`మంత్రులు అట్లా…ఎమ్మెల్యేలు ఇట్లా!!
` బిజేపి నేతల నోర్లు మూయించలేరా!
`వారికి సమాధానం చెప్పే సమయం కూడా లేదా?
`మాకెందుకొచ్చిన తలనొప్పి అని అనుకుంటున్నారా!
`ఉద్యమ కాలంలో వున్న స్పూర్తి ఏమైంది?
` తెలంగాణ తెచ్చిన పార్టీలో వుండి మౌనమేలా!
` తెలంగాణ రావడంలో వీసమెత్తు భాగస్వామ్యం లేని వాళ్లు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా?
`కౌంటర్ చేయలేనంత అసహాయతలో వున్నారా?
`ఎమ్మెల్యేలకు కూడా నోరు పెగలడం లేదా?
`మంత్రులేం చేస్తున్నారో కనీసం వారికైనా తెలుసా?
` అన్నీ సిఎం కేసిఆర్ చెబితేనే చేస్తున్నారా?
`పార్టీని రక్షించుకునే బాధ్యత మీకు లేదా?
`త్యాగాల నుంచి ఎదిగిన నేతలను టార్గెట్ చేస్తుంటే కూడా కదలలేరా?
`కనీసం షర్మిల వ్యాఖ్యలను కూడా ఖండిరచలేరా?
` నిస్తేజం ఆవహించిందా…నిస్సత్తువ నిండిపోయిందా?
` టికెట్లు మాత్రం కావాలి…పార్టీని సిఎం ఒక్కడే కాపాడాలి.
`మీరంతా నోటికి తాళం వేసుకొని ప్రతిపక్షాల విమర్శలు విని వదిలేయాలి?
`ఇదేనా ఇంత కాలం నేర్చుకున్నది!
`ఇదేనా పార్టీ మీద మీకున్న ప్రేమ…!
హైదరాబాద్,నేటిధాత్రి:
మంత్రులు అట్లా వున్నారు…ఎమ్మెల్యేలు చూస్తే ఇట్లా వున్నారు. పదవుల మీద వున్న పట్టింపు పార్టీ మీద లేదు. ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను తిప్పికొట్టరు. అందరూ గప్ గుప్…ఎందుకు అంటే ఎవరి దగ్గరా సమాధానం లేదు. వారి గురించి వారికే సరైన సమాచారమే వుండదు. ఎవరైనా అడిగితే మా దృష్టికి రాలేదంటారు. అడిగిన వాళ్లనే అసలేం జరిగిందని తెలుసుకొని ఔనా అని ఓ నిట్టూర్పు వదిలి చూద్దాం… అంటారు. మర్చిపోతుంటారు. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక మాట అంటుంటారు. అనేటోడిది కత్తా, నెత్తా! అని… టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా వర్తింపజేసుకోవచ్చు. అసలు ప్రతిపక్షాలకు తెలంగాణలో మాట్లాడే నైతిక హక్కు లేదు. బిజేపిలో తెలంగాణ ఉద్యమం చేసిన నాయకులు లేరు. ఇప్పుడు కొత్తగా అద్దెకొచ్చిన పిడికెడు మంది తప్ప భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరూ కనిపించరు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే అప్పటి ఎమ్మెల్యే యెండల లక్మి నారాయణ మాత్రమే చేశారు. అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమయం చూసి అమెరికా వెళ్లిపోయాడు. రాజీనామా చేయలేదు. అలాంటి పార్టీ తెలంగాణ గురించి మాట్లాడుతుంటే ఉద్యమ కాలం నాటి పోరాట యోధులు ఏం చేస్తున్నారు. అనేక మంది తెరాస ఎమ్మెల్యేలున్నారు. వారెందుకు నోరు విప్పడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి నాయకులను చూసి కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలు వివాదాలు ఎదుర్కొన్నప్పుడు మాత్రం పార్టీ అండగా వుండాలి. పార్టీని ఇరుకున పెట్టే విధంగా, అసత్యాలు, అర్థ సత్యాలు, అభూతకల్పనలు ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే పట్టించుకోరు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు స్పందించడం లేదు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు కాకముందే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం పనులు మొదయ్యాయి. కానీ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తి చేయలేదు. సగం పనులు కూడా పూర్తి కాలేదు. అది పూర్తి కావాలంటే మరో ఐదేళ్లు పట్టొచ్చు. పదేళ్లు పట్టొచ్చు. అక్కడ వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి అయ్యే అవకాశమే లేదు. జగన్ ప్రభుత్వం ఏనాడో వదిలేసింది. ఆ రాష్ట్ర రైతాంగాన్ని గాలికొదిలేసింది. కొన్ని దశాబ్దాల ఆంద్రుల కల అక్కడే మూలుగుతోంది. ఓ వైపు ఆంద్రప్రదేశ్ బిజేపి నేతలు తెలంగాణలో పూర్తయి, అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. టిఆర్‌ఎస్ నేతలకు అవి కూడా కనిపించడం లేదా! వినిపించడం లేదా!! ఆంధ్రప్రదేశ్ బిజేపి నాయకులకు వున్న నీతి తెలంగాణ బిజేపి నేతలకు లేదా? ప్రతిపక్షాలను పల్లెత్తు మాట అనేందుకు కూడా నోరు రావడం లేదా? లేక బిజేపి అంటే భయపడుతున్నారా? ఎక్కడ ఈడీ వస్తుందో అని దాక్కుంటున్నారా? మొత్తం కాళేశ్వరం పాజెక్టే లక్షానలభై వేల కోట్ల ప్రాజెక్టు. అందులో లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా? సాధ్యమౌతుందా? బిజేపి, వైఎస్‌ఆర్టీపి పార్టీలు ఇలాంటి దిక్కుమాలిన ఆరోణలు చేస్తుంటే సమాధానం చెప్పలేనంత అమాయకులా తెరాస ఎమ్మెల్యేలు. వందమంది ఎమ్మెల్యేలున్నారు. నిజాలు చెప్పి బిజేపి నేతల నోర్లు మూయించలేరా! వారికి సమాధానం చెప్పే సమయం కూడా లేదా? మాకెందుకొచ్చిన తలనొప్పి అని అనుకుంటున్నారా! ఉద్యమ కాలంలో వున్న స్పూర్తి ఏమైంది? తెలంగాణ కోసం కొట్లాడిరది మీరు కాదా? తెలంగాణ తెచ్చిన పార్టీలో వుండి మౌనమేలా! తెలంగాణ రావడంలో వీసమెత్తు భాగస్వామ్యం లేని వాళ్లు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? కౌంటర్ చేయలేనంత అసహాయతలో వున్నారా? ఎమ్మెల్యేలకు కూడా నోరు పెగలడం లేదా?మంత్రులేం చేస్తున్నారో కనీసం వారికైనా తెలుసా? అన్నీ సిఎం కేసిఆర్ చెబితేనే చేస్తున్నారా? పార్టీని రక్షించుకునే బాధ్యత మీకు లేదా?
త్యాగాల నుంచి ఎదిగిన నేతలను తెలంగాణ కు సంబంధం లేని షర్మిల టార్గెట్ చేస్తుంటే కూడా కదలలేరా?
తెలంగాణ ను ఎండబెట్టి, ప్రాజెక్టు పండబెట్టి, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసి, తెలంగాణ కు నీళ్లు లేకుండా చేసింది వైఎస్ కాదా? ఈ విషయం ప్రజలకు చెప్పలేరా? నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, రసమయి బాలకిషన్ ఇలా ఉద్యమ కారులైన ఎమ్మెల్యేలను షర్మిల నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. వాళ్లుకు సపోర్ట్ గా ఎవరూ మాట్లాడలేరా? కనీసం షర్మిల వ్యాఖ్యలను కూడా ఖండిరచలేరా? నోరుంది కదా! అని ఎంతొస్తే అంత షర్మిల మాట్లాడుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ ను కూడా దూషిస్తోంది. మంత్రి కేటిఆర్ ను విమర్శిస్తోంది. ఎమ్మెల్యేల మగతనం గురించి ప్రస్తావిస్తోంది. అవినీతి చేస్తున్నారంటోంది.
టిఆర్‌ఎస్ నేతలో నిస్తేజం ఆవహించిందా…నిస్సత్తువ నిండిపోయిందా? ప్రతిపక్ష బిజేపి, షర్మిల టిఆర్‌ఎస్ పై మాట్లాడుతుంటే వినపడడం లేదా? గత ఎన్నికలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న గెలుపు కోసం ప్రచారం చేసిన షర్మిలకు ఇక్కడేం పని అని అడగడం చేతకావడం లేదా! ముందు అక్కడ గెలిచిన జగన్ పోలవరం మర్చిపోయాడు. అది గుర్తు చేసి, దానిని పూర్తి చేసేందుకు షర్మిల దీక్షలు చేయాల్సింది అక్కడ. పూర్తయ్యి తెలంగాణ ను సస్యశ్యామలం చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ కూడా హజరయ్యాడు. మన పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావని అక్కడ అన్నను నిలదీయమని షర్మిలకు చెప్పడం కూడా టిఆర్‌ఎస్ నేతలకు రావడం లేదా?
టికెట్లు మాత్రం కావాలి…పార్టీని సిఎం ఒక్కడే కాపాడాలి.
ఇది టిఆర్‌ఎస్ ఇప్పుడు వినిపిస్తున్న మాట. కార్యకర్తలు నాయకులను తిట్టిపోస్తున్న మాట. మీరంతా నోటికి తాళం వేసుకొని ప్రతిపక్షాల విమర్శలు విని వదిలేయాలి? అనుకుంటున్నారా! లేదా మాకెందుకు ఈ గోలంతా అని సైలెంట్ అయిపోతున్నారా? అధికారంలో వున్నంత కాలం పదవులు కావాలి. కానీ పార్టీకి కష్ట కాలం వస్తే పక్క చూపులు చూడాలి. ఇవేనా మీరు నేర్చుకుంటున్నది. బిజేపి కి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో నలభై మంది ఎమ్మెల్యేలు మావైపు వచ్చేందుకు రెడీగా వున్నారని ఏ ధైర్యంతో చెబుతున్నారు. నమ్మి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపిస్తే పొరుగు పార్టీల వైపు చూడడం సరైందేనా? ఒక్క సారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి.
ఇదేనా ఇంత కాలం పార్టీలో వుండి నేర్చుకున్నదేమిటి?
ఒకనాడు వున్న దూకుడు టిఆర్‌ఎస్ లో ఇప్పుడు ఎందుకు లేదు. కనీసం పార్టీ తెలంగాణలో బలంగా వుందన్న సంగతైనా నాయకులకు తెలుసా? ప్రతి పక్షాలు చెప్పే మాటలు నిజమని నమ్ముతున్నారా? ప్రతిపక్షాలు మేం టిఆర్‌ఎస్ కన్నా బలంగా వున్నామని ఎక్కడా! ఎప్పుడూ చెప్పడం లేదు. ప్రత్యామ్నాయం మాత్రమే అని చెప్పుకుంటున్నాయి. అంతే తప్ప టిఆర్‌ఎస్ కన్నా మాకే జనాదరణ వుందని చెప్పడం లేదు. ముందు ఇదైనా తెలుసుకోండి. ఇప్పటైనా మేలుకోండి. ఉద్యమకాలం నాటి దూకుడు గుర్తుచేసుకోండి. టిఆర్‌ఎస్ లో అసంతృప్తి అన్నది ఒట్టి మాట. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు కూడా పదవులు అనుభవిస్తున్నారు. ఉద్యమకారులంతా ఏదో ఒక ప్రధాన్యతలోనే వున్నవారే…అంతే కానీ అందరూ ఎమ్మెల్యేలు కావాలంటే కుదరదు. పార్టీ అధికారంలో వుంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా ఏదొ ఒక పదవి అందకపోదు. అదే నాయకులే చేతులెత్తేస్తే గుడిసె కూడా లేకుండా పోతుంది. వున్న నీడ కరువౌతుంది. ఇప్పటికైనా మేలుకోండి. మీకు అవగాహన లేకపోతే కనీసం టిఆర్‌ఎస్ చేసిన తప్పేంటి అని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు వినండి. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే టిఆర్‌ఎస్ కు మద్దతుగా అంత మాట్లాడగల్గుతుంటే, మీరెంత మాట్లాడే అవకాశం వుందో తెలుసుకోండి. ఇప్పటికైనా నోరు విప్పండి…కానీ నోరు జారకండి…ఇరుకున మాత్రం పడకండి. బండకింద ఇరికిన చేయి జాగ్రత్తగా తీసుకోవాలి. అంతే!