దసరా తరువాత నిరవధికంగా బంద్ చేయడానికి ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్ణయం
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల వైస్ ప్రెసిడెంట్ అయాచితుల జితేందర్రావు
వేములవాడ నేటిధాత్రి
ప్రైవేట్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ (బోధనా రుసుం) విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ప్రభుత్వం అందజేసే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అర్హతగల విద్యార్థులకు ఉచిత విద్యా బోధన చేస్తున్నాయి. ఇందుకుగాను బోధనకు అయ్యే ఖర్చులన్నీ యాజమాన్యాలు భరిస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తే చేసిన అప్పులతోపాటు తమ ఖర్చులకు ఇబ్బందులు ఉండవని సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నాయి. అయినా ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా కళాశాలల యాజమాన్యాలు దసరా తర్వాత నిరవధికంగా బంద్ చేయడానికి ప్రైవేట్ డిగ్రీ కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ నిర్ణయం మేరకు దసరా లోపు ఫీజ్ బకాయిలు చెల్లించకుంటే లేదా ఫీజ్ బకాయిలపై ముఖ్యమంత్రి నుండి స్పష్టమైన హామీ వచ్చేవరకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు దసరా సెలవులు పూర్తి అయిన కళాశాలలు తెరవకూడదని నిర్ణయించామని ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు కూడా తెలుపుతామని శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేష్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల వైస్ ప్రెసిడెంట్ అయాచితుల జితేందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు