నవశకానికి చంద్రోదయం!

`ఉదయించనున్న కొత్త జాతీయ రాజకీయం…

`అట్టహాసంగా కేసిఆర్‌ కొత్త పార్టీ ప్రకటన…

`రైతును దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్మాణ రచన.

`విధ్వంసమైన సాగుకు పూర్వవైభవమే ఆచరణ…

`రైతు రాజ్య స్థాపనే ఆలంబన

`తెలంగాణ వాదుల్లో సరికొత్త ఉత్సాహం…

`మళ్ళీ ఉద్యమకారులంతా ఏకమౌతున్న శుభ తరుణం…

`దేశ రైతాంగానికంతా కేసిఆర్‌ పార్టీయే వేధిక…

 `అన్ని రాష్ట్రాల రైతులకు ఒకే విధానం…

`దేశమంతా రైతు బంధు…

`సాగుకంతా ఉచిత కరంటు…

`తరలివచ్చిన రైతు నాయకులు…

`ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయ పార్టీలు…

`కేసిఆర్‌ దూరదృష్టిని పసిగట్టి ఏకమౌతున్న వివిధపక్షాలు…

 `కేసిఆర్‌ జాతీయ పార్టీలో భాగస్వామ్యం కోసం ఇతర రాష్ట్రాల నేతలు…

`సరికొత్త రాజకీయ వ్యూహరచన…అన్ని వర్గాల అభ్యున్నతి పయనాన.

`బిఆర్‌ఎస ప్రకటన….దసరా ముహూర్తాన…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆ సమయం ఆసన్నమైంది. ముహూర్తం కలిసొచ్చింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మరోకొత్త జాతీయపార్టీ ప్రకటనకు వేధిక అంతా సిద్దమైంది. పార్టీపేరు జెండాపై పూర్తి స్ధాయి స్పష్టత రానున్నంది. దేశంలోని అనేక రాష్ట్రాల రాజకీయ ప్రతినిధులు, రైతు సంఘాల క్రియాశీలురు, రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అంతా ఎంతో ఆసక్తిగా వున్నారు. ఎప్పుడెప్పుడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ కొత్త పార్టీ ప్రకటన విందామన్న ఎదురుచూపుల్లో గడియారాల వంక పదే పదే చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు బుధవారం మధ్యాహ్నామౌతుందా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కేసిఆర్‌ కొత్త పార్టీ ప్రకటన , పార్టీ విధివిధానాలు ఎలా వుంటాయన్నదానిపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటన నాడు వున్న ఉత్కంఠకు కొన్ని వేల , లక్షల రెట్లు ఇప్పుడు ప్రజల్లో వుంది. ఆనాడు టిఆర్‌ఎస్‌ ప్రకటనపై ఒక్క తెలంగాణ ప్రజల్లోనే ఆసక్తి కనబడిరది. కాని నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొని వుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ ప్రజలకు ఎం సంకేతాలిస్తారు? ఏం సందేశాలిస్తారు? ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు…ప్రజల గురించి ఏం చెబుతారు? ప్రగతిని ఎలా విశ్లేషిస్తారు..ఎలా ప్రాస్తవిస్తారు…తాను కలలు కంటున్న దేశ నవశక నిర్మాణం తనదైన వెల్లడిస్తారన్నదానిపై మాత్రం అందరకీ కుతూహలంగానే వుంది. ప్రజలైనా, ప్రతిపక్షాలు కూడా ఆ ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. కేసిఆర్‌ ఏం చెబుతారన్నదానిపై ఎనలేని ఆసక్తిని కనబర్చుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో సరికొత్త విప్లవమే అని చెప్పాలి. స్వాత్యంత్య్రం సిద్ధించిన తర్వాత ఒక రాజకీయ పార్టీ ప్రకటన కోసం దేశమంతా ఎదురు చూడడం అన్నది ఇదే మొదటిసారి. ఇంతగా ఆసక్తిని పెంచిన పార్టీ మరొకటి లేదు. దేశ రాజకీయాలను శాసించే స్ధాయిలో నిర్ణయాలు తీసుకున్న పార్టీ లేదు. అంతగా సంప్రదింపులు చేసిన నాయకుడు కేసిఆర్‌ తప్ప మరొకరు లేరు. తెలంగాణ కోసం గతంలో ఎక్కె గడప, దిగే గడప అన్నట్లు కొన్ని సంవత్సరాల పాటు ఆయన పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. నాడు కేసిఆర్‌ పాటు పడిన విధం ఇప్పటికీ తెలంగాణ ప్రజలకే కాదు, దేశ ప్రజలకు కూడా గుర్తుంది. ఇప్పుడు అదే విధంగా కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశంలోని చాలా రాష్ట్రాలు తిరగడమే కాకుండా, అక్కడి నాయకులతో చర్చలు జరిపి, అక్కడి బౌగోళిక పరిస్ధితులను పూర్తిగా అర్ధం చేసుకున్నాడు. వాటిపై అధ్యయనాలు చేశాడు. చివరికి కొత్త పార్టీ ఏర్పాటు వైపు మొగ్గు చూపాడు.

దేశంలో బిజేపి,కాంగ్రెస్‌లకు ప్రత్నామ్నాయ రాజకీయ శక్తి ఎంతో అవసరం వుందన్న సంగతిని గుర్తించాడు తెలంగాణ సత్తాతో దేశపీఠం అధిరోహించే రాజకీయం మొదలుపెట్టాడు. దేశంలో తొలి దక్షిణాది నాయకుడిగా జాతీయ పార్టీ జెండా ఎగరవేయనున్నాడు. దక్షిణాది నుంచి డిల్లీలో చక్రం తిప్పిన నాయకులున్నారు. ప్రధానులుగా ఇద్దరు పనిచేశారు.కొందరు రాష్ట్రపతులయ్యారు. కాని దక్షిణాధినుంచి జాతీయ నేతలుగా ఎదిగి, పార్టీలు ఏర్పాటు చేసిన వాళ్లు లేదు. ఆయా పార్టీలు జాతీయపార్టీలుగా ప్రచారం చేసుకున్నవారున్నారు. కాని దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలన్న సంకల్పంతో జాతీయపార్టీ ప్రకటించిన వారు లేదు. అందుకే కేసిఆర్‌ ఎప్పుడూ తనదైన శైలిని సాగిస్తారు..తనదైన పంధాలో పురోగమిస్తారు…ఆయన ఎంచుకున్న మార్గంలో వెనుదిగిరి చూడరు…అపజయాలు ఆయన ఎప్పుడూ చూడలేదు. విజయాలు వరించుకుంటూ పోతూనే , సరికొత్త దారులు వేసుకుంటూ సాగుతుంటారు… దేశానికి దిశానిర్ధేశం చేసేందుకు జాతీయ పార్టీతో ముందుకు కదులుతున్నారు. బలమైన అడుగులు వేయడానికి అవసరమైన శక్తియుక్తులు కూడగట్టుకున్నారు…తెలంగాణ ఉద్యమం నాడు ఒక్కడుగా మొదలై, లక్షల మంది కేసిఆర్‌లను తయారు చేశాడు…తన ఘనత కేసిఆర్‌ ప్రపంచానికి చాటాడు. ఇప్పుడు కూడా అతనొక్కడే…మరో అడుగుకు శ్రీకారం చుడుతున్నాడు…జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాడు. ఎంతో అట్టహాసంగా అందరూ అనుకుంటున్నట్లు బిఆర్‌ఎస్‌ను ప్రకటించనున్నారు. దాంతో ఇక టిఆర్‌ఎస్‌ కాస్త బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందనున్నది అంటున్నారు. అయితే ఇదే ఒక సంచలన విషయం అనుకుంటే, రైతును రాజకీయ కేంద్రం చేసి, సాగును జాతీయ స్ధాయిలో ఒక చర్చనీయాంశం చేసి, దేశానికి రైతే దిక్కని చెప్పడానికి కేసిఆర్‌ బయలుదేరుతున్నాడు. రైతు అంటే ఏమిటో…రైతు అవసరం ఏమిటో…రైతు మనకు ఎంత అవసరమో ప్రపంచానికి తెలియజేయనున్నాడు. రైతు లేనిదే దేశం లేదు…రైతు లేనిదే ఎవరికీ బతుకు లేదు…కాని ఆ రైతే నేడు నిర్భాగ్యుడౌతున్నాడు.

అందరికీ అన్నం పెట్టే రైతన్న దుఃఖిస్తున్నాడు. సాగు చేయలేక కడుపు మార్చుడుకుంటున్నాడు. పచ్చనిమాగాన బీడుగా మారుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు. భూమిని వదలుకోలేక, ఆ భూమిని నమ్ముకొని బతకలేక, దేశం ఆకలితో అల్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాడు. లాభం లేకపోయినా, రాకపోయినా పంటలు పండిరచడం ఆపలేకపోతున్నాడు…కన్నీటి వ్యవసాయం సాగిస్తూ, దేశం కడుపునింపుతున్నాడు…అందుకు ఆ రైతు రుణం అందరూ తీర్చుకోవాలి. పాలకులు పట్టించుకోవాలి. రైతుకు మేలు జరగాలి. సాగులో పాలకులు సాయం కావాలి. రైతుకు కావాల్సిన చేయూతనందించాలి. పెట్టుబడి సాయంతో రైతుకు భరోసా కల్పించాలి. అది తెలంగాణలో అమలౌతోంది. తెలంగాణ రైతును ఆదుకుంటోంది. తొలకరి నాడు దిగులు పడే రైతన్న , తొలి వాన చినుకు భూమిని ముద్దాతున్న నేడు మురిసిపోతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం అందించే రైతుబంధుతో ధీమాగా వుంటున్నాడు. ఇరవై నాలుగు గంటలు ఇచ్చే కరంటుతో సాగును పండగ చేసుకున్నాడు. బంగారు పంటలు పండిస్తున్నాడు. అది దేశమంతా అమలు కావాలి. అన్ని రాష్ట్రాలలో రైతు సల్లగుండాలి. ప్రపంచానికి మన ఆహార ఎగుమతులే దిక్కు కావాలి. మన రైతు రాజు కావాలి. మన రైతు సుభిక్షమవ్వాలి. దేశమంతా సరిసంపదలు వెల్లివిరియాలి. ఇలా రైతును దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏర్పాటు చేసిన వారు లేరు. రైతు సంక్షేమం కాంక్షిన నాయకుడు లేడు. అదే కేసిఆర్‌ వ్యక్తిత్వం. ఆయన పాలనలో గొప్పదనం. తెలంగాణలో అమలౌతున్న సంక్షేమానికి నిదర్శనం. ఇప్పుడు ఇదే దేశమంతా కావాలి. అమలు చేయాలి. అది కాంగ్రెస్‌ వల్లకాదు. బిజేపి వల్ల అసలేకాదని తేలిపోయింది. తెలిసిపోయింది. ఒక వేళ పేద వర్గాల మీద బిజేపి పార్టీకి ప్రేమే వుంటే ఈ ధరలు వుండేవి కాదు. రైతుల విద్యుత్‌ సరఫరాకు మోటార్ల ముచ్చట వచ్చేదే కాదు. అసలు రైతు పంటకు మార్కెట్‌ సౌకర్యమే లేకుండా చేసి,రైతులను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను తెవాలని బిజేపి చూసింది. మరో వైపు సాగుకు అవసరమైన యూరియా, పురుగు మందులను విపరీతంగా పెంచింది. అదేంటని ప్రశ్నిస్తే దిగుమతి ధరలను సాకుగా చూపిస్తోంది. అలాంటి బిజేపి ఇక రైతుల గురించి, సామాన్యుల గురించి ఆలోచిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. పైగా ప్రజలకు ఉచితాలు అలవాటు చేయొద్దని స్వయంగా ప్రధాని మోడీ సూచిస్తున్నారు. అలాంటి బిజేపి సంక్షేమ పథకాలపై మాట్లాడి తన ద్వంద్వ నీతితో ప్రజలను తడిగుడ్డతో గొంతు కోయడమే అవతుఉంది. అయినా తన వాదనను బిజేపి ఉపసంహరించుకోలేదు. అలాంటి బిజేపికి మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తే, ఇక ప్రజలకు మోతే..ధరల వాతే…! దేశంలో గత ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వచ్చిన అనేక సంస్ధలను బిజేపి కేంద్ర ప్రభుత్వం వాటిని అమ్మకమే పనిగా పెట్టుకున్నది. ఇలా మరో కొంత కాలం పోతే దేశంలో ప్రభుత్వానిది అని చెప్పుకోవడానికి ఏమీ వుండదు. రైళ్లు, రోడ్లు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే…ఇక సామాన్యుడు బతకడం కష్టమే…ప్రజలకు ప్రజాస్వామ్య ఫలాలు మృగ్యమే..! అన్న ఆరోపణలు వినిస్తున్నవే…ఇలాంటి సమయంలో దేశంలో ఒక వెలుగులాగా, ఒకమార్పులాగా, ప్రజలు ఒక ఆశలాగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటించబోయే బిఆర్‌ఎస్‌ వుంటుందని నమ్ముతున్నారు. పేదల పక్షపాతి, రైతు మేలు కోరే కేసిఆర్‌ పాలన వస్తే దేశమంతా సుభిక్షిమౌతుందని, సంతోషం నిండుతుందని, ఆనందం వెల్లివిరస్తుందని, సుఖశాంతులను చూస్తారని అనుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version