ఢల్లీి ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం
అవినీతి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆప్ అగ్రనేతలు
ఓడి గెలిచిన రాహుల్
ఆప్ ఓటమికి ఆరు కారణాలు
ఉద్యమ నేత నియంతగా మారితే ఫలితం ఇదే
ఆప్ ఓటమితో విపక్షాల్లో నైరాశ్యం
హైదరాబాద్,నేటిధాత్రి:
శనివారం జరిగిన ఢల్లీి ఎన్నికల ఫలితాల్లో 48 స్థానాల్లో తన బలాన్ని నిరూపించుకున్న భారతీ యజనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఢల్లీి పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితం కాగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ‘సున్నా’ సీట్లతో మరో చెత్త రికార్డు సృష్టించింది. ఆప్ అగ్రనేతలైన కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్రజైన్ వంటి నాయకులు ఓడిపోయారు. వీరుముగ్గురూ లిక్కర్ స్కామ్‌లో జైలుకెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఓటమితో ఆప్‌కు ఊహించని దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అతిశి, కల్కా నియోజకవర్గం నుంచి గెలవడం గుడ్డిలో మెల్ల. ఢల్లీి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ ఓటమి నేపథ్యంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢల్లీి సచివాలయాన్ని సీజ్ చేయాలని నిర్ణయించారు. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులు తరలించవద్దని ఆదేశాలు వెళ్లాయి.
ఆప్ ఉత్థాన పతనాలు
ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపన జరిగిన కొద్ది నెలల్లోనే అంటే 2013లో ఢల్లీి అసెంబ్లీకి జరిగిన ఎన్నిక ల్లో 28 సీట్లు గెలుచుకొని అందరినీ ఆశ్చర్య పరచింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసినా కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం కూలిపోవడంతో, 2015లో ఢల్లీి అసెంబ్లీ 70 స్థానాల కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 68 సీట్లు గెలుచుకోవడంతో మిగిలిన రాజకీయపార్టీలు ఆశ్చర్యంతో పాటు అయోమయంలో వుండిపోయాయి. 2020 ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకుంది. ఈసారి తమదే విజయం అన్న విశ్వాసంతో వున్న ‘ఆప్’కు ఓటమి రూపంలో గట్టి దెబ్బ తగిలింది. అసలు ఆప్ పార్టీ ఓటమి పాలవడం రాజకీయాల్లో సహజమనుకు న్నా, ఈసారి ఆప్ అగ్రనాయ కులంతా ఓటమిపాలవడం కోలుకోలేని దెబ్బ! రాహుల్ చద్దా పార్టీలో ఉన్నారో లేదో తెలియదు. ఈ ఓటమి దెబ్బకు ఇప్పటివరకు కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్ సమకూర్చి చేతులు కట్టుకొని నిలబడిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌్ మాన్ ఇక ముందు మాట వింటారా? ఇప్పుడు ఎన్నికైన వారు, ఓటమిపాలైన అగ్రనాయత్వం మాట ఎంతవరకు వింటారనేవి పెద్ద ప్రశ్నలు.
అగ్రనేతల ఓటమి
ఢల్లీి మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఢల్లీి స్థానం నుంచి భాజపా అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జంగ్‌పూరలో 675 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు.ఢల్లీి ముఖ్యమంత్రి అతిశి కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి 3521 ఓట్ల మెజారిటీలో భాజపా అభ్యర్థి రమేష్ బిదూరీపై విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ వెనుకంజలో వున్న ఆమె చివర్లో పుంజుకొని విజయబావుటా ఎగురవేశారు. ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ షాకూరి బస్తీలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ 20998 ఓట్ల తేడాతో గెలిచా రు. మరో ఆప్ ముఖ్య నేత సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ స్థానంలో పరాజయం పాలయ్యారు.ఇక్కడ బీజేపీ అభ్యర్థి శిఖారాయ్ 3188 ఓట్ల తేడాతో గెలిచారు. బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాష్ గెహ్లోత్ విజయం సాధించారు. ఆప్ అభ్యర్థి సురేందర్ భర ద్వాజ్‌పై 9833 ఓట్ల తేడాతో గెలిచారు. గాంధీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి అర్వీందర్‌సింగ్ లవ్లీ, ఆప్ అభ్యర్థిపై 12748 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఓడి గెలిచిన రాహుల్
ఒకవిధంగా చూసుకుంటే ఢల్లీి ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడి గెలిచారనుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థిగా రాహుల్‌కు పోటీగా కేజ్రీవాల్ సు స్థిరమయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన ఒకపక్క ఇండీ కూటమితో మరోపక్క కాంగ్రెస్‌తో అవసరానికి అనుగుణంగా డబుల్‌గేమ్ ఆడుతూ వస్తున్నారు. దీనికితోడు మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి వంటి రాష్ట్రాల్లో వరుస ఓటములతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకిరాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా పెద్ద ‘గుదిబండ’గా మారారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇండీ కూటమిలోని ప్రాంతీయ పార్టీల నేతల్లో ప్రధానిపదవిపై ఆశలు పెరిగాయి. వీరిలో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ తదితరులున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ ఓటమి పుణ్యమాని రాహుల్‌కు ఒక పోటీదారు రంగంనుంచి తప్పుకున్నట్లయింది.
