చేర్యాల నేటిధాత్రి…
జనవరి మొదటి వారంలోగా చేర్యాల పట్టణంలోని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠధామం మరియు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా ఆదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమ అగ్రవాల్ అధికారుల ఆదేశించారు. గురువారం జిల్లా ఆదనపు కలెక్టర్ చేర్యాల పట్టణంలో పర్యటించి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అధికారులతో చేర్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న శానిటేషన్, ఇతర అభివృద్ధి పనుల పై సమీక్షించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ మరియు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన నిర్మాణాలు చేర్యాల పట్టణంలో జరుగుతున్నాయని వాటిని త్వరగా నిర్మించేందుకు మున్సిపల్ అధికారులు మరింత చొరవ తీసుకొని నాణ్యత కూడిన నిర్మాణాలను జనవరి మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీలో పారిశుధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి చేర్యాల మున్సిపాలిటీ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, మున్సిపాలిటీ ద్వారా పౌరులకు అందించే సేవలను నిర్ణీత సమయానికి అందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్, మున్సిపల్ ఏఈ శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కళ్యాణ్ చక్రవర్తి, మేనేజర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.