42శాతం ఒక విప్లవం..కాంగ్రెస్‌ బడుగులకు వరం?

దేశంలో ‘‘మొదటి రాష్ట్రంగా’’ కీర్తిని సంపాదించుకునే ప్రభుత్వం.

`బీసీల చేతుల్లోకి పంచాయతీ పాలన!

`బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలుతోనే ఎన్నికలు.

`ఇక తెలంగాణల పల్లె పాలనలో బీసీలదే అగ్రభాగం.

 

`ఇంత గొప్ప నిర్ణయం చేసినా కాంగ్రెస్‌ శ్రేణులు ఏం చేస్తున్నారు.

`కనీసం క్యాబినెట్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసే తీరిక లేదా!

`ప్రచారం చేసుకునే సోయి కూడా లేదా!

`బీసీరిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌ పై జాగృతి సంబరాలు చేస్తుంటే కనిపించడం లేదా!

`క్రెడిట్‌ మాదే అని జాగృతి ప్రకటనలు చేస్తుంటే చూడడం లేదా!

`మంత్రులందరూ ఏం చేస్తున్నారు.

`ఎమ్మెల్యేలందరూ ఏ పనిలో వున్నారు.

`కనీసం నాయకులకు, కార్యకర్తలకు చెప్పినా చేసే వాళ్లు.

`మంత్రి పొంగులేటి క్యాబినెట్‌ బ్రీపింగ్‌ ఇచ్చిన వెంటనే పిసిసి ఏం చేస్తున్నాట్లు!

`ముఖ్యమంత్రి రేవంత్‌ తర్వాత ఆక్టివ్‌గా వుండేది ఇద్దరు మంత్రులేనా?

`పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ లకు తప్ప మిగతా వారికెవ్వరికీ పట్టదా?

`బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అనేది సంచలనమైన నిర్ణయం.

`ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమైన నిర్ణయం.

`ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్‌ వెనుకబడితే ఎలా?

`మా ఒత్తిడి వల్లనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఇతర పార్టీలు ప్రచారం చేసుకుంటాయి.

`తెలంగాణ ఇచ్చినా అప్పుడు ప్రచారం చేసుకోలేకపోయారు.

`రుణమాఫీ విషయంలో అదే పొరపాటు చేశారు.

`సన్న బియ్యంపై అనుకున్నంత ప్రచారం చేసింది లేదు.

`ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రచారం చేసుకునే ఓపిక కాంగ్రెస్‌ నాయకులకు లేదు.

`బీసీల రిజర్వేషన్‌ మీద ఎవ్వరూ నోరు మెదపడం లేదు.