ఆదినుంచీ ప్రధాని పదవిపైనే కన్ను
ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వుంటూ, తర్వాత దేశ ప్రధాని అయ్యా రు. ఆయన పేరును భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దేశం ఒక్కసారి ఆయనవైపుచూడటం మొదలుపెట్టింది. గుజరాత్ అభివృద్ధి నమూనా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమం త్రులకు ఒక దిక్సూచిగా మారింది. ఇదిలావుంటే కేజ్రీవాల్ కూడా ఢల్లీి పీఠం అధిష్టించిన దగ్గరి నుంచి ప్రధానిపదవికి అభ్యర్థిగా ఎదగాలన్న బలీయమైన ఆకాంక్షతో ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే తన పార్టీలో మరొకరిని ఎదగనివ్వలేదు, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా వం టి రాష్ట్రాల్లో బలమైన నాయకుడుగా ఎదుగుతారని అనుమామున్నవారినల్లా తొక్కేసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్‌ను గాంధీల కుటుంబం ఎట్లా శాసిస్తుందో, ఆప్‌ను ‘అతడే ఒక సైన్యం’ మాదిరిగా శాసించాలనుకున్నారు. ఈ కలలన్నీ ఇప్పుడు కల్లలైపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే దేశాధినేతగా ఎదగాలన్న ఆతృతలో పార్టీలో నాయకులను ఎదగనీయకుండా తన గొంతు తానే కోసుకున్నారని చెప్పాలి. ఆప్ పార్టీకి ప్రారంభంలో విద్యావంతులు విపరీతంగా మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ సభ్యులుగా గర్వంగా చెప్పుకునేవారు. ఉద్యోగులుగా ఉన్న యువత తమ జీతాల్లో కొంత శాతం పార్టీ ఫండ్‌గా ఇచ్చిన రోజులున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మారిపోయారు. అవకాశాలు దొరకనంతవరకు ‘నీతి’గా వుంటూ, అవకాశం దొరికినతర్వాత ‘అవినీతికి’ తెరలేపారు. ఏటా మీడియా మేనేజ్‌మెంట్‌కు సుమారు రూ.400కోట్లు ఖర్చుచేయడం, సం క్షేమం పేరుతో పరిధికి మించి ‘ఉచితాలు’ ప్రకటించడం వంటివి ఆయనకు మొదట్లో మద్దతి చ్చిన విద్యావంతులను దూరం చేశాయి. ‘సంక్షేమం’ కూడా ఒక పరిమితి వరకే అధికారానికి దోహదం చేస్తుంది. మితిమీరితే వికటిస్తుంది. ఇప్పుడు జరిగిందిదే! చివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తనవిగా ప్రచారం చేసుకోవడానికి వెనుకాడలేదు. ఆవిధంగా అన్నీ తానే చేసానని చెప్పుకోవడానికి తహతహలాడారు. మరి నిజాలెప్పుడూ నిప్పుమాదిరిగానే వుంటాయి. ఏది నిజమో తెలిసొచ్చిన ప్రజలు ఇప్పుడాయన్ను పక్కనపెట్టారు.
