hanuman junction gudisela kahani…, హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కహానీ…!

హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కహానీ…!

ఓ కమ్యూనిస్టు పార్టీ పోరాటం ప్రారంభిస్తుంది. గుడిసెల పోరాటం చేస్తుంది అంటే కమిటీతో చర్చించి, సాధ్య, అసాధ్యాలను పరిశీలించి ముందుకు కదులుతారు. అదే భూపోరాటం చేయాలంటే, పేదప్రజలకు ఇంటిస్థలాలు ఇప్పించాలంటే ఆ భూమి సర్వే నెంబర్‌ ప్రభుత్వ భూమా…? ప్రైవేట్‌ భూమా…? కబ్జాలో ఎవరైనా ఉన్నారా…లేదా…తదితర వివరాలను పరిశీలించి భూమిపైకి వెళ్తారు. కానీ వరంగల్‌ నగరంలో భూపోరాటాలకు సీపీఐ నేతలు చెప్తున్న కొన్ని పోరాటాలు వాటి వెనుక నడిచిన తతంగాలను చూస్తే నవ్వొస్తుంది. గుడిసెల పోరాటంలో పావులుగా మిగిలిపోయి మోసపోయిన పేదప్రజలను చూస్తే ఆవేదన కలుగుతుంది. ఎంతో కొంత ప్రతిఫలం అందుకుని మూట, ముల్లే సర్థుకుని శల్యసారథ్యం వహించిన సీపీఐ నాయకులు నగరంలో అనేక పోరాటాలకు పుల్‌స్టాప్‌ పెట్టారు. అందినకాడికి దండుకుని బయటపడ్డారు. నిజానికి చెప్పాలంటే లక్షల్లో వెనకేసుకున్నారు. చెప్పేది శ్రీరంగ నీతులు…చేసేది ఏదో పని అన్నట్లు కామ్రేడ్‌లు కనికరం లేకుండా పేదప్రజల నిలువ నీడ అనే సెంటిమెంట్‌తో ఇల్లు అనే ఆశతో ఓ ఆట ఆడుకున్నారు.

ఇదీ హనుమాన్‌ జంక్షన్‌ కథ

సరిగ్గా 18సంవత్సరాల క్రితం వరంగల్‌ ములుగురోడ్డు సమీపంలో కాకతీయ కెనాల్‌ దాటాక ప్రస్తుతం హనుమాన్‌ జంక్షన్‌గా పిలుస్తున్న ప్రాంతం కాకతీయుల కట్ట 701, సర్వే నెంబర్‌ 45/బి. ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో అప్పటి సీపీఐ నాయకులు పాటూరి సుగుణమ్మ, సదాలక్ష్మి, జ్యోతి, మోతె లింగారెడ్డి, సిరిబోయిన కరుణాకర్‌లు, కేఎల్‌ మహేంద్రనగర్‌ వాసులు ఈ భూమిలో జెండాలు పాతి తుమ్మకంపలు కొట్టి గుడిసెలు వేశారు. ఇల్లును సాధించుకోవాలనే పట్టుదలతో ఎన్ని కష్టాలు వచ్చిన పేదలు ధైర్యం కోల్పోలేదదు. పోలీసు, రెవెన్యూ అధికారులు పలుమార్లు గుడిసెలు తొలగించాలని బెదిరించిన పోరాటాన్ని కొనసాగించారు.

పోరాటం ఎందుకు ముగిసింది…?

నెలరోజులపాటు గుడిసెలు వేసి ఇళ్ల స్థలాల కోసం పోరాటం ఉద్ధృతంగా నడిచిన అది రాజీమార్గం పట్టింది. కారణం డబ్బులతో సీపీఐ నాయకులను ఓ భూమి కొనేయడమే కారణమని ఆరోపణ ఉంది. 4లక్షల రూపాయలకు 2వందల మంది గుడిసెవాసుల ఆశలను తాకట్టు పెట్టినట్లు తెలిసింది. సీపీఐకి చెందిన ప్రధాన నాయకులు భూస్వామితో కుమ్మక్కు కాగానే అతని అనుచరులు ఇతర నాయకులను బెదిరించారు. గుడిసెలు తీసేయాలి..మీ నాయకులతో మాట్లాడమని హుకుం జారీ చేశారు. దీంతో పార్టీలో గొడవ ముదిరిపోయిందట. గుడిసెలు ఎలా తీస్తారని కొందరు ప్రశ్నిస్తే పార్టీ ఫండ్‌ ఇస్తారట అని సమాధానం లభించిందట. ఇక్కడ అర్థంకానీ విషయం ఏంటంటే గుడిసెలు వేసేటప్పుడు ప్రభుత్వభూమి రికార్డుల్లో చూశాం అని వాదించిన సీపీఐ నాయకులు, అప్పటి కార్యదర్శితోసహా వెంటనే మాటమార్చి అది ప్రైవేట్‌భూమిని వారికి వారే నిర్థారణకు ఎలా వచ్చారో తెలియదు. కాకతీయుల కోట కట్ట అని ఊదరగొట్టిన నాయకులు పార్టీలోనే ఇతరులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తే వెళ్లి ఆ భూస్వామినే అడగండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారని తెలిసింది. ఈ విషయం సీపీఐకి రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. పైగా అతన్నే జిల్లా కార్యదర్శిగా కొనసాగించారు. ఆ తరువాత ఆ భూమి నాది పట్టాదారు అంటూ సీపీఐ నాయకులకు కావాల్సింది ముట్టజెప్పిన భూస్వామి పోలీసులతో తన అనుచరులను పంపి అక్కడ ఉన్న పేదప్రజలను తరిమివేసి గుడిసెలు దగ్ధం చేశారు. సీపీఐ నాయకులు మాత్రం ఆ సీన్‌లోకి ఎంటర్‌ కాకుండా ఇంట్లోనే హాయిగా ఉండిపోయారు. దీంతో హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కథ ముగిసిపోయింది. ఇంటిస్థలం ఆశతో జనం లాఠీ దెబ్బలు తిన్నారు. ఖర్చుల పాలయ్యారు. సీపీఐ నాయకులు మాత్రం కావల్సింది అందుకుని జేబులు నింపుకున్నారు. చివరకు ఓడింది మాత్రం పేదప్రజలే.

prabuthva badilone cherpinchali, ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి

ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి

గీసుగొండ మండలకేంద్రంలో ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలని కోరుతూ ఉపాధ్యాయులు స్థానిక నాయకులు తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని, అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ సూర్యకళ, ఉపాధ్యాయులు రామ్మూర్తి, ప్రభాకర్‌, స్థానికులు చాడ కొమురరెడ్డి, లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు.

bhanudi bagabaga..janam vilavila, భానుడి భగభగ…జనం విలవిల

భానుడి భగభగ…జనం విలవిల

రోజురోజుకు భానుడి ప్రతాపం పెరుగుతోంది…భానుడి భగభగకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రెండురోజుల వ్యవధిలో సుమారుగా 15మంది మృతిచెందారు. ఇదేవిధంగా భానుడు ప్రతాపం చూపితే ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొన్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ 45డిగ్రీలు దాటి 50డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు వెళ్లొచ్చని, ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతను బట్టి అంచనా వేయవచ్చు. ఈ ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలు మధ్యాహ్నం వేళల్లోనైతే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి. రోజువారి పనుల్లో భాగంగా ప్రజలు తమ పనులను ఉదయం 11గంటలలోపే పూర్తి చేసుకుంటున్నారు. తిరిగి అత్యావసర పనుల నిమిత్తం సాయంత్రం 7 తరువాత మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది.

జాగ్రత్తలు తీసుకోవాలి

పనికి వెళ్లే వారు ఉదయం, సాయంకాలం వేళల్లో తమ పనులను చూసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లేవారు తెల్లని కాటన్‌ వస్త్రాలను తలపాగాగా చేసుకుని వెంట తాగేందుకు నీటిని తీసుకువెళ్లాలని తెలిపారు. అదేవిధంగా ఒదులుగా ఉన్న కాటన్‌ వస్త్రాలను ధరించాలని, తలకు తప్పనిసరిగా చేతిరుమాలు చుట్టుకోవాలని, మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై రాకుండానే మంచిదని హెచ్చరిస్తున్నారు.

puttinaroju vedukalu, పుట్టినరోజు వేడుకలు

పుట్టినరోజు వేడుకలు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లిబోర్డు వేణునగర్‌ వద్దగల సేవాజ్యోతి శరణాలయంలో వరంగల్‌ జిల్లా వాస్తవ్యుడు, సగర జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారు, నేటిధాత్రి దినపత్రిక అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, ధాత్రి గ్రూప్స్‌ చైర్మన్‌ కట్టా రాఘవేందర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో ఒకరోజు మీరోజు కావాలని కోరుతున్నామని అన్నారు. అభాగ్యుల సేవకు ఆలయంగా నిరంతరం సేవలు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శవంతమైన విధంగా జరగాలని, మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖసంతోషాలతో సమాజానికి ఆదర్శంగా జీవించాలని కోరారు. సేవా జ్యోతి శరణాలయం నుండి ఆశీర్వాదం ఎప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఉంటుందని అన్నారు. మంచిర్యాల జిల్లా జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం సభ్యుడు ఆసం ముత్తయ్య తిర్యాణి ఎఇఓ మాట్లాడుతూ భారతదేశం ఘనత ప్రపంచానికి పరిచయం చేసిన మహత్ముల పుణ్యభూమిలో పుట్టిన సగరుడు సర్వమానవుల సంక్షేమం కోసం పాటుపడటం అనేకరకాల బాధ్యతలను కూడా స్వీకరించి తదనుగుణంగా ముందుకు వెలుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి సేవా ప్రముఖ్‌ గజ్జెల్లి మల్లేశం, గజ్జెల్లి సత్యకేశవ్‌ జిత్‌, నిర్వాహాకులు కొంకటి స్వప్న, కష్ణ కొంకటి, కుటుంబ రమేష్‌, రాజ్‌కుమార్‌, సర్వమాధవ్‌ జిత్‌, నాగమణి, రాజేశ్వరి, విద్యార్థులు, మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.

gananga hanuman irumudi mahostvam, ఘనంగా హనుమాన్‌ ఇరుముడి మహోత్సవం

ఘనంగా హనుమాన్‌ ఇరుముడి మహోత్సవం

మండల రోజులు దీక్ష పూర్తి చేసుకున్న హనుమాన్‌ మాలాదారులు సోమవారం ఇరుముడి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామంలోని హనుమాన్‌ భక్తులు మాలాధారణతో మండల దీక్ష పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్‌ దేవాలయంలో గణపతి హోమం, నవగ్రహాల పూజలను వేదపండితులు గణేశ్‌శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి నిర్వహించుకున్నారు. అనంతరం ఇరుముడి మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గ్రామంలోని మహిళలు, కుటుంబసభ్యులతో కలిసి ఇరుముడి ప్రాంగణం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలను నిర్వహించారు. బుధవారం జరిగే హనుమాన్‌ జయంతి సందర్భంగా ద్విచక్రవాహనాలపై భద్రాచలానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కందుల కుమారస్వామి, కామెడీ మల్లారెడ్డి, ఈర్ల కొమ్మాలు, గడ్డమీది కుమారస్వామి, శరత్‌, రుదీర్‌, రామకష్ణ, శ్రీనివాస్‌లతోపాటు పలువురు ఉన్నారు.

gudiselu veinchi…beram kudurchuco…,గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో…

గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో…

నిలువ నీడలేని పేదలను కొందరిని చేరదీస్తారు. చెప్పింది వినాలంటారు. ప్రభుత్వభూమినో, ప్రైవేటు భూమినో చూపిస్తారు. ఇందులో మీకు జాగ ఖాయం అంటారు. దీనిని చదును చేస్తే మనం గుడిసెలు వేసుకోవచ్చని నమ్మకంగా చెప్తారు. నిలువ నీడ దొరుకుతుంది. నగరంలో ఓ ఇల్లు కట్టుకోవచ్చని పేదలు చెప్పిన ప్రతీ దానికి తలలూపుతారు. మరీ భూమిని చదును చేయాలి, జెండాలు పాతాలి, పోలీసులను ఎదుర్కొవాలి. ఇదంతా చేయాలంటే ముందుగా చేతిలో ఎంతో కొంత పైకం ఉండాలి. ఇంకేముంది చేరదీసిన ప్రజల వద్ద నుంచే తలా కొన్ని పైసలు వసూలు చేస్తారు. ఇక్కడ మొదలవుతుంది. వసూళ్ల పర్వం వంద నుంచి మొదలైన ఈ పర్వం డిమాండ్‌ను బట్టి వేలకు చేరుకుంటుంది. పొద్దస్తమానం కష్టపడి సంపాదించిన సొమ్మును నిలువ నీడ కోసం పేదలు అక్కడి నాయకులకు సమర్పించుకుంటారు. కష్టనష్టాలకోర్చి గుడిసెలు వేసుకుంటారు. ఒకటి, రెండు రోజులు చూసి ప్రభుత్వభూమి అయితే రెవెన్యూ అధికారులు, పోలీసుల సహాయంతో గుడిసెలు తొలగిస్తారు. అడ్డుకుంటే ఈడ్చి అవతల పారేస్తారు. డబ్బులు వసూలు చేసి గుడిసెలు వేయడానికి నాయకత్వం వహించిన నాయకులు సైతం అధికారులకు ఎదురుతిరుగుతారు. పోలీస్‌ వ్యాన్‌ ఎక్కుతారు. ఇదంతా బాగానే ఉన్నా తెల్లవారి నుంచి గుడిసెల పోరాటం మాట వినపడదు. చివరకు పేదలు, గుడిసె కోసం చెమటోడ్చి తమ కష్టార్జితం చేతిలో పెట్టినవారు నష్టపోతారు. నాయకులు మాత్రం వసూళ్ల పైసలతో హాయిగా ఉంటారు. ఇక ప్రైవేట్‌ స్థలం అయితే కథ వేరే విధంగా ఉంటుంది. వారం, పదిరోజులపాటు గుడిసెలు వేసి తమకు పేద ప్రజల అండ ఉందని నిరూపించుకుని బేరసారాలకు దిగుతారు. యజమానితో కుమ్మకైతారు. అదే రియలెస్టేట్‌ వెంచర్‌ అయితే డిమాండ్‌ భారీగానే పెట్టి తమ జేబులు నింపుకుని గుడిసెలు వేసిన వారికి ఏవో మాయమాటలు చెప్పి తప్పుకుంటారు. గుడిసెల స్థలంలో వారం, పదిరోజుల్లో అందమైన భవంతులు, అపార్టుమెంట్లు వెలుస్తాయి. ఇక్కడ చివరకు పేదలే ఓడిపోతారు. నాయకులు ఆర్థికంగా లాభపడి హాయిగా ఉంటారు. ఇదంతా గుడిసెల పేరుతో జరుగుతున్న పోరాటాల్లో తరుచుగా కనపడుతున్న మోసాలు. నిలువ నీడ లేని పేదలకు ఎంతో కొంత జాగ కోసం పోరాటం చేయడం సరైందే అయిన కేవలం తమ పార్టీల కోసం డబ్బులు రాబట్టుకోవడం కోసం కొందరు కమ్యూనిస్టుల పేరుతో ఎర్రజెండాను అడ్డుగా పెట్టుకుని దిగజారుడు పద్దతులు అవలంభించడం నిజంగా క్షమించరాని నేరం.

బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ

బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ

దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రామంలో వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మూెత్సవాలు జరుగుతున్న సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నూతనంగా ఎంపికైన మహబూబాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవితలు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ఆలయ ధర్మకర్త వారికి ఘనంగా స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్చాలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ జడ్పీటిసి అభ్యర్థి ఆకుల శ్రీనివాస్‌, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, బీరం సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్‌ మురళి, హేమచందర్‌గౌడ్‌, కమలాకర్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.

anni vidala adukuntam,  అన్ని విధాల ఆదుకుంటాం

అన్ని విధాల ఆదుకుంటాం

కిడ్ని వ్యాధితో మృతిచెందిన అనుముల రమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. వివరాల్లోకి వెళితే…మండలంలోని నాగపురానికి చెందిన అనుముల రమ కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం నగరంలోని మ్యాక్స్‌కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్‌, ఎంపిపి మార్నేని రవిందర్‌రావులు ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వపరంగా రమ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉండి వారిని ఆదుకుంటామని అన్నారు. అనంతరం వారి కుటుంబానికి ఆయన ఆర్ధికసహాయం చేశారు. మృతురాలికి భర్త సంపత్‌, కుమార్తెలు శిరిష (25), అనూష(21)లు ఉన్నారు.

kulina prabuthva patashala bavanam, కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం

కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం

నుగూరు వెంకటాపురం మండలం నెలారిపేటలో ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయింది. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం శనివారం ఉదయం కుప్పకూలింది. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలకోసం నూతన భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శిథిలమైన భవనాల్లో పాఠశాల నడపడం ఎప్పటికైనా ప్రమాదమేనని వారు అంటున్నారు.

 

errajanda perutho buvyaparam, ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం

ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం

వారికి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధం లేకున్నా కమ్యూనిస్టులమని చెప్పుకుంటారు. ఎర్రజెండా పేరుతో గుడిసెలు వేస్తారు. ఖరీదైన స్థలాలను గుర్తించి అమ్మేసుకుంటారు. అధికారుల సాయం తీసుకోవడానికి వారికి స్థలం ఆశ చెపుతారు. ఖరీదైన ప్రభుత్వ స్థలంలోనే అధికారులకు ప్రహరీ గోడ కట్టి, బోర్‌ వేసి స్థలాన్ని ఆక్రమించి అప్పగిస్తారు. అధికారుల స్థలాన్ని కంటికి రెప్పలా కాపాడుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే స్థలం ఆ అధికారిది కాదు మాదే అని దబాయిస్తారు. ఎం చూస్తారో చేసుకొండని బెదిరిస్తారు. విలేకరులు వివరణ అడిగిన అలాగే అంటారు. అసలు మీకేం సంబంధం మేము ఇలాగే కబ్జా చేస్తాం అంటూ అవగాహన లేకుండా మాట్లాడుతారు. స్థానిక పోలీసు అధికారికి సైతం ఇందులో వాటా ఉందంటారు. ప్రభుత్వ భూములు యథేచ్చగా కబ్జా అవుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లే వ్యవహరిస్తారు. హన్మకొండలో జరుగుతున్న ఈ యధేచ్చ కబ్జాపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కథనం సోమవారం సంచికలో…

collector sir…mudokannu teravali, కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి…

కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి…

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ జిల్లా డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతికి పాల్పడిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే సస్పెండ్‌ చేస్తూ, డిఐఈవో, సూపరింటెండెంట్‌ను విధుల్లో నుండి తొలగించాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సమితి(ఎవిపిఎస్‌), అంబేద్కర్‌ విద్యార్థి సమాఖ్య(ఎబిఎస్‌ఎఫ్‌), డెమోక్రాటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌(డివైఎఫ్‌), భారతీయ విద్యార్థి మోర్చా(బివిఎమ్‌), బహుజన దళిత్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌(బిడిఎస్‌ఎఫ్‌) సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత పదిరోజులుగా డిఐఈవో కార్యాలయంలో క్యాంపు పేరిట వచ్చిన డబ్బులను కార్యాలయంలోని కొందరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోపాటు డిఐఈవో, సూపరింటెండెంట్‌లు అవినీతికి పాల్పడ్డారని ‘నేటిధాత్రి’ దినపత్రికలో వస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సంబంధిత జిల్లా యంత్రాంగం అధికారుల తీరును విమర్శిస్తున్నారు.

అవినీతి ఉద్యోగులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

డిఐఈవో కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీని నియమించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను గుర్తించి వెంటనే సస్పెండ్‌ చేయాలి. స్టేషనరీ పేరుతో ముక్కున వేలేసుకునే విధంగా లెక్కలు రాశారని, క్యాంపులో పనిచేయని వారి పేర్లను రాసి దొంగపేర్లతో, దొంగల అకౌంట్లలో డబ్బులు వేసుకుని అందినకాడికి దండుకున్నారని, కొన్ని బిల్లులపైన తీసుకున్న వారి సంతకాలు లేకున్నా వారికి చెల్లించినట్టుగా బిల్లులు తయారుచేసి అసలు పనిచేసిన వారికి తెలియకుండా ఎక్కువ మొత్తంలో నొక్కేశారు. పేపర్‌ వాల్యుయేషన్‌ చేసే లెక్చరర్‌ల విషయంలో కూడా ఒక్కో టేబులో ఉన్న వారికంటే ఎక్కువ మంది ఉన్నట్టు బిల్లులు డ్రా చేశారు. వీటిని కమిటీ చేత విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.

డిఐఈవో, సూపరింటెండెంట్‌లను ఉద్యోగాల నుండి తొలగించాలి

క్యాంపునకు చెందిన డబ్బులను డ్రా చేయడంలో వీరిద్దరి పాత్ర కీలకమైనదని, వీరు సంతకాలు చేస్తేనే బిల్లులు డ్రా చేసే అవకాశం వుంటుంది. ఫిఫ్టీ-ఫిఫ్టీ దండుకునేందుకు పన్నిన ప్రణాళికలో భాగమే ఈ అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. క్యాంపు రిజిష్టర్‌లలో సంతకాలు లేని వారికి బిల్లులు, డబ్బులు డ్రా ఎలా చేస్తారని సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ అవినీతి భాగోతానికి సూత్రధారి డిఐఈవో, పాత్రధారి సూపరింటెండెంట్‌లేనని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, ఇంటర్మీడియట్‌ ఆర్జేడీ వెంటనే స్పందించి విచారణ చేయించి బాధ్యులను ఉద్యోగాల నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ఇంటర్‌ బోర్డు కమీషనర్‌, హైదరాబాద్‌, తెలంగాణ విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలసి వినతిపత్రాలు ఇస్తామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

harithahaaraniki mokkalu siddam cheyali, హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి

హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి

హరితహారం కార్యక్రమ సమయానికి మొక్కలను అందించేందుకు సిద్ధంగా ఉంచాలని రాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి సూచించారు. శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాయినగర్‌లో నిర్వహిస్తున్న నర్సరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహార కార్యక్రమానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. అదేవిధంగా సాయినగర్‌లోని వాటర్‌ట్యాంకులను సందర్శించి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, ప్రజలకు స్వచ్చమైన నీటిని అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సినారె ఆధునాతన గ్రంథాలయ పనులను పర్యవేక్షించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీలకు సూచిస్తూ నాణ్యతాయుతంగా పనులు కొనసాగేలా చూసుకోవాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

 

summer season, badibatapia avagahana, సమ్మర్‌ సీజన్‌, బడిబాటపై అవగాహన

సమ్మర్‌ సీజన్‌, బడిబాటపై అవగాహన

సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌లో సమ్మర్‌ సీజన్‌, బడిబాటలపై తెలంగాణ సాంస్క తిక సారధి, టీమ్‌లీడర్‌ గడ్డం శ్రీనివాస్‌ అవగాహన కల్పించారు. శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌ గ్రామాలు పెద్దూర్‌, జగ్గారావుపల్లి, సర్దాపూర్‌ గ్రామాల్లో జిల్లా సమాచారశాఖ ఆదేశాలతో గడ్డం శ్రీనివాస్‌ బందంచే సమ్మర్‌ సీజన్‌, టిబి వ్యాధి, బడిబాటలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లితండ్రులు కషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏవిధమైన ఫీజులు లేకుండా నాణ్యమైన విద్య, మంచి సంస్క తి, ఆరోగ్యమైన వాతావరణం ఉంటుందని వివరించారు. కూలి పనులు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు, మండుటెండలకు అందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం, సాయంత్రం పనులు చేసుకోవాలని అన్నారు. ఎండలోకి వెళ్లే ముందు తలపాగా, టోపి ధరిస్తూ, గొడుగు, మంచినీరు వెంట ఉంచుకోవాలని చెప్పారు. పిల్లలు, వద్దులు, గర్భిణులు, బీపీ, షుగర్‌, గుండె జబ్బులు ఉన్నవారు, ధీర్ఘ వ్యాధిగ్రస్తులపై వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కనుక ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, తెల్లని, వదులైన కాటన్‌ దుస్తులు ధరించడం మంచిదని సూచించారు. మజ్జిగ, నిమ్మ, కొబ్బరినీళ్లు తాగడం, అధికంగా ద్రవపదార్థాలు తీసుకోవడం మంచిదని, ఎండలో ఎలాంటి రక్షణ లేకుండా తిరగడం, నీళ్లు తక్కువగా, మత్తు పానీయాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా వడదెబ్బ తగులుతుందని తెలిపారు. తల తిరగడం, తీవ్ర తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గుండె వేగంగా కొట్టుకోవడం, బాగా జ్వరం రావడం అనిపిస్తే సత్వర చికిత్స అందజేయాలని, లేకుంటే ప్రమాదకరం, ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని వాతావరణం, నీడలో కాసేపు సేదతీర్చి మంచినీరు తాగించి, తడిగుడ్డతో తుడిచి, చల్లని నీటిస్నానం చేయించి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వివరించారు. అదేవిధంగా టీబీ వ్యాధి గాలి ద్వారా మైక్రో బ్యాక్టీరియా, ఒకరినుండి మరొకరికి వ్యాపించే వ్యాధి అని, టిబి2 వరకు పైగా జ్వరం, తేమడతో కూడిన దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి, నీరసం, తిమ్మిర్లు, రాత్రిపూట చెమటలు, ఈ లక్షణాలు కనిపిస్తే సమీప ఏరియా ఆస్పత్రులలో పరీక్షలు చేయించాలని సూచించారు. టిబి అని నిర్దారణకు వస్తే భయపడే అవసరం లేదని, తగు జాగ్రత్తలతో డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తూ, వ్యాధికి తగు మందుల కోర్సును వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణకోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఎడ్మల శ్రీధర్‌రెడ్డి, ఆకునూరి దేవయ్య, గడ్డం దేవయ్య, కాయితోజు ప్రవీణ్‌, పొత్తురి రాజు, కొడుమోజు లక్ష్మినారాయణ, ఆయా గ్రామల ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

