దిగజారుడు, దివాళాకోరు రాజకీయం బిజేపిది: మంత్రి హరీష్‌రావు.

`నోరు తెరిస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పలేని బిజేపినేతలు.

`చెప్పుకోవడానికి నిజాలు లేక, అబద్దాల మీద రాజకీయాలు చేస్తున్నారు. 

`పదే పదే అబద్దాలు ప్రచారం చేసి, నిజాలని నమ్మించాలని దిక్కుమాలిన రాజకీయాలు బిజేపివి.

`రాష్ట్రంలో అతి ఎక్కువ రైతు బంధు అందుతున్న నియోజకవర్గం మునుగోడు.

`మునుగోడులో 1,01279 మంది రైతులు రైతు బంధు పొందుతున్నారు. 

`వానాకాలంలోనే 131 కోట్ల, 82లక్షల రూపాయలు అందించడం జరిగింది. 

`40వేల ఆసరా పెంన్షన్లు అందుతున్నాయి. 

`1200 మంది రైతులకు రైతు భీమా అందింది.

`టిఆర్‌ఎస్‌ ఫ్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంటే…బిజేపి కేంద్రం ధరలు పెంచుతోంది. 

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అబద్దాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన బిజేపి నాయకులు తీరు దివాళాకోరు తనాన్ని చూపిస్తుందని, చిల్లర చేష్టలతో దిక్కుమాలిన రాజకీయం

చేస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బిజేపి నేతల తీరును తూర్పార పట్టారు. మునుగోడులో ముఖ్యమంత్రి కేసిఆర్‌ సభ సక్సెస్‌ కావడంలో బిజేపి నేతలకు మతి పోయినట్లైంది.

ప్రజలు చండూరు సభకు పెద్దఎత్తున స్వచ్ఛందంగా తరలిరావడం బిజేపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి సభకు అంత పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడంతో తమ ఉనికే ప్రమాదంలో పడిరదని బిజేపి గాయిగత్తర చేస్తోందన్నారు. చండూరు సభతో టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమైందన్నది బిజేపి నేతలకు పూర్తిగా స్పష్టమైంది. తెలంగాణ ప్రజల విశ్వాసానికి ప్రతిరూపమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి తాము అండా దండా అని ప్రజలు మరోసారి నిరూపించారని వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు అని హరీష్‌రావు అన్నారు. ఈ సభ విజయవంతం కావడంతో బిజేపి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, బండి సంజయ్‌కి కంటిమీద కునుకు లేకుండాపోయిందని మంత్రి ఎద్దేవా చేశారు. మునుగోడులో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. బిజేపి వాళ్ల మాటలను గురించి దేశంలో ఎక్కడ అడిగినా వాళ్ల వెకిలి, మకిలి మాటలే కాదు, సర్వం అబద్దాల మయమని ఎద్దేవా చేశారు. వారి బతుక్కి ఒక్క నిజం కూడా చెప్పరని అన్నారు. అబద్దాలు ఆడడమే బిజేపి పార్టీ డిఎన్‌ఏ అని మంత్రి విమర్శించారు. రాజ్యాంగబద్దమైన పదవుల్లో వున్న కేంద్ర మంతులు పచ్చి అబద్దాలు ఆడడానికి కూడా వెనుకాడడం లేదని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. 

 సీఎం సభ తర్వాత బిజేపి నేతలకు దిమ్మ తిరిగి ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాక, వింత వింత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. 

డిల్లీ నుంచి వచ్చిన బిజేపి నాయకులు గల్లీ నాయకులకు తీసిపోని విధంగా మాట్లాడడం విడ్డూరమన్నాడు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర నాయకులను ఆ పార్టీ నేతలే విశ్వసించడం లేదన్నది తేలిపోయిందని, దాంతో వారి స్ధాయి ఏమిటో అర్ధమైందన్నారు. ప్రజాస్వామ్యంలో బిజేపి నేతల తీరు చాలా బాధాకరమన్నారు. వ్యవసాయానికి మీటర్ల మీదగాని, జిఎస్టీల మీద గాని నిజాలు మాట్లాడే శక్తి బిజేపి నేతలకు వుందా?అన్నారు. ఎనమిదేళ్లలో తెలంగాణలోఎంత అభివృద్ధి జరిగిందో బిజేపి నేతలు కళ్లుండి కూడా చూడలేకపోతే వారిపై జాలి పడడం తప్ప చేసేదేమీ లేదన్నారు. మునుగోడులో తిరుగుతూ మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడలేక పోతున్నారు. మునుగోడులో ఫ్లోరైడ్‌ గోస తీర్చిన ఘనత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుంది. శుద్ధిచేసిన కృష్ణానది నీళ్లు ఇంటింటికీ చేరుతున్నారు. మంచినీళ్ల కోసం బిందె భుజం మీద పెట్టుకొని నాలుగేళ్లయిందని, ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్లనే మా కష్టం తీరిందని ఓ చెల్లె చెప్పిందని మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు. ఎల్బీనగర్‌ నుంచి నీళ్ల క్యాన్‌లు వస్తే మంచినీటి చుక్క దొరకని పరిస్దితి ఒకనాడు మునుగోడుది. అలాంటి మునుగోడులో ఇప్పుడు ఇంటింటికీ మంచినీరు అందుతుండడం నిజం కాదా? ఆయన ప్రశ్నించారు. అయినా అబద్దాలు ఆడే బిజేపి నేతలకు కర్రుకాల్చి వాతలు పెట్టాల్సిందేనన్నారు. 

 ప్రతి ఇంటికీ తాగునీరు, రైతు బందు, సాగుకు ఉచిత విద్యుత్‌,రైతు భీమా, కళ్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్‌,వంటి పధకాలు కూడా మునుగోడులో అందిన సంగతి బిజేపి నేతలకు కనిపించడం లేదా?

 డిల్లీలో, హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడడం కాదు…మునుగోడు వెళ్లి ప్రజలను అడిగితే చెబుతారు అని హరీష్‌రావు అన్నారు. తెలంగాణ వచ్చాక, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల ప్రతి ఇంటికి మునుగోడులో ఏదో రకమైన సంక్షేమ పధకం అందింది. కాని బిజేపి వల్ల రూ.400 వున్న సిలిండర్‌ ధర రూ.1200 అయ్యింది. మేం సంక్షేమ పథకాలు పంచితే, బిజేపి ధరలుపెంచిండ్రని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనే అతి ఎక్కువ రైతు బంధు పొందిన నియోజకవర్గం మునుగోడు. మా ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఆశ చూపించినా, వాటిని గడ్డిపోచల్లా వదులుకొని ప్రజా స్వామ్యపరిరక్షణకు నిలబడ్డారని అదీ టిఆర్‌ఎస్‌కు వున్న నిబద్దత అని మంత్రి అన్నారు. 

 రాజ్యాంగ బద్దంగా నిబందనలకు అనుగుణంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేల టిఆర్‌ఎస్‌లో విలీనమయ్యారే గాని, బిజేపిలా ప్రభుత్వాలను కూలగొట్టలేదని హరీష్‌రావు అన్నారు.

 ఈడిలు, బోడీలు నిజాయితీకి ప్రతీరూపమైన టిఆర్‌ఎస్‌ నాయకులను ఏమీ చేయలేరన్నారు. అబద్దాన్ని పదే పదే వల్లిస్తూ నిజం చేయాలని బిజేపి చూస్తోందని ప్రజలు ఈ విషయాన్ని గమనించారన్నారు. బిజేపి చెప్పే మాటల్లో ఏ ఒక్కటీ నిజం లేదన్న విషయం రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతులకు తెలియాల్సిన అసవరం వుందని మంత్రి అన్నారు. రైతుల ఉరితాడుకు వేళాడే పరిస్ధితి బిజేపి తెవాలని చూస్తుంటే, రూ.35వేల కోట్లు కాదని రైతులే తమకు ముఖ్యమనుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని హరీష్‌రావు చెప్పారు. వ్యవసాయ మీటర్లు పెట్టమని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని వివరించారు. జిఎస్టీ మీద హరీష్‌రావు సంతకం చేశాడని పచ్చి అబద్దాలు చెప్పడం కిషన్‌రెడ్డి,సంజయ్‌లు మానుకోవాలని హితవు పలికారు. చిన్న పిల్లాడికి సైతం బిజేపి నేతలవి చిల్లర మాటలని తెలిసిపోతుందన్నారు. ఓట్ల కోసం ఇంత దిగజారి మాట్లాడతారా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేసి, ఆఖరకు ఏం చేప్పారో తెలిసిందే…మాట మీద నిలబడే తత్వం బిజేపిలో లేదన్నది ఎప్పుడో నిరూపించారు. ఇంకా ఆ పార్టీని ప్రజలు నమ్మడం అన్నది కలలో కూడా జరగదన్నారు. చేనేతపై జిఎస్టీ అమలు చేయొద్దన్నదానిపై అప్పటి ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ బిజేపిలోనే వున్నారని, నిజం తెలుసుకొని మాట్లాడాలని హరీష్‌రావు అన్నారు. జిఎస్టీ విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేసిన బిజేపి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కోసం రూ.800 కోట్లు ఇచ్చినట్లు కిషన్‌ రెడ్డి చెప్పడం అంతకన్నా పచ్చి అబద్దం ఏమైనా వుంటుందా? అని మంత్రి నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!