రేషన్ షాప్ ల తనిఖీలు – తహసిల్దార్ నాగరాజు.

నూగూరు వెంకటాపురం నేటి ధాత్రి :-
వెంకటాపురం మండల తాసిల్దార్ అంటి నాగరాజు ఆకస్మికంగా మండలంలోని అన్ని రేషన్ షాపులను తనిఖీ నిర్వహించారు రేషన్ షాప్ ల లో రేషన్ డీలర్లు ఉచితంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం సరిగా ఇవ్వాలని ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టవద్దని తూకం విషయంలో కార్డుదారులకు అన్యాయం జరగకూడదని రేషన్ షాప్ కు వచ్చిన ప్రతి ఒక్కరు మాస్కు ధరించి కనీస దూరం పాటించే విధంగా చూడాలని వీరు రేషన్ డీలర్లకు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఆర్ఐ వెంకటేశ్వర్లు అటెండర్ కుమార్ వి ఆర్ ఎ అరుణ పాల్గొన్నారు

*హోటల్ తెరిస్తే 5వేల జరిమానా*

శాయంపేట, నేటి ధాత్రి: లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండగా ఎవరైనా హోటల్ లు తెరిస్తే 5వేల జరిమానా విధిస్తామని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. శాయంపేట మండలంలో శుక్రవారం కొన్ని హోటల్లు తెరిచారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మండలంలోని హోటల్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కోవిండ్ -19 కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన దుకాణాలు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు చేపట్టాలని, మాస్కులు ధరించడం సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అనుసరించాలి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వివరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

దెబ్బకు దిగివచ్చిన మద్యం ధరలు

 

కనీస విచారణ చేపట్టనీ అధికారులు.

వెల్గటూర్ (నేటిధాత్రి):

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రముతో పాటు మండలంలోని అన్ని వైన్స్ షాపులలో మద్యం ధరలు దిగివచ్చాయ్. బుధవారం నుండి తెరుచుకున్న వైన్స్ షాపులు ప్రభుత్వ రేట్లను అధిగమించి వైన్స్ లోనే ఏకంగా బ్లాక్ దందాను మొదలు పెట్టి ప్రభుత్వం నియమించిన రేటు కంటే ఒక్కో మద్యం క్వార్టర్ సీసాపై 20 నుండి 30 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తూ మద్యం ప్రియులను నిలువు దోపిడీ చేశాయి. దీనిపై నేటిధాత్రితో సహా పలు దిన పత్రికలలో జోరుగా శీర్షికలు వచ్చాయి. దీనితో చేసేదేమీ లేక ప్రస్తుతం వైన్స్ యాజమాన్యాలు మద్యంను ప్రభుత్వ ధరలకే విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం వైన్స్ షాపులలో సామాన్యునికి జరిగిన నిలువు దోపిడిపై అన్ని పత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికి సంబంధిత అధికారులు ఇప్పటివరకు కనీస విచారణ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికంగా వసూలు చేసిన డబ్బులు ఎవరి జేబుల్లో జమయ్యాయి? అధికారుల జేబుల్లోనా లేక వైన్స్ యాజమాన్యం ఖాతాలోనా అనే అంశాలు బయట మెండుగా విన్పిస్తున్నాయి. వెల్గటూర్ వైన్స్ యజమానుల్లో ఒకరు నూతనంగా ఎన్నుకోబడిన స్థానిక ప్రజాప్రతినిధి అవ్వడముతోనే అధికారుల అండదండలతో యథేచ్ఛగా వైన్స్ లోనే బ్లాక్ దందా నడిపించారనీ పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు లాక్ డౌన్లో కూడా సామాన్యులను ఆదుకోకపోవడం విషయం సంగతి అటు ఉంచితే ఇలా సొంత వ్యాపారాల్లో సామాన్యులపై నిలువు దోపిడీ ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నది ఇలా నిలువు దోపిడీ చేసేందుకేనా అనే నినాదం ప్రజల్లో గట్టిగా విన్పిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారణ జరిపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

*మద్యం మత్తులో పామును కొరికిన వ్యక్తి అరెస్ట్..!*

*మద్యం మత్తులో పామును చంపి మెడలో వేసుకున్న కుమార్‌ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.*

*వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు.. ఇప్పుడు అరెస్ట్ చేశారు.*

*కర్ణాటకలోని ముగబాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో కుమార్‌ అనే వ్యక్తి ఫుల్లుగా తాగి బైక్‌లో వెళ్తుండగా.. పాము కనిపించింది.*

*తాగిన మైకంలో దాన్ని చేతుల్లోకి తీసుకున్న కుమార్.. పామును కొరికి చంపేశాడు. ఆ తరువాత మెడలో వేసుకున్నాడు*

*దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. కుమార్‌ను అరెస్ట్ చేశారు.*

పాలకుర్తి సర్పంచ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి

*జనగామ జిల్లా..పాలకుర్తి సర్పంచ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి*

*మరుగుదొడ్ల బాగోతంలో*
*కార్యదర్శిని సస్పెండ్ చేశారు*
*సర్పంచ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు*

*-సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తాం*

*-సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి రమేష్ రాజా*
——————————-

పాలకుర్తి:నేటిధాత్రి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి,అక్రమాలలో కలెక్టర్ కు పిర్యాదు లు అందిన నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నత అధికారులు 4 లక్షల రూపాయల మేరకు అవినీతి జరిగిందని తేల్చి కేవలం కార్యదర్శి మనోహర్ స్వామిపై మాత్రమే చర్యలు తీసుకున్నారని, సర్పంచ్ వి.యాకాంత రావుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా ప్రశ్నించారు.
మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్.బి.ఎం) అకౌంట్ కు సంబంధించి కార్యదర్శి, సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ కలిగి ఉన్నారని, అయితే నిధుల దుర్వినియోగంపై కేవలం కార్యదర్శిని మాత్రమే సస్పెన్షన్ చేశారని అన్నారు. జాయింట్ చెక్ పవర్ కలిగి ఉన్నందున ఇద్దరిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని, అలా కాకుండా సర్పంచ్ ను మినహాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం కావడం, మంత్రి గారి ముఖ్య అనుచరుడు కావడం వలనే సర్పంచ్ పై చర్యలు తీసుకోలేదని, అందుకు వారి సామాజిక వర్గం తోడైందని ప్రజల్లో కలుగుతున్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇద్దరిపై చర్యలు తీసుకోకుండా ఒక బీసీ ఉద్యోగిపైన వివక్ష పూరితంగా చర్యలు చేపట్టారని అన్నారు. అవినీతికి ఎవరు పాల్పడిన ఒకే రకమైన న్యాయం ఉండాలని, కార్యదర్శి పాలకుర్తిలో ఉన్నప్పుడు సస్పెన్షన్ చేయకుండా వేరే మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందించి,ఆ మరుక్షణ మే సస్పెన్షన్ చర్యలు తీసుకోవడంపై అంతర్యం ఏంటో తెలపాలని కోరారు. మరుగుదొడ్లలో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిని వదలకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తమ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు, రూరల్ డెవలప్మెంట్ సెంట్రల్ మినిస్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు రమేష్ రాజా తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి జీడి సోమయ్య తదితరులు ఉన్నారు.

అన్నిధానాల్లో అన్నదానం గొప్పది

వరంగల్ సిటి నేటిధాత్రి

అన్నిదానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.నన్నపునేని నరేందర్ అభిమాన సంఘం వ్యవస్థాపకులు బత్తుల కుమార్ ఆద్వర్యం 23వ డివిజన్ ఎస్.ఆర్.ఆర్ తోట లో లాక్ డౌన్ నేపద్యంలో 500 మంది పేదలకు మాంసాహారంతో కూడిన బోజనం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై మాట్లాడారు లాక్ డౌన్ సమయంలో పేదలకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు. పేదవారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పలు సేవలు అందిస్తున్నారని వారి మార్గనిర్దేశనంలో దాతలు ముందుకొచ్చి సేవ చేయడం అభినందనీయమని నిర్వహుకులను కొనియాడారు ఈ కార్యక్రమంలో రామ రమేష్,అందుగుల శ్రీనివాస్,కార్పోరేటర్ కత్తెరశాల వేణు గోపాల్,మాజీ కార్పోరేటర్ పల్లం రవి,వడ్నాల నరేందర్,కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్,కవిత,ఆశ,వగిలిశెట్టి అనీల్,బొల్లం రాజు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..

నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే…. డి సి పి

మల్కాజిగిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా),
8 మే (నేటిధాత్రి):

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రెడ్ జోన్
లో ఉన్నందున కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన డి సి పి రక్షిత మూర్తి,ఈ సందర్భంగా వ్యాపారులకు నిర్మాణ రంగ సంస్థ యజమానులకు లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరించారు, ఇంట్లో నుండి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని మాస్క్ లేకుండా ఎవరైనా బయట తిరిగితే 1000 రూపాయల జరిమానా విధిస్తాము అని అన్నారు, నిర్మాణ రంగ సంస్థ కు సంబంధించి వారి వద్ద ఉన్న కూలీల తోనే నిర్మాణం చేపట్టాలన్నారు బయటి ప్రాంతం కూలీల కు అనుమతి లేదన్నారు
ఐటీ రంగానికి సంబంధించి 33 శాతం ఉద్యోగస్తులు మాత్రమే విధులు నిర్వహించే విధంగా చూసుకోవాలన్నారు
ఉద్యోగస్తులకు వ్యక్తిగత వాహనాలు కాకుండా సంస్థ బస్సులు ఉపయోగించుకోవాలని కోరారు,సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్నందున వ్యాపారులు ఉద్యోగస్తులు సాయంత్రం 6 లోపు పనులు ముగించుకొని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి సూచించారు.

లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి

లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి

నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌

రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో లైసెన్సు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ అన్నారు. శుక్రవారం పోలీస్‌, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో చేపట్టి నకిలీ విత్తనాలు పట్టివేతకు సంబంధించిన అక్రమ వ్యాపారి అరెస్టు వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా కేశవపట్టణం మండలం చింతగుట్ట గ్రామానికి చెందిన కరివెద సదాశివరెడ్డి అనే అక్రమ వ్యాపారి ప్రభుత్వ లైసెన్సు, ఎలాంటి లేబుల్స్‌ లేకుండా 22 క్వింటాళ్ల నకిలీ మొక్కజొన్న విత్తనాలను రైతులకు విక్రయిస్తుండగా నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌ చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీల్లో భాగంగా పట్టుకున్నామని తెలిపారు. వెంటనే పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా నిందితుడిని గ్రామంలో మరో 65క్వింటాలు మొత్తం 146 బ్యాగులల్లో 87క్వింటాలు, 17లక్షల 40వేలు విలువ ఉంటుందని నకిలీ మొక్కజొన్నలను స్వాధీనపరచుకుని విత్తన చట్టం కింద కేసు నమోదుచేసి నిందితుడు సదాశివరెడ్డితోపాటు మరో నిందితుడు కొయ్యడ రాజులను అరెస్టుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ సునీత మోహన్‌ తెలిపారు. చాకచక్యంగా ఛేదించి నకిలీ విత్తనాలను పట్టుకున్న సిఐ దేవేందర్‌రెడ్డి, ఏడీఏ శ్రీనివాస్‌రావులను ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో నర్సంపేట టౌన్‌ సీఐ దేవెందర్‌రెడ్డి, నర్సంపేట వ్యవసాయశాఖ సంచాలకులు శ్రీనివాసరావు, ఏవో కష్ణకుమార్‌, ఎస్సై నాగ్‌నాథ్‌లు పాల్గొన్నారు.

‘బోరా’ సాబ్‌ కబ్జా కహాని

‘బోరా’ సాబ్‌ కబ్జా కహాని

రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడిన కుటుంబం రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ భారీగానే వెనకేసుకున్నారు. వ్యాపారాలు చేసి అలసిపోయారో ఏమో తెలియదు. కానీ ఇంకా సంపాదించాలంటే రియల్‌ఎస్టేట్‌ రంగం సరైన వేదిక అనుకున్నారు ఆ రంగంలోకి అడుగుపెట్టారు. వ్యాపారాలు చేసుకోవడం తప్పులేదు, రియల్‌ఎస్టేట్‌ కూడా తప్ప కాదు. కానీ వచ్చిన చిక్కల్లా కబ్జాలు చేయడమే. ఆ కబ్జా భూముల్లో అక్రమ వెంచర్లు వేసి అప్పనంగా దండుకుందామనుకోవడమే సరిగ్గా ఇదే జరుగుతుంది. గీసుగొండ మండలంలోని గొర్రెకుంట, ధర్మారం మధ్యలో రాజస్థానీ అయినా జెపి బోరా అనే వ్యక్తి ఈ కబ్జాకు తెరలేపాడు. ఊరచెరువు శిఖం భూమిని, ప్రభుత్వ భూమిని, గొర్రెకుంట ప్రాంతానికి చెందిన దళితుల భూమిని కబ్జా చేసి అక్రమ వెంచర్‌కు శ్రీకారం చుట్టాడు. ఇది తప్ప కదా అని ‘నేటిధాత్రి’ ప్రశ్నిస్తే మీకు ఫిర్యాదు చేసిన వారిని కేసు వేసుకోమనండి అంటూ తలబిరుసు సమాధానం చెప్తున్నాడు. స్థానికంగా కొంతమంది యువకులను చేరదీసి డబ్బు ఆశచూపి తన చుట్టూ తిప్పుకుంటూ ఇప్పటికే కోట్ల రూపాయలు వెనకేసాడని జెపి బోరాపై ఆరోపణలు ఉన్నాయి.

