https://epaper.netidhatri.com/
`మల్లారెడ్డికి మాత్రమే అన్ని రాసిచ్చారా?
`మల్కాజిగిరి మల్లారెడ్డికి లీజుకిచ్చారా?
`మేడ్చల్ సీట్లన్నీ మల్లారెడ్డి కుటుంబానికేనా?
` బిఆర్‌ఎస్ నాయకుల ఆగ్రహం.
`ఉద్యమ కాలం నుంచి పార్టీ జెండా మోస్తున్న వారు కనిపించడం లేదా?
`ఇంత కాలం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వారు వద్దా?
`మల్లారెడ్డి ఉద్యమనాయకుడా?
`తెలంగాణ సాధనలో పాల్గొన్న చరిత్ర వుందా?
`ఉద్యమకారులను దూరం పెట్టాడు.
`అనుచరుల చేత కబ్జాలు చేయించాడు.
`పార్టీని భ్రష్టు పట్టించాడు.
`రానున్న కాలంలో కారులోనే వుంటాడన్న గ్యారెంటీ లేదు.
కారు పార్టీలో కుంపట్లు రగులతున్న వేళ మల్కాజిగిరి పార్లమెంటు సీటు ప్రకంపనాలను సృష్టించేలా వుంది. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో బిఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా వుంది. కాంగ్రెస్‌కు అందనంత ఎత్తులో వుంది. బిఆర్‌ఎస్ అత్యధిక సీట్లు సాధించింది కూడా ఈ జిల్లాల్లోనే.. అందువల్ల హైదరబాద్, రంగారెడ్డి జిల్లాల పార్లమెంటు టిక్కెట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. టిక్కెట్ల కోసం పోటీ కూడా ఎక్కువ వుంది. ఇదే సమయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుమారుడికి కోసం మేడ్చల్ త్యాగం చేసి, మల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. దాంతో గత కొంత కాలంగా మల్లారెడ్డి మల్కాజిగిరి టికెట్ కావాలంటున్న సంగతి తెలిసిందే. ఇది ఇప్పుడు పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. మల్లారెడ్డి కుటుంబాన్నే మళ్లీ పార్టీలో రుద్దితే సమర్థించేది లేదు. సహకరించేదిలేదు. ఎన్నికల వేళ ప్రచారం చేసేది లేదని పార్టీ పెద్దలకు క్యాడర్ తేల్చిచెబుతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో..ఎప్పుడు పార్టీలో వుండాటో కూడా చెప్పలేమని క్యాడర్ అనుమానం వ్యక్తం చేస్తోంది. మల్లారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్, బిజేపిలకు రెండు పార్టీలతో ముందస్తు సంప్రదింపులు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా మల్కాజిగిరి గెలచి ఆ తర్వాత పార్టీలో చేరుతానని భరోసా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మల్లారెడ్డి అంతటి ఘటనా ఘటన సమర్ధుడే అన్నది అందరికీ తెలిసిందే..ఒక దశలో చంద్రబాబును మించిన దేవుడు లేడని పొగిడిన మల్లారెడ్డి,కారెక్కిన తర్వాత కేసిఆర్‌ను దేవుడన్నాడు. రేపటి రోజున ఎవరిని దేవుడంటాడో కూడా తెలియదు. పచ్చి అవకాశవాది మల్లారెడ్డి అని క్యాడర్ దుమ్మెత్తిపోస్తోంది. మల్లారెడ్డికి మల్కాజిగిరి ఏమైనా రాసిచ్చారా? అని పార్టీ పెద్దలను నిదీస్తామని క్యూడర్ అంటోంది. మేడ్చల్ జిల్లా సీట్లన్ని మల్లారెడ్డి కుటుంబానికేనా? ఇంకెవరు నాయకులులేరా? అని ప్రశ్నిస్తున్నారు.
మల్లారెడ్డి రాకతో బిఆర్‌ఎస్ రాజకీయాలు ఆగమయ్యాయని అంటున్నారు.ఉద్యమ కాలం నుంచి జెండా మోసిన వారని ఏనాడు మల్లారెడ్డి గుర్తించేలేదన్నది చాలా మంది చెబుతున్న మాట. ఇంత కాలం పార్టీని కాపాడుకున్నది ఉద్యమ కారులేనని, మల్లారెడ్డి కాదని అంటున్నారు. మల్లారెడ్డి ఏనాడు తెలంగాణ ఉద్యమం చేసింది లేదు. అయనా ఆయనకు టిక్కెట్ ఇచ్చారు. మంత్రిని చేశారు. ఆ కృతజ్ఞత మర్చిపోయిన మల్లారెడ్డి, ఉద్యమ కారులను అణివేశాడు. అనుచరులను అందలమెక్కించాడు. పేదల భూములు లాక్కున్నాడు. పార్టీని భ్రష్టుపట్టించాడనేది స్దానిక నాయకులు, కార్యకర్తలు చెబుతున్న మాట. మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలు తియ్యగా..చేతలు చేతులుగా వుంటాయి. పాలమ్మిన, పూలమ్మిన అని గొప్పలు చెప్పుకొని, పబ్బం గడుపుకుంటే సరిపోదు. రాజకీయమంటే పదవులు కాదు. ప్రజా సేవకు కట్టుబడి వుండాలి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజలకు మేలు చేయాలి. పేదలను ఆదుకోవాలి. వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. అంతే కాని పదువులను చూసుకొని మురిసిపోతూ, తాను గొప్ప అని మురిసిపోయేవాడు నాయకుడు కాదు. పేదల భూములు ఆక్రమించుకుంటూ చిలక పలుకులు చెప్పేవారు అసలే కాదు. జనం మెచ్చింది..గెలిపించింది మల్లారెడ్డిని చూసి కాదు. బిఆర్‌ఎస్ పార్టీని చూసి, కేసిఆర్‌ను చూసి..అంతే కాని మేడ్చల్‌లో గెలుపు మల్లారెడ్డిది కాదు… పార్టీది..కేసిఆర్‌ది…కాని మల్లారెడ్డి తానే గెలిచినట్లు ఎగిరెగిరి పడుతున్నాడు. పార్లమెంటు పోటీ చేస్తానంటున్నాడు. కొత్త నాటకానికి తెరతీస్తున్నాడు. ఇది ఎవరో కాదు సాక్ష్యాత్తు బిఆర్‌ఎస్ మేడ్చల్ జిల్లా నాయకులు అనే మాట. రాజకీయాల్లో గెలిచిన వారంతా గొప్ప వాళ్లు కాదు. ఓడిన వాళ్లు చేత కాని వాళ్లు కాదు. రాజ్యాంగ నిర్మాణ డాక్టర్. బాబా సాహెబ్ అంబెద్కర్ కూడా ప్రత్యక్ష ఎన్నికలో ఓటమి పాలైన నాయకుడే. అయినంత మాత్రాన చరిత్రలో ఆయన స్ధానం చెదిరిందా? ఆయన విలువ తగ్గిందా? బంగారం ఎక్కడున్నా వన్నెతగ్గదు.
మల్లారెడ్డి లాంటి నాయకుడు ఏ పార్టీలో వున్నా ఆ పార్టీకి పరువు దక్కదు. ఇటీవల కాలంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు బిఆర్‌ఎస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే పోటీ చేస్తానంటూ మల్లారెడ్డి మాటలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదే గాని జరిగితే మేడ్చల్ జిల్లా బిఆర్‌ఎస్ క్యాడరంతా తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మల్లారెడ్డి ఎప్పుడైతే మేడ్చల్ జిల్లా బిఆర్‌ఎస్ రాజకీయాల్లో చేరాడో అప్పటినుంచి పార్టీకి చెడ్డ రోజులు దాపురించాయంటున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీని నమ్ముకొని వున్నవారికి ప్రాధాన్యత లేకుండాపోయిందని వాపోతున్నారు. ఇంత కాలం పార్టీకి తోడు, అండగా వున్నవారు మల్లారెడ్డి మూలంగా నష్టపోయారు. నిజానికి ఉద్యమ కాలం నుంచి పార్టీ జెండా మోసిన వారు మల్లారెడ్డిని గుర్తించాల్సిందిపోయి, మల్లారెడ్డి ఇచ్చే గుర్తింపు కోసం ఎదురుచూసే రోజులు వస్తాయని ఏ ఉద్యమ కారుడు అనుకోలేదు. తెలుగుదేశం పార్టీలో చేరి మల్కాజిగిరి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన మల్లారెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. కేసిఆర్‌కు దగ్గరయ్యాడు. క్యాడర్‌ను పార్టీకి దూరం చేశాడు. పార్టీ పెద్దలను కలవకుండా చేశాడు. తన అనుచరలకు తప్ప ఇతరులకు గౌరవం లేకుండా చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి మల్కాజిగిరి పారమెంటు స్ధానానికి పోటీ చేసిన మల్లారెడ్డి నియోజకవర్గంలోని సుమారు 50 వేల మందికి తన కాలేజీలలో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. మల్కాజిగిరి మొత్తం తన సొంత నిధులతో ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేయించి ఇంటింటికీ మంచినీటి సరఫరా చేయిస్తానని చెప్పాడు. గెలిచినకొద్ది రోజులకే బిఆర్‌ఎస్‌లో చేరి, ఇచ్చిన హమీకి మంగళం పాడాడు. తర్వాత మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే ప్రజలు నమ్మరని మేడ్చల్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యాడు.
