`అధికారుల వత్తాసుతో భూ ఆక్రమణ..
`ప్రభుత్వ స్థలం హాంపట్….
`రోడ్డును మింగేసి షెడ్డు నిర్మాణం…
`చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం.
`జూబ్లీ హిల్స్ క్లబ్ మెంబర్ షిప్ కు డిప్యూటీ కమిషనర్ కక్కుర్తి?
`కోట్లాది రూపాయల భూమి సంతర్పణం.
`అక్కడ గజం మూడు లక్షల పైమాటే.
`ముందు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు.
`వెనక వున్న ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారు.
`అడిగేవారు లేడు…పట్టించుకోవాల్సిన అధికారి రాడు.
`ఇష్టారాజ్యం…పిల్మ్ నగర్లో భూములు భోజ్యం.
`ఫిల్మ్ నగర్ చుట్టూ ఆక్రమణలే…ప్రభుత్వ భూములు చెరబట్టుడే.
హైదరాబాద్,నేటిధాత్రి:
కనిపిస్తే కన్నేయడమే! కాజా తిన్నంత సులువుగా భూమిని కబ్జాపెట్టేయడమే! అతని పని. ఇది జూబ్లిహిల్స్‌లో చాలా మందికి తెలిసిన బాగోతమే! అది ప్రభుత్వ స్ధలమైనా సరే అతను కబ్జా చేస్తాడు. అది జనం నడవాల్సిన రోడ్డైనా సరే…ఆక్రమించేసుకుంటాడు. అక్కడ షెడ్లు నిర్మాణం చేసేస్తుంటాడు. పేరు మాత్రం చాలా పెద్దది. అందుకే ఇలాంటివి చేస్తుంటాడు. ఆ పేరును అడ్డం పెట్టుకొని అడ్డదడ్డమైన పనులు చేయపోతే ఎలా అనుకుంటాడో ఏమో! కాని చెప్పలేనన్ని ఆరోపణలు మూటగట్టుకున్నాడు. అనేక కేసులు కూడా ఎదుర్కొంటున్నాడు. అయినా కబ్జా మాత్రం ఆపడు. ఆక్రమణలు వదిలిపెట్టడు. జూబ్లీహిల్స్ ఏరియాలో రోడ్డు కూడా ఖాళీగా కనిపించకూడదు. కనిపిస్తే ఇక అంతే…వాటిని ఆక్రమించేయడం…అమ్ముకోవడం..సొమ్ము చేసుకోవడం….కోట్లు కూడబెట్టుకోవడమే…ఆతని పని. ఏ భూమి ఆక్రమించినా దానికో మతలబు ముడిపెడుతుంటాడు. చెప్పడానికో సాకు వుంటుంది. పెద్దోళ్లందరూ ఆయన వెనకాలే వుంటారు. అధికారులు కూడా అతనికే వంతపాడుతుంటారు. ఇక భూములు ఎందుకు ఆక్రమించడు? ఒక రకంగా ఆయన జూబ్లిహిల్స్ మున్సిపల్ సర్కిల్లో ఆయన ఎంత చెబితే? అంత? ఏది చెబితే? అది? చెల్లుబాటు కావాల్సిందే…ఇప్పటిదాకా అవుతున్నదే? అది…ఏ అధికారైనా సరే ఊ అనాల్సిందే..ఊ కొట్టాల్సిందే…! అతను చేసే ఆక్రమణలన్నీంటికీ అధికారులనుంచి అనధికార అనుమతి వున్నట్లే లెక్క. అలాంటిదే ఈ కొత్త భూ ఆక్రమణం…!
అది జూబ్లీహిల్స్‌లోని మెయిన్ రోడ్డు స్ధలం.
120 ఫీట్ల రోడ్డు. ఆ రోడ్డు మీద గతంలో కొందరు మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే కొంత ప్రభుత్వ స్థలం వుంది. దానిపై ఆ వ్యక్తి కన్ను పడిరది. ఎలాగైనా ఆ స్ధలం సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు సమయం ఆసరాగా తీసుకున్నాడు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సహకరించాడు. తొలుత జిహెచ్ఎంసి ఒప్పుకోలేదు. దాని వెనకాల ఈ వ్యక్తివున్నాడని తెలియక జిహెచ్ఎంసి అధికారులు కాదన్నారు. అసలు విషయం తెలిశాక ఓకే చెప్పేశారు. ఆ తర్వాత ఓ ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకోవడంతో అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇదే అదునుగా అటు విగ్రహ నిర్మాణం చేపట్టారు. ఆ విగ్రహావిష్కరణ పూర్తి పూర్తిచేశారు. ఆ విగ్రహం వెనక వున్న స్ధలం అతను కబ్జా చేశాడు. దానిలో నిర్మాణాల మొదలుపెట్టేశాడు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం అని అనుమానం రాకుండా పూర్తి చేస్తున్నాడు. అందుకు జిహెచ్ఎంసికి చెందిన డిప్యూటీ కమీషనర్ వ్యవహార శైలి ఉపయోగపడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్ క్లబ్లో కీలక పాత్ర దారిగా వున్న అతను, డిప్యూటీ కమీషనర్‌కు క్లబ్లో సభ్యత్వం ఇస్తానన్న వాగ్ధానం చేసినట్లు తెలుస్తోంది. దాంతో జిహెచ్ఎంసి అటు వైపు చూడడం కాని జరగడంలేదు. ఇక టౌన్ ప్లానింగ్‌కు చెందిన ఓ అధికారిని కూడా అందుకు సహకరిస్తోందన్న విమర్శలు వున్నాయి. ఫిల్మ్ నగర్‌లోని మెయిన్ రోడ్డులో స్థలం కాజేయడం అంటే మాటలు కాదు. అధికారుల పూర్తి సహకారంతోనే జరుగుతోంది.
ఈ స్ధలంలో వివాదం చాల రోజుల నుంచి నడుతున్నాడు.
గతంలోనే ఇక్కడ ఓ సదరు వ్యక్తి ఓ రూం వేయడం జరిగింది. దాన్ని కొందరు స్ధానికులు ప్రశ్నించారు. అది జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన స్ధలం కాదంటే వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. స్దానిక నేతలు కొందరు గట్టిగా నిలబడడంతో కొంత కాలం ఆ నిర్మాణం ఆపేశాడు. అది ప్రభుత్వ స్ధలమన్న పక్కా ఆధారాలతో సదరు వ్యక్తిని స్ధానిక నాయకులు అడ్డుకోగలిగారు. అయితే ఎలాగైనా ఆ స్థలం కొట్టేయాలనుకున్న వ్యక్తి, అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుతో మళ్లీ కట్టడం మొదలుపెట్టాడు. ఓ దశలో ఆ విగ్రహ ఏర్పాటును కూడా స్ధానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీని వెనక జరుగుతున్న అసలు విషయం తెలియని ఎమ్మెల్యే విగ్రహ ఏర్పాటును అడ్డుకోవద్దని సూచించారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తేనే స్థలం కబ్జా సులువౌతుందని గ్రహించిన సదరు వ్యక్తి, తన అనుకున్నది పూర్తి చేశారు. ముందు ఒక రూం వేశాడు. ప్రహారీ నిర్మాణం చేశాడు. ఎన్నీఆర్ విగ్రహం ఏర్పాటు కోసమంటూ చుట్టూ పరదా ఏర్పాటుచేసి, వెనక వున్న స్ధలంలో నిర్మాణం కూడా పూర్తి చేశాడు. అక్కడ అక్రమ నిర్మాణం జరగుతోందని కొందరు వ్యక్తులు జూన్నెలలోనే జిహెచ్ఎంసికి పిర్యాధు చేశారు. అయితే కేవలం పిల్మ్ నగర్లో సభ్యత్వం కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ స్ధలంలో డిప్యూటీ కమీషనర్ ఆ స్ధలంలో నిర్మాణాలను అడ్డుకోకపోవడం విడ్డూరం.
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును తొలుత అధికారులు కూడా అనుమతివ్వలేదు.
విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన పిల్లర్లు కూడా అధికారులే కూల్చేశారు. అదే అదికారులు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆ పక్కనే వున్న స్థలంలో సదరు వ్యక్తి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే చూస్తూ వంత పాడుతున్నారు. ఇలా ప్రభుత్వ స్దలాలను కబ్జా చేయడం ఆ వ్యక్తికి కొత్త కాదని స్ధానికులు అంంటున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతమంటేనే ఇప్పుడు హాట్‌కేక్ లాంటిది. అక్కడ గజం ధర సుమారు రూ.3లక్షల పైమాటే. అలాంటి అక్కడ సుమారు 150 గజాల స్థలం ఆక్రమణకు గురైంది. సర్వే నెంబర్ 403లో వున్న ఈ స్ధలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణం తొలగించాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డును ఆక్రమించుకొని ఇలా నిర్మాణాలు చేయడం నేరం. అయినా అధికారుల అవినీతి మూలంగా, స్వార్ధపరులు ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకోడం అలవాటు చేసుకుంటున్నారు. అందుకు టౌన్ ప్లానింగ్ అధికారికి సహాయకుడైన మరో ఉద్యోగి సహాకారంతో స్థలం కబ్జా బాగోతం తంతుపూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే జూబ్లిహిల్స్ సొసైటీలో కీలకభూమిక పోషించే ఆ వ్యక్తి గతంలో ప్రభుత్వ స్థలాలను ఇదే విధంగా కబ్జాలు పెట్టి, నిర్మాణాలు చేసి అమ్ముకున్నట్లు అనేక విమర్శలున్నాయి. వాటిపై కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఆ కేసులు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అయినా అతని దుష్ట చేష్టలు ఆగడం లేదని స్దానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ స్ధలాలను కబ్జా చేస్తున్నవారిని ప్రభుత్వం నిలువరించకపోతే, భవిష్యత్తులో ప్రభుత్వ స్థలాలు వుండవని ప్రజలు కోరుతున్నారు. ఏకంగా రోడ్డు స్థలాన్నే మింగేయాలని చూస్తున ఆ వ్యక్తిని ఇలాగే వదిలేస్తే జూబ్లిహిల్స్‌లో స్ధలాలను మిగలనివ్వడని కూడా అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.