`మహబూబాబాద్ పొలిటికల్ కహానీ!
`కవితే..నా! అసలు కిరికిరి!?
`సిట్టింగ్ స్థానంలో సిగపట్లేమిటి?
`ప్రతిపక్షాలకు అవకాశమివ్వడమేమిటి?
` జిల్లా అధ్యక్షురాలై వుండి ఇదేం పని?
` పార్టీ నిలబెట్టే పని వదిలేసి, పొగబెట్టడమేమిటి?
`సమన్వయం వదిలేసి ఎగదోయడేమిటి?
` జిల్లాలో ఈ లుకలుకలేమిటి?
`ఇప్పటికే మూడు పదవులు మీ ఇంటికి?
`మళ్ళీ కొత్త పంచాయతీ ఏమిటి?
`బలమైన చోట బలహీనం చేయడమేటి?
`జిల్లా అధ్యక్షురాలిగా ప్రతిపక్ష పాత్రకర్థమేమిటి?
` తెలిసి జరుగుతోందా? తెలియాలనే జరుగుతోందా?
`సమస్య సర్థుమనగకపోతే అన్ని వేళ్లు కవితవైపే?
`ఏక కాలంలో ఎన్ని పదవులు కావాలేమిటి?
`డోర్నకల్ కాదనుకోవడంలో అసలు తిరకాసేమిటి?
`గెలిపించాల్సిన స్థానంలో కూర్చొని అస్త్ర సన్యాసమేమిటి?
`సిట్టింగ్ స్థానం ఆశించడంలో ఔచిత్యమేమిటి?
`పార్టీ శ్రేణుల ఆందోళన గుర్తించే వారేరీ!
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో బలం లేక ప్రతిపక్షాలు బాదపడుతున్నాయి. అధికార పార్టీ బలముండి తలనొప్పులను కొని తెచ్చుకుంటోంది. ఎదురులేని చోట కుంపటి రగించుకుంటున్నారు. ఆదిపత్య రాజకీయాలలో పార్టీ పరువును తీస్తున్నారు. జిల్లా అధ్యక్ష స్ధానంలో వుండి పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నట్లు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ప్రతిపక్షాలు ఎలా బలపడాలని ఎదురుచూస్తున్నా, ప్రజలు వారివైపు చూడడం లేదు. ప్రతిపక్షాలను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేదు. కారణం ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన. నాయకులు ఎలా వున్నా, వారి వ్యవహారం ఎలా వున్నా, ప్రజలు కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ అందిస్తున్న పాలనవైపు చూస్తున్నారు. ఇది తెలిసిన కొందరు నేతలు సొంత బలం లేకపోయినా, నాయకుల మధ్య చిచ్చు పెట్టి టిక్కెట్ సాధించాలన్న ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల వల్ల పార్టీకే తీరని నష్టం జరుగే అవకాశం వుం ది. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదన్నదానిపై కూడా చర్చ సాగుతోంది. అయితే అక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వడం న్యాయం. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వడం అసవరం. కాని ఎలాంటి నాయకత్వ సమస్య లేని చోట, గందరగోళలం సృష్టించి, లేని వివాదాలు రగిలించి రాజకీయాలు కూడా కొందరు చేస్తున్నారు. పెద్దన్న పాత్ర పోషించే స్ధాయిలో వున్న నేతలు కూడా పార్టీలో కయ్యానికి తెరతీయడం అన్నది సరైందికాదు.
మహబూబాద్ జిల్లాలో ఇప్పుడు ఇదే జరుగుతుందని తెలుస్తోంది.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలంగాణ ఉద్యమకారుడు. ఉద్యోగం వదులుకొని మరీ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు. అక్కడ ఉద్యమాన్ని భుజాన వేసుకొని నడిపాడు. ముందుండి కొట్లాడిన నేత శంకర్ నాయక్. ఉద్యమకాలంలో నెగ్గుకు రాగలిగిన శంకర్ నాయక్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావడం శోచనీయం. ఉద్యమకారుడిని కూడా ఇబ్బందులకు గురిచేసే పరిస్ధితులు సృష్టిస్తున్నారు. నిజానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ వల్ల, ఆ నియోజకవర్గ పరిధిలో ప్రతిపక్షాలు చోటు లేకుండా పోయింది. అటు ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన, ఇటు ఎమ్మెల్యే పనితీరుతో ప్రజలు సంతోషంగానే వున్నారు. పార్టీకి పటిష్టం చేయడంలో శంకర్ నాయక్ పాత్ర కూడా ఎంతో వుంది. భవిష్యత్తులో తన రాజకీయానికి ఎదురులేకుండా చూసుకోవడంలో, ప్రతిపక్షాలకు ఉనికి లేకుండా చేశాడు. బిఆర్‌ఎస్‌కు కంచుకోటను చేశాడు. అదే ఇప్పుడు ఆయనకు తెలనొప్పిని తెచ్చిపెట్టేలా చేస్తోంది. బలమైన నేతగా వున్న ఆయన స్ధానం కోసం జిల్లా అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు కవిత ఎప్పటినుంచో ప్రతయ్నం చేస్తోందన్న ప్రచారం బలంగానే వుంది. అందుకే ఇదంతా జరుగుతోందన్న ప్రచారం వుండనేవుంది. ఆమె తండ్రి రెడ్యానాయన్ పక్కనే వున్న డోర్నకల్ నియోజకవర్గంలో కొన్ని దశాబ్ధాలుగా రాజకీయాలు శాసిస్తున్నారు. ఆ స్ధానం మాలోతు కవిత కోరుకుంటోందంటే అర్ధముంది. కాని డోర్నకల్ వద్దనుకొని, మహబూబాబాద్ కావాలని కోరుకోవడం అంటే పార్టీలోనే చిచ్చు రేపడమౌతుంది.
మాలోతు కవిత. ఇప్పటికే పార్లమెంటు సభ్యురాలు.
ఆమె పదవీకాలం ఇంకా ఏడాదికిపైగా వుంది. ఆమె పోటీ చేయాలనుకుంటే డోర్నకల్ నియోజకవర్గం వుంది. కాని అక్కడ ఆమె తండ్రి రెడ్యానాయక్‌పై ప్రజలు తిరగబడుతున్న పరిస్దితులు చూస్తున్నాం. దాంతో ఆమె అక్కడ పోటీ చేస్తే మొదటికే మోసానికి వస్తుందేమో? అన్న అనుమానంతో బిఆర్‌ఎస్ బలంగా వున్న మహబూబాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించే ఎత్తుగడ వేస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెకు ఇప్పటికే రెండు పదవులున్నాయి. ఒకటి పార్టీ జిల్లా అధ్యక్షపదవి వుంది. మరొకటి ప్రజా ప్రతినిధిగా పార్లమెంటు సభ్యురాలుగా వున్నారు. అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే ఆమెకు మరో రెండు నియోజకవర్గాలు కూడా ఎంచుకునే అవకాశం వుంది. ఆమె పార్లమెంటు పరిధిలో వున్న ములుగు, డోర్నకల్ కూడా వుంది. ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వుంది. ఆమెను ఓడిరచి, బలమైన నాయకురాలుగా గుర్తింపు పొందాలన్న తపన వుంటే ఆ నియోజకవర్గం ఎంచుకుంటానంటే పార్టీ కూడా స్వాగతించేందుకు ఆస్కారం వుండేది. డోర్నకల్ కూడా అందుబాటులోనే వుంది. ఈ రెండూ కాదని మహబూబాబాద్ కావాలని అక్కడ అస్ధిర రాజకీయాలకు ఆజ్యం పోయడం అంటే పార్టీకి తీరని నష్టం కల్గించడమే అవుతుంది.
ఈ మధ్య ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం అందిన వెంటనే మహబూబాబాద్‌లో ఓ నాయకుడి మామిడి తోటలో బిఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడా ఇంత వరకు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిరది లేదు. తమ నియోజకవర్గం అభివృద్ది జరగలేదని చెప్పింది లేదు. ఎక్కడా పేచీ లేదు. రైతులు కూడా తమకు నీళ్లు రావడం లేదనో, కరంటు సరిగ్గా రావడం లేదనో కూడా రోడ్డెక్కింది లేదు. ఇతర సంక్షేమ పధకాల అమలులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్టించుకోవడం లేదనో, ఇబ్బందులకు గురి చేస్తున్నాడనో వార్తలు కూడా రాలేదు. కాని ఎన్నికల తరుణం దగ్గరకు వస్తున్న సమయంలో అదును చూసి, కొంత మంది ఎమ్మెల్యేను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో జిల్లాపార్టీ అధ్యక్షురాలుగా వున్న మాలోతు కవిత సమస్యను ఇక్కడే పరిష్కరించాల్సిన బాధ్యత ఆమెపై వుంది..
కాని సమస్యకు అసలు కారణమే ఆమె అన్న తేలడంతో ఇక పార్టీ శ్రేణులు ఏం చేయాలో అన్న ఆందోళనలో వున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నియోకవర్గం వరకు ఎమ్మెల్యేలే సుప్రిం అన్నది అనేక సార్లు స్పష్టం చేశారు. ఎంపిలైనా, ఎమ్మెల్సీలైనా సరే ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దన్న ఆదేశాలు కూడా వున్నాయి. అయినా శంకర్‌నాయక్ సీటు మీద కన్నెసిన మాలోతు కవితే, పార్టీ అధ్యక్ష స్ధానంలో వుండి కూడా సమస్యకు ఆజ్యం పోస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా బలమైన స్ధానంలో సొంత పార్టీలోనే ఇలాంటి సిగపట్లు వుంటే , ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లౌవుంది. లుకలుకలు లేని చోట అనవసర రాద్దాంతాలు సృష్టించి, పార్టీని పరువును బజారున పడేసుకోవడాన్ని ప్రజలు కూడా స్వాగతించరు. కాంగ్రెస్ పార్టీలోనే ఇలాంటి రాజకీయాలు వుంటాయని ఇంత కాలం చెప్పుకుంటున్న ప్రజలు మహబూబాబాద్ రాజకీయాలు చూసి బిఆర్‌ఎస్ కూడా తక్కువేం కాదన్న విమర్శలు చేసే దాకా తెచ్చుకోవద్దు. పార్టీకి నష్టం చేకూర్చే పనులు ఎవరూ చేసుకోవద్దు. అధికారంలో లేక ప్రతిపక్షాలు మధనపడుతుంటే, అధికారంలో పార్టీలో లుకలుకలు మంచిది కాదు. నాయకుల తీరు కూడా ప్రజాతీర్పు మీద ప్రభావం చూపుతుందని మర్చిపోవద్దు.