`గతం ప్రభుత్వానికి మించి పాలన సాగిస్తున్నా చెప్పుకునే దిక్కు కాంగ్రెస్‌ లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హమీ మేరకు బిసిలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. సెప్టెంబర్‌ ఆఖరులోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశంతోపాటు, 42 శాతం బిసి రిజర్వేషన్‌ అమలు చేయడం పై కాంగ్రెస్‌ పార్టీ సిరియస్‌గా దృస్టిపెట్టింది. నిజం చెప్పాలంటే ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా దేశ చరిత్రలో లిఖించబడుతుంది. సిఎం. రేవంత్‌రెడ్డి పేరు చిరస్ధాయిగా నిలిచిపోతుంది. మనదేశంలో బిసిల జనాభా మేరకు ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో వుంది. కాని డెబ్బై ఏళ్లలో ఏనాడు, ఏ స్దాయిలో ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. అందుకు సుప్రింకోర్డు ఆదేశాలు కూడా అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నాయి. ఒకవేళ సుప్రింకోర్టు తీర్పు అడ్డులేకపోతే అమలు చేసేవాళ్లమని పదే పదే అనేక పార్టీలు చెప్పుకున్న సందర్బాలున్నాయి. దాట వేసేందుకే ఎక్కువ ఇష్టపడేవి. బిసిల మీద ప్రేమ ఒలబోస్తున్నట్లు నటిస్తూనే బిసిల రిజర్వేషన్‌ అమలుచేయాలంటే దైర్యం చేయలేకపోయాయి. బిసిలు రాజకీయంగా ఎదిగితే ఓసిల రాజకీయానికి మరణ శాసనమే అని భావించేవారు. అందుకే బిసిలను రాజకీయంగా ఎదగకుండా ఎప్పటికప్పుడు ఏదో సానును చూపిస్తూ వుండేవారు. మొత్తానికి బిసిలను ఎదగకుండా చేశారు. ఇప్పుడ బిసిలకు 42శాతం ఎట్టిపరిస్ధితుల్లోనూ రిజర్వేషన్‌ అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో ముందుకు పోవడం తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నట్లే వుంది. బిసిల రిజర్వేషన్‌ ఎలా అమలు చేయాలన్నదానిపై క్యాబినేట్‌లో సుధీర్ఘమైన చర్చ జరిగింది. అందుకోసం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పనిలో పనిగా మరోసారి అత్యవసర అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, కేంద్రానికి మరోసారి తీర్మాణాన్ని పంపించాలనుకుంటున్నారు. తర్వాత కేంద్రంపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. ఏది ఏమైనా బిసి రిజర్వేషన్‌ అమలుకు ఒక దారి పడినట్లే అని అంటున్నారు. దేశంలోనే ఇది సంచలనామ్మకమైన ప్రక్రియగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో అమలు జరిగితే మాత్రం దేశమంతా ఆచరించాల్సిందే అని అంటున్నారు. అది కాంగ్రెస్‌ పార్టీకి దేశ వ్యాప్తంగా ఏంతో మేలు జరుగుతుంది. ఆ పార్టీ దేశ వ్యాప్తంగా బలపేందుకు కూడా మార్గం వేసినట్లౌవుంది. ఒకే దెబ్బకు రెండుపిట్టలన్నట్లు కాంగ్రెస్‌ పార్టీకి దేశ మంతా నీరాజనం పడుతుందని చెప్పడంలో సందేహమే లేదు. తెలంగాణలో బిసిల రిజర్వేషన్‌ అమలు జరడం వల్ల పంచాయతీ ఎన్నికలల్లో బిసిలు రాజకీయంగా మరింత ఎదుగుతారు. రాష్ట్రంలో సగం మంది సర్పంచ్‌లు, ఎంపిపిలు, జడ్పీచైర్మన్‌లు అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో బిసి రాజ్యానికి దారి పడుతుంది. ఇంత గొప్ప కార్యాక్రమం చేపట్టాలని సిఎం. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాని అమలుకు దారులు వెతుకుతున్నది. ఇలా క్యాబినేట్‌ తీర్మానం చేసిందనే ప్రకటన వచ్చిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా జాగృతి సంస్ధ సంబరాలు చేసుకున్నది. ఈ విషయం తమ ఖాతాలో వేసుకునే ఎత్తుగడ వేసింది. ఈ మాత్రం సోయి కాంగ్రెస్‌పార్టీ నాయకులకు లేకుండాపోయింది. ఎన్నికల ముందు ఈ హమీ ఇచ్చి, ఇప్పటికే అసెంబ్లీలో తీర్మాణం చేసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం డిల్లీకి పంపింది. అంటే బిసిల రిజర్వేషన్‌ అమలు బిల్లు క్రెడిట్‌ అంతా కాంగ్రెస్‌ పార్టీకే చెందాలి. కాని సందిట్లో సడేమియా అన్నట్లు జాగృతి సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు గడ్లప్పగించి చూస్తున్నారు. ఈ మాత్రం బాద్యత లేని కాంగ్రెస్‌ నాయకుల వల్లనే ప్రభుత్వం ఎంత మంచి కార్యక్రమాలు చేసినా ప్రజల్లోకి వెళ్లడం లేదు. ప్రచారం జరగడం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి బలం చేకూరడం లేదు. తెలంగాణ ఏర్పాటకు అసలైన నిర్వచనం చెప్పేటు వంటి 42శాతం రిజర్వేషన్ల అమలును కాంగ్రెస్‌ ప్రచారం చేసుకోలేకపోవడం విడ్డూరం. ఇప్పటికే ఏ పధకమైనా, ప్రతిపక్షాలకు సమాదానం చెప్పడంలో అటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. అడపా దడపా ఓ ఇద్దరు ముగ్గురు మంత్రులు కనిపిస్తుంటారు. మిగతా మంత్రులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. వాళ్లు ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాదానం చెప్పడానికి ఎప్పుడూ ముందుకు రారు. మాకు సంబంధం లేని విషమనుకుంటారో..