– ఇలా అయితే నిండా మునుగుడు ఖాయం!
– గత రెండేళ్లుగా ఎక్కడోదగ్గర ముసలం.
– ఒక చోట ముగిసేలోపు మరో చోట మొదలు.
– మొదట్లో భూపాలపల్లి.
– ఆ తర్వాత స్టేషన్ ఘన్ పూర్.
– మధ్యలో మహబూబాబాద్.
– తూర్పులో తరుచూ కిరికిరే.
-ఒకరు కాకపోతే ఒకరు.
-ఆధిపత్య పోరు…అలిగిన వాళ్లు ఎదురుతిరుగు!
-వివాదాల ముసురు…పార్టీకి ఎసరు!
– పరకాలలో మరో కోణం.
-వర్ధన్నపేట లో ఇప్పటికైతే సమసిన డోలాయమానం.
– ప్రతిపక్షాలు ఎదగకుండా చేశారు?
-సొంత కుంపటిలో అసంతృప్తి సెగలు రాజేసుకున్నారు!
– ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!
-ప్రతిపక్షాలు లేని చోట అధికారిక పక్షంలోనే వివాదం!
-జనగామ ఎమ్మెల్యే కూతురే తండ్రి మీద కురిపించిన ప్రశ్నల వర్షం.
-బాజాప్తా కబ్జా చేశానని ఎమ్మెల్యే చెప్పిన వింత సమాధానం!
-వరంగల్ కారులో అంతా బలమైన నేతలే!
-ఎంతో అనుభవం వున్న నేతలే!
-అందులోనూ ఎక్కువ మంది ఉద్యమకారులే.
-బలహీనం కావడంలో కారకులు కారు నాయకులే!
హైదరబాద్,నేటిధాత్రి:
సాఫీగా సాగాల్సిన వరంగల్ కారు విపరీతమైన కుదుపులకు లోనౌతోంది. తెలంగాణలోని ఏ జిల్లాలో లేనంతంగా ఒడిదొడుకులకు గురౌతోంది. ఎక్కడలేనంత బలంగా వున్న ఉమ్మడి వరంగల్‌లోనే ఇలాంటి పరిస్ధితి నెలకొన్నది. గత రెండేళ్లుగా ఈ ఎగుడుదిగుడు ప్రయాణం సాగుతోంది. ఎప్పటికిప్పుడు సర్ధుమనుగుతుందని అనుకుంటున్నా, చల్లారినట్లే చల్లారి మళ్లీ కుంపటి రేగుతోంది. ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింత ఎక్కుతౌతోంది. ఎప్పుడు సమసిపోతుందో అర్దం కాక సగటు బిఆర్ఎస్ కార్యకర్త తలలు పట్టుకుంటున్నాడు. సహజంగా ఎక్కడైనా ఒకే గ్రూపు వుంటుంది. కాని ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్లో గ్రూపులే గ్రూపులు. పాత గ్రూపులు, కొత్త గ్రూపులు, ఇవి కాకుండా మధ్యేమార్గ గ్రూపులు కూడా ఎన్నో వున్నాయి. వాటి గురించి రాస్తే రామాయణం అవుతుంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ అత్యంత బలంగా వుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడా ప్రతిపక్షం అన్నది కనిపించకుండా చూసుకున్నారు. కాని సొంత పార్టీలోనే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. దాంతో ఎంత బలమున్నా బిఆర్ఎస్ ఇబ్బందులు పడుతోంది. అటు ఉద్యమ కాలం నాయకులు, ఇటు కొత్తగా చేరిన నాయకుల మధ్య సఖ్యత, సమన్వయం మాత్రం ఎక్కడా కుదరడం లేదు. పైకి కనిపిస్తున్నంతగా కలుపుగోలు తనం ఎవరి మధ్యా లేదు. కేవలం నివురుగప్పిన నిప్పులా వుంది. ఎవరికి కాలుతుందో అర్ధం కాకుండా వుంది. పార్టీకి మాత్రం బాగానే సెగ తలుగుతోంది. సహజంగా ఎక్కడైనా ప్రతిపక్షాలతో అధికార పక్షానికి తలనొప్పులుండాలి. కాని ఇక్కడ స్వపక్షంలోనే విపక్షం చాలా చోట్ల తయారైంది. ఎదురు లేని చోట కొత్త కొరివి తెచ్చిపెట్టుకుంటున్నారు. నిజానికి ప్రతిపక్షం లేని చోట కారు ప్రయాణం ఎంతో సాఫీగా సాగాలి. కాని ఎగుడు దిగుడు ప్రయాణం మాత్రమే కనిపిస్తోంది. అధిప్యత పోరు అడుగడుగునా కనిపిస్తోంది. సొంత కుంపటిలోనే చిటపటల ఉప్పు కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు ఒకరు పోరుతో పొగపెట్టుకుంటున్నారు. పార్టీ పరువు తీస్తున్నారు. ప్రజల్లో వాళ్లూ చులకనౌతున్నారు. పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు. ప్రజలు బిఆర్ఎస్ను ఎంత నమ్ముతున్నారో..విశ్వాసలేమి బిఆర్ఎస్ నాయకుల్లో అంత కనిపిస్తోంది…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాల పల్లిలో రగడ తొలుత మొదలైంది.
దీనికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ అక్కడ సీనియర్ నాయకుడైన మాజీ స్పీకర్ మధుసూధనా చారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా గౌరవప్రదమైన గుర్తింపునిచ్చారు. అయినా ఆయనలో మరోసారి ఎమ్మెల్యే కావాలనో, మంత్రి కావాలన్న కోరిక మిగిలిపోయింది. నిజానికి మధుసూధనాచారికి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత గౌరవప్రదమైన స్ధానం తొలి శాసనసభ కాలంలోనే దక్కింది. కాని తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అది పార్టీ తప్పు కాదు. తెలంగాణ మొత్తం బిఆర్ఎస్ గాలి వీచినా ఆయన మాత్రం గెలవలేపోయారు. తర్వాత పార్టీలో కిరికిరి పెడుతూ వచ్చారు. ఇంతలో ఎమ్మెల్సీ పదవి రానే వచ్చింది. అయినా ఆయన కొంత కాలంగా తన రాజకీయం తాను చేయడం మొదలుపెట్టారు. కాకపోతే ఇప్పుడు సర్ధుమనిగిందనే అందరూ అనుకుంటున్నారు. ఇంకా కథ కంచికి చేరిందో లేదో అన్నది ఎన్నికల సమయం దగ్గరకొస్తేగాని తెలియదు. ఇక పరకాల నియోజకవర్గానికి చెందిన సమస్య ఇంతవరకు పెద్దగా లేదుఅక్కడ ఎమ్మెల్యే ధర్మారెడ్డికి పోటీ కూడా వున్నట్లు లేదు. ఉద్యమ నాయకులు మాత్రం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా కొన్ని గొంతులు వినిపిస్తున్నాయి. ఆయన అనుచరులు చేస్తున్న హాడావుడి ఎమ్మెల్యే మెడకు చుట్టుకునేలా రాజకీయం సాగుతోంది.
వరంగల్ తూర్పులో గత నాలుగేళ్లుగా పార్టీలో లుకలుకలు కనిపిస్తూనే వున్నాయి.
కరోనా కాలం పూర్తియిన తర్వాత తూర్పులో అలజడి మరింత ఎక్కువైంది. అక్కడ మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రస్తుతం ఎమ్మెల్సీగా వున్నారు. అయినా ఆయన వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఎంతో ఆశపడుతున్నారు. చేయాల్సినంత ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే నరేందర్‌పై నాయకుల్లో వున్న వ్యతిరేకతను పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మాజీ రాజ్యసభ సభ్యురాలు, ప్రస్తుత మేయర్ గుండుసుధారాణి కూడా అవకాశం వస్తే పోటీకి సిద్దంగానే వుంది. ఇక్కడ కూడా సస్యత లేని రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి.
స్టేషన్ ఘన్‌పూర్‌లో లొల్లి అందరికీ తెలిసిందే. ఇద్దరూ ఉద్దండులే.