( జెపి బోరా కబ్జా కహానిపై సమగ్ర కథనం త్వరలో…)

నకిలీ విత్తనాలు స్వాధీనం

50క్వింటాల నకిలీ మొక్కజొన్న విత్తనాలు స్వాధీనం

నర్సంపేట డివిజన్‌లో మళ్లీ నకిలీ విత్తనాలను కొందరు అక్రమ వ్యాపారులు రైతులకు అంటకడదామని పనిలో పడ్డారు. అక్రమ వ్యాపారాన్ని పసిగట్టిన పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు వెంటనే రైతుల శ్రేయస్సు కోసం వారి నిజాయితీని నిరూపించుకున్నారు. పోలీస్‌, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్‌ను చాకచక్యంగా ఛేదించారు. మూడుగంటల వ్యవధిలోనే ఇతర జిల్లాకు వెళ్లి అక్రమ దందా గట్టురట్టు చేశారు. నర్సంపేట అర్బన్‌ సిఐ కొత్త దేవేందర్‌రెడ్డి, నర్సంపేట వ్యవసాయ శాఖ సంచాలకులు శ్రీనివాస్‌రావులు తెలిపిన కథనం ప్రకారం…కొత్తగూడెం మండలం ఓటాయి గ్రామానికి చెందిన కొందరు రైతులు శుక్రవారం మధ్యాహ్నం నర్సంపేటలో మొక్కజొన్న విత్తనాలను బస్తాలలో తీసుకువెళుతుండగా వెంటనే అనుమానంతో పరిశీలన చేయగా ప్రభుత్వ గుర్తింపు పొందని నకిలీ మొక్కజొన్న విత్తనాలుగా ఉన్నట్లు గుర్తించామన్నారు. కొనుగోలు చేసిన రైతులతో వివరాలను అడిగి తెలుసుకొని విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వెంటనే పోలీస్‌, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో కరీంనగర్‌ జిల్లా కేశవ పట్టణం మండలం చింతగుట్ట గ్రామంలో సదాశివరెడ్డి అనే వ్యక్తి ఆడా, మగా హైబ్రీడ్‌ మొక్కజొన్న విత్తనాల ఆర్గనైజింగ్‌ చేస్తున్నాడు. గోదాం వద్ద తనిఖీలు నిర్వహించగా ప్రభుత్వ గుర్తింపు పొందని 50క్వింటాల నకిలీ మొక్కజొన్న విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విత్తనాల స్వాధీనం అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు నర్సంపేట టౌన్‌ సిఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు.

ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం

ఈటెల పేషిలో…అవినీతి ‘ప్రసాద’ం-1

ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల పేషిలో అవినీతి, నకిలీ ప్రసాదం హల్‌చల్‌ చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి మంత్రి ఈటెలకు ఇద్దరు ఓఎస్డీలను కేటాయించినా ఈ అనధికార, నకిలీ ఓఎస్డీ వైద్య, ఆరోగ్య శాఖలో తిష్టవేసి కూర్చున్నాడు. అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు మంత్రి ఈటెల రాజేందర్‌ సైతం ఈ అనధికార ఓఎస్డీకే అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ సీఎం తనకు కేటాయించిన ఓఎస్డీలను పక్కన పెడుతున్నట్లు కనబడుతోంది. గురుకులాల్లో సీట్లు కావాలని, ప్రైవేట్‌ పాఠశాలల్లో సీట్లు కావాలని, వైద్యం చేయించాలని, సింగరేణిలో క్వార్టర్‌ కేటాయించాలని ఇలా ఒకటి కాదు, రెండు కాదు వందలాది ఉత్తరాలు ఓఎస్డీనంటూ సంతకం చేస్తూ మరి పంపాడు. అంతేకాదు అనధికార, నకిలీ ఓఎస్డీనని ఏ మాత్రం సోయి లేకుండా సాధారణ పరిపాలన శాఖ (ఓఎస్డీ)కి సైతం లెటర్‌లు పంపడం కావల్సిన ప్రపోజల్స్‌, అలవెన్సులు, వేతనం తదితర అంశాలన్నింటిని తెలుపుతూ ఓఎస్డీ హోదాలో లెటర్లు పంపాడంటే ఇతగాడి ధైర్యాన్ని, ఆరోగ్య మంత్రి ఇస్తున్న ప్రోత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతగాడు ఎవరో కాదు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయంలో సరసాదేవి కుంభకోణంలో ఎ2గా ఉన్న జక్కని ప్రసాద్‌. సమైక్య రాష్ట్రంలో కోట్ల కుంభకోణానికి కారకుడైన ప్రసాద్‌ను ఆహ్వానించి, ఆదరించి అనధికార ఓఎస్డీగా ఈటెల పేషిలో కొనసాగిస్తున్నారంటే దీనివెనకాల ఉన్న బలమైన కారణాలేంటో ఇప్పటికీ బేతాళ ప్రశ్నగానే మిగిలిపోతున్నాయి. ఈటెల రాజేందర్‌ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి పేషిలో తన పెత్తనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఈ నకిలీ ఓఎస్డీ ప్రసాద్‌ చేతివాటం చూపడంలో సిద్ధహస్తుడనే ఆరోపణలు ఉన్నాయి. ఈటెల పేషిలో సైతం ఇదే చేతివాటాన్ని చూపుతూ కన్సల్టెంట్‌గా చేరి ఓఎస్డీగా చెలామణి విడ్డూరంగా కనపడుతోంది.

ఆర్టీసీని తప్పుదారి పట్టించాడు..

