మలహార్ రావు, నేటిధాత్రి ;
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలో ఆంజనేయ శివ పంచాయతన ఆలయంలో గణపతి, పార్వతి, శివుడు, సూర్యభగవనుడు, విష్ణుమూర్తి ల విగ్రహల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శుక్ర, శని, ఆదివారం మూడు రోజుల పాటు ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. 19న శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షా స్వీకారం, ఋత్విక్వర్ణనం, నవగ్రహ, యోగిని, వాస్తు క్షేత్రపాలక బ్రహ్మది మండల పూజలు, అగ్నిప్రతిష్ట దేవతా హోమాలు విగ్రహాజలాధి వాసాలు నిర్వహించారు. ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించిన హోమం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం రోజున గణపతిపూజ, పుణ్యాహవాచనం, విగ్రహ పాలాభిషేకము, స్థాపిత దేవతా పూజలు, హోమాలు, విగ్రహ ధ్యానఫల, పుష్ప శయ్యాధివాసాలు నిర్వహించనున్నారు. ఆదివారం రోజున బ్రహ్మముహూర్తంలో లక్ష్మీనారాయణ హోమం గర్తన్యాసం, యంత్రప్రతిష్ట, విగ్రహప్రతిష్ట, దృక్బలి, దిక్బలి. పూర్ణహూతి అనంతరము భక్తులకు దర్శనం కల్పించనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు. తాడిచెర్ల ఆలయ అభివృద్ది కమిటి ఆధ్వర్యంలో ప్రతి రోజు అన్నదాన కార్యక్రమము నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
