శ్రీనివాస్ , ఎడ్ల రమేష్, డి.నరేష్, ఎం.పూజ జిల్లా నాయకులు తిప్పారపు సురేష్, జి.తిరుపతి నాయక్, రాయికంటి శ్రీనివాస్, పున్నం రవి, జి.కనకరాజు, కండే రాజు, కనకేష్ ,రోహిత్, వినయ్, సాయి, ఇసాక్, రాకేష్, రితీష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version