లేక సిఎం రేవంత్‌ చూసుకుంటారనుకుంటారో గాని, నోరు విప్పరు. ప్రతిపక్షాలను పల్లెత్తు మాట అనరు. ఇతర సమయాల్లో మాట్లాడలేకపోయినా, బిసిల రిజర్వేషన్‌ అంశంపై కూడా నోరువిప్పకపోతే ఎలా? ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం స్పందిం చకపోతే ఎలా? మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాబినేట్‌ బ్రీఫింగ్‌ చేస్తున్నప్పుడే జాగృతి సంబరాలు చేసుకున్నది. ఈసంగతి కాంగ్రెస్‌ నాయకులకు కనిపించడ ంలేదా? ఏకంగా జాగృతి కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. రంగులు చల్లుకున్నారు. క్రెడిట్‌ మాదే అంటూ ప్రకటనలు కూడా చేశారు. కాని ఎక్కడా కాంగ్రెస్‌ నాయకులు కనిపించలేదు. పిసిసి కూడా ఏం చేస్తున్నట్లో అర్ధం కావడం లేదు. దీనిపై ఇతర మంత్రులగాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడా ప్రకటనలు చేయలేదు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పలేదు. తెలంగాణలో ఎక్కడా కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నది లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి పాలాభిషేకాలు జరిపింది లేదు. ఇదే కాదు ప్రజా ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత తీసుకున్న అనేక కార్యక్రమాలను కూడా అలాగే నిర్లక్ష్యం చేశారు. మీడియాలో వార్తలు వస్తే స్పందించలేదు. నిజం చెప్పాలంటే 42శాతం బిసిలకు రిజర్వేషన్‌ అనేది దేశంలోనే తొలి రాష్ట్రంగా కీర్తిపొందుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దేశ ప్రజల నుంచి ప్రశంసలు కూడా అందుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతమైన నిర్ణయం చేసినప్పుడైనా కాంగ్రెస్‌ శ్రేణులకు సోయి రాకపోవడం విడ్డూరం. తెలంగాణ ఇస్తే ఏపిలో కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగౌతుందని తెలుసు. నాయకులతోపాటు, కార్యకర్తలు కూడా ఒక్కరు కూడా లేకుండాపోతారని తెలుసు. భవిష్యత్తులో ఏపిలో కాంగ్రెస్‌ ఉనికిలో వుండదని కూడా తెలుసు. జెండా మోసేవారే కనుమరుగౌతారని తెలుసు. కాంగ్రెస్‌ జండా పట్టుకుంటే ప్రజలే లాక్కుంటారని తెలుసు. మరో వందేళ్లయినా సరే ఏపిలో కాంగ్రెస్‌కు ఊపిరి అనేది లభించదని తెలుసు. అయినా సోనియాగాందీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తెలంగాణ ఇచ్చారు. అలాంటి తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ కనుమరుగౌతుందని ఎవరూ ఊహించలేదు. తెలంగాన ఇచ్చిన వెంటనే బిఆర్‌ఎస్‌ సంబరాలు చేసుకున్నది. తెలంగాణ తెచ్చింది మేమే అని ప్రజలను నమ్మించింది. కాని తెలంగాణ ఇచ్చింది మేమే అని అప్పుడు కాంగ్రెస్‌ నాయకులు బలంగా చెప్పుకుంటే పరిస్దితి మరోలా వుండేది. కాంగ్రెస్‌ అప్పుడే గెలిచేది. కాని ఆనాడు కూడా కాంగ్రెస్‌ నాయకులు అదికారం రాదన్నట్లే చేతులెత్తేశారు. అలా రెండు ఎన్నికల్లోనూ తెలంగాణ ఇచ్చింది మేమే అని బలంగా చెప్పుకోలేకపోయారు. పిసిసి. అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ ప్రచారం మొదలైంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతో విన్నవించుకున్నారు. ఏపిలో పార్టీకి తీరని నష్టమైనా సరే తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి కృతజ్ఞత తెలియజేయాలని కోరారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని కాలుకు బలపం కట్టుకొని తిరిగారు. అప్పుడు గాని ఇతర కాంగ్రెస్‌ నాయకులకు జ్ఞానోదయం కాలేదు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా అనేక గొప్ప కార్యక్రమాలు అమలు చేశారు. పదేళ్ల కాలంలో కేసిఆర్‌కు సాధ్యంకాని రుణమాఫీని ఏక కాలంలో చేపట్టారు. రైతులను రెండు లక్షల రూపాయల రుణమాఫీ నుంచి విముక్తి ప్రసాదించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మొదటి సారి పేదలకు సన్న బియ్యం రేషన్‌ దుకాణాల ద్వారా అందజేస్తున్నారు. దానిని కూడా ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్‌ నాయకులు బద్దకిస్తున్నారు. పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల సంబురాలు ప్రజల్లో కనిపిస్తున్నంతగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో కనిపించడం లేదు. ఇది కాంగ్రెస్‌కు భవిష్యత్తులో తీరని నష్టాన్ని మిగిల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికైనా తేరుకోండి. మేలుకోండి. పార్టీని కాపాడుకోండి. మరింత బలంగా కాంగ్రెస్‌ను నిర్మాణం చేసుకోండి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version