వణికిస్తున్న చలి పులి.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T124713.772.wav?_=1

 

వణికిస్తున్న చలి పులి….!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఉదయం 8గంటల వరకు సైతం పొగమంచు వీడడం లేదు. చలిగాలుల ప్రభావంతో రాత్రితో పాటు పగటి ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. సాయంత్రం 5గంటల నుంచి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతూ తెల్లవారుజామున 3గంటల వరకు అత్యల్ప స్థాయికి చేరుకుంటున్నాయి. సాధారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు 30 నుంచి 40 డిగ్రీలు ఉండాల్సి ఉండగా 15 నుంచి 20డిగ్రీలకు తగ్గుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత మరీ తక్కువగా నమోదవుతునన్నది. ముందస్తు జాగ్రత్తలతోనే ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులకు జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చలి బారిన పడకుండా స్వెటర్లు తొడిగించాలని, వేడి నీటితో స్నానం చేయించాలని, దూర ప్రయాణాలు తగ్గించుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె సంబంధ వ్యాధులున్న వారు, గుండె ఆపరేషన్‌ చేయించుకున్న వారు వాకింగ్‌ జోలికి వెళ్లొద్దని, చలికాలంలో ఎక్కువగా తిరిగితే రక్తనాళాలు గడ్డ కట్టి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని, బీపీ, షుగర్‌ ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆస్తమా ఉన్న వారు నిత్యం వాడే మందులను అందుబాటులో ఉంచుకోవాలని, చల్లగాలి తగలకుండా చూసుకోవాలని, చర్మం పొడిబారకుండా ఉండేందుకు గ్లిజరిన్‌ సబ్బులను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

చలికాలంలో కీళ్లనొప్పులు..

చలికాలంలో ఉదయం లేవగానే కొందరిలో ఒళ్లు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కాళ్లు, చేతులకు అవసరమైన రక్తం సరఫరా కాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో ఊపిరితిత్తులు, గుండె వంటి భాగాలకు ఎక్కువగా రక్త సరఫరా జరుగుతుంది. కాళ్లు, చేతులు, భుజాలు, కీళ్లకు తగినంత రక్తం సరఫరా కాదు. ఫలితంగా కీళ్లు బిగుసుకుపోయి నొప్పి వస్తాయి. అంతే కాకుం డా శీతాకాలంలో చాలామంది చలికి భయపడి ఎక్కువగా ఇంట్లోనే ఉండటానికి ఆసక్తి చూపుతారు. ఇంట్లోనే కదల కుం డా కూర్చోవడం, పడుకొని ఉండడం వల్ల కీళ్లకు, ఎముకలకు దన్నుగా నిలిచే కండరాలు, కండర బంధనాలూ బిగుసుకుం టాయి. ఇది మోకాళ్లు ఇతర భాగాల్లో నొప్పులకు కారణమవుతుంది.

ఉపశమనం

ఉదయం లేవగానే కాళ్లూ చేతులూ ఆడించాలి. ఇంటిలోనైనా కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. తగినంత నీరు తాగాలి. దీని వల్ల కీళ్లు తేలికగా కదలడానికి అవకాశం ఉంటుంది. కీళ్ల నొప్పులకు మందులను వాడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. చేతికి గ్లౌజులు, పాదాలకు సాక్స్‌లు వేసుకోవాలి.

వింటర్‌ వాకింగ్‌తో ప్రయోజనాలు

మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజూ వాకింగ్‌ చేయడం చాలా మంచిది. అయితే వాకింగ్‌ కాస్త వేగంగా ఉంటే ఆరోగ్యానికి మరింత మంచిది. శీతాకాలం వల్ల చాలా మంది వాకింగ్‌ను అశ్రద్ధ చేస్తుంటారు. అలా చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వింటర్‌లోనూ వాకింగ్‌ చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు.

పొగమంచుతో జాగ్రత్త

ప్రస్తుతం రోడ్లపై పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈమేరకు రవాణా శాఖ అధికారులు తగు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. వాహనం ముందు, వెనుక రేడియం స్టిక్కర్‌ అంటించుకోవాలని, సిగ్నల్‌ లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్‌ చేసుకోవాలని, ముందున్న వాహనాలు కనిపించవు కాబట్టి గంటకు 40కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లొద్దని, లో భీమ్‌ లైట్లు వాడాలని, పొగమంచు ఉన్నప్పుడు ఫాగ్‌ లైట్లు వాడడం వల్ల 25మీటర్లు స్పష్టంగా చూడొచ్చని రోడ్డు, ట్రాన్స్‌పోర్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ ఫలాలతో ప్రయోజనం..

మిగితా సీజన్ల కంటే శీతాకాలంలోనే జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. సరైన జాగ్త్రతలు తీసుకోకపోతే ఇంట్లోనే ఒకరి నుంచి మరొకరికి ఇవి వ్యాపిస్తాయి. ఈ సీజన్‌లో మనకు లభించే కొన్ని పండ్లను తీసుకుంటే రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుంది. అలాగే అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

ఆస్తమా బాధితులకు ఆహార సూచనలు..

మిగిలిన సీజన్‌లతో పోలిస్తే శీతాకాలంలో ఆస్తమా రోగులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చలి వాతావరణం, శీతల గాలులతో ఆస్తమా లక్షణాలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల ఊపిరి తీసుకోవడం కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా మారుతుంది. అలాగే ఈ సీజన్‌లో కొన్ని ఆహార పదార్ధాలను కూడా వీరు దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

◆:-ఐస్‌క్రీం, కూల్‌డ్రింక్స్‌ వంటి చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి.

◆:- పాలు, ఇతర డైరీ ఉత్పత్తుల కారణంగా ఆస్తమా పేషంట్లలో వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి.

◆:- ఆస్తమా పేషెంట్స్‌ టీ/కాఫీ తాగకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ట్రిక్‌ సమస్యలు తలెత్తవచ్చని కొన్ని పరిశోధనల్లో తేలింది.

◆:- వాల్‌నట్స్‌, పిస్తా వంటివి తినడం వల్ల ఆస్తమా మరింత తీవ్రమవుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నట్స్‌లో కొన్ని పదార్థాలు ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తాయట.

◆:- అందుకే ఆస్తమా పేషెంట్స్‌ చలికాలంలో డ్రై ఫ్రూట్స్‌ తినే ముందు డాక్టర్‌ సలహా తీసుకోవాలి.

◆:- విటమిన్‌-సీ ఎక్కువగాఉండే నారింజ, బత్తాయి లాంటి పండ్లను తింటే రోగ నిరోధక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. అలాగే జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం పొందవచ్చు.

◆:- యూపిల్‌లో ఉండే పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌ మన జీర్ణ వ్యవస్థకు మరింత మేలు చేస్తాయి.

◆:- అరటి మనకు తక్కువ ధరలో లభించే ఫలం. దీనిలో ఉండే పొటాషియంతో మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే తక్షణ శక్తిని అందిస్తుంది.

◆:- కివీ పండ్లు, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ ఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈ సీజన్‌లో వచ్చే పలు రకాల ఫ్లూల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

◆:- దానిమ్మ, ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి

జాగ్రత్తలు తప్పనిసరి

చలికాలంలో ముందస్తు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ వాతావరణ మార్పులతో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా అన్ని పీహెచ్‌సీలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు గోరువెచ్చని నీటినే తాగించాలి. ఐక్‌క్రీంలు, కూల్‌డ్రింక్స్‌ ఇవ్వొద్దు, జంక్‌ఫుడ్‌, కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి. చలికాలంలో ఎక్కువగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ధూమపానం, మద్యపానం, మాంసానికి దూరంగా ఉండాలి. 20ఏళ్లు దాటిన వారు లిపిడ్‌ ప్రొఫైల్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. రోజూ వ్యాయమం తప్పనిసరి.

– ఝరాసంగం మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version