టిఎస్‌ ఆర్టీసిలో ఉచితంగా ప్రయాణం చేయడానికి నకిలీ ఓఎస్డీ జక్కన ప్రసాద్‌ ఏకంగా బస్‌భవన్‌కు ఓ లేఖ పంపాడు. లేఖ పంపడం బాగానే ఉన్న తాను ఓఎస్డీనని ఆర్థికశాఖ మంత్రి ఈటెల వద్ద పనిచేస్తున్నానని కాంప్లీమెంటరీ పాస్‌ సంపాదించాడు. నిజానికి ఇతను ఓఎస్డీ కాదు ఈటెల ఆర్థిక మంత్రి కాదు. కానీ ఆర్టీసి అధికారులు సైతం చూసిచూడనట్లే చూసి ఓఎస్డీ ఆర్థికశాఖ అంటూ కాంప్లీమెంటరీ పాస్‌ జారీ చేశారు. అంతేకాదు ఈ నకిలీ ఓఎస్డీ పిఎలు కానివారికి సైతం ఈటెల వద్ద పనిచేసే డ్రైవర్లకు, ఇతరులకు అసెంబ్లీ పాస్‌లు ఇతర రాయితీలను ఓఎస్డీనంటూ లెటర్‌లు పంపి సాధించిపెడతాడు. ఇవన్నీ చూస్తుంటే ఇతగాడు ఎంతటి అసాద్యుడో ఈటెల పేషిలో ఏ మేరకు తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నాడో అర్థమైపోతుంది.

మంత్రి ఈటెలకు తెలిసే జరుగుతుందా…?

రోజు వందలకొద్ది లెటర్లు, వివిధ శాఖలకు రిఫరెన్స్‌లు పెడుతూ జక్కని ప్రసాద్‌ అనధికార ఓఎస్డీగా ఎలా కొనసాగుతున్నాడు. మధ్యాహ్నం 12గంటలకు పేషిలోకి వచ్చి 4గంటలకు వెళ్లిపోయే నకిలీ ఓఎస్డీ లక్షల్లో వేతనం దండుకుంటుండడం సాధారణ పరిపాలన శాఖనే తప్పుదారి పట్టిస్తూ తాను ఓఎస్డీనంటూ ఫోజులు కొడుతుండటం తెలంగాణ సచివాలయంలో చర్చకు దారితీస్తోంది. అయితే ఇదంతా మంత్రి ఈటెల రాజేందర్‌కు తెలియకుండానే జరుగుతుందా…? అనుకుంటే అలా కానే కాదు…తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, ప్రసాద్‌ జీతభత్యాల విషయంలో ఇతరత్రా సమస్యలపరంగా ఓఎస్డీనంటూ ఇప్పటివరకు వందలకొద్ది లేఖలు పంపాడు. ఈ నకిలీ ఓఎస్డీ ఇంత జరుగుతున్న ఈటెలకు తెలియకుండా ఎలా ఉంటుంది. ఏకంగా మంత్రి పేషిలోనే కన్సల్టెంట్‌గా చేరి ఓ వ్యక్తి ఓఎస్డీనంటూ అనుమతి లేకుండా ఎలా విధులు నిర్వహిస్తాడు అలా సాధ్యం కానే కాదు. అయితే ప్రభుత్వం నియమించకుండా, ఎలాంటి ఉత్తర్వులు లేకుండా జక్కన ప్రసాద్‌ అనధికార ఓఎస్డీగా కొనసాగుతున్నడంటే మంత్రి చొరవతోనే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ సీఎం ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు ఓఎస్డీలు ఉండగా జక్కని ప్రసాద్‌ను ఈటెల అనధికార ఓఎస్డీగా ఎందుకు కొనసాగిస్తున్నాడనేదే ప్రశ్న. కొద్ది నెలలుగా ఈ ప్రశ్న మంత్రి పేషిలోని ఉద్యోగులందరినీ వేదిస్తున్నా సమాధానం మాత్రం దొరకడం లేదు. ఓఎస్డీ కాకున్న ఓఎస్డీనంటూ విధులు నిర్వహిస్తున్న జక్కని ప్రసాద్‌ను ఇదేంటని సాధారణ పరిపాలన శాఖ (జిఎడి), అధికారులు సైతం ప్రశ్నించలేదంటే ప్రసాద్‌ మహత్యం అలాంటిదన్న మాట.

కథనాలు నన్నేం చేస్తాయి…?

నకిలీ ఓఎస్డీగా చెలామణి అవుతూ మంత్రి ఈటెల పేషిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జక్కని ప్రసాద్‌ ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ ఓఎస్డీ బండారం బయటపడబోతుందని తెలియగానే ‘నేటిధాత్రి’ కథనం తననేం చేయదని కోట్ల కుంభకోణంలోనే తనను ఏం చేయలేకపోయారని…ఇదేంత…? అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడట. తన అనుభవంలో ఎన్నో చేశానని ఈ కథనాలు తనకో లెక్క కాదని అంటున్నాడట.

ప్రసాదాన్ని కాపాడుతున్నదెవరూ…?

ఈటెల పేషిలో ఎలా పాతుకుపోయాడు…?

సీఎం ఆదేశాలు ఎందుకు బేఖాతరు అవుతున్నాయి…?

(రేపటి సంచికలో…)

