రామడుగు, నేటిధాత్రి:
వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్న సరైన విచారణ లేకపోవడం వల్ల దొంగలను పట్టుకోలేకపోవటం, పోలీసులు దొంగలను పట్టుకుంటారన్న నమ్మకం లేకుండా పోతుందని ప్రజలు విశ్వయానికి గురవుతున్నారు. వివరాలలోకి వెళితే ఈనెల 9న అర్ధరాత్రి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ చౌరస్తాలోని గౌరీ ఫోటో అండ్ వీడియో గ్రాఫ్, గడియారాల దుకాణంలో దొంగలు తాళాలు పగలగొట్టి పదివేల నగదుతో పాటు గడియారాలు కూడా దొంగిలించాడని షాపు యజమాని మధు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీంతోపాటు పక్కనే ఉన్న మయూరి జనరల్ స్టోర్, ప్రజా క్లినిక్ లకు వేసిన తాళాలను పగలగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ విఫలం కావడంతో దొంగలు వెనుతిరిగి పోయారు. అంతే కాకుండా బార్బర్ షాపుతో పాటు మరిన్ని వాణిజ్య సముదాయాల తాళాలు పగలగొట్టి వస్తువులను దొంగిలించారని షాపు యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. తిరిగి మళ్లీ సరిగ్గా వారం రోజుల గడువులోనే ఆదివారం రాత్రి ఇంతకుముందు దొంగతనం జరిగిన దుకాణానికి ఆనుకుని ఉన్న సంతోషిమాత ఎలక్ట్రానిక్స్ దుకాణంలో పిఓపిని తొలగించి షాపులో ఉన్న కొంత నగదుతో పాటు ఎటిఎం తస్కరించి నగదు విత్ డ్రా చేయడానికి ప్రయత్నాలు జరిపినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. సోమవారం పోలీసులకు దుకాణ యజమాని ఫిర్యాదుమేరకు ఎస్ఐ సురేందర్ పోలీసు సిబ్బందితో వచ్చి సోమవారం సాయంత్రం విచారణ చేపట్టారు. ఇదిలా వుండగా సోమవారం అర్ధరాత్రి దోంగలు గ్రామబస్టాండ్ సమీపంలోని ఇనుగుర్తి రఘు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న యమహా బైకును దొంగిలించి ఎత్తుకు వెళ్లారు. ఈఘటనపై మంగళవారం సాయంత్రం స్థానిక పోలీసులకు బైకు యజమాని ఫిర్యాదు చేశారు. గతవారం రోజుల వ్యవధిలోనే ఐదారు సంఘటనలు జరిగాయి. ఇంత జరిగిన పోలీసులు మాత్రం సమగ్ర విచారణ చేపట్టకుండా నామమాత్రంగా విచారణ చేస్తూ ఎందుకు దొంగలను పట్టుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇంతతంతు జరుగుతున్న గ్రామంలోని బస్టాండ్ చౌరస్తాలో ఉన్న నిఘానేత్రాలు పనిచేయకపోవడం చూస్తుంటే పరిసర గ్రామాల ప్రజలతో పాటు గ్రామ ప్రజలు పలురకాల ఉహాగానాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సరైన విచారణ జరిపి దోంగలను పట్టుకోవాలని, నిఘానేత్రాలను సరిచేయాలని గ్రామప్రజలు కోరుతున్నారు.