ఏరియా జిఎం ఏ మనోహర్
మందమర్రి, నేటిధాత్రి:-
ఏరియాలో సెప్టెంబర్ మాసంలో 91శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు సింగరేణి సంస్థ ఏరియా జిఎం ఏ మనోహర్ తెలిపారు. శనివారం ఏరియా జిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ నెలలో ఏరియాలో సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమం గురించి వివరించారు. సెప్టెంబర్ మాసంలో ఏరియాలోని కేకే 5 గని 79శాతం, కాసీపేట గని 55శాతం, కాసిపేట-2 గని 32శాతం, శాంతిఖని గని 50శాతం, కేకే ఓసిపి 79శాతం, ఆర్కే ఓసిపి 136శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు. సెప్టెంబర్ నెలలో భూగర్భ గనుల ద్వారా 52శాతం ఉత్పత్తి సాధించగా, ఓసిపి ల ద్యారా 102శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏరియా ఉత్పత్తి లక్ష్యంలో సెప్టెంబర్ మాసం వరకు 87శాతం లక్ష్యాన్ని సాధించామని వివరించారు. సెప్టెంబర్ మాసంలో 2.15లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా,ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు 16.04లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ మాసంలో 52రేకులతో 2.01లక్షల టన్నుల బొగ్గును రైలు మార్గం గుండా రవాణా చేయగా, ఈ ఆర్ధిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు 378రేకులతో 15.03లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో 0.13లక్షల టన్నుల బొగ్గును,ఆర్థిక సంవత్సరంలో 1.01లక్షల టన్నుల బొగ్గును రోడ్డు మార్గం గుండా రవాణా చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ మాసంలో 22.09లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని వెలికితీయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 160.71లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని వెలికితీసినట్లు ఆయన తెలిపారు. ఏరియాలోని ఆర్కేపి ఓసిపి సెప్టెంబర్ మాసంలో 100శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్కేపి ఓసిపికి ఇచ్చిన ఉత్పత్తి లక్ష్యంలో 122 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, ఓసిపి అధికారులకు, సూపర్వైజర్లకు, ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఏరియాలో మిగిలిన గనులు సైతం ఉత్పత్తిలో పుంజుకొని, తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించి, ఏరియాను ప్రగతి పథంలో నడపడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఏరియాలో భూగర్భ గనులు ఉత్పత్తి లక్ష్యసాధనలో వెనుకబడి ఉన్నాయన్నారు. భూగర్భ గనులలో గైర్హాజర్ సైతం ఉత్పత్తి లక్ష్యానికి విఘాతం కలిగిస్తున్నందున కార్మికులు తమ విధులకు నాగాలు చేయకుండా, సక్రమంగా విధులు నిర్వహించాలని కోరారు. ఏరియాలో ఉత్పత్తి లక్ష్యసాధన మరింత మెరుగుపరుచుటకు ఏరియాలో ఎస్డిఎల్ యంత్రల సంఖ్య పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్షణ సూత్రాలు పాటిస్తూ, సంస్థ ఉత్పత్తిలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. ఏరియాలో నూతనంగా కేకే ఓసిపి నుండి రోడ్డు మార్గం గుండా కాకుండా కన్వేయర్ బెల్ట్ ద్వారా వ్యాగిన్ లోడ్ కొరకు 130 కోట్ల రూపాయలతో 1.2కిలోమీటర్ల కన్వేయర్ బెల్ట్ తోపాటు ఓసిపి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైల్వే సైడింగ్ పనుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా ఏరియాలో రానున్న రోజుల్లో ఇసుక కొరత అధిగమించేందుకు శ్రీరాంపూర్ ఓసిపి లోని పిఓబి ప్లాంటును (ఓసిపి మట్టి నుండి ఇసుక తయారీ) కేకే ఓసిపి సమీపంలో ఏర్పాటు చేయడం కొరకు పనులు సాగుతున్నాయని, రానున్న ఆరు నెలలలో ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆర్కేపీ ఓసీపీ సంబంధించిన అనుమతులు సుమారు మరో సంవత్సరంలో ముగుస్తుండగా ఓసిపి పొడగింపు అనుమతుల కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలోఏరియా రక్షణ అధికారి ఎం రవీందర్, డిజిఎం ఐఈడి రాజన్న, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్,ఏరియా ఇంచార్జ్ ఇంజనీర్ సూర్యనారాయణ రాజు,ఎఫ్ అండ్ ఏ డివైజిఎం ఆర్విఎస్ఆర్కే ప్రసాద్, డివై సిఎంఓ డాక్టర్ ఉష, డివైపిఎం మైత్రియ బంధు, ఏరియా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.