రామడుగు, నేటిధాత్రి:
ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, స్కావెంజర్, అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాలల సందర్శన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈసందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యను అభివృద్ధి పరచాలన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కాళీ ఉన్నటువంటి ఎంఈఓ, అటెండర్, స్కావెంజర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచాలన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి మరిన్ని నిధులు కేటాయించి మంచి పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పొన్నం భాస్కర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.