సగం బడ్జెట్లోనూ 6 శాతం మాత్రమే విద్యారంగానికి.
దేశ జీడీపీ లో 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలి.
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు
భూపాలపల్లి నేటిధాత్రి
దేశంలో మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విద్యారంగం గూర్చి అబద్ధాలు మాట్లాడారని
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ
అభిప్రాయపడుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యకు సంబంధిత ఉత్పత్తులపై 18 శాతం జీఎస్టీ నుండి ప్రభుత్వం 5 శాతానికి తగ్గించిందని, తాము ఆయా వస్తువులపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరుతున్నామని అన్నారు. మంత్రి ప్రసంగంలో ఉన్నత విద్యారంగంలో విద్యార్థినీల గ్రాస్ ఎన్రోల్మెంట్ 28% పెరిగిందనీ, సైన్స్,టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో విద్యార్థినీల చేరిక 43% శాతంగా నమోదైందనీ ఇదే ప్రపంచంలో అత్యుత్తమమైనదనీ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం విద్యార్థినీల చదువుల పట్ల అంకిత భావంతో లింగ సమానత్వం కోసం పనిచేస్తుందనడం ఒట్టి బూటకపు మాటలు అని తెలిపారు. 2014లో బిజెపి అధికారం చేపట్టిన నాటినుండి విద్యార్థినీలు చదువులకు దూరమయ్యారని, బిజెపి ప్రభుత్వానికి విద్యార్థినీల చదువుల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, కేంద్రీయ విద్యాలయాల్లో నవోదయాల్లో విద్యార్థినీల చదువుల కోసం ప్రభుత్వం ఏమి చేసిందన్నారు. కేంద్ర విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కొరత ఉందని, ప్రతి ఏటా విద్యార్థినీల డ్రాపౌట్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందనీ అన్నారు. దేశంలో స్కిల్ ఇండియాలో భాగంగా 1.4 కోట్ల మంది యువతను నైపుణ్యం కలిగిన యువతగా తీర్చిదిద్దామని చెబుతున్న ప్రభుత్వం దేశంలో ఎంతమంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారో చెప్పాలన్నారు. నూతన మెడికల్ కళాశాలలుఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం 2019లో నేషనల్ మెడికల్ కమీషన్ లో అనేక మార్పులను చేస్తూ తీసుకొచ్చిన చట్టం విద్యార్థులకు ఉరితాడుగా మారిందన్నారు. నూతన ఉన్నత విద్యాసంస్థలు,ఐటిఐలు,ఐఐటీలు, మెడికల్ కళాశాలలు,ఐఐఎం లు,ఎయిమ్స్ కళాశాలలు, ఏర్పాటు చేసినప్పటికీ ఆయా విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను కల్పనకు నిధులు కేటాయించాలడం లేదన్నారు. 390 కి పైగా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులిచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారన్నారు. నూతన జాతీయ విధానం ద్వారా రాష్ట్రాల హక్కులను లాక్కొని విద్య పై కేంద్రం పూర్తి స్థాయి నియంత్రణ కోసం ప్రయత్నిస్తోందన్నారు. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని కోరారు.