కార్యకర్తలే కంచుకోటలు!

https://epaper.netidhatri.com/view/220/netidhathri-e-paper-28th-march-2024%09/3

కాంగ్రెస్‌ గెలుపుకు వారధులు.

సారధులెప్పుడూ నిమిత్తమాత్రులే.

పదేళ్ళు ప్రాణాలు ఫణంగా పెట్టి నిలబడిరది శ్రేణులే.

తెలంగాణ ఇచ్చినా అధికారం కోసం కష్టపడ్డారు.

అవకాశవాదులతో రాజకీయాలొద్దు!

ద్వారాలు తెరిస్తే వచ్చేది వాళ్లే.

పచ్చగున్న చోట చోటు వెతుక్కునేది వీళ్లే.

స్వార్థపరులతో స్నేహలు వద్దు!

నాయకులతో పార్టీలు బలపడవు.

శ్రేణులు బలంగా వున్నప్పుడే పార్టీలకు గెలుపు.

నాయకుల తప్పులే పార్టీలకు శాపాలు.

కష్టకాలంలో నిలబడేది శ్రేణులే.

ఎవరు వున్నా, ఎవరు లేకపోయినా పార్టీని కాపాడేది కార్యకర్తలే.

వచ్చిపోయేవారు తమ పనులు చక్కదిద్దుకునే వాళ్లే.

నాయకులే బలవంతులైతే ఓటమి వుండదు.

జనంలో పలుకుబడి ఒక్కటే గెలుపుకు మార్గం కాదు.

పదేళ్ళ తర్వాత అధికారం తెచ్చింది శ్రేణులే.

ప్రచారం కీలక భాగస్వామ్యం వారిదే.

నాయకులెక్కడైనా నిమిత్త మాత్రులే.

ఇంటికొచ్చిన వాళ్లంతా ఇష్టులుకాదు..గడప తొక్కిన వాళ్లంతా బంధువులు కాదు. రాజకీయాలలో శాశ్వత మిత్రుల లేరు. శాశ్వత శత్రువులు లేరు. కాని కార్యక్తలు మాత్రమే హితులు. పార్టీకి పట్టుగొమ్మలు. వాళ్లే బంధువుల. వాళ్లే కంచుకోటలు. వచ్చేవాడెప్పుడూ అవకాశవాదే…ఎప్పుడు వెళ్లిపోదామా? అని దారి వెతుక్కునేవాడే..అందుకే గేట్లు తెరిస్తే వస్తున్నవారు..ఎవరు చేర్చుకోవాల్సిన వారు ఎవరు? అన్నది కూడా కాంగ్రెస్‌ పార్టీ , ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి ఆలోచించుకోవాలి. దానికితోడు ఘర్‌ వాపసీ అంటే, కాంగ్రెస్‌లో అన్యాయం జరిగి, న్యాయం జరగదని వెళ్లిన వారిని రమ్మని అక్కున చేర్చుకోండి. కాని కాంగ్రెస్‌లో పదువులు అనుభవించి, ఆధిపత్యం చెలాయించి, గత పదేళ్లుగా పార్టీకి దూరం జరిగిన వాళ్లతో ఒరిగేదేమీ వుండదు. కుటుంబంలో తగాదాలున్నంత మాత్రాన బంధాలు చెదిరిపోవు. కాకపోతే కొంత కాలం కలతలుంటాయి. కాని మొత్తానికే తెగదెంపులు చేసుకొని వెళ్లినవారిని రమ్మని పిలిస్తే వచ్చేవారు చుట్టపు చూపుగాళ్లే..అందువల్ల గేట్లెత్తే ముందు కాంగ్రెస్‌ పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకోండి. వారి సూచనలు పరిగణలోకి తీసుకోండి. ఏ నియోజకవర్గ స్దాయి నాయకుడు వచ్చినా, సంబంధిత ప్రాంత శ్రేణులతో పార్టీ ఆలోచనలు పంచుకోండి. లేకుంటే పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూడా జెండా మోసిన శ్రేణుల్లో నిస్తేజం నింపకండి. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లెవరు తమ అనుచరుల కోసం పనిచేస్తారేగాని, అసలు కాంగ్రెస్‌ శ్రేణుల మేలు కోరరు. ఎందకంటే అసలైన శ్రేణులు ఏ నాయకుడికి అణిగి మణిగి వుండరు. వారిలో ఆత్మాభిమానం వుంటుంది. పార్టీపై పట్టు వుంటుంది. నాయకులతో సాన్నిహిత్యం వుంటుంది. అది కొత్తగా వచ్చిన వారికి నచ్చదు. వారి ముందు కార్యకర్తలు మాట్లాడితే సహించరు. వారి సూచనలు ఏ విషయంలోనూ కొత్తగా వచ్చిన వారు పరిగణలోకి తీసుకోరు. తీసుకుంటున్నట్లు నటించినా వారికి విలువ ఇవ్వరు. ఇది ఎప్పటికైనా కాంగ్రెస్‌కు మంచిది. పదేళ్ల తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. అందుకు పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడ్డారు. ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేశారు. ఎన్నికల వేళ ఆకలికి కూడా ఓర్చుకున్నారు. తమ నాయకులు గెలవాలని కోరుకున్నారు. వారి కోసం త్యాగాలు చేశారు. గెలిచిన నియోజక వర్గాలలో వారికి గుర్తింపు వుంటుంది. కాని ఓడిపోయిన నియోజకవర్గాలలో వలస నాయకులు వస్తే అసలైన నాయకులను దూరం పెడతారు. వారి మనోభావాలు దెబ్బతీస్తారు. చివరికి అసలైన కార్యకర్తలనే టార్గెట్‌ చేస్తారు. ఇక ఘర్‌ వాపసీ నాయకుల మూలంగా ఈ పదేళ్లలో తయారైన నాయకులకు గౌరవం వుండదు. గతంలో ఆ నేత పార్టీ మారినప్పుడు వారి వెంట వెళ్లని నేతలను ఇప్పుడు వేధింపులకు గురిచేస్తారు. ప్రతి సమస్య పార్టీ దాకా రాకపోవచ్చు. జిల్లా స్ధాయిలో కార్యకర్తలకు న్యాయం జరక్కపోవచ్చు. కొత్తగా వచ్చిన వారి ఆధిపత్యం ముందు కార్యకర్తలు తల దించుకోవాల్సిరావొచ్చు. ఇలా అనేక సమస్యలు పార్టీకి ఉరితాళ్లుగా మారుతాయి.
తెలంగాణ వచ్చిన తర్వాత గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పదేళ్లుగా వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లే నిజమైన కాంగ్రెస్‌ పార్టీ సైనికులు. అలాంటివారిని ప్రోత్సహించండి. గత శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ గెలిచి తీరాలన్న కసితో పార్టీలో ఎవరికి టికెట్లు ఇచ్చినా కార్యకర్తలు సర్ధుకుపోయారు. పార్టీ గెలుపుకు సహకరించారు. ప్రచారం చేశారు. గెలిపించారు. ఇప్పుడు ఓడిపోయిన వారి నియోజకవర్గాలలో కొత్తవారిని తెచ్చి కార్యకర్తల నెత్తిమీద పెడితే, వాళ్లు అణిచివేయబడతారు. వేలివేయబడతారు. మనోవేధను గురౌతారు. కాంగ్రెస్‌ పార్టీ గేట్లు తెరిస్తే బిఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందేమో! కాని అందులోనూ బిఆర్‌ఎస్‌ వర్గం ప్రత్యేకంగా తయారౌతుంది. వారి గ్రూపుకు కొంత కాలమైతే ఎవరైనా తలొగ్గాల్సివస్తుంది. అంతే కాకుండా పదేళ్ల కాలంలో ఏ నాయకులతో పోరాటం చేశారో వాళ్లే తమ నాయకులు కావడం ఏ కార్యకర్త జీర్ణించుకోలేదు. ఏ నాయకులైతే కార్యకర్తలను జైలు పాలు చేశారో ఆ నాయకుల కింద పనిచేయాలంటే కాంగ్రెస్‌ శ్రేణులు ముందుకు రాకపోవచ్చు. ఏ నాయకులైతే కాంగ్రెస్‌ కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేశారో వాళ్ల ముందు మళ్లీ పార్టీలో చేతులు కట్టుకొని నిలబడాలంటే ఇష్టపడకపోవచ్చు. దాంతో కరుడుగట్టిన కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా పక్క చూపులు చూడొచ్చు. పార్టీని వీడి ఇతర పార్టీలలో నాయకులు కావొచ్చు. అప్పుడు అదే నియోజక వర్గంలో కొత్త తలనొప్పి కావొచ్చు. అయినా కరుడుగట్టిన కార్యకర్తలను వదులుకునే ప్రయత్నం కాంగ్రెస్‌ ఎప్పటికీ చేయొద్దు. పదేళ్ల పాటు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేశారు. అనేక త్యాగాలు చేశారు. వారిని ముందు పరిగణలోకి తీసుకోండి. వారికి మేలు చేసే కార్యక్రమాలు చేయండి. వారికి ప్రభుత్వం తరుపున అందే ప్రోత్సాహకాలు అందించండి. పదవులు కట్టబెట్టండి. పార్టీ పదవులను ప్రకటించండి. పార్టీలో ఎక్కడికక్కడ యంత్రాగాలకు పెద్ద పీట వేయండి. పార్టీ నిర్మాణం చేపట్టండి.
పచ్చగున్న చోట చోటు వెత్తుక్కునే అవకాశవాదలు, స్వార్ధపరులు చాలా మంది వుంటారు. నిన్నటి దాకా ఏ నాయకులనైతే విమర్శించారో వాళ్లు పార్టీలో చేరితే సచ్చీలురు కాలేరు. వారు చేసిన అరాచాకాలు సమసిపోవు. వారు ఆర్జించిన అక్రమార్జనల ఆరోపణలు ఆగిపోవు. ఏ నోటితో తిట్టారో ఆ నోటితోనే ఆ నాయకులను పొగడం సరైంది కాదు. కొత్త నాయకులను తయారు చేయండి. కొత్త తరం తీసుకురండి. కొత్త నీరు పేరుతో పాత నాయకులకు పెద్ద పీట వేయకండి. యువతరం నాయకత్వాలను ప్రోత్సహించండి. మరో దశాబ్దానికి దిక్చూచీ కావాల్సిన నేతలను తయారు చేయండి. అంతే కాని పాత చింత కాయపచ్చడి లాగా అక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే అక్కడ నీడ కోసం పాకులాడే వారికి అవకాశం ఇవ్వకండి. దారిని అసలు దరి చేయనీయకండి. ద్వారాలు తెరవాల్సిన అవసరం లేదు. కొత్త తరాన్ని ఆహ్వానించండి. విద్యార్ధి రాజకీయాలలో చురుగ్గా వున్నవారిని ప్రోత్సహించండి. సమాజంలో చైతన్యం తీసుకొచ్చేలా వారికి శిక్షణలివ్వండి. నాయకత్వ లక్షణాలు ఎలా వుండాలో తర్ఫీదులివ్వండి. పదేళ్ల పాటు ప్రజలకు సేవ చేస్తూ, పార్టీ కోసం కష్టపడుతున్నవారిని గురించి, వారికి రేపటి తరం నాయకులుగా మలచండి. వారిని పక్కన పెట్టి, కారును ఖాళీ చేయాలని హస్తం గూటిలో అక్రమార్కులకు చోటు కల్పించకండి. నాయకులతో పార్టీలు బలపడతాయనుకుంటే భ్రమ. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎదిరించి గెలిచిందంతా కొత్త తరం నాయకత్వమే..అలాగే బిఆర్‌ఎస్‌ తయారు చేసింది నూతన నాయకత్వానే..ఇప్పటికీ వారసత్వ వానసలు పోని కాంగ్రెస్‌లో కొత్త తరం కుటుంబాలకే పరిమితమైతే కార్యకర్తలకు గుర్తింపేది. వారి పదవులకు భరోసా ఏది? కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిందిపోయి, మళ్లీ కొత్త నాయకులకు బానిసలు చేయకండి. నాయకులు ఎప్పుడూ స్వార్ధపరులే. ఏ స్వార్ధం తెలియని వాళ్లే శ్రేణులు. ఓవైపు నిత్యం పార్టీ జెండా మోస్తూ, తన కూలీ పని తాను చేసుకుంటూ, తాను రేషన్‌ బియ్యం తింటూ, సంపాదించిన దానిలో పార్టీకి తన తాహతకు మించి ఖర్చు చేసే త్యాగజీవి కార్యకర్త. ఏ నాయకుడి ముందు చేయి చాచడు. ఏ నాయకుడు తనకు సాయం చేయమని వేడుకోడు. ప్రభుత్వ పరంగా అందే వాటిని కూడా ముందు ప్రజలకు చేరాలని కోరుకునే నిస్వార్ధసేవకుడు కార్యకర్త. అలాంటి కార్యకర్తల మీద పెత్తనానికి అవకాశవాదులను తెచ్చిపెట్టకండి. ఇప్పటికైనా కార్యకర్తకు స్వేఛ్చను ప్రసాదించండి. వారికి కూడా గుర్తింపు నివ్వండి. ఏ పార్టీకైన కష్టకాలంలో నిలబడేది కార్యకర్తే…పారిపోయేది నాయకుడే..వచ్చిపోయేవాళ్లు ఎప్పుడూ తన పనులు చక్క దిద్దుకుంటరే గాని, పార్టీని చక్కదిద్దే బాధ్యత తీసుకోరు. జేజేలకు మాత్రం కార్యకర్తలు వినియోగించుకుంటారు. ఇంటికొస్తే ఉప్మా పెట్టి జేజేలు కొట్టించుకుంటారు. కార్యకర్తలు గడపదాటగానే బూతు పురాణం మొదలుపెడతారు..ఇదీ అద్దె నేతల, వలసవాదుల తీరు..అందుకు అసలు సిసలు కాంగ్రెస్‌ నేతలకే ప్రాదాన్యతలివ్వండి. పార్టీని పది కాలాల పాటు కాపాడుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!