ప్రభుత్వాసుపత్రిలో ప్రసవ సేవలు భేష్…
ఆర్టీసీ డ్రైవర్ ఔదార్యం
ఆర్టీసీ డ్రైవర్, ప్రభుత్వాసుపత్రి వైద్యలను పలువురు అభినందించారు.
ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులు- సమయస్ఫూర్తి కనబర్చిన డ్రైవర్
గర్భిణీని ప్రభుత్వాసుపత్రికి తరలింపు…
ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం- పండంటి బిడ్డ జననం
భూపాలపల్లి,నేటిధాత్రి: ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న గర్భిణీ సెగ్గం లహరికి వున్నట్టుండి నొప్పులు మొదలయ్యాయి. విషయం తెలిసిన బస్సు డ్రైవర్ హుటాహుటిన బస్సును భూపాలపల్లి జిల్లా వంద పడకల ప్రభుత్వాసుపత్రికి మళ్లించాడు.
మధ్యలోనే ఆసుపత్రికి కండక్టర్ సమాచారం చేరవేశారు. స్పందించిన ప్రభుత్వాసుపత్రి వైద్యరాలు డాక్టర్. మౌనిక నేతృత్వంలోని బృందం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సు ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకునే సరికి స్టేచర్తో సహా సిబ్బంది రెడీగా వున్నారు. వెంటనే లహరిని ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లలోకి తరలించారు. లహరికి సాధారణ ప్రసవం చేశారు. పండంటి బాబుకు లహరి జన్మనిచ్చింది. దాంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రి వాతావరణం సందడిగా మారింది. సమయానికి స్పందించి బస్సును ఆసుపత్రికి తీసుకొచ్చిన డ్రైవర్ ను అందరూ అభినందించారు. సకాలంలో స్పందించిన ఆసుపత్రి సిబ్బందికి లహరి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ వుంది. ప్రవస సమయం తెలుసుకునేందుకు మహా ముత్తారం మండలం పొలంపల్లి లహరి పరకాలలో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ప్రసవానికి ఇంకా సమయం వుందని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో ఆమె తిరుగు ప్రయాణమైంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. చివరికి కథ సుఖాంతమైంది. ఈ వైద్యంలో స్టాప్ నర్సు మానస,నరేష్,ఎఫ్ ఎన్‌ఓ సౌందర్యలు పాల్గొన్నారు. లహరికి మూడు కిలోల బాబు జన్మించాడని ,తల్లి బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సంజీవయ్య ఆకుల తెలిపారు.