https://epaper.netidhatri.com/
`కాంగ్రెస్, బిజేపి మాత్రమే నా?
`వామపక్షాల జాడేది?
`బీఎస్పీ, డిఎస్పీల ప్రభావమెంత?
`జనసమితి ప్రభావం కనిపించేనా?
`పాదయాత్రలు ఎన్ని చేసినా మైలేజీ ఎందుకు లేదు?
`ప్రజలు ఆదరించడం లేదా?
`నాయకులుగా సక్సెస్ కావడం లేదా?
`బీఆర్‌ఎస్ కు పోటీ ఇచ్చే పరిస్థితులే కనిపించడం లేదు?
`కాంగ్రెస్ లో కుమ్ములాటలు?
`బీజేపీలో లుకలుకలు?
`షర్మిల కాంగ్రెస్ లో చేరేనా?
`ఇంతకాలం హడావుడి చేసి, ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
`అంతా భబ్రాజమానం భజగోవిందం!
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాలు రాను రాను చాలా విచిత్రంగా మారుతున్నాయి. ఉద్యమ కాలంలో చేసిన పొరపాటు ప్రతిపక్షాలకు శాపంగా పరిణమించింది. దాంతో ప్రజలు ఒక్క బిఆర్‌ఎస్ ను తప్ప ఏ ప్రతి పక్ష పార్టీని నమ్మేందుకు సిద్ధంగా లేని పరిస్థితులు సృష్టించబడ్డాయి. ప్రజల కళ్ల ముందు కేవలం అధికార పక్షం బిఆర్‌ఎస్ మాత్రమే కనిపిస్తోంది. ప్రతి పక్ష పాత్రలో మాత్రం కేవలం రెండు పార్టీలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఉద్యమ కాలంలో బిజేపి కంటే బలంగా ప్రజల్లో వున్న వామపక్షాల జాడ లేకుండా పోయింది. పార్టీలు అంటే ఉన్నాయా? అంటే వున్నాయి? అన్నట్లు తప్ప ఉనికిలో మాత్రం వామపక్షాల పెద్దగా లేవనే చెప్పాలి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో వామపక్షాల పాత్ర ఎంతో ఘనమైనది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వుండేది. ముఖ్యంగా నైజాం పాలన పోయి, హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ప్రభుత్వంలో బలమైన ప్రతిపక్షంగా సిపిఐ వుండేది. హైదరాబాదు రాష్ట్రంలో తెలంగాణ జిల్లాలో ఎక్కువ శాతం సీట్లు కూడా వామపక్షాలే సాధించుకున్నాయి. అలాంటి స్థాయి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ వచ్చే దాక వామపక్షాలది క్రియాశీలక పాత్రే. తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణలో బలమైన పార్టీగా వేళ్లూనుకున్న కమ్యూనిస్టు పార్టీ 1964లో విడిపోయి కూడా మరింత బలపడ్డాయి. ఇప్పుడు ఉనికి కోసం వెంపర్లాడుతున్నాయి. ఏ పార్టీ అక్కున చేర్చుకుంటుందా? అని ఎదురుచూస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వామపక్షాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడిరది. ఎన్నికలు అనగానే వామపక్షాలను తనవైపు తప్పుకోవడం కోసం అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం చూసేవి. దాంతో ఐదేళ్లు ఒక పార్టీకి, మరో ఐదేళ్లు మరో పార్టీకి అన్నట్లు పొత్తు సాగేది. కాకపోతే ఏ పార్టీ అధికారంలో వున్నా, ఎన్నికల తర్వాత ప్రతి పక్ష పాత్రనే పోషించేవి. దాంతో ప్రజల్లో వామపక్షాలు ఒక నమ్మకం నిర్మించుకున్నాయి. ఒక దశలో ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టు బావ జాలం ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. వాటిని చూసేందుకు ప్రజలు ధియేటర్లకు ఎగబడేవారు. అలా రెండు దశాబ్దాల పాటు సినిమాలతో ఎర్రజెండా పార్టీలు కనిపించాయి. సినిమా తీసిన నిర్మాతలకు కలెక్షన్ల రూపంలో కనక వర్షాలు కురిపించాయి. అయినా వామపక్షాలు మాత్రం అక్కడే వున్నాయి. తెర మీద ఎర్రజెండా చూడడానికి ఇష్ట పడిన ప్రజలు ఆ పార్టీలను మాత్రం అదరించలేదు. ఇక దేశంలో బిజేపి పార్టీ దినదినాభివృద్ధి జరుగడంతో కమ్యూనిస్టు పార్టీలకు కాలం చెల్లినంత పనైంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి మరీ అద్వాహ్నంగా తయారైంది. సమైక్యాంధ్ర కు మద్దతిచ్చి తెలంగాణ లో నష్టపోయారు. సిపిఐ, సిపిఎం చెరో దారి ఎంచుకోవడంతో మరింత చతికిల పడ్డాయి. రెంటికీ చెడిన రేవడిగా మారిపోయాయి. కాలానికి తగ్గట్టుగా మారకపోగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించకపోవడంతో మొదటికే మోసం తెచ్చుకున్నాయి. ఆఖరు దశలో సిపిఐ తెలంగాణకు మద్దతు పలికినా, అప్పటికే పుణ్యకాలం గడిచిపోయింది. ప్రజలకు దూరమైంది. సిపిఎంకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో తెలంగాణలో ప్రతిపక్షాలంటే ఆ రెండేనా? కేవలం కాంగ్రెస్, బిజేపి యేనా అని చర్చించుకోవాల్సి వస్తోంది.