అంతా డస్ట్‌తోనే పని…

ఇసుక లేకుండా అంతా డస్ట్‌తోనే పని…

నర్సంపేట పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి మున్సిపల్‌ శాఖ నుండి కోట్లాది రూపాయలు వెచ్చించి పనులను ప్రారంభించారు. అభివద్ధిలో భాగంగా ముందుగా ప్రధాన రహదారుల మధ్య 5కిలోమీటర్ల మేరకు రోడ్డు డివైడర్‌ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుండి మల్లంపల్లి రోడ్డు, అమరవీరుల స్థూపం వద్ద నుండి వరంగల్‌ వైపు రోడ్డుకు పనులు చేశారు. అలాగే పాకాల సెంటర్‌ నుండి మహబూబాబాద్‌ రోడ్డు వైపునకు కూడా పనులు ప్రారంభం చేశారు. మహబూబబాద్‌ వైపు వెళ్లే రోడ్డుకు డివైడర్‌ పనుల్లో నాసిరకంగా పనులు నిర్వహిస్తున్నారు. లోన లొటారం…పైన పటారం అన్న చందంగా డివైడర్‌ పనుల రౌతు గోడలను, ఇసుక సిమెంట్‌తో కడుతూ కాంక్రీట్‌ పనులను మాత్రం కంకర డస్ట్‌తో పనులను నిర్వహిస్తున్నారు. ప్లాంట్‌లో తీసుకుంటాడు వరంగల్‌ రూరల్‌ జిల్లాలో నర్సంపేటను స్మార్ట్‌ సిటీగా చేయడానికి స్థానిక శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి గత పాలనలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివద్ధి పనులను ప్రారంభించారు. కానీ సదరు కాంట్రాక్టర్‌ సంపాదనే ద్యేయంగా నాసిరకంగా పనులు చేపడుతున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. గురువారం నర్సంపేట పట్టణానికి చెందిన కొందరు ప్రజలు ‘నేటిధాత్రి’ ప్రతినిధితో తెలుపగా నిర్మాణ పనులను పరిశీలన చేయగా నాసిరకంగా పనులు చేస్తున్నారని తేలిపోయింది. 20ఎంఎం కంకరకు బదులుగా 40ఎంఎం కంకరను వాడుతున్నారు. ఇసుక, కంకర, సిమెంట్‌తో చేయాల్సిన కాంక్రీట్‌ పనులను ఇసుకకు బదులుగా కంకర డస్ట్‌ వాడుతున్నట్లు, పని నిర్వహించే సూపర్‌వైజర్‌ ధనుంజయ అలాగే కార్మికులు తెలిపారు. డస్ట్‌ వాడకూడదు కదా అని అడగగా సంబంధిత శాఖ, అలాగే కాంట్రాక్టర్లు ఇసుకకు బదులుగా డస్ట్‌ను మాత్రమే వాడాలని చెప్పినట్లు వారు వివరించారు. నిర్మాణ పనుల వద్ద నుండి మున్సిపల్‌ ఏఈ సతీష్‌కు ఫోన్‌లో మాట్లాడగా వెంటనే స్పందించిన ఆయన నిర్మాణ పనుల వద్దకు వచ్చి పరిశీలించారు. నాసిరకంగా రోడ్డు డివైడర్‌ పనులను నిర్వహిస్తున్నారని పరిశీలనలో తేలిపోయింది. పనుల్లో ఇసుకను మాత్రమే వాడాలని, కంకర డస్ట్‌ వాడితే డివైడర్లను కూల్చివేస్తామని హెచ్చరించారు.

‘లేఖ’లో…ఏముంది…?

‘లేఖ’లో…ఏముంది…?

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతి జరిగిందని, అవినీతికి డిఐఈవో లింగయ్య పూర్తి బాధ్యత వహించాలని, విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిని వెంటన సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వరంగల్‌ అర్బన్‌జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి ‘గుమ్మడికాయ దొంగ ఎవరంటే..భుజాలు తడుముకున్న’ చందంగా ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య తాము ఏ తప్పు చేయలేదు..తామంతా సత్యహరిశ్చంద్రులమంటూ, తమపై తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తున్నారు, తప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయి,తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని ‘నేటిధాత్రి’ తమపై పనిగట్టుకొని వార్తలను రాస్తున్నారని, వాటిని నమ్మొద్దనే విదంగా డిఐఈవో లింగయ్య ఓ వినతిపత్రాన్ని కలెక్టర్‌కు ఇచ్చారని విశ్వసనీయసమాచారం.

తాము తప్పే చేయలేదని కలెక్టర్‌కు వినతి

నవ్విపోదురు గాక ‘నాకేమి సిగ్గు’ అన్నట్లుగా..డిఐఈవో కార్యాలయంలో అవినీతికి ఆజ్యంపోసి, లక్షల రూపాయాల ప్రభుత్వ సొమ్మును అక్రమంగా దొంగపేర్లతో నొక్కేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ తాము సత్యహరిశ్చంద్రులమంటు తమకు తామే సర్టిఫికెట్‌ పుచ్చుకొని అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించుకున్న విషయం బయటికి పొక్కడంతో ఆయన అబద్దాల ఆటలను, మాయలగారడీని, లింగయ్య వ్యవహరించిన తీరుపై విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

డిఐఈవోను వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశం..?

తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారని కలెక్టర్‌కు డిఐఈవో లింగయ్య ఇచ్చిన వినతిపత్రానికి కలెక్టర్‌ స్పందిస్తూ ఏ విషయంలో, ఎవరు తప్పుడు వార్తలు రాశారు, ఏమి రాశారు, ఎందుకు రాశారు, ఏ అంశాలపై రాశారు వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ డిఐఈవో లింగయ్యను ఆదేశించినట్లు సమాచారం.

నేటికి స్పందించని డిఐఈవో లింగయ్య

డిఐఈవో లింగయ్య కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంపై వివరణ ఇవ్వాలని డిఐఈవోను కలెక్టర్‌ ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం పట్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొన్నది. వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ కోరి వారంరోజులు అవుతున్నా నేటి వరకు డిఐఈవో లింగయ్య ఎందుకు వివరణ ఇవ్వలేకపోయాడో అంతుచిక్కని వాతావరణం నెలకొన్నది. ఆయన తప్పే చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే ఇప్పటి వరకు ఎందుకు వివరణ ఇవ్వలేదో అంతుచిక్కడంలేదు. అవినీతికి పాల్పడింది నిజమే అయినందున వివరణ ఇవ్వలేకపోతున్నాడా? వివరణ ఇస్తే ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని వెనకడుగువేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి

– సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

వరంగల్‌ ట్రైసిటి పరిధిలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ సూచించారు. వరంగల్‌ పోలీస్‌ అధ్యక్షతన నగరంలో ట్రాఫిక్‌ అభివద్దికోసం తీసుకోవాల్సిన చర్యలపై గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌, ఆర్‌ అండ్‌ బి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం రాత్రి పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించారు. వరంగల్‌ ఆర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రవికిరణ్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషన్‌ పరిధిలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలను ఆరికట్టడం కోసం తీసుకోవాల్సిన అంశాలపై వరంగల్‌ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ విభాగం చేసిన సూచనలపై పోలీస్‌ కమిషనర్‌, కలెక్టర్‌, గ్రేటర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి గుర్తించిన ట్రాఫిక్‌ సమస్యలపై ట్రాఫిక్‌ ఎసిపి మజీద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సందర్బంగా ప్రస్తుతం 12 ట్రాఫిక్‌ జంక్షన్లల్లో ఉన్న సిగ్నల్స్‌తోపాటు, మరో అదనంగా 13 జంక్షన్లలో సిగ్నల్స్‌ ఏర్పాటుకు కావల్సిన నిధులపై జిడబ్ల్యూఎంసి అధికారులు పోలీస్‌ అధికారులతో కలసి తగు ప్రణాళికను రూపొందించాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు. నగరంలో సిగ్నల్స్‌ మరమత్తులు, ముఖ్యమైన రోడ్డుమార్గాల్లో డివైడర్ల ఏర్పాటు, జంక్షన్లలో ఐలాండ్‌ మార్పులపై అధికారులకు వివరించారు. అవసరమైన ముఖ్యకూడళ్లల్లో రోడ్డు వెడల్పు, నగరంలో ముఖ్య సూచికబోర్డుల ఏర్పాటుతోపాటు, ముఖ్యమైన ప్రాంతాల్లో విఎంఎస్‌ సైన్‌బోర్డుల ఏర్పాటు చేయడంపై అధికారులను ఆదేశించారు. ట్రైసిటి పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వాహనదారులకు కనిపించే విధంగా వేగం పరిమితి బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారుల దష్టికి తీసురావడంతోపాటు, అన్ని ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద స్టాప్‌లైన్స్‌తోపాటు జీబ్రా లైన్స్‌ రూపొందించాల్సిన అవసరం ఉందని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతోపాటు, కొత్త ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వరంగల్‌ నగరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో పోలీస్‌ అధికారులతోపాటు, మనపై కూడా ఉందని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ కమిబద్దీకరణ కోసం ట్రాఫిక్‌ పోలీసుల సూచనలపై ఎప్పటికప్పుడు స్పందించాల్సి ఉంటుందని, ఇందుకోసం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనరేట్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగానికి నోడల్‌ అధికారిని నియమిస్తామని చెప్పారు. ఈ నోడల్‌ అధికారి ద్వారా ట్రాఫిక్‌ పోలీసులు సూచించే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు, జిడబ్ల్యూఎంసి, ఆర్‌ అండ్‌ బి, నేషనల్‌ హైవే అధికారులు పాల్గోన్నారు.

ప్రొఫెసర్‌ సార్‌ కబ్జాపురాణం

ప్రొఫెసర్‌ సార్‌ కబ్జాపురాణం

ఆయన పిల్లలకు విద్యాబుద్దులు నేర్పే రిటైర్డు అయిన ప్రొఫెసర్‌. సమాజంలో బాద్యతాయుతమైన, గౌరప్రదమైన స్థానం కలిగినవాడు. చెడుమార్గంలో వెళుతున్న వారిని సరిదిద్ది సక్రమార్గంలో పంపించాల్సిన వాడు. కానీ ఇన్ని సంవత్సరాల ప్రొఫెసర్‌గిరి, అనుభవాన్ని, చదువు, తెలివితేటల సారానంతటిని రంగరించి కబ్జా పురాణానికి తెరలు తీశాడట. పదవివిరమణ జరిగాక చేతినిండా ఏదో పని ఉండాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన ఇంటి పక్కనే ఉన్న స్థలంలో పాగావేసి కబ్జా పురాణాన్ని మహాజోరుగా నడిపిస్తున్నాడట. ఇంటి పక్కనే ఖాళీ జాగ కనపడటంతో తన ప్రొఫెసర్‌ తెలివినంతటిని ఉపయోగించి ఉన్న స్థలానికి ఖాళీ స్థలాన్ని జోడిస్తే విశాలమైన జాగ సొంతం అవుతుందని ఆలోచిస్తున్నాడట. దీంతో ఖాళీస్థలం యజమాని లబోదిబోమంటున్నారు. ప్రొఫెసర్‌ సార్‌ కబ్జా బుద్దితో తాము చుక్కలు చూస్తున్నామని, ఈ స్థలం నీది కాదు…మొర్రో అన్న ఎంత మాత్రం వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి సమీపంలోని ఎక్సైజ్‌కాలనీలో సర్వే నెంబర్‌ 298/1లో కోటిచింతల కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి 2018 నవంబర్‌ నెలలో నల్లా ఇమ్మాన్యువల్‌ అనే అతని వద్ద నుండి 346గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. కొనుగోలు చేయగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. భూమిని కొనుగోలు చేసిన నంబరులో భూమి వద్దకు వెళ్లి పనులు చేయించడానికి ఉపక్రమించాడు. అంత రిటైర్డు ప్రొఫెసర్‌ రూపంలో ఓ అడ్డుపుల్ల తగిలింది. ఈ భూమి తనదంటూ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ పనిచేసి పదవివిరమణ పొందిన కె.కొండల్‌రెడ్డి నోటరీ పేపర్‌తో ఈ స్థలాన్ని తాను ఎప్పుడో కొనుగోలు చేశానని స్థలాన్ని కొనుగోలు చేసిన కిరణ్‌కుమార్‌ను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు బాధితుడికి అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. దీంతోనయిన పని అవుతుందనుకుంటే అదీ కాలేదు. కిరణ్‌కుమార్‌ను సవాల్‌చేస్తూ కొండల్‌రెడ్డి కోర్టుకెక్కాడు. కోర్టు అక్కడ కూడా బాధితుడికే అనుకూలంగా తీర్పు చెప్పింది. ప్రొఫెసర్‌ తీరును తప్పుపట్టించి అయిన ప్రొఫెసర్‌ సార్‌ తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. నయానో, భయానో బాధితుడిని తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. పైరవీకారులు ప్రజాసంఘాల నాయకులు, పార్టీ నాయకుల పేరుతో తిరిగేవారితో సెటిల్‌మెంట్‌కు దిగాడు. అయిన బాధితుడు ససేమిరా అన్నాడు. దీంతో ప్రొఫెసర్‌ సార్‌ కొంతమంది సెటిల్‌మెంట్‌ రాయిళ్ల సూచనలతో అది 298/1 సర్వే నెంబర్‌కాదని 294 సర్వే నెంబర్‌ అని కొత్త పల్లవి అందుకున్నాడు. పక్కా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌తో 298/1 సర్వేనెంబర్‌లో పక్కా గృహాన్ని నిర్మించుకున్న ప్రొఫెసర్‌ సాబ్‌ తన ప్రహారీగోడ పక్కస్థలాన్ని 294 సర్వే నెంబర్‌ అంటూ కొత్త పల్లవి అందుకోవడంలోనే పక్కా కబ్జా బుద్ది బయటపడుతుందని బాధితుడు అంటున్నాడు. 298/1 సర్వే నెంబర్‌ ప్రొఫెసర్‌కు అతని స్థలాన్ని సంబంధించిన స్తలం డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని, తన స్థలం కూడా అదే సర్వే నెంబర్‌ కావడంతో ఇది నాది అంటున్నా ప్రొఫెసర్‌ను అప్పుడే రిజిస్ట్రేషన్‌ ఎందుకు చేయించుకోలేదు…? ఇంటి స్థలం కాగితాలు పక్కాగా ఉండి..ఖాళీస్తలం కాగితాలు లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తారని కేవలం నోటరితో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నాటకం ఆడుతున్నాడని బాదితుడు కిరణ్‌కుమార్‌ ఆరోపించాడు. తన స్థలాన్ని అప్పనంగా స్వాధీనం చేసుకోవడానికే రిటైర్డు ప్రొఫెసర్‌ నోటరీతో తనను ఇబ్బందులు పాలుచేస్తున్నాడని కోర్టు తనకు అనుకూల తీర్పు చెప్పిన, సర్వేయర్‌ 298/1 సర్వేనెంబర్‌ భూమి ఇదేనని తేల్చిన వినడం లేదని అన్నాడు.

