`బాజాప్త కబ్జా …అయితే ఏంది!? : ముత్తిరెడ్డి సమర్థింపు.
` నువ్వు కబ్జాలు చేయలేదా?
` నేనొక్కడినే చేశానా?
`నీ కబ్జాల చిట్టా మొత్తం నా దగ్గర వుంది?
` నేను ప్రజల కోసం కబ్జా చేసిన?
`ముత్తిరెడ్డి వింత వాదన?
`ప్రజా సేవ కోసం కబ్జానా జనం చీకొట్టరా?
`ఇలా చెప్పే వాళ్లను సమర్థిస్తారా?
`వినేవాళ్లు వెర్రివెంగలప్పలా?https://netidhatri.com/what-is-left-for-the-congress-is-a-dream/
హైదరబాద్,నేటిధాత్రి:
కబ్జా చేయడం తనకు జాగీరైనట్లు, అది తప్పే కానట్లు, చేసింది గొప్ప పని అన్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పిన సుద్దులు ఆశ్చర్యకరంగా వుంది. దానికి తోడు నవ్వేమైనా తక్కువా…నువ్వు కబ్జాలు చేయలేదా? అంటూ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి గురించి ముత్తిరెడ్డి వ్యాఖ్యానించ ఇద్దరం…దొందేలే అని చెప్పినట్లుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లుంది జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్యలు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకైనా అర్థమౌతుందా? అనే దాక వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యాడో…అప్పటి నుంచి వివాదాలే! వివాదాలు!! అయినా కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం, పాలన కోసం ప్రజలు ముత్తిరెడ్డి ని భరిస్తున్నారు. ఇదే వాస్తవమని బిఆర్‌ఎస్ నాయకులే అంటున్నారు. ముత్తిరెడ్డి విషయంలో వివాదం లేని సమయం లేదు…సందర్భం లేదు. గతంలో కొంత గంభీరంగా మాట్లాడే వారు. కోపంతో ఊగిపోయేవారు. ఇప్పుడు అదును చూసి అప్పుడప్పుడు ఏడుస్తూవున్నాడు. సమావేశాల్లో కొన్ని సార్లు ఆయనే నిరసన తెలుపుతున్నారు. సభల్లో నేల మీద పడుకొని నిరసనలు తెలియజేస్తాడు. అప్పడే రైతులను బెదిరిస్తాడు. ఏక కాలంలో అనేక డైమన్షన్లు చూపిస్తుంటాడు. తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా వింతగా వున్నాయి. అంతే కాదు…నేనింతే! అన్నట్లు వున్నాయి. కబ్జాల విషయంలో తాను బాజాప్త చేశానని ఆయనే ఒప్పుకున్నాడు. పైగా కబ్జా చేసిన స్థలాన్ని జనానికి దానం చేసినంత దాన కర్ణుడిలాగా మాట్లాడుతుంటాడు. ప్రజల భూమిని కబ్జా చేయడమే నేరం. దాన్ని సమర్థించుకోవడం అంతకన్నా నేరం. తన కూతురు అమాయకురాలు కాబట్టి భూమి వదిలేసుకున్నది అని తనే అంటాడు. అలా తన కూతురు చేర్యాల చెరువు భూమి ప్రజలకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని అంటాడు. అంటే తన కూతురు అలా భూమి ఇవ్వడం ఇష్టం లేదని పరోక్షంగా చెప్పుకుంటున్నాడు. ఇదిలా ఉంటే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే గా వున్న సమయంలో అనేక అక్రమాలు చేసినట్లు ముత్తిరెడ్డి ప్రకటించారు. వెంచర్ చేసి, ప్రజలకు, ప్రభుత్వానికి అందించాల్సిన స్థలం కూడా కొమ్మూరి ఇవ్వలేదని ముత్తిరెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లుగా ముత్తిరెడ్డి ఎమ్మెల్యేగా వుండి ఏం చేస్తున్నట్లు? చోద్యం చూస్తున్నాడా? ఎవరికి చెబుతారు? ఈ కల్లబొల్లి మాటలు అని జనం ఈసడిరచుకున్నారు. కూతురు ను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఎన్నికలలో గెలవాలని సరికొత్త నాటకానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెరతీసినట్లు జనం చెప్పుకుంటున్నారు. చివరగా అసలు విషయం చెప్పుకోవాలి. ఇటీవల ముత్తిరెడ్డి కూతురు తన తండ్రికి వెయ్యి కోట్ల ఆస్థి వుంది. నెలకు కోటిన్నర రెంట్లే వస్తాయి అని చెప్పింది. మళ్ళీ ఎమ్మెల్యే కూతురు తుల్జా భవానీ రెడ్డి మా నాన్న ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడు అని చెప్పింది. ప్రజలు ఒక వేళ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే సంపాదించాడన్న సంకేతాలు వెళ్లే ప్రమాదముందని గ్రహించి సరిదిద్దే ప్రయత్నం చేసింది. అంటే తండ్రి, కూతురు చాలా చక్కని స్క్రీన్ ప్లే రచించారు. ఇదిలా ఉంటే జనగామ రాజకీయాలు గుత్తకు తీసుకున్నట్లు, కబ్జాలు వాళ్ల హక్కు అన్నట్లు ఇద్దరు నేతలు ముత్తిరెడ్డి, కొమ్మూరి ల మధ్య సంవాదం చాలా విచిత్రంగా ఉంది. నా బాగోతం నాకు తెలుసు, నీ బాగోతం నాకు తెలుసు అని చెప్పుకుంటూ భలే నాటకాలు ఆడుతున్నారు. ప్రజల ముందుకు వచ్చేది, ఎన్నికలలో నిలబడేది, రాజకీయాలు చేసేది ఇందుకేనా? ప్రజలకు సేవ చేయడం అన్నది అటు ముత్తిరెడ్డి, ఇటు కొమ్మూరి మర్చిపోయారా? ఇక ముత్తిరెడ్డి చెప్పే విషయాలు కొన్ని అటు పార్టీని, ఇటు ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఇరుకున పట్టేలా? వున్నాయి. నేనేంటో, నేను చేసేవేమిటో అన్నీ సిఎం. కేసిఆర్ కు తెలుసు అని చెప్పడంలో ముత్తిరెడ్డి ఆంతర్యమేమిటన్న దానిపై చర్చ మొదలైంది. అసలు ముఖ్యమంత్రి కేసిఆర్ ఇలాంటి వాటిని సమర్థిస్తారా? ఇంకా ఇలాంటి నాయకులను ఉపేక్షిస్తూ పోతే రాజకీయాలంటేనే ప్రజలు విసుగెత్తిపోయే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా ముత్తిరెడ్డి, కొమ్మూరి లాంటి నాయకులను రాజకీయాలు చేయడాన్ని ప్రజలు మాత్రం హర్షించరు.