 

మడిపల్లిలో మహాయజ్ఞం

మడిపల్లిలో మహాయజ్ఞం

మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం బొడ్రాయి ఉత్సవాల చివరిరోజు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు బొడ్రాయి వద్ద పూజలు చేసి మహాయజ్ఞం చేశారు. గ్రామస్తులంతా కలసివచ్చి గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రతిష్టించిన అమ్మవార్లకు కొత్తబట్టలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి తమతమ మొక్కులు తీర్చుకున్నారు. వేదపండితులతో ప్రతిఒక్కరు అమ్మవార్ల దీవెనెలు తీసుకున్నారు. గ్రామంలోని వారందరు చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గల గ్రామాల ప్రజలు కూడా మడిపల్లి గ్రామంలోని బొడ్రాయి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ బొడ్రాయి మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఆనందోత్సాహాలతో సాగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ చిర్ర సుమలత విజయ్‌, ఎంపిటిసి ఆకుల ఇంద్రయ్య, రైతు సమన్వయ అధ్యక్షుడు అంచూరి విజయ్‌కుమార్‌, వెలుదండి శ్రీరాములు, రమేష్‌, మాజీ ఎంపిటిసి రాజ్‌కుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

aa ci anthe…maradata…,ఆ సీఐ అంతే…మారదట…!

ఆ సీఐ అంతే…మారదట…!

ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి పేరు చెపితేనే సర్కిల్‌ పరిధిలోని ప్రజలు అమ్మో…అంటున్నారు. సమస్య ఏదైనా ఉంటే పరిష్కారానికి వెళితే చేయి తడపందే పని పూర్తికాదని, అడిగింది సమర్పించుకుంటే మనవైపు ఎంత న్యాయం ఉన్నా కేసు రివర్స్‌ అయిపోతుందని అంటున్నారు. ధర్మసాగర్‌లో సీఐగా వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతిపనికి రేటు కట్టి దండుకోవడం తప్ప బాధితులకు న్యాయం చేసిన పాపానపోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌ గడప తొక్కితే చాలు ఖర్చు కావాల్సిందేనని పైసలు ముట్టజెప్పనిదే ఏ పనికాదంటున్నారు. ధర్మసాగర్‌, రాంపూర్‌ తదితర ప్రాంతాలలో భూముల ధరలు అధికంగా ఉండడం, భూతగాదాలు, భూకబ్జాలు సైతం అదే స్థాయిలో ఉండడంతో తనకు అవసరం లేకున్నా సీఐ శ్రీలక్ష్మి సివిల్‌ మ్యాటర్‌ అని తెలసి కూడా కలుగజేసుకుంటుందని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల వద్ద గొడవలతో స్టేషన్‌కు వెళితే ఇదే అదనుగా భావించి ఎవరు అసలు హక్కుదారులో, ఎవరు కబ్జాకోరల్లో గుర్తించకుండా డబ్బులు ఎవరు ఎక్కువగా ఇస్తే వారివైపే సీఐ మొగ్గుచూపుతుందని, దీంతో ధర్మసాగర్‌ సర్కిల్‌ పరిధిలో అమాయకులు అనేకమంది చుక్కలు చూస్తున్నారని వారు అంటున్నారు.

పోలీసు ఉన్నతాధికారులకు పట్టదా…?

ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి ఇంతా చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు మాత్రం తమకేం తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. రాంపూర్‌ భూవివాదం విషయంలో బాధితులు 2018 సంవత్సరంలో పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అసలు హక్కుదారులం మేమేనని మొరపెట్టుకున్నారు. అయిన ఎవరు స్పందించలేదు. సమస్య పరిష్కారం చేసేందుకు చొరవ చూపలేదని తెలిసింది. సీఐ శ్రీలక్ష్మి విషయంలో సైతం కమిషనర్‌కు ఫిర్యాదులు బాగానే వెళ్లాయట. కానీ సీఐపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని ధర్మసాగర్‌ సర్కిల్‌ పరిధిలో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం రాజకీయ ఒత్తిళ్లు అనే అనుమానం సైతం కలుగుతుంది.

సీఐకి బదిలీ ఉండదా…?

ధర్మసాగర్‌లో సీఐ శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించి మూడు సంవత్సరాలు అవుతున్నా ఉన్నతాధికారులు బదిలీ చేయడానికి సాహసం చేయడం లేదని తెలిసింది. రెండు సంవత్సరాలకే లాంగ్‌ స్టాండింగ్‌ పేరుతో బదిలీ చేయడం, పోస్టింగ్‌ లేకుంటే అటాచ్‌లో ఉంచడం కమిషనరేట్‌ పరిధిలో జరుగుతుంది. కానీ అందుకు విరుద్ధంగా సీఐ శ్రీలక్ష్మిని 3సంవత్సరాలు గడిచినా అధికారులు బదిలీ చేయడం లేదు. అయితే భూవివాదాలు, ఇతర గొడవల్లో చేతివాటం ప్రదర్శించి బాధితులను ముప్పుతిప్పలు పెట్టే సీఐ శ్రీలక్ష్మి తనకు బదిలీ అయితే తిరిగి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉండాలని అనుకుంటుందట. నిజానికి ఒక నియోజకవర్గంలోని స్టేషన్‌లో విధులు నిర్వర్తించాక అదే నియోజకవర్గంలోని వేరే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ ఉండదని అంటున్నారు. సీఐ శ్రీలక్ష్మి మాత్రం తాను స్టేషన్‌ ఘన్‌పూర్‌ పట్టణ సీఐగా వెళ్తానంటూ ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక ఎమ్మెల్యే అండతో రెండునెలల క్రితమే ఎమ్మెల్యే విల్లింగ్‌ లెటర్‌ సంపాదించినట్లు తెలిసింది. నిజానికి శ్రీలక్ష్మి ఉన్నతాధికారులను సైతం పట్టించుకోకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి స్థానిక ఎమ్మెల్యే కారణమని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

కమిషనర్‌ సాబ్‌ జర దేఖో

భూముల విషయంలో అతిగా వ్యవహరిస్తూ సివిల్‌ మ్యాటర్‌లో వేలు పెడుతున్న ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి వ్యవహారాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించాలని రాంపూర్‌ భూబాధితులు కోరుతున్నారు. గతంలోనే తాము కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని గుర్తుచేస్తున్నారు. అసలు హక్కుదారులైన తమను మానసిక వేధింపులకు గురిచేస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలని, తమ సమస్య పరిష్కారం చేయాలని వేడుకుంటున్నారు. కబ్జాదారుల ఆట కట్టించి తమను ఆదుకోవాలంటున్నారు.

kabza kathalu endukosam…, ‘కబ్జా’ కథలు ఎందుకోసం…?

‘కబ్జా’ కథలు ఎందుకోసం…?

భూమితో మనిషిది విడదీయరాని సంబంధం. భూమి లేనిది మనిషి జీవించడం అసంభవం. నాలుగుముద్దలు నోట్లోకి వెళ్లాలన్న నాలుగు పైసలు సంపాదించాలన్న భూమి అనేది ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈ ప్రపంచానంతటిని తిండిగింజలు అందిస్తూ పోషిస్తున్నది భూమి. భూమి, భుక్తి, విముక్తి అంటూ, దున్నేవాడిదే భూమి అంటూ అనేక ఉద్యమాలు సైతం కొనసాగాయి. ఈ ఉద్యమాలకు భూమే ప్రధాన భూమికగా మారింది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలాంటి భూమి ఈ రోజుల్లో వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం కొంతమంది కబ్జాదారులు అమాయకులు, బలహీనుల భూములను బలవంతంగా అక్రమిస్తున్నారు. జీవనాధారం అనుకున్న భూమి నిలువ నీడ కోసం ఇంత గూడు వేసుకోవడానికి ఉపయోగపడే భూమి కొంతమంది బలవంతుల కబంధహస్తలలో చిక్కుకొనడంలో ‘ఏ ఆసరా లేని అమాయకులు భూముల అసలు హక్కుదారులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సహయం చేసి వారు ఎదుర్కొంటున్న కష్టాలను, కబ్జారూపంలో వారికి జరుగుతున్న అన్యాయాన్ని అధికారులకు, సర్కార్‌ దృష్టికి తేవడానికి ‘నేటిధాత్రి’ దినపత్రిక ‘కబ్జా’కథలు శీర్షికను కొనసాగిస్తుంది. కబ్జా అయిన భూముల వివరాలు, కబ్జారాయుళ్ల ఆగడాలతో నిత్యం వేధింపులకు గురిఅవుతున్నావారి వేదనను బహిర్గతం చేసేందుకు మేము సర్వదా సిద్ధంగా ఉన్నాం. దేశంలోని భూసమస్యలు పరిష్కారం అయితే మెజార్టీశాతం ప్రజలు హాయిగా జీవిస్తారనే సత్యాన్ని ‘నేటిధాత్రి’ బలంగా విశ్వసిస్తుంది. అందుకు కొంతమంది బలవంతులు మా ప్రయత్నాన్ని ఆపడానికి బెదిరింపులకు దిగినా, బాధితులపక్షాన వకాల్తా పుచ్చుకుంటే లేనిపోని ఆరోపణలు చేసిన ఏ మాత్రం ఖాతరు చేయకుండా పేదప్రజలపక్షాన ముందుకు వెళుతూ నిఖార్సయిన వార్తలు అందించేందుకే నిత్యం కృషి చేస్తుంది. భూఅక్రమాలు, భూకబ్జాలను వెలికితీసి బాధితులపక్షాన తన గొంతును ‘నేటిధాత్రి’ వినిపించబోతుంది. మీ సమస్యలు ఏం ఉన్నా మాకు తెలియచేయాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాటి పరిష్కారానికి ‘నేటిధాత్రి’ దినపత్రిక వేదికగా మేము మావంతు కృషి చేస్తామని చెపుతున్నాం. ‘కబ్జా’ కథలు శీర్షికన కబ్జాకోరుల ఆగడాలను ఇక ఆటకట్టిస్తాం.

lingambaba…iduguru dongalu, ‘లింగంబాబా’…ఐదుగురు దొంగలు

‘లింగంబాబా’…ఐదుగురు దొంగలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా డిఐఈఓ కార్యాలయంలో క్యాంపు పేరిట భారీ మొత్తంలో అవినీతి జరిగిందన్నా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అవినీతి బాగోతాన్ని ‘నేటిధాత్రి’ కథనాల ద్వారా పాఠకులకు అందించిన అవినీతి డిఐఈఓ కార్యాలయంలో ఉద్యోగులు అవినీతి పాల్పడ్డారన్న కథనాల ఆధారంగా విద్యార్థి, ప్రజాసంఘాలు కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమవుతున్నట్లు విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు తెలిపారు.

తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న దొంగలు

క్యాంపు పేరిట అక్రమంగా నొక్కేసి అవినీతికి పాల్పడిన ‘ఐదుగురు దొంగలు’ తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. క్యాంపు బాయ్స్‌ పేరిట 90మందికిపైగా పనిచేయకున్నా పనిచేసినట్లుగా పేర్లను సృష్టించి వారి అకౌంట్లలో దొడ్డిదారిన ప్రభుత్వ సొమ్మును వారి ఖాతాలో జమచేశారు. ఇవేకాకుండా స్టేషనరీ, ట్రావెల్స్‌, ఫ్లైయింగ్‌ స్వ్కాడ్స్‌, సిట్టింగ్‌ స్వ్కాడ్స్‌, పేపర్‌ వాల్యూవేషన్‌ చేసిన లెక్చరర్ల విషయంలో కూడా లెక్కకు మించి ఎక్కువ బిల్లులు పెట్టి అక్రమంగా నొక్కేశారు. ఈ విధంగా అవినీతికి పాల్పడిన ఆ ‘ఐదుగురు దొంగలు’ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కమిటీ వేస్తే దొరకడం ఖాయమంటున్న కొందరు

క్యాంపులో జరిగిన అవినీతి లీలలపై వస్తున్న ఆరోపణలపై ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ ఒకవేళ విచారణ కమిటీని నియమిస్తే అందరం దొరికిపోవడం ఖాయమని అవినీతికి పాల్పడిన ఉద్యోగులు ఒకరితో ఒకరు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

(అలీబాబా…’అస్త్రం’ త్వరలో)

kulo thagunitiki katakata, కేయూలో తాగునీటికి కటకట

కేయూలో తాగునీటికి కటకట

కాకతీయ యూనివర్సిటీలో తాగునీటి కటకట ఏర్పడింది. అసలే ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయ్‌…చల్లటి నీటితో దాహం తీర్చుకుందాం అనుకున్న విద్యార్థులకు, ఉద్యోగులకు నీళ్లులేక…పనిచేయక అలంకార ప్రాయంగా మిగిలిన ప్రిడ్జ్‌లు దర్శనం ఇస్తున్నాయి. అన్ని డిపార్టుమెంట్లలో తాగునీటికి అధికారులు ప్రిడ్జ్‌లు ఏర్పాటు చేసిన ఇవి పనిచేయక పాడైపోయి వెక్కిరిస్తున్నాయి. అధికారులు మాత్రం ఇదేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో గుక్కెడు నీటికోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

sena layout kabzalu chudatharama…,సేనా లేఅవుట్‌ కబ్జాలు చూడతరమా…

సేనా లేఅవుట్‌ కబ్జాలు చూడతరమా…

లేఅవుట్‌ నిర్వాహకుల కబ్జాలు నానాటికి స్థానిక ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మండలంలో లే అవుట్‌ కొరకు కొనుగోలు చేసిన భూముల్లో, పక్కన ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని దర్జాగా ప్లాట్లను అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ భూములను కొనుగలు చేసి కోట్లు గడించాలన్న వారి ఆలోచన వారి వ్యాపారవ్యవహారాలకు సంబంధించినదైతే అట్టి భూములను ఆనుకుని ఉన్న భూములనే నమ్ముకుని బతుకుతున్న రైతుల జీవితాల్లో చీకట్లు మిగిల్చే పరిస్థితులకు దారి తీస్తున్నాయి. బీద ప్రజలకు సంబంధించి భూముల్లో చిన్న చిన్న తప్పిదాలు ఉంటేనే అమ్మో ఎంత పెద్ద తప్పిదమో అని భూతద్దంలో చూసి పట్టాలు చేయకుండా పక్కనబెట్టే రెవెన్యూ అధికారులు రెవెన్యూ కార్యాలయం పక్కనే నిర్వహిస్తున్న లేవుట్‌లో తప్పిదాల మీద తప్పిదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు అర్జీలు పెట్టుకున్నప్పటికి అధికారులు మాత్రం నిర్వాహకులకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. దీంతో రెచ్చిపోయిన సేన లేఅవుట్‌ నిర్వాహకులు భూములను కబ్జా చేసుకుంటూనే పోతున్నారు.

మిట్టకాలువ మాయం.!

సేన లేఅవుట్‌ కొరకు కొనుగోలు చేసిన భూములలో ఉన్న మిట్టకాలువను లేఅవుట్‌ నిర్వాహకులు అక్రమంగా కబ్జాచేసి కాలువను మాయం చేశారు. దీంతో మిట్టకాలువ పరిధిలో ఉన్న వ్యవసాయ భూములకు చెందిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కబ్జా చేసి మూసివేసిన మిట్టకాలువ కింద సుమారు 60మంది రైతులకుపైగా వ్యవసాయ భూములు కలిగి ఉన్నారు. కాలువను మూసిన విషయమై నిర్వాహకులను స్థానిక రైతులు ఇదేంటని ప్రశ్నించినప్పటికీ మీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకొండని చెప్పినట్లు సమాచారం.

పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా..?

లేఅవుట్‌ నిర్వహిస్తున్న స్థలాన్ని ఆనుకుని 29 సర్వే నంబర్‌ ఉంది. ఈ సర్వే నంబర్‌లో మొత్తం 16ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉన్నది. కొనుగోలు చేసిన భూమి పక్కన ప్రభుత్వభూమిని కబ్జా చేసినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. 516, 517, 305లను అనుకున్న ప్రభుత్వభూమిలో సుమారు 12 నుండి 15గుంటల భుమిని కబ్జాచేసి లేఅవుట్‌లో కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

బ్లూప్రింట్‌లో కొంత లేఅవుట్‌ చేస్తున్నది మరింత….

కుడాకు, గ్రామపంచాయితికి సమర్పించిన కొనుగోలు భూమికి సంబంధించి బ్లూప్రింట్‌లో చూపిన భూమి విస్త్తీర్ణానికి ప్రస్తుతం నిర్వాహకులు చేస్తున్న విస్తీర్ణానికి మధ్య చాలా తేడాలు ఉన్నట్లు స్పష్టంగా తెలియవస్తుంది. బ్లూప్రింట్‌ ప్రకారం 13ఎకరాల భూమిని చూపినప్పటికీ కాలువ, ప్రభుత్వ భూములు కలుపుకుని మొత్తం 16ఎకరాల విస్తీర్ణం వరకు లేఅవుట్‌ కొరకు అభివృద్ధి చేస్తున్నారు.

అధికారిక నిర్వాహకులు వేరు…పెత్తనం చేసే నిర్వహకులు వేరు..?

అసలే లేఅవుట్‌ వ్యాపారం కోట్ల రూపాయల పెట్టుబడులు, రాబడుల వ్యవహారం. దీంతో నిర్వాహకులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. లేఅవుట్‌ నిర్వహణకు సంబంధించి రాజకీయ ప్రముఖుల అండదండలు ఉన్న వ్యక్తులే ఇందులో భాగస్వాములుగా ఉండడం అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అందరికి తెలిసిన విషయమే. సరిగ్గా మండలకేంద్రంలో నిర్వహిస్తున్న లేఅవుట్‌ విషయంలో కూడా ఇదే జరుగుతన్నదని ప్రచారం జరుగుతుంది. సేనా లేఅవుట్‌కు సంబంధించి గ్రామపంచాయితికి సమర్పించిన భూముల కొనుగొళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో గంజి నవీన్‌, ఆమంచ మహేశ్వర్‌లు కొనుగోలుదారులుగా ఉన్నారు. కాని లేఅవుట్‌ నిర్వహణ తదితర వ్యవహారాలు మాత్రం స్థానిక నేతలకు దగ్గరి పరిచయస్తులు, రాజకీయ మిత్రులే చూస్తున్నారని స్థానిక ప్రజలు పలు సంధర్భాల్లో అధికారులకు సమర్పించిన దరఖాస్తులలో తెలియజేశారు. ఏదిఏమైనా వ్యాపారవ్యహరాలను అడ్డుపెట్టుకుని ప్రజలకు అన్యాయం చేసే విధంగా ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను మింగెయాలని చూసే వారి ప్రయత్నాలు మానుకోవాలని పలు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు.

కబ్జాలపై కుడా అధికారుల ద్వందవైఖరి..

మండలకేంద్రంలో సేన లేఅవుట్‌లో జరుగుతున్న కబ్జాలను గురించి కుడా అధికారులు నిర్వాహకులకు అండగా ఉండే విధంగా వ్యహరించడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాసంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఅవుట్‌లో ప్రభుత్వ భూముల కబ్జాల గురించి కుడా అధికారులు స్పందించకుండా నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరించడం అధికారుల నిర్లక్ష్యవైఖరిని ప్రతిబింబించడంతోపాటు వారు నిర్వాహకులకు కొమ్ముకాస్తున్నారని ఒప్పుకోకనే ఒప్పుకుంటున్నారు. కుడా అనుమతి కొరకు సంబంధిత సేన లేఅవుట్‌ ఫైల్‌ టెక్నికల్‌ విభాగంలో ఉన్నట్లు సమాచారం.

లేఅవుట్‌ కబ్జాలపై రెవెన్యూ, కుడా అధికారుల పాత్రే కీలకం..

లేఅవుట్ల నిర్వహణలో భూములకు సంబంధించి క్లియరెన్స్‌ ఇచ్చేది. రెవెన్యూ శాఖ అధికారులు వారి నుండి ఫైల్‌ ముందుకు వెళ్ళిన తర్వాత కబ్జాలకు పాల్పడినట్లైతే స్థానిక రెవెన్యూ అధికారులు, కుడా అధికారులకు విషయం దృష్టికి వస్తే తగు విచారణ చేసి చర్యలు తీసుకోవడం, అనుమతుల రద్దులకు సంబంధించి రెవెన్యూ, కుడా అధికారుల పాత్రలే కీలకంగా ఉంటాయి. మరీ మండలకేంద్రం లే అవుట్‌ జరుగుతున్న కబ్జా అంశాలపై ఇదివరకే సమాచారం తెలిసినప్పటికి అధికారులు వాయిదాలను ఎంచుకుని కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయాలపై స్పందించి నిర్వాహకుల ఆగడాలకు చెక్‌ పెట్టనట్లతే సమాజంలో విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదంతోపాటు ఉన్నతాధికారుల నుండి అధికారిక చర్యలకు బాధ్యులవుతారనే విషయాన్ని గుర్తెరిగితే మంచిదని అంటున్నారు పిర్యాదిదారులు.

baryanu nariki champina bartha, భార్యను నరికి చంపిన భర్త

భార్యను నరికి చంపిన భర్త

కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను అతి కిరాతరంగా నరికి చంపిన ఘటన మండలంలోని కట్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…కట్రియాల గ్రామానికి చెందిన చెవ్వల్ల యాదగిరికి గత 24 సంవత్సరాల క్రితం రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన మల్లికాంబతో వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితంలో ఇరువురు కుమారులు జన్మించారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరికి తరచూ కలహాలు రావడంతో మల్లికాంబ తన స్వగ్రామమైన కొత్తూరుకు వెళ్లిపోయి అక్కడే జీవనం సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో యాదగిరి మల్లికాంబలకు కలిగిన ఇరువురు కుమారులు పెరిగి పెద్దవారు కావడంతో తల్లిదండ్రులు వివాదాలు పక్కనపెట్టి కలిసి ఉండాలని ఇరు గ్రామాలకు చెందిన పెద్దమనుషులు పంచాయితిలో నిర్ణయించారు. వీరి నిర్ణయం మేరకు గత 8సంవత్సరాలుగా తల్లిగారి ఇంటి వద్దే ఉన్న మల్లికాంబ తిరిగి అత్తగారి గ్రామమైన కట్రియాలకు ఈనెల 16న వచ్చి తన కుటుంబంతో కలిసి ఉంటుంది. అయితే వచ్చిన తర్వాత ఇద్దరు బాగానే ఉన్నప్పటికీ శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3గంటల సమయంలో భర్త యాదగిరి మల్లికాంబ నిద్రిస్తున్న సమయంలో పదునైన ఆయుధంతో ఆమెపై విచక్షణారహితంగా నరకడంతో ఆమే నిద్రిస్తున్న మంచంపైనే మరణించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి ప్రవీన్‌, ప్రశాంత్‌ కుమారులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు స్థానిక ఎసిపి మధుసూధన్‌, సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సంపత్‌లు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version