పట్టింపులేని తహశీల్దార్‌…?

298/1 సర్వేనెంబర్‌లో 346గజాల స్థల విషయంలో ఇంత వివాదం నడుస్తున్న హన్మకొండ తహశీల్దార్‌ మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. సర్వే నెంబర్‌ విషయంలో ప్రొఫెసర్‌ కొండల్‌రెడ్డి కిరికిరి పెడుతుండగా సర్వేయర్‌ అది 298/1 సర్వే నెంబర్‌ అని తేల్చిన చర్యలు తీసుకోవడంలో తహశీల్దార్‌ వెనుకాడుతున్నట్లు సమాచారం. పంచనామా నిర్వహించాలని కోరిన ప్రొఫెసర్‌ సహకరించడం లేదనే సాకుతో నెలలు గడుస్తున్న తహశీల్దార్‌ కనీసం స్పందించడం లేదట. తహశీల్దార్‌ ప్రొఫెసర్‌తో కుమ్మక్కై బాదితుడు ప్రశ్నిస్తున్నప్పుడల్లా పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. తహశీల్దార్‌ పంచనామా నిర్వహించి నివేదిక సమర్పిస్తే స్థల వివాదం ముగుస్తుంది. కానీ తహశీల్దార్‌ అందుకు ఎంతమాత్రం పూనుకోవడం లేదని బాధితుడు కిరణ్‌కుమార్‌ అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఉన్న తగదాను పరిష్కరించి, అది గొడవలకు దారితీయకుండా ఉండేందుకు పంచనామా నిర్వహించాలని స్థానిక పోలీస్‌ అధికారి తహశీల్దార్‌ను కోరిన నిర్లక్ష్యధోరణి తప్ప తహశీల్దార్‌ సమస్య పరిష్కారం చేసేందుకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రొఫెసర్‌ కొండల్‌రెడ్డి పక్షాన ఉండేందుకు అతను యత్నిస్తున్నట్లు సమాచారం. ఇకనైన తహశీల్దార్‌ పంచనామా నిర్వహించి తమకు న్యాయం చేయాలని, ప్రొఫెసర్‌ పంచనామాకు సహకరించడం లేదనే సాకులు చెప్పవద్దని బాధితుడు కిరణ్‌కుమార్‌ కోరుతున్నాడు.

లోటస్‌ కాలనీలో మరో ఇద్దరు ప్రొఫెసర్ల భూబాగోతం

త్వరలో…

జర్నలిస్టుల అక్రిడేషన్ల దరఖాస్తు గడుపు పొడిగించాలి

జర్నలిస్టుల అక్రిడేషన్ల దరఖాస్తు గడుపు పొడిగించాలి

టియుడబ్ల్యుజె (ఐజెయు) డిమాండ్‌

ఈనెల 30వ తేదితో ముగియనున్న జర్నలిస్టుల అక్రిడేషన్‌ కార్డులు, బస్‌పాసుల గడుపును మరో ఆరు నెలల వరకు పొడిగించాలని టియుడబ్ల్యుజె ( ఐజెయు) వరంగల్‌ ఉమ్మడి జిల్లా కమిటీ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కంకణాల సంతోష్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న జర్నలిస్టుల హక్కులు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరించివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసిఆర్‌ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్‌ కార్డులు ఇస్తామని అనేక సందర్బాలలో ఇచ్చాన హమీలను విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తే నిరాశే ఎదురవుతుందని అన్నారు. సిఎం కేసిఆర్‌ కొత్త నిబందనలు సృష్టించి పత్రికలను, ఛానెల్స్‌లను ఎబిసిడి లుగా వర్గీకరించి జర్నలిస్టులకు అక్రిడేషన్లు అందరికీ అందని ద్రాక్షలగా చేస్తున్నారని అన్నారు. అన్‌లైన్‌ అక్రిడేషన్ల ప్రక్రియ ముగిసినందున ఐ అండ్‌ పిఆర్‌ శాఖ వెబ్‌సైట్‌ గత రెండు రోజులుగా సాంకేతిక కారణాలతో వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదని దీంతో అనేక మంది జర్నలిస్టులు అక్రిడేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోలేకపోయారని తెలిపారు. వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని విరమించుకోవాలని, పాత పద్దతిలోనే దరకాస్తు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ఉన్న అక్రిడేషన్స్‌, బస్‌పాసులను మరో ఆరు నెలలు పొడిగించాలని డిమాండ్‌ చేశారు.

లింగయ్యా..ఉల్లంఘనేందయ్యా…?

లింగయ్యా..ఉల్లంఘనేందయ్యా…?

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో అమర్చిన సీసీ కెమెరాలను మార్చి నుండి ఏఫ్రిల్‌ వరకు ఎందుకు బందు చేశారో నేటి వరకు ఆ విషయంపై ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య వివరణ ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలను బందు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది! ఏదేని అవినీతికి పాల్పడాలనుకున్నప్పుడు ఆ కెమెరాలు అడ్డొచ్చాయా? పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో జరిగిన అవినీతికి సంబందించిన బిల్లులు చేసేటప్పుడు కాని, డబ్బులు పంచుకునేటప్పుడు కాని కెమెరాలల్లో దొరికి పోతామనుకున్నారా? ఇంటర్‌ బోర్డు కమీషనర్‌ అనుమతి లేకున్నా డిఐఆవో లింగయ్య ప్రైవేటుగా తన వ్యక్తిగతంగా పెట్టుకున్న నైట్‌వాచ్‌మెన్‌ బండారం బయటపడుతుందని బంద్‌చేశారా? డిఐఈవోను ఎవరైనా ప్రైవేటుగా కలువడానికి వస్తున్న వ్యక్తులు కెమెరాల్లో రికార్డు కావొద్దన్న ఉద్దేశ్యంతో బంద్‌ చేశారా?.. అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు….! ఏ ఉద్దేశ్యంతో బంద్‌ చేశారో నేటికి చర్చనీయాంశంగానే సీసీ కెమెరాల బంద్‌ విషయం సస్పెన్స్‌గా మిగిలిపోయింది.

