ఉర్సు ఉత్సవాలకు ముస్తాబైన బిజగిరి షరీఫ్ దర్గా

సర్వమతాల సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి దర్గా ….
మత సామరస్యానికి ప్రతీక వైషమ్యాలకు చరమగీతిక… మానవత్వమే మతం…
వేలాదిగా తరలిరానున్న హాజ్రత్ సయ్యద్ ఇంకుషావళి భక్తులు…

జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని ప్రముఖ ముస్లిం పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహ్మతుల్లాహు అలై దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. వందల ఏళ్ళ నుండి కులమతాలకతీతంగా సర్వమతాలకు వేదికగా కుల, మత, వర్గ, సామాజిక వైషమ్యాలకు అతీతంగా జరిగే ఉర్సు ఉత్సవాలకు వేదికగా నిలుస్తుంది. బిజిగిర్ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు బక్రీద్ పండుగ తేది: 17-06-2024 నుండి 19-06-2024 వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి దర్గాను దర్శించుకుంటారు. తమ కష్టాలు తొలగిపోవాలని కోరికలు నెరవేరాలని వేడుకుంటారు. వివిధ జిల్లాల నుండే కాక, మహారాష్ట్రా, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా భక్తులు ఉర్సు ఉత్సవాలకు హాజరవుతారు.
దర్గా ప్రాశస్త్యం:-
తెలంగాణాలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం బిజిగిరిషరీఫ్ దర్గాను 11వ శతాబ్దంలో నిర్మించినారు. సుమారు 864 సం॥రాల సుదీర్ఘ చరిత్ర ఉన్న దర్గాలో హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహుఆలైతో పాటు ఆయన సోదరుడైన హజ్రత్ సయ్యద్ అజ్మత్ షావలీ వీరి కుమారులైన హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావళి, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలి సమాధులున్నాయి. జమ్మికుంట పట్టణానికి తొమ్మిది కిలోమీటర్లు దూరంలో విశాలమైన గుట్టలు, ప్రకృతి రమణీయత ఆహ్లాదకరమైన వాతావరణానికి అనుసంధానమై చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం గల ఈ దర్గా ఉంది.
ఇస్లాంతో పాటు అల్లాహ్ సందేశాన్ని దివ్య ఖురాన్ లోనీ సూక్తులను ప్రజలకు తెలియజేస్తు మధ్యయుగాల కాలంలో అరబ్బు దేశం నుండి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మానవత్వమే మతం అని విశ్వమానవ
సమాసత్వాన్ని చాటుతు బిజిగిర్ షరీఫ్ చేరుకొని దర్గాను నిర్మించుకున్న హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి తన జీవిత కాలంలో ప్రదర్శించిన మహిమలు, బాధితుల పట్ల చూపిన కరుణ దయ వల్ల ఎందరో ప్రజలు సుఖ శాంతులలో జీవనం గడుపగలినారు. హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా జిల్ హజ్ మాసంలో 10వ తేది: 17-06-2024 నుండి మూడు రోజుల
పాటు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. నిష్టలతో వేడుకునే భక్తుల కోరికలను హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి
తీర్చుతారని ప్రసిద్ధి.
ఉర్సు ఉత్సవాలు:-
ఉర్సు ఉత్సవాల సందర్భంగా 17వతేది సోమవారం బక్రీద్ పండుగ రోజున సాయంత్రం గుసల్ షరీఫ్ కార్యక్రమం నిర్వహిస్తారు. దర్గా ముతావళి మహ్మద్. అక్బర్ అలీ దర్గా కమిటి అధ్యక్షుడు మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో జరిగే చాదర్ గుల్ కార్యక్రమంలో దర్గా ముజావర్లు హైద్రబాద్ నుండి తెచ్చిన చాదర్లు సోమవారం తేది 17-06-2024 సాయంత్రం ప్రత్యేకంగా దర్గాలోని సమాధులకు ఆలంకరించనున్నారు. సోమవారం రాత్రి కొత్తగూడెం వాస్తవ్యులైన శ్రీ కీ!!శే.గాజి గోవర్ధన్ గారి మిత్రబృందం సుమారు మూడువేల మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. సోమవారం బక్రీద్ పర్వదినం రాత్రి ముఖ్యఘట్టమైన సంధల్ షరీష్ (గ్రంధలేవనం) ను మొళ్ళపల్లె మరియు పెద్ద బిజిగిర్ షరీఫ్ గ్రామాల నుండి ఉత్సాహపూరిత వాతావరణంలో భక్తుల మేళతాళాల మధ్య సంధల్ ను ఉరేగింపుగా దర్గాకు తీసుకొవచ్చి భక్తిశ్రద్ధలతో సమాధులకు అలరింపజేస్తారు. ఉర్సు సందర్భంగా మహ్మద్ ప్రవక్త ఉపదేశాలను అలపిస్తూ ఖవ్వాలి సమ్మేళనాలు జరుపుతారు. ఈ ఖవ్వాలి. కార్యక్రమంలో మహరాష్ట్రలోని లాతుర్ కు చెందిన ప్రముఖ ఖవ్వాలి పార్టీ నాందేడ్ కు చెందిన మహ్మద్ సలీమ్ పాషా బృందం ఖవ్వాలిలు అలపించనున్నారు.