తెలంగాణలో బిఎస్పీ, డిఎస్పీల ప్రభావమెంత? అన్నదానిపై ప్రజల్లో చర్చే లేదనిపిస్తోంది.
బిఎస్పీ రాష్ట్ర ఛీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఉన్నత ఉద్యోగం వదిలి ప్రజా జీవితంలోకి వచ్చారు. అయితే ఆయన పోలీసు ఉన్నతాధికారిగా వున్న సమయంలో ఎన్ కౌంటర్లు పెద్ద ఎత్తున జరిగాయన్న అపవాదు వుంది. తాను ఎంతో మంది ఎస్సీ ఎస్టీ యువతకు ఉపయోగపడ్డానని చెబుతున్నప్పటీ గతం తాలూకు విషయాలపై ప్రతి సారి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. తనకు, ఆ సమయంలో జరిగిన ఘటనలకు సంబంధం లేకపోయినా, అప్పటి ఉన్నతాధికారిగా ప్రవీణ్ కుమార్ వుండడం గమనార్హం. తెలంగాణ లో యువత నక్సల్స్ వైపు ఆకర్షితులై, అమరులైన వారిలో అధిల శాతం ఎస్సీ ఎస్టీలే వున్నారు. అందుకే ఇప్పటికీ తెలంగాణ పల్లె ఏ అలికిడి వినపడినా భయపడుతుంది. ఇక డిఎస్పి విశారదన్ కూడా తెలంగాణలో పాదయాత్ర ద్వారా బడుగులను సంఘటిత పరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతగా సఫలీకృతమైనట్లు కనిపించడం లేదని కొందరి మాట. ఇక జనసమితి విషయానికి వస్తే కోదండరామ్ ను ఇంకో ఐదేళ్లు పోతే ప్రజలు మర్చిపోవొచ్చు. నిజానికి ఆయన ముఖ్యమంత్రి కేసిఆర్ తో వుండే ఆయన కీర్తి కూడా రేపటి తరానికి తెలిసేది. కానీ ఆయన కాంగ్రెస్ ను నమ్ముకున్నాడు. రాజకీయంగా నిండా మునిగాడు. తెలంగాణ ఉద్యమ కారుడిగా ఆయన ను ఎంత గుర్తించినా, నాయకుడిగా గుర్తించేందుకు పార్టీలు సైతం ఇష్ట పడడం లేదు. ఈసారి ఎన్నికలలో జనసమితి ప్రభావం కనీసం కనిపించేనా? అన్న అనుమానం కల్గుతోంది.
రాష్ట్రంలో అటు కాంగ్రెస్, బిజేపి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, బిఆర్‌ఎస్ కు పోటీ ఇచ్చే పరిస్థితులే కనిపించడం లేదు?
ఎందుకంటే నిత్యం కాంగ్రెస్ లో కుమ్ములాటలు? కనిపిస్తూనే వుంటాయి. ఎక్కడో అక్కడ ఏదో వివాదం ముదురుతూనే వుంటుంది. అది మండుతూనే వుంటుంది. అంత దాక ఎందుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్లలలో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ ఇష్టం లేని నాయకుడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినపుడే సీనియర్లు అయిపోయింది అన్న మాటలు మాట్లాడారు. ఏకంగా పిసిసి అధ్యక్షుడు కాగానే నిండా మునిగిపోవడం ఖాయమన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రేవంత్ విషయంలో కిరికిరే నడుస్తోంది.
నేనేం తక్కువ, నాకేం తక్కువ అని బిజేపి లో గొడవలు, అలకలు, కవ్వింపులు, ఎత్తిపొడుపులు, మా పార్టీలో చూపిస్తామని చెబుతున్నట్లే వుంది.
అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా బిజేపి లో లుకలుకలు? మొదలయ్యాయి. గత ఎన్నికలలో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు సాధించిన బిజేపి పార్లమెంటు ఎన్నికలలో అనూహ్యంగా నాలుగు ఎంపి సీట్లు గెలిచింది. దాంతో బిజేపిలో కొత్త ఉత్సాహం నెలకొన్నది. దానికి తోడు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి, పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన బండి సంజయ్ కు వెంటనే ప్రమోషన్ వచ్చింది. ఏకంగా పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. బండి సంజయ్ బిజేపికి మంచి ఊపును తెచ్చాడు. అది కూడా ఆ పార్టీలో కొందరికి గిట్టలేదు. బిజేపి పార్టీ అధ్యక్షుడుగా అధికార పార్టీకి టార్గెట్ అవుతాడని అనుకుంటే సొంత పార్టీ నేతలకే బండి సంజయ్ టార్గెట్ అయ్యాడు. అయితే బండి సంజయ్ కొంత అతి విశ్వాసం ప్రదర్శించారని, సీనియర్లను పట్టించుకోలేదన్న అపవాదు ఎదుర్కొన్నాడు. ఆఖరుకు తన పదవి తాను పోగొట్టుకున్నాడు. పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని చెప్పి, తన పదవికే ఎసరు తెచ్చుకున్నాడు. బండిని బలవంతంగా దించేసి, ఊపు మీద కనిపించిన పార్టీకి గాలి తీసేశారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కోసం పార్టీ పడిగాపులు పడేలా చేసుకున్నారు. ఇక ఇదిలా వుంటే షర్మిల కొంత కాలం నేనున్నాని హడావుడి చేసింది. కాంగ్రెస్ గంగలో తన పార్టీని కలిపేయాలని చూస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరేనా? అన్నది ఇప్పటికైతే ప్రశ్నగానే వుంది. ఈ పార్టీలన్నీ నిన్నటి దాకా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అదేంటో ఇంతకాలం హడావుడి చేసి, ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అంతా భబ్రాజమానం భజగోవిందం!