ప్రధాన రోడ్డుపై
తరచూ ప్రమాదాలు.
కారువచ్చినా దారి ఇవ్వలేని పరిస్థితి
అదే మార్గంలోనే ఎమ్మెల్యే ఎంపీ ప్రయాణం.
పట్టించుకోని అధికారులు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మండలకేంద్రం నుంచి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో వాహనదారులకు అసౌకర్యంగా మారింది. ఆర్‌అండ్‌బీ అధికారులు కంపచెట్లు తొలగించక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. వివరాల్లోకి వెళితే
నవాబుపేట మండల కేంద్రం నుండి మహబూబ్ నగర్ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లు ప్రమాదకరంగా మారాయి.. వివిధ గ్రామాల నుండి బైక్‌లు, ఆటోలపై నవాబుపేట మండల కేంద్రానికి తరచుగా వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు పెరిగి రోడ్డును కమ్మేస్తున్నాయి. ఈ దారి గుండా పోయే వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్ కు ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగించాలని కోరుతున్నారు. కాగా మండల కేంద్రానికి వెళ్లే ఈ రోడ్డు మార్గంలో నవాబుపేట నుంచి మహబూబ్ నగర్ వరకు ముళ్ల పొదలు రోడ్డుకు ఇరువైపులా బాగా పెరిగిపోయాయి. పెరిగిన ముళ్లపొదలను తొలగించకపోవడంతో రహదారిని మూసేస్తున్నాయి. అలాగే గురుకుంటా నుంచి నవాబుపేట వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుపై కూడా ముళ్లపొదలు రోడ్డు అడ్డంగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో పాటు రెండు వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎదురుగా వచ్చే వాహనం వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే ముళ్ల కంప గీరుకుపోయి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎదురుగా కారువచ్చినా దారి ఇవ్వలేని పరిస్థితులు ఉండడంతో ఒక్కోసారి వాహనదారులు గొడవలకు దిగుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే నవాబుపేట మండల కేంద్రం నుండి మహబూబ్ నగర్ వెళ్లే రహదారుల్లో ముళ్లపొదలను తొలగించాలని మండల ప్రజలు కోరతున్నారు.