భక్తుల నమ్మకం-
ప్రజల భక్తి విశ్వాసాలకు చారిత్రాక చిహ్నంగా నిలిచిన ఈ దర్గా పై భక్తులకు ఎనలేని విశ్వాసం ఉంది. దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాలకు హిందు, ముస్లిం, సిక్కు తదితర అన్ని మతాల భక్తులు హాజరవుతుంటారు. దర్గాషరీఫ్ మన దేశంలోని మత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోంది. అనేక రుగ్మతలు దీర్ఘకాలిక రోగాలు, మానసిక రోగాలు నయం కావాలని ఇక్కడ వేడుకుంటారు. ఆరోగ్యం కుదటపడిన తర్వాత “కందుర్లు” పేరిట తమ మొక్కులు తీర్చుకొంటారు. కొత్తగూడెంకు చెందిన భక్తుడు కీ!!శే.గాజి గోవర్ధన్ గారీ మిత్రబృందం వారు గత 17 సంవత్సరాల నుండి ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్నదానం చేస్తున్నారు.
ఉర్సు ఉత్సవాలకు హాజరుకానున్న ప్రజాప్రతినిధులు…
దర్గా ఉర్సు ఉత్సవాల కార్యక్రమానికి తేదీ 18-06 -2024 మంగళవారం రోజున ఉదయం తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు,కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి కనుమల్ల విజయ గారు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వొడితెల ప్రణవ్ గారు, జమ్మికుంట తహసిల్దార్ విజయ గారు,జమ్మికుంట మండల జడ్పిటిసి శ్రీ శ్రీ రామ్ శ్యామ్ గారు, జమ్మికుంట మండల ఎంపీపీ శ్రీమతి దొడ్డే మమతా గారు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళపల్లి రాజేశ్వరరావు గారు, బిజిగిర్ షరీఫ్ గ్రామ కార్యదర్శి రాజేందర్ గారు, బిజిగిర్ షరీఫ్ గ్రామ ఎంపీటీసీ శ్రీ రాచపల్లి రాజయ్య గారు తదితరులు దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించి ఉత్సవాలలో పాల్గొనున్నారు.
ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు హుజురాబాద్ ఏసిపి శ్రీ శ్రీనివాస్ జి గారు, జమ్మికుంట సిఐ శ్రీ వరంగంటి రవి గారు, పోలీస్ బందోబస్త నిర్వహించనున్నారు.
ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు:-
దర్గా ఉర్సు ఉత్సవాలు జరుపుటకు దర్గా ముతవల్లి కమిటీ దర్గాను, మినార్లు, చారిత్రాత్మక కట్టడాలకు రంగులు వేయించారు. దర్గాను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు త్రాగునీరు, వైద్యం, పోలీస్ బందోబస్తు, విద్యుత్ సౌకర్యం, జనరేటర్,వసతి, బస్సు సౌకర్యం విస్తృతంగా ఏర్పాట్లను చేస్తున్నట్టు దర్గా ముతవల్లి మహమ్మద్ అక్బర్ అలీ, దర్గా ముతవల్లి కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్;దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, దర్గా కమిటీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్, దర్గా కమిటీ కార్యదర్శి మహమ్మద్ జమాల్ అష్రఫ్,దర్గా కమిటీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ నయిముద్దీన్, షా హుస్సేన్ సభ్యులు అహ్మద్,లతీఫ్ హుస్సేన్, ఆజమ్,జలీల్,తాజ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version