ఇద్దరూ మాజీ డిప్యూటీ సిఎంలే. కాని ఇక్కడి వివాదం చాలా విచిత్రమైంది. ఇద్దరు ఉన్నత విద్యావంతుల మధ్య అగాధం బాగా పెరిగిపోయింది. గతంలో ఇద్దరూ వైరి శిభిరాల్లో వుండేవారు. ఇప్పుడు ఒకే గూటిలో వున్నారు. ఇద్దరూ చెరో పదవిలోనే వున్నారు. కాకపోతే కడియం శ్రీహరి తనకు పోటీగా రావడం ఎమ్మెల్యే రాజయ్యకు సుతారం ఇష్టంలేదు. ఆసారి ఒక్కసారి నాకు అవకాశం వస్తే బాగుండు అన్న ఆలోచనతో కడియం వున్నారు. కాకపోతే ఈ ఇద్దరి వైఖరి పార్టీకి తలనొప్పినే తెచ్చిపెట్టింది. తప్పు ఎవరిదన్నది పక్కన పెడితే ఇద్దరూ విజ్ఞులే. కాని స్టేషన్ రాజకీయం చిందరవందర చేసిపెట్టారు.
జనగామ రాజకీయం మరీ విచిత్రం.
ఇక్కడ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి తన కూతురే ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఓ వైపు ఎమ్మెల్యే మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న సంకేతాలు వస్తున్న వేళ, తన కూతరు రూపంలో యాదగిరి రెడ్డి రాజకీయానికి పుల్‌స్టాప్ పడేదాకా వచ్చింది. ఎక్కడైనా వారసులు తమ కుటుంబ రాజకీయం రాజ్యమేలాలని చూస్తారు. కాని ముత్తిరెడ్డి కుటుంబం విషయంలో ఏముందో గాని, ముత్తిరెడ్డి రాజకీయానికి తన కూతురే అడ్డంకిగా మారింది. దాంతో ఆయన వ్యవహర శైలి పార్టీకి తీరిన నష్టం చేకూర్చిపెడుతోందన్నది నిర్వివివాదాంశం. ఎందకంటే బాజాప్తా భూకభ్జా చేసినట్లు, అది ప్రజల కోసమే అన్నట్లు చెప్పడం రాజకీయాలు ఇలా కూడా చేస్తారా? అన్న అనేక శేషప్రశ్నలకు తావిచ్చినట్లైంది.
ఇక మహబూబాబాద్ నియోజకవర్గం విషయంలో ఉద్యమ కారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై సొంత పార్టీలోనే నేతలే కత్తికటారు.
నిజానికి కొన్ని వివాదాలు తప్ప, ప్రజల నుంచి మాత్రం ఎమ్మెల్యేకు పెద్దగా వ్యతిరేకత లేదు. అయినా ఇక్కడ ప్రస్తుత ఎంపి. మాలోతు కవిత పోటీ చేయాలన్న ఆలోచనతోవుంది. అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మామిడి తోట రాజకీయం కొందరు నెరిపారు. మానుకోట రాజకీయం రసకందాయంలో పడేశారు.
డోర్నకల్ లో రెడ్యా నాయక్‌పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది.
పార్టీ బలంగా వుంది. అక్కడ పోటీ చేసేందుకు మాలోతు కవిత శ్రద్ద చూపడం లేదన్నది ఒక వార్త. అక్కడ మరో కుటుంబం రాజకీయం పెద్దగా ఎదగలేదు. ఇలాంటి సమయంలో అక్కడ ఎవరు పోటీ చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. దాంతో పార్టీ బలంగా వున్నా, లుకలుకలు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించేందుకు ఆస్కారం లేకపోలేదు.
ములుగులో బిఆర్ఎస్ బలంగానే వుంది.
కాకపోతే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆ నియోజకవర్గంలో పాగా వేయాలంటే బిఆర్ఎస్ నాయకులంతా కలిసి కట్టుగా వుంటే, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు ఎవరూ ఆపలేరు. కాని బిఆర్ఎస్లో పెద్ద పెద్ద నేతలే అక్కడ సీతక్కకు సహకరిస్తున్నారన్నది భహిరంగ రహస్యమే. అక్కడ పార్టీ ఈసారి సీటును సాధిస్తుందా? మళ్లీ పోగొట్టుకుంటుందా? అన్నది నాయకుల ఐక్యతతో తేలాల్సివుంది. ఇక ఉమ్మడి వరంగల్జల్లాలో పోరు లేని, కుంపట్లు రాజేయని నియోజకవర్గాలు కూడా మూడున్నాయి. నర్సంపేటలో ఎలాంటి వివాదంలేదు. వరంగల్ పశ్చిమలో బిఆర్ఎస్కు ఎదురులేదు. పాలకుర్తి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదీ మ్యాటరు..!