మోదీ బ్రహ్మాస్త్రం
అరవింద్ కేజ్రీవాల్ ఆశలకు ఏవిధంగానైనా గండికొట్టాలన్న వ్యూహంతో బీజేపీ ముందుకెళ్లింది. ప్రధాని నరేంద్రమోదీ ఢల్లీి ఎన్నికల్లో తన చివరి ‘బ్రహ్మాస్త్రాన్ని’ ప్రచారం చివరిదశలో గురిచూసి వదిలారు. బడ్జెట్‌లో ఆదాయపుపన్ను మినహాయింపు 12లక్షలకు పెంచడమే ఆ బ్రహ్మాస్త్రం. ఢల్లీిలో మూడొంతులవరకు వేతనజీవులే వుండటం విశేషం. ఇంతస్థాయిలో ఐ.టి. మినహాయిం పునిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇది మోదీ వదిలిన తురుపు ముక్కగా అప్పుడే రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. గత శనివారం అంటే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్ ఈమేరకు చేసిన ప్రకటన ఎన్నికల్లో తప్పక ప్రభావం చూపుతుందన్న అందరి అంచనా నిజమైంది. నిజానికి కేజ్రీవాల్ మధ్యతరగతిని ప్రధానంగా ఆకర్షించే ఉద్దేశంతో ఐ.టి.ని రూ.10లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కానీ మోదీ ప్రభుత్వం దీన్ని ఏకంగా రూ.12లక్షలకు పెం చింది. ఆవిధంగా కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువగానే చదివానని భాజపా నిరూపించుకుంది.
మధ్యతరగతివారే అధికం
ఢల్లీిలో ఎగువ మధ్యతరగతి పదిశాతం, దిగువ మధ్యతరగతి 48 నుంచి 50శాతం వరకు వుంటే మిగిలినవారు ఇతర వర్గాల ప్రజలు. వీళ్లను ఆకట్టుకోవడానికి ఆప్, భాజపాలు తీవ్రంగా ప్రయత్నించాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయవర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభివృద్ధి పథ కాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణల తో సతమతమైంది. ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు కాకుండా కాంగ్రెస్ కు పడటం ఆప్ దారుణంగా దెబ్బ తినడానికి మరో కారణమని చెబుతున్నారు. దేశ రాజధాని నగరంలో వెయ్యికి పైగా మురికివాడలున్నాయి. గతంలో బంగ్లాదేశ్‌నుంచి, పాక్‌నుంచి వలసలు వచ్చి వివిధ ప్రాంతాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వర్గాల పూర్తి మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు సాధిస్తూ వచ్చింది. ఈ వర్గాలకే కేజ్రీవాల్ వెన్నుదన్నుగా నిలిచారు. రాయితీలు, ప్రయోజనాలు ఈ వర్గాలకే కల్పిస్తూ వచ్చారు. ఈ వర్గాల మతపెద్దలను ఎప్పటికప్పుడు సంతృప్తిపరచే విధంగా ప్రవరిస్తూ, హిందువులను తీవ్ర వివక్షకు గురిచేసిన చరిత్ర కేజ్రీవాల్‌ది. కరోనా కాలంలో కూడా ఆయా మతవర్గాలకే ప్రాధాన్యం ఇచ్చాడు తప్ప హిందువులకు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు. చివరకు దీపావళి కూడా జరుపుకోకుండా ఆంక్షలు విధించి ఘనత కేజ్రీవాల్‌ది. నూతన సంవత్సర వేడుకల్లో, విజయోత్సవాల సందర్భంగా, ఇతర మతాల వేడుకల్లో బాణాసంచా కాల్చుకోవచ్చు. అదే హిందువులు బాణాసంచా కాలిస్తే కేసులు నమోదయ్యేవి. పౌర సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ వద్దంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూవర్గాలను చీల్చి మైనారిటీల పేరుతో నడిపిన రాజకీయం నేపథ్యంలో ఢల్లీిలో భాజపా భవితవ్యం ఒక దశలో ప్రశ్నార్థకంగా మారిన మాట నిజం! కేజ్రీవాల్ పాలన క్రమంగా ఢల్లీిని మినీ పాకిస్తాన్, మినీ బంగ్లాదేశ్‌గా మారుస్తున్న విషయాన్ని గ్రహించిన ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది.