-ఆర్టీఐ చట్టమంటే అంత చులకనా…?

కార్యాలయంలో సీసీ కెమెరాలు నెలరోజులకుపైగా ఎందుకు బంద్‌ చేయాల్సి వచ్చిందో వివరణ కావాలని సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్యకు ధరఖాస్తు ద్వారా కోరి 30రోజులు దాటుతున్నా నేటి వరకు సమాచారం ఇవ్వలేదు. ఆర్టీఐ చట్టం ప్రకారం ఏదేని ప్రభుత్వ కార్యాలయంలో సమాచారం కొరకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు ఇస్తే, సమాచార అధికారి క్లాస్‌ (6) ప్రకారం 30రోజుల్లో సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ చట్టం చెబుతున్నది. సీసీ కెమరాలను ఎందుకు బంద్‌ చేశారో సమాచారం కావాలని ఆర్టీఐ ద్వారా కార్యాలయంలో కోరి 30రోజులు దాటుతున్నా నేటివరకు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. డిఐఈవోకు ఆర్టీఐ చట్టమంటే గౌరవం లేదా? సమాచారం ఇస్తే తమ బండారం బయటపడుతుందని ఇవ్వటం లేదా? అన్న ప్రశ్న దరఖాస్తు దారుడిని వేదిస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా స్పందించి సమాచారం ఇవ్వాలని లేని యెడల సమాచార హక్కు చట్టం కమీషనరేట్‌కు ఫిర్యాదు చేస్తానని అంటున్నారు.

 పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

చిన్నారి శ్రీహితపై అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్‌ చేస్తూ చిన్నారి బంధువులు, మహిళలు, వివిధ సంఘాల కార్యకర్తలు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఆందోళనతో హన్మకొండ పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. హన్మకొండ చౌరస్తా ప్రాంతం నుంచి పబ్లిక్‌గార్డెన్‌ వరకు ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించే ప్రయత్నం చేయగా హన్మకొండలోని దాదాపు అన్ని ప్రాంతాలు వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని తమకు అప్పగిస్తే తామే బహిరంగంగా శిక్షిస్తామని కొంతమంది మహిళా సంఘం నాయకులు పోలీసులను డిమాండ్‌ చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా చిన్నారి మృతదేహాన్ని చేతులతో ఎత్తుకుని పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నా చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులను చూసి పలువురు కంట తడిపెట్టారు. తొమ్మిదినెలల చిన్నారిని చిదిమేయడానికి మనసేలా వచ్చిందంటూ కొందరు నిందితుడిని శాపనార్థాలు పెట్టారు.

పసిమొగ్గను…చిదిమేశాడు

పసిమొగ్గను…చిదిమేశాడు

హన్మకొండ నగరంలోని టైలర్‌స్ట్రీట్‌ పాలజెండా ప్రాంతంలో దారుణం జరిగింది. తొమ్మిది నెలల పసికందుపై ఓ కామాంధుడు సభ్యసమాజం తలదించుకునేలా ముక్కుపచ్చలారని తొమ్మిదినెలల పసికందు పాపపై అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేశాడు. ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసే ఈ సంఘటన బుధవారం నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… జక్కోజు జగన్‌-రచన దంపతుల కుమార్తె శ్రిత (9నెలలు)తో తమ ఇంటి బంగ్లాపై నిద్రించారు. తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో కొలేపాక ప్రవీణ్‌ (28) అనే వ్యక్తి వారు నిద్రిస్తున్న బిల్డింగ్‌పైకి వెళ్లి పాపను తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేశాడు. తల్లిదండ్రులు నిద్రలోంచి మేల్కోని చూసేసరికి పాప కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. బంగ్లాపై పక్కనే స్పృహతప్పి రక్తస్రావంతో తమ కుమార్తె కనిపించడంతో గుండెలవిసేలా బోరునవిలపిస్తూ పాపను చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో హుటాహుటిన హన్మకొండ మ్యాక్స్‌కేర్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పాపను పరీక్షించి అప్పటికే మరణించిందని వైద్యులు నిర్థారించడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతే లేకుండాపోయింది. ఆసుపత్రి ఆవరణలో వారు రోదిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరు కన్నీరుమున్నీరయ్యారు. మానవజాతికే మచ్చ తెచ్చిన ఆ కామాంధుడిని నిందిస్తూ శాపనార్థాలు పెడుతూ శోకసముద్రంలో మునిగితేలారు. పాప తల్లిదండ్రులు పాపను తమ చేతుల్లోకి తీసుకుని ఏడుస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కంటనీరు పెట్టించింది.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తొమ్మిదినెలల పాపపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు కొలేపాక ప్రవీణ్‌ (24)ను స్థానికులు పట్టుకుని చితకబాది, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ప్రవీణ్‌ను పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడు దామెర మండలానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం పాప మృతదేహాన్ని వరంగల్‌ ఎంజిఎం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎంజీఎం మార్చురీ వద్ద పాప తల్లితండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ముక్కుపచ్చలారని తొమ్మిదినెలల పసికందుపై అత్యాచారయత్నం, హత్య చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని వివిధ విద్యార్థి, మహిళా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ భవనం కూడలిలో పెద్దఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించడం వల్ల సుమారుగా గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న వారిని విరమింపజేశారు. అనంతరం వివిధ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ కామంతో కళ్లు మూసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడిన ప్రవీణ్‌ను ఉరితీయాలని కొందరు, శిక్షించాలని మరికొందరు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నిందితుడిపై కేసులు నమోదు చేశాం

– సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

ఈ సంఘటనకు సంబంధించి మరణించిన చిన్నారి శ్రీహిత మామయ్య హన్మకోండ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు అధారంగా నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టుచేసి సెక్షన్‌ 366, 302, 376ఎ, 376ఎబి, 379 ఐ.పి.సి సెక్షన్లతోపాటు 5(యం) రెడ్‌ విత్‌ 6 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ 2012 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

కఠినచర్యలు తీసుకోండి

– దారుణంపై పోలీసులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం

హన్మకొండలో చిన్నారిపై దారుణం జరిగిన ఘటనపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version