మేడ్చల్ పరిధిలో అనేక అరాచకాలు చేశాడు. అన్యాయాలు చేశాడు. మంత్రి పదవి అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలు చేశాడు. పేదల భూములు లాక్కున్నాడు. కొంత మందితో ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకొని, భూముల కబ్జాకు తెరతీశాడు. ఈ ఎన్నికల మందుకూడా మంత్రి మల్లారెడ్డి మీద గిరిజనులు కేసు నమోదు చేసిన సందర్భం వుంది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల నేపధ్యంలో తాను పార్లమెంటుకు పోటీ చేస్తానని చెప్పడం వెనకు మరో కుట్ర దాగి వుంది. మల్లారెడ్డి మేడ్చల్‌కు రాజీనామా చేసిన తన కొడుకును ఎమ్మెల్యే చేయాలని ఆలోచిస్తున్నాడు. తాను మల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తానంటున్నాడు. ఇప్పటికే ఆయన కుటుంబం నుంచి అల్లుడు కూడా వచ్చాడు. గత పార్లమెంటు ఎన్నికల్లో మర్రి రాజశేఖరరెడ్డి పోటీ చేసి ఓడిపోయాడు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి గెలిచాడు. అల్లుడు ఎమ్మెల్యే కావడంతో కుటుంబంలో పంచాయితీ మొదలైంది. మల్లారెడ్డి కోడలు తన భర్తను ఎమ్మెల్యేను చేయాలని పట్టుబడుతోంది. దాంతో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలు కలిసొచ్చేలా మల్లారెడ్డి ప్రకటనలు చేయడాన్ని పార్టీ క్యాడర్ అంగీకరించడం లేదు. అంతే కాకుండా పార్టీని బ్లాక్ మెయిల్ చేసే ప్రకటనలుగా వున్నాయని కూడా బిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. ఎట్టి పరిస్ధితుల్లో మాల్లారెడ్డికి మల్కాజిగిరి పార్లమెంటు స్ధానం కేటాయించొద్దని బిఆర్‌ఎస్ నాయకులు పార్టీని కోరుతున్నారు. అసలు ఇప్పుడున్న పరిస్ధితుల్లో మల్లారెడ్డి రాజీనామ చేసి మల్కాజిగిరిలో పోటీ చేసినా గెలిచే అవకాశం లేదు. మేడ్చల్‌లోనూ మళ్లీ బిఆర్‌ఎస్ గెలిచే పరిస్థితి లేదు. మొత్తంగా పార్టీని ఫణంగా పెట్టి తన వ్యక్తిగత రాజకీయాలు చేయాలని మల్లారెడ్డి చూస్తున్నారని అది పార్టీకి తీరని నష్టమని నాయకులు వాపోతున్నారు. మల్కాజిగిరి నుంచి అవకాశమిస్తే పోటీ చేసి గెలిచే సత్తా వున్న నాయకులు అనేక మంది వున్నారు. అందులోనూ విద్యార్ధి ఉద్యమ నాయకులుగా ఇప్పటికీ పార్టీకోసం పనిచేస్తున్న వారు వున్నారు. అలాంటి వారికి అవకాశమిస్తే పార్టీ మరింత బలపడే అవకావం వుంటుంది.