చెప్పిందొకటి చేసింది మరొకటి
కేజ్రీవాల్ ఓటమికి లిక్కర్ స్కామ్ ప్రధాన కారణమన్న వాదన బాగా వినబడుతున్నప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి అదొక్కటే కాదు, అధికారంలో వుండగా కేజ్రీవాల్ చెప్పిన మాటలకు, చేసినచేతలకు పొంతన లేకపోవడం మరో కారణం. పైకి నీతులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవినీతి భయంకరంగా తాండవమాడటానికి కేజ్రీవాల్ వైఖరే కారణం. సంక్షేమ పథకాలకు మేధావి వర్గం ఎప్పుడూ వ్యతిరేకమే. కేజ్రీవాల్ వాళ్లకు అనుకూలంగా వున్నప్పటికీ, ఆయన ప్రకటించిన సంక్షేమ పథకాలే అధికారాన్ని కట్టబెట్టాయి. ఇప్పుడు భాజపా ఎంతో సంయమనంతో, సమ తుల్యంతో వ్యవహరించాల్సివుంటుంది. తానిచ్చిన సంక్షేమ వాగ్దానాలను అమలు పరుస్తూనే, ఢల్లీి పాలనను అట్టగుస్థాయి నుంచి మరింత క్రమబద్ధీకరించాల్సి వుంటుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో భాజపా ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఇది గుర్తెరిగి పాలన సాగించాలి.
కేజ్రీవాల్ ఆరు తప్పులు
నిజం చెప్పాలంటే కర్ణుడు చావుకు ఆరు కారణాలు అన్నట్టు, కేజ్రీవాల్ పతనానికి ఆయన చేసిన ఆరు తప్పులు ప్రధాన కారణం. కేజ్రీవాల్ నిజానికి అన్నాహజారే మొదలుపెట్టిన అవినీతి వ్యతి రేక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు, నాయకుడిగా ఎదిగారు. జన్‌లోక్‌పాల్ వ్యవస్థను తీసుకురావాలన్నది అన్నాహజారే ఆకాంక్ష. అయితే కేజ్రీవాల్ పార్టీ పెట్టాలని ఉత్సాహం చూపి నప్పుడు అన్నాహజారే వారించారని చెబుతారు. ఆయన మాట వినకుండా కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (సామాన్యుల పార్టీ)ని స్థాపించారు. కానీ రెండోసారి ఎన్నికైన తర్వాత ఆయన నియంతగా వ్యవహరించడం మొదటి తప్పు. ఆయన పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో 70శాతం మందికి ఆయన్ను కలవడం సాధ్యమయ్యేది కాదు. కేజ్రీవాల్ పి.ఎ. విభవ్‌కుమార్ వద్దకు మాత్రమే వారికి అవకాశం వుండేది. ఇందుకు ఉదాహరణ స్వాతీ మాలివాల్. ఆమె కేజ్రీవాల్ ను కలవడానికి వస్తే చావుదెబ్బలు బహుమానంగా లభించాయి. ఇటువంటి కారణాలవల్ల కేజ్రీవాల్ పార్టీ నాయకులకు, కేడర్‌కు దూరమైపోయారు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు ఏడు గురు ఆప్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారంటే, కేజ్రీవాల్ నియంతృత్వం ఏస్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. తనకు పార్టీలో ఆప్తమిత్రులుగా వున్న వారిని ఒక్కొక్కరిగా దూరం చేసుకున్నారు. స్వాతీ మాలివాల్‌కు మహిళల్లో గట్టి పట్టుంది. ఈమె మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు. ఈమెను శీష్‌మహల్‌లో కేజ్రీవాల్ పి.ఎ. విభవ్‌కుమార్ చితకబా దారు. దీంతో ఆమె పార్టీకి దూరమైంది. ఆమె పట్టుపట్టి మరీ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉద్యమం రూపంలో చేసింది. కుమార్ బిశ్వాస్ తొలి టర్మ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన గొప్పకవి, వ్యంగ్యంగా చతురోక్తులు విసరడంతో దిట్ట. ఈయన్ను కూడా దూ రం పెట్టడంతో ఆయన తన కవిసమ్మేళనాలు, సమావేశాల ద్వారా మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలకు ఎంతో చేరువయ్యారు. తన సమావేశాల్లో ఆయన కేజ్రీవాల్‌ను వ్యంగ్యోక్తులతోచేసిన విమర్శలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. స్వాతీమాలీవాల్, కుమార్ బిశ్వాస్‌లు ఆప్‌కు కంచు కోటగా వున్న మధ్యతరగతి ఓటర్లను దూరం చేయడంలో కీలకపాత్ర పోషించారు. వీరిని దూరంచేసుకోవడం కేజ్రీవాల్ రెండో తప్పు. ఇక మూడోతప్పేమిటంటే, తనపై లిక్కర్ స్కామ్ ఆరోపణ లు వచ్చినప్పుడు తక్షణం రాజీనామా చేసివుండాల్సింది. అలా చేయలేదు సరికదా, ముఖ్యమంత్రిపదవిలో కొనసాగుతూనే జైల్లోకి వెళ్లి చరిత్ర సృష్టించారు. ఈ స్కామ్‌లో కేజ్రీవాల్‌తో పాటు కొందరు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా జైలుకెళ్లారు. దీంతో ఆయనతో పాటు మంత్రుల అవినీతి ప్రజలకు బాగా తెలిసొచ్చింది. ఇది ఆయన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. ఇక నాల్గవ తప్పు శీష్‌మహల్ విషయంలో ఆ యనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంలో విఫలం కావడం. ఆయన కట్టుకున ్నశీష్‌మహల్ వైభవంపై ఆరోపణలు వచ్చినప్పుడు, మీడియాను తీసుకెళ్లి మొ త్తం చూపించి వుండాల్సింది. అట్లా చేయలేదు. రూ.33కోట్ల ప్రజాధనం ఖర్చుచేసి శీష్‌మహల్‌కు మరమ్మతులు చేయించారని కాగ్ నివేదిక పేర్కొనడంతో దుమారం చెలరేగింది. భాజపా దీ న్ని ప్రధాన ఆయుధంగా మలచుకుంది. మధ్యతరగతి ప్రజల్లోకి ఇది బాగా వెళ్లింది. ఫలితంగా కేజ్రీవాల్‌పై ఢల్లీివాసుల్లో అనుమానాలు పెరిగాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీయే అవినీతిలో కూరుకుపోవడం అప్పట్లో మీడియాలోవిపరీతంగా చర్చలకు దారితీసింది. ఐదో ప్రధాన తప్పిదం ముస్లింల ఓట్లు ఎక్కడ కాంగ్రెస్, ఎం.ఐ.ఎం.లు చీల్చుకుంటాయన్న భయంతో ఈసారి ఆయన పూర్తిగా హిందూ ఓటర్లను విస్మరించడం. గతంలో బీజేపీ జై శ్రీరామ్ అంటే ఆయన జై హనుమాన్ అని నినాదమిచ్చి హిందువులకు తాను అనుకూలమని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన పూర్తిగా ముస్లింల భజనకే పరిమితమయ్యారు. ఆయన చేసిన తప్పుల్లో అత్యంత కీలకమైందిగా దీన్ని పరిగణించాలి. దీంతోపాటు ఢల్లీి ఓటర్లలో క్రమంగా పెరుగుతున్న మతపరమైన పోలరైజేషన్‌ను గుర్తించడంలో ఆయన విఫలమయ్యారు. ఇక ఆరవ తప్పు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం. ఆవిధంగా ప్రకటించిన తర్వాత వీరిని మార్చటం సాధ్యంకాదు. అట్లాచేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతా యి. లాక్కోలేని, పీక్కోలేని దుస్థితి ఇది. ప్రకటించిన వారిలో కొందరు ఓటమి పాలవుతారన్నది ఖాయంగా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో 20మందిని మార్చడంతో, అసంతృప్తి చెలరేగింది. ఇక భాజపా తన అభ్యర్థులను అందరికంటే చాలా ఆలస్యంగా ప్రకటించింది. ముఖ్యంగా ఆమ్‌ఆద్మీ పార్టీలో పరిణామాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు గెలుపు అచంనాలు వేస్తూ, అభ్యర్థులనుఎంపిక చేసింది. ఒకరకంగా కేజ్రీవాల్ ముందుగా అభ్యర్థులను ప్రకటించి భాజపాకు మేలు చేశారనే చెప్పాలి. దీంతో పాటు తాను అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ముందుగానే ప్రకటించడం, బీజేపీ, కాంగ్రెస్‌లు తాము మరింత ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని ప్రకటించడానికి దోహదం చేసింది.