కదిలిస్తున్న కేసిఆర్‌ రగిలిస్తున్న రాహుల్‌

`రాజకీయ పార్టీల ఐక్యం కోసం కేసిఆర్‌

`ప్రజల్లో చైతన్యం కోసం రాహుల్‌…

`సామాన్య బాగోగుల కోసం కేసిఆర్‌..

`యువ నాయకత్వం కోసం రాహుల్‌…

`దేశమంతా తెలంగాణ పథకాల అమలు చేయాలని కేసిఆర్‌

`ధరల భారం తగ్గిస్తామంటున్న రాహుల్‌…

`కొత్త రాజకీయ శక్తిగా కేసిఆర్‌…

`త్యాగాలను గుర్తు చేస్తూ రాహుల్‌…

`సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం కేసిఆర్‌….

`పాదయాత్ర ను నమ్ముకుంటున్న రాహుల్‌.

`ఇద్దరి రాజకీయం ఒకటే…

`దారులు వేరు…

`కారు, కాంగ్రెస్‌ కలిస్తే ఎప్పటికైనా తిరుగుండదు.

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒకరు ఉత్తరాదినుంచి రాజకీయ పార్టీలను కదిలిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కేసిఆర్‌. మరొకరు దక్షిణాదినుంచి ప్రజల్లో రాజకీయం చైతన్యం కోసం పాదయాత్ర చేపట్టారు. ఆయన రాహుల్‌ గాంధీ. ఇద్దరూ కలిసి బిజేపి ముక్త్‌ భారత్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ గత ఎన్నికల ముందే దేశంలో ప్రత్నామ్నాయ రాజకీయ శక్తి కావాలన్నారు. అందుకు అవసరమైన ప్రణాళిక తానే మొదలు పెడతా! అన్నారు. అన్నట్లుగానే ఆయన ఇప్పటికే దేశమంతా తిరుగుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా దేశంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న నాయకులను కలుస్తున్నారు. దేశ రాజకీయాలపై చర్చిస్తున్నారు. బిజేపి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువుపెడుతున్నాడు. బిజేపి తప్పులను ఎత్తు చూపుతున్నాడు. ప్రజల్లోనే ఎండగడుతున్నాడు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లు బిజేపి కేంద్ర ప్రభుత్వం ప్రజల మేలు కన్నా, ప్రధాని మోడీ అనుయాలకు దేశాన్ని దోచి పెడుతున్నారని విరుచుకుపడుతున్నాడు. దేశం నుంచి బిజేపిని పారద్రోలితే గాని ప్రజలకు విముక్తి కాదని కేసిఆర్‌ చెబుతున్నాడు. పేద ప్రజల నుంచి ముక్కు పిండి జిఎస్టీల పేరుతో ఉప్పు , పప్పు, పాలు, పెరుగు మీద, ఆఖరుకు స్మశాన వాటికల వినియోగం మీద కూడా పన్నుల మీద పన్నులేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విరుచుకుపడుతున్నాడు. అలా వసూలు చేస్తున్న సొమ్మును షావుకార్లు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు దేశానికి భారం అంటూ, షారుకార్లు రుణపడిన బ్యాంకు రుణాలు మాఫీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ప్రజలపై మోయలేని బారాన్ని మోపుతున్న బిజేపి సర్కారును గద్దెదించితే తప్ప ప్రజలకు మోక్షం లేదని అంటున్నాడు. దేశంలో బిజేపి వివక్షపూరితమైన రాజకీయాలు చేస్తోందని కేసిఆర్‌ మండిపడుతున్నాడు. విషం చిమ్మే కుయుక్తులను నమ్ముకొని, ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని బిజేపి రాజకీయాలు చేస్తోందంటున్నాడు. ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని దుయ్యబడుతున్నాడు. బిజేపి మతం చుట్టు రాజకీయాలను పరిభ్రమింపజేస్తోందని, అది దేశానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలుకుతున్నాడు. బిజేపి ధర్మం వల్లిస్తూ పేదలను వంచిస్తున్న బేజేపి ముక్త్‌ భారత్‌ జరగాలని, దేశంలో సంక్షేమ రాజ్య స్ధాపన జరగాలని కేసిఆర్‌ కోరుకుంటున్నారు. రైతు రాజ్యం రావాలని రాజకీయ పార్టీలను ఏకం చేస్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్ధలు, ఆస్ధులను అమ్ముతూ, ప్రాంతీయ పార్టీల మనుగడును చిదిమిస్తే, మిధ్యగా వుండాల్సిన కేంద్రం పెత్తనం పేరుతో బీజేపీ దేశ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోందని కేసిఆర్‌ రాష్ట్రాలు తిరిగి పార్టీలకు ప్రజలకు వివరిస్తున్నారు.

రైతు జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని చెబుతున్నాడు. రైతుకు అన్యాయం చేసిన వారు చరిత్ర హీనులౌతారని హెచ్చరిస్తున్నాడు. రైతుక్షేమం కాంక్షిన వారికే ఈదేశంలో, భారత చరిత్రలో చోటు అని గుర్తు చేస్తున్నాడు. ప్రజావ్యతిరేక, పేదల వ్యతిరేక బిజేపిని తరిమికొట్టడమే కాదు, మళ్లీ దేశంలో సంక్షేమ రాజ్య నిర్మాణంకోసం ప్రాంతీయ పార్టీలు ఏకమైన రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా కేసిఆర్‌ అడుగులు వేస్తున్నాడు. అంతే కాదు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, విజయవంతంగా పూర్తి చేసిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, మంచినీటి సౌకర్యాలు, చెరవుల పునరుద్దరణ, పేదింటి అమ్మాయిల పెళ్లికి భరోసా, పెద్దలకు పెద్దకొడుకుగా అండగా నిలిచే ఆసరా వంటి పధకాలన్నీ దేశం మొత్తం అమలు కావాలని కోరుకుంటున్నారు. ఆకలి కేకలు లేని సమాజ నిర్మాణం జరగాలి. పేద, పెద్ద అన్న ఆర్ధిక అంతరం తొలగాలి. రైతు రాజు కావాలి. పాడి, పంట మళ్లీ పూర్వపు రోజులు చూడాలి. రైతు సంతోషంగా వర్ధిల్లాలి. ప్రజలకు ఆహార భద్రత కలగాలి. సాగుకు అనుబంధ రంగాలన్నీ మళ్లీ పుంజుకోవాలి. ఆహార ఉత్పత్తులో స్వయం సమృద్ధి సాధించాలి. విద్య, వైద్య రంగాల్లో వినూత్నమైన మార్పులు రావాలి. ప్రతి పేద వారికి మెరుగైన ఉచిత వైద్యం అందుబాటులోకి రావాలి. రైతుకు రైతు బంధు వంటి చేయూత అందాలి. మెరుగైన సమాజామే కాదు, ఉన్నతమైన సమాజం నిర్మాణం కావాలి. ఇది కేసిఆర్‌ లక్ష్యం. అందుకోసం జాతీయ రాజకీయాలలోకి కేసిఆర్‌ ఆగమనం…అందులో భాగంగా ఆయన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో రెండు సార్లు సమావేశమయ్యారు. రాజకీయాలు చర్చించారు. ఏకతాటిపైకి ప్రాంతీయ పార్టీల రాజకీయాలు రావాలని కోరారు. అలాగే బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను కలిశారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ తాఖరేతోపాటు, రాజకీయ కురువృద్దుడైన శరద్‌ పవార్‌తోను కూడా సిఎం. కేసిఆర్‌ కలిశారు. అలాగే కర్నాటకకు చెందిన మాజీ సింఎం. కుమార స్వామితో పలు మార్లు చర్చలు జరిపారు. బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవేగౌడతో కూడా సమావేశమయ్యారు. తమిళనాడు సిఎం. స్టాలిన్‌తో అనేక దఫాల చర్చలు జరిపారు. ఉత్తర ప్రదేశ్‌ మాజీ సిఎం. అఖిలేష్‌ యాదవ్‌తో అనేక సార్లు బేటీ జరిగింది. దేశంలో ఏడాదిన్న కాలం పాటు ఉద్యమాలు చేసి, ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు పంజాబ్‌ వెళ్లారు. వారికి తెలంగాణ ప్రభుత్వం తరుపున ఆర్ధిక సాయం అందించారు. రైతు నాయకులతో మాట్లాడారు. వారిని తెలంగాణకు ఆహ్వానించి, మూడు రోజుల పాటు ప్రగతి భవన్‌లో చర్చలు జరిపి, రైతుల కోసం ఏం చేస్తే బాగుంటుందన్నదానిపై బ్లూప్రింట్‌ తయారు చేశారు. ఇలా కేసిఆర్‌ తన జాతీయ రాజకీయాల రూట్‌ మ్యాప్‌ తయారు చేస్తున్నారు. దసరా తర్వాత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించేందుకు కూడా సన్నద్దమౌతున్నారు. దక్షిణాధి నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన రాహుల్‌గాంధీ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం మొదలు పెట్టారు.

ప్రజలంటే ఆయనకు, ఆయన కుటుంబానికి ఎంత ప్రేమో ఆయన చెరగని చిరునవ్వులో చూపిస్తున్నారు. ప్రజలందరి చెంతకు వెళ్తున్నారు. పాదయాత్రలో అందరితోనూ కలుపుగోలుగా వుంటున్నారు. పాదయాత్ర అన్నది దేశ రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైన ఘట్టమనే చెప్పాలి. దేశ స్వాతంత్య్రం కోసం మొదలైన పోరాటంలో ఉప్పు సత్యాగ్రహగంతో పాదయాత్రల పర్వం మొదలైందనే చెప్పాలి. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి దండి వరకు సుమారు నెల రోజులకు పైగా మహాత్మాగాంధీ సాగించిన ఉప్పు సత్యాగ్రహం పాదయాత్ర దండికి చేరుకునే సరికి జన ఉప్పెనగా మారింది. ఎక్కడిక్కడ ఉప్పు తయారీ జరిగింది. అదీ పాదయాత్ర పవర్‌ అని ఆనాడే తేలిపోయింది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర పవరేమిటో తెలిసింది. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన పాదయాత్రతో రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేయొచ్చని తెలిసింది. అయితే ప్రజాసమస్యల పరిష్కారానికి మాత్రమే పాదయాత్రలు గతంలో జరిగేవి. కాని రాజకీయాల మార్పు, ప్రభుత్వాల మార్పు కు కూడా పాదయాత్ర తోడ్పడుతుందని తేలింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్‌, ఆయన సోదరి షర్మిల, ప్రస్తుతం బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్‌ సాగిస్తున్న పాదయాత్రలు కూడా చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో కృష్ణానదీ జాలల కోసం అందరికంటే ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాదయాత్ర చేసిన సందర్భం తెలంగాణలో వుంది. ఇప్పుడు అదే స్పూర్తితో రాహుల్‌ గాంధీ కన్యా కుమారి నుంచి కాశ్మీర్‌ వరకు సాగనున్న జోడో యాత్ర మాత్రం కాంగ్రెస్‌కు మళ్లీ పునరుజ్జీవం కల్పిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మన దేశ మీడియా రాహుల్‌ గాంధీ పాదయాత్రను పట్టించుకోకపోయినా, ప్రజలు పట్టించుకుంటున్నారు. రాహుల్‌ పాదయాత్రకు ప్రజలు తండోప తండాలుగా తరలివస్తున్నారు. ఎంతో సింపుల్‌గా వుండే రాహుల్‌ గాంధీ ఆహార్యం, ప్రజల్లో ఆయన మమేకమౌతున్న విధానం, పాదయాత్రల్లో హడావుడి కాకుండా, కంటైనర్లలో బస చేయడం వంటి సింప్లీ సిటీ వ్యవహారం ప్రజలను ఎంతో ఆకర్షిస్తోంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు రాహుల్‌ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్‌కు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది. పార్టీ బలోపేతానికి తోడ్పడుతుంది. చరిత్రలో రహాల్‌ గాంధీకి కూడా చోటు దొరినట్లే అన్నది తేలిపోతోంది. ఎందుకంటే దేశ రాజకీయాల పరంగా చూస్తే పాదయాత్ర అన్నది ప్రస్తావిస్తే రాహుల్‌ గాంధీ గుర్తుకొస్తారని చెప్పడంలో సందేహం లేదు. దేశమంతా పాదయాత్ర అన్నది అంత ఆషామాషీ వ్యవహరం కాదు. కాంగ్రెస్‌లో కొత్త రక్తం, యువ రక్తం రాబోతోందని చెప్పడానికి ఇదే సంకేతం…భవిష్యత్తు కాంగ్రెస్‌దే అని చెప్పడానికి కూడా ఇదొక నిర్వచనం. ..మళ్లీ కాంగ్రెస్‌ పునర్వైభవానికి శ్రీకారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!