సింగరేణి సిఎండి బలరాం నాయక్ కు వినతిపత్రం
మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సిఐటియు) పిలుపులో భాగంగా హైదరాబాద్ లోని ప్రజావాణిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో సింగరేణి నూతన సిఎండి ఎన్ బలరాం నాయక్ ను కలిసి, గులాబీ పూలు అందించి, శుభాకాంక్షలు తెలుపుతూ, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి మధు లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 73 షెడ్యూల్ పరిశ్రమలకు సంబంధించిన కనీస వేతనాల జిఓ లను జూన్ 2022లో విడుదల చేసిన, సంవత్సరాలు గడుస్తున్న నేటికీ వాటిని గెజిట్ చేయకుండా, కాంట్రాక్ట్ కార్మికుల పొట్టలు కొడుతుందని ఆరోపించారు. కనీస వేతనాల జిఓ లను గెజిట్ చేయడం వలన ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేదని, ఆయన కార్మికుల వేతనాలు పెంచడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, వేతన జిఓ లను వెంటనే గెజిట్ చేయాలని కోరారు. అదేవిధంగా కోలిండియాలో జెబిసిసిఐ లో చేసిన ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు హైపర్ కమిటీ వేతనాలు అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 2022లో జరిగిన 18 రోజుల సమ్మె సందర్భంగా చేసిన సమ్మె ఒప్పందంలోని మిగిలిన అంశాలైనా 20శాతం బోనస్ చెల్లించడం, నర్సరీ కార్మికులకు అగ్రికల్చర్ జిఓ ప్రకారం వేతనాలు చెల్లించడం, చట్టప్రకారం రావాల్సిన పండుగ, ఆర్జిత సెలవులు ఇప్పించడం తోపాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన సింగరేణి సిఎండి బలరాం నాయక్ వెంటనే కార్మికులకు 30 లక్షల ఇన్సూరెన్స్, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఈఎస్ఐ వైద్య సదుపాయానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే కార్మికులకు అవి అమలు అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మిగతా సమస్యలను సైతం త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో సింగరేణి వ్యాప్తంగా గల నర్సరీ, ఎస్ అండ్ పిసి, బెల్ట్ క్లీనింగ్, సెల్ పికింగ్, రోడ్డు క్లీనింగ్, హౌస్ కీపింగ్, సివిక